కేసీఆర్ మాటంటే కార్మికులకు లెక్క లేదా? అమిత్-షాకి టీబీజేపీ ఏం రిపోర్ట్ ఇచ్చింది?

  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పట్టు సడలించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు డెడ్ లైన్లు పెట్టినా బెదిరింపులకు దిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. మంగళవారం అర్ధరాత్రిలోపు బేషరతుగా విధుల్లో చేరాలంటూ కేసీఆర్ ఇచ్చిన ఆఖరి డెడ్-లైన్ ను ఆర్టీసీ కార్మికులు లైట్ తీస్కున్నారు. కేసీఆర్ డెడ్‌లైన్‌ను 99.99శాతం కార్మికులు లెక్కే చేయలేదు. మొత్తం 49వేల కార్మికుల్లో కేవలం 350మంది మాత్రమే రీ-జాయిన్ అయ్యారు. వాళ్లలోనూ సగం మంది మళ్లీ డుమ్మాకొట్టారు. కేసీఆర్‌ బెదిరింపులకు, డెడ్‌లైన్లకు బెదిరేది లేదని, ఇలాంటి డెడ్‌లైన్లను చాలా చూశామంటోన్న ఆర్టీసీ కార్మికులు... తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. డెడ్ లైన్ సంగతి పక్కనబెడితే, ట్యాంక్ బండ్ పై తొమ్మిదిన నిర్వహించే మిలియన్ మార్చ్ కు ఆయా పార్టీల మద్దతును ఆర్టీసీ జేఏసీ కూడగడుతోంది. ముందుగా బీజేపీ నేతలను కలిసి ఆర్టీసీ కార్మికులు మద్దతు కోరారు. అయితే, ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... ఆర్టీసీ సమ్మెను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్న లక్ష్మణ్... ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులతో చర్చలు జరపాలని కేసీఆర్ కు సూచించారు.  అయితే, ఇప్పటికే 5వేల100 రూట్ల ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. మరో 5వేల మార్గాలను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, తెలంగాణను ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మార్చబోతున్నామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, తాజా పరిణామాలపై... హైకోర్టు ఎలా స్పందిస్తుందోనని ఇరువర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

విజయారెడ్డి మర్డర్ వెనుక పొలిటికల్ పవర్... మాట విననందుకే దారుణంగా చంపేశారా?

  తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.... కాంగ్రెస్ లీడర్ మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి హత్య వెనుక నీ హస్తముందంటే.... నీ హస్తముందంటూ మంచిరెడ్డి అండ్ మల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ముమ్మాటికీ టీఆర్ఎస్ ‌ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హస్తముందంటోన్న కాంగ్రెస్‌ లీడర్ మల్‌రెడ్డి రంగారెడ్డి.... విజయారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఎన్నోసార్లు బెదిరించారని, మాట వినకపోవడంతోనే, తన అనుచరుడు ద్వారా తహశీల్దారుని హత్య చేయించారని ఆరోపించారు. మంచిరెడ్డి భూకబ్జాలను తాను తహశీల్దార్ విజయారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, తనపై ఎమ్మెల్యే ఒత్తిడి ఉందంటూ చెప్పిందన్నారు. కబ్జా భూమిని సీజ్ చేయొద్దంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి బెదిరించినట్లు విజయారెడ్డి చెప్పిందన్న మల్‌రెడ్డి.... ఆమె ధైర్యవంతురాలు కాబట్టే.... ఆ భూమిని సీజ్ చేసి.... గవర్నమెంట్ ల్యాండ్ అంటూ బోర్డు పెట్టించిందని, అందుకే తన అనుచరుడు సురేష్‌ ద్వారా విజయారెడ్డిని హత్య చేయించాడని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై మూడుసార్లు ఓడిపోయిన ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలో భూకబ్జాలు చేసింది మల్‌‌రెడ్డి సోదరులు, బంధువులే అన్నారు. తహశీల్దార్ విజయారెడ్డిని చంపిన సురేష్‌ కుటుంబ సభ‌్యుల భూములను మల్‌రెడ్డి బంధువులే కొనుగోలు చేశారంటూ ఆధారాలను మీడియాకి రిలీజ్ చేశారు. ఇదిలాఉంటే, విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ శక్తుల ప్రమే‍యం ఉండొచ్చని ఆమె భర్త సుభాష్ రెడ్డి అనుమానిస్తున్నారు. నిందితుడు సురేష్‌ వెనుక రాజకీయ శక్తి ఉందని, అదెవరో తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రాణభయంతో హడలిపోతున్న రెవెన్యూ ఉద్యోగులు....భూపరిపాలన నుంచి తప్పించాలని విజ్ఞప్తి

  తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ప్రతి చోటా భూవివాదాలు ఉండటంతో ముందుముందు ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం అవుతాయేమోనని భయపడుతున్నారు. విజయారెడ్డి హత్యపై ఒకపక్క ఆందోళనలు, నిరసనలు చేపడుతోన్న రెవెన్యూ యంత్రాంగం.... ఈ ఘటన నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందంటూ అభిప్రాయపడింది. ముఖ్యంగా అత్యంత వివాదాస్పదంగాను, ప్రాణసంకటంగాను మారిన భూపరిపాలన విభాగం నుంచి తమను తప్పించాలని రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ జేఏసీ అయితే, ఇప్పట్నుంచే స్వచ్ఛందంగా భూపరిపాలన నుంచి తప్పుకుంటున్నామని, భూరికార్డులకు సంబంధించిన ఫైళ్లను తాము పరిశీలించబోమని ప్రకటించారు. ఉద్యోగం కంటే తమకు ప్రాణమే ముఖ్యమంటోన్న రెవెన్యూ యంత్రాంగం... భూపరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతుల కష్టాలు తీరవని.... అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవనీ అభిప్రాయపడింది. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే... ప్రధానంగా ఐదు అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించింది. సమగ్ర భూసర్వే.... భూచట్టాలపై సమీక్ష-సమగ్ర రెవెన్యూ కోడ్‌ రూపకల్పన.... టైటిల్ గ్యారంటీ చట్టం.... భూవివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌... భూరికార్డుల సవరణలో ప్రజల భాగస్వామ్యం... ఇలా ఐదు అంశాలతో చర్యలు చేపడితేనే... భూవివాదాలకు ఫుల్‌ స్టాప్ పడుతుందని రెవెన్యూ జేఏసీ అభిప్రాయపడింది. రెవెన్యూశాఖకు ఒకప్పుడు రెవెన్యూ వసూలుతోపాటు భూపరిపాలనే కీలకంగా ఉండేదని, కానీ ఇప్పుడు భూపరిపాలన కంటే ...మిగతా పనులు ఎక్కువై-పోయాయని రెవెన్యూ యంత్రాంగం అంటోంది. ప్రోటోకాల్‌ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్నీ రెవెన్యూ ఉద్యోగులే చేయాల్సి వస్తోందని, దాంతో కీలకమైన భూపరిపాలనకు సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందని, అందువల్లే సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. లోభభూయిష్టమైన విధానాలు కూడా రెవెన్యూ ఉద్యోగులకు చెడ్డపేరు తీసుకొస్తున్నాయని అంటున్నారు. అసలు భూపరిపాలన నుంచి తమను తప్పిస్తే... ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అయితే, భూవివాదాలు పెరిగిపోవడానికి కారణాలను కూడా రెవెన్యూ జేఏసీ ప్రస్తావించింది.... భూమి హక్కుల నిరూపణకు రికార్డులే సాక్ష్యం కాకపోవడం... ఏ భూమి రికార్డునైనా, ఎప్పుడైనా సవరించే అవకాశం ఉండటం... భూరికార్డుల్లోని వివరాలకు భరోసా లేకపోవడం... భూమి హద్దులు తెలిపే చిత్రపటాలు లేకపోవడం... భూములకు సరిహద్దు రాళ్లు లేకపోవడం.... ఏ భూసమస్యను ఎంతకాలంలో పరిష్కరించాలో స్పష్టత లేకపోవడం.... చట్టాల్లో గందరగోళం... లెక్కకు మించిన నియమాలు, ఉత్తర్వులు... 40ఏళ్లకు ఒకసారి భూసర్వే జరగాల్సి ఉండగా, 80ఏళ్లయినా జరగని సర్వే.... అసంపూర్తిగా సీలింగ్, టెనెన్సీ, ఇనాం భూచట్టాల అమలు... వాస్తవ పరిస్థితిని అద్దంపట్టని భూరికార్డులు.... చట్టాలు, రూల్స్‌‌పై అవగాహన లేకపోవడం... జమాబందీ, ఆజమాయిషీ నిలిచిపోవడం.... ఇలా అనేక సమస్యలతో సివిల్ కోర్టుల్లో 66శాతం కేసులు భూతగాదాలే ఉంటున్నాయని రెవెన్యూ జేఏసీ అంటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా భూపరిపాలనపై దృష్టిపెట్టకపోతే మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవని రెవెన్యూ జేఏసీ హెచ్చరిస్తోంది.  

ఒక్క పైసా బాకీ లేమంటూ అఫిడవిట్లు... ఆర్టీసీపై అటోఇటో తేల్చేయనున్న కేసీఆర్... 

  తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌తోపాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అండ్ జీహెచ్ఎంసీ కమిషనర్లను హైకోర్టు ఏకిపారేయడంతో... వాళ్లంతా సమగ్ర సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేశారు. ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ లెక్కలకు.... మీరు చెబుతున్న మాటలకు పొంతన లేదంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో.... ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ మరోసారి కౌంటర్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై క్లారిటీ ఇచ్చారు. సునీల్ శర్మ రిపోర్ట్ ప్రకారం ఒక్క ముక్కలో చెప్పాలంటే.... ఆర్టీసీకి ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా బాకీ లేదంటూ తేల్చిచెప్పారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కంటే 867 కోట్లు ఎక్కువే వచ్చాయంటూ సునీల్ శర్మ... హైకోర్టుకు నివేదించారు. వేర్వేరు పద్దుల కింద ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇచ్చిందన్నారు. రుణ పద్దు కింద విడుదలైన నిధులను, వడ్డీని ప్రభుత్వం ఎన్నడూ అడగలేదని నివేదించారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాలని చెప్పిన 14వందల 42కోట్లను... చట్టప్రకారం రీఎంబర్స్‌మెంట్ కోరడమే తప్ప... డిమాండ్ చేయలేమని సునీల్ శర్మ తెలిపారు.  హైకోర్టు ఆదేశాల మేరకు ఫైనాన్స్, మున్సిపల్ అండ్ జీహెచ్ఎంసీ కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీకి 3వేల 6కోట్లు చెల్లించాల్సి ఉండగా.... అంతకంటే ఎక్కువగా ప్రభుత్వం 3వేల 903 కోట్లు ఇచ్చిందని తెలిపారు. మోటారు వాహనాల పన్ను కింద ...ఆర్టీసీయే ప్రభుత్వానికి 540కోట్లు చెల్లించాల్సి ఉందని ఆర్థికశాఖ అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్న రామకృష్ణారావు... రుణ పద్దు కింద ఇచ్చినవి విరాళమేనని స్పష్టం చేశారు. అలాగే, జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే... ఆర్టీసీకి సాయం చేస్తుందన్న GHMC కమిషనర్... చట్టప్రకారమైతే ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని తన అఫిడవిట్‌లో తెలిపారు. జీహెచ్‌ఎంసీకి మిగులు బడ్జెట్‌ ఉన్నప్పుడు ఇచ్చామని, కానీ ఇప్పుడు లోటు బడ్జెట్‌లో ఉందని, దాంతో ఆర్టీసీకి నిధులిచ్చే పరిస్థితి లేదన్నారు. మరోవైపు, ఆర్టీసీ సమ్మె, కోర్టు విచారణ, ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతులపై దాదాపు 8గంటలపాటు కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేట్ ఆపరేటర్లకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇచ్చేందుకు న్యాయపరమైన చిక్కుల్లేకుండా విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. ఇదిలాఉంటే, హైకోర్టు విచారణ తర్వాత ఆర్టీసీపై సీఎం కేసీఆర్ అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సర్కారు తీరును ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... మరి ఈసారి ఎలా రియాక్టవుతుందోనన్న ఉత్కంఠ ఇరువర్గాల్లో కొనసాగుతోంది. 

కార్యకర్తల ప్రశ్నల వర్షం.. చంద్రబాబు తీరు ఇప్పుడైనా మారుతుందా?

  కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు అంటారు. అలాగే ఉంది ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఒక్కొక్క జిల్లాలో మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులను పరామర్శించడం, నియోజక వర్గాల ఇన్ చార్జిలతో కలిసి భోజనం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల మూడు రోజుల పాటు విజయవాడలో కృష్ణా జిల్లాకు చెందిన పదహారు నియోజక వర్గాల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అనేక విషయాలు పార్టీ పెద్దల దృష్టికొచ్చాయి. కొన్ని నియోజక వర్గాల్లో బహునాయకత్వ ఉండడం ఎమ్మెల్యేకి, క్యాడర్ కి మధ్య దూరం పెరగడం, వాటిని చంద్రబాబు పట్టించుకోకపోవటం, ద్వితీయ శ్రేణి నేతలకు సైతం సరైన గౌరవం ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో నష్టం చేశాయని తేలింది. ఈ విషయాలను ఆయా నియోజక వర్గాల నేతలు స్వయంగా చంద్రబాబుకి నివేదించడం గమనార్హం. ఇదిలా ఉంటే విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పార్టీ నేత నాగుల్ మీరా వర్గాల మధ్య చంద్రబాబు సమక్షంలోనే వివాదం జరిగింది. ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. నాగుల్ మీరా తమకు మద్దతు ఇవ్వలేదని జలీల్ ఖాన్ వర్గీయులు ఆరోపించారు. జలీల్ ఖాన్ తమను కలుపుకు వెళ్లలేదని ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని నాగుల్ మీర వర్గీయులు ప్రత్యారోపణలు చేశారు. ఈ పరిణామంతో విసిగిపోయిన చంద్రబాబు ఇటువంటి వివాదాలు ఎవరికీ మంచిది కాదని ఎవరికైనా పార్టీ సుప్రీం అని అందరూ విధేయులుగా ఉండాలని ఆ రెండు వర్గాల వారికి స్పష్టం చేశారు. ఇటువంటి నియోజకవర్గాల్లో వివాదాలను సర్దుబాటు చేసేందుకు సీనియర్ నేతలను పంపుతామని హామీ ఇచ్చారు. పరిష్కారం కాకపోతే నేరుగా తానే జోక్యం చేసుకుంటానని కూడా వివరించారు. గన్నవరం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే వంశీ మోహన్ ఈ సమీక్షకు హాజరు కాలేదు కానీ స్థానిక కార్యకర్తలు నేతలు మాత్రం పెద్ద ఎత్తున హాజరయ్యారు. అక్రమంగా బనాయించిన కేసు విషయంలో భయపడ్డం మంచిది కాదని వంశీకి తాను సూచించానని మరోసారి మీ ద్వారా ఆయనకి ఈ విజ్ఞప్తి చేస్తున్నానని కార్యకర్తలతో అధినేత చంద్రబాబు చెప్పారు. ఎవరున్నా లేకున్నా తమ పార్టీకి అండగా ఉంటామని ఈ సందర్భంగా గన్నవరం తెలుగు తమ్ముళ్లు బాబుకి భరోసా ఇచ్చారు. మరికొన్ని నియోజక వర్గాల్లో కూడా ఇటువంటి సమీక్ష జరిగింది. అయితే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అధికారంలో ఉన్న ఐదేళ్లలో మిమ్మల్ని కలవలేకపోయాం అని, మీరు పార్టీని వదిలేసి అధికారులతో బిజీ బిజీగా గడిపారని, విడిపోయిన రాష్ట్రం అంటూ చాలా కష్టపడ్డారని, దీంతో సరైన ప్రాధాన్యం లేక పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో యాక్టివ్ గా పనిచెయ్యలేదని నేరుగా చంద్రబాబుతోనే చెప్పారు. మిమ్మల్ని కలిసేందుకు ఎన్నిసార్లు వచ్చినా అపాయింట్ మెంట్ దొరకలేదని కొందరు చెప్పిన తీరు చూసి చంద్రబాబు కూడా చలించిపోయారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వచ్చినా కూడా తమకు నిరాదరణ ఎదురయిందని మరికొందరు పార్టీ అధినేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల మనోభావాలు విన్న చంద్రబాబు వారికొక విషయం స్పష్టం చేశారు. ఇక ముందు పరిస్థితి గతంలో మాదిరిగా ఉండదని పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇది తన మాటగా నమ్మాలని వివరించారు. కృష్ణజిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో పార్టీకి ట్రీట్మెంట్ తానే చేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మైలవరం నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ అక్కడ టిడిపి పరాజయం పాలవడానికి గల కారణాలపై చంద్రబాబు లోతుగా ఆరా తీశారు. ఒక్కసారి జగన్ కు చాన్సిద్దాం అనే భావన, కొన్నివర్గాలు టిడిపికి దూరం కావడమే ఓటమికి కారణాలని తేల్చారు. ఆయా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల పనితీరు ఉందంటూ చంద్రబాబు కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ లోక్ సభ స్థానం పరిధి లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓటమి చెందినా, ఎంపీ అభ్యర్ధి కేశినేని నానికి మెజారిటీ రావడం ఆయన గెలుపొందడం కూడా కొంతమంది కార్యకర్తలు ప్రస్తావించారు. టాటా ట్రస్టు ద్వారా కేశినేని నాని చేపట్టిన కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం వివాదాలకు అతీతంగా వ్యవహరించడం వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ తో పాటు లోక్ సభలో ప్రధాని మోదీని నేరుగా నిలదీసిన తీరు కూడా ఆయన విజయానికి కారణమయ్యాయి అని ఈ సందర్భంగా మరికొందరు నేతలు విశ్లేషించారు. ఇలా ప్రతి నియోజక వర్గం లోని ప్లస్సులూ మైనస్సులూ చంద్రబాబు టిడిపి ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. తద్వారా వచ్చే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

కాసుల కోసం ప్రసాదంలో సైనైడ్ పెట్టి ప్రాణాలు తీసిన దుండగుడు...

  అతని పేరు సింహాద్రి అలియాస్ శివ. చదివింది పదో తరగతి. గతంలో అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పని చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టి దెబ్బతిన్నాడు. ఆపై అడ్డదారిలో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. కాసుల కోసం ప్రాణాలు తీశాడు. అలా ఒకరూ ఇద్దరు కాదు ఇరవై నెలల్లో పది మందిని చంపాడు. అది కూడా సైనైడ్ కలిపిన ప్రసాదమిచ్చి చంపాడు. ఆ సీరియల్ కిల్లర్ బారిన పడి స్వామీజీ నుంచి సామాన్య గృహిణి వరకూ ప్రాణాలు కోల్పోయారు. శివతో పాటు అతనికి సలహాలిచ్చి సహకరించిన మరొకరిని పశ్చిమగోదావరి పోలీసులు అరెస్ట్ చేశారు.  ఏలూరు వెంకటాపురం పంచాయతీ లోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి వాచ్ మ్యాన్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తి బాగా నష్టపోయాడు. ఆ తరువాత వ్యక్తుల బలహీనతలూ, నమ్మకాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగురాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపయ్యే మార్గమంటూ బాగా డబ్బున్న వారిపైన, అప్పుల నుంచి బయటపడాలనుకునే వారిపైనా కన్నేశాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన షేక్ అమనుల్లా అలియాస్ బాబుతో స్నేహం చేశాడు.  మోటార్ వాహనాల విడిభాగాలకు నికెల్ కోటింగ్ వేసే శంకర్ వద్ద సైనైడ్ ఉంది. అదే సైనైడ్ ను ఆయుర్వేద మందులు, ప్రసాదంలో కలిపి హత్యలకు తెర తీశారు. భక్తి పేరిట కొందరికి రైస్ పుల్లింగ్ కాయిన్ కొని పెడతామని ఇంకొందరికీ, గుప్తనిధుల ఉన్నచోటు చూపిస్తామని కొందరికి, బంగారం తెస్తే రెట్టింపు చేస్తామని కొందరికి శివ ముఠా వల వేసింది. సొంత బంధువులనే తొలిగా బలి తీసుకుంది, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పేపర్ మిల్ వద్ద ఉంటున్న కొత్తపల్లి రాఘవమ్మ దగ్గరకు చుట్టపు చూపుగా శివ వెళ్లాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మను ఆయుర్వేదంతో బాగు చేస్తానని నమ్మించాడు. ఆమెకిచ్చే మందులో సైనెడ్ కలిపి చంపేశాడు, ఆమె ఇంట్లోంచి లక్ష రూపాయలకు పైగా నగదుతో ఉడాయించాడు. ఇదే జిల్లా బొమ్మూరులో ఉంటున్న వరుసకు వదినయ్యే సామంత కుర్తీ నాగమణిని కూడా ఇలాగే హత్య చేసి ఐదు లక్షల డబ్బులు నగలుతో పరారయ్యాడు. గుప్త నిధుల జాడ చూపుతానని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మరికొందరిని హతమార్చాడు. చివరకు అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద మందు అంటూ ఒక స్వామీజీని కూడా సైనైడ్ తో చంపేశాడు. ఏలూరు కేబిడిటి హై స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కాటి నాగరాజు రైస్ పుల్లింగ్ కాయిన్ కోసం తెలిసిన వారినల్లా సంప్రదించాడు. శివ గురించి తెలుసుకున్న నాగరాజు ఆయన్ను కలిశాడు. ఇదే అదునుగా తీసుకున్న శివ ఆ కాయిన్ ఇస్తానని గత నెల 16 వ తేదీన తన వద్దకు పిలిపించుకున్నాడు. అతడు చెప్పినట్టు నాగరాజు రెండు లక్షల రూపాయల నగదు, నాలుగున్నర కాసుల బంగారు నగలు పట్టుకొని ఇంటి నుంచి వెళ్లాడు.  ఏలూరు సమీపంలోని వట్లూరు మినీ బైపాస్ రోడ్డులో శివను కలుసుకున్నాడు. నాగరాజుకు ప్రసాదం అంటూ సైనేడ్ పెట్టాడు. ఆ ప్రసాదం తిన్న నాగరాజు మృతి చెందాడు. అతని వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు శివ అపహరించుకుపోయాడు. అయితే నాగరాజు మృతి చెందిన తీరుపై బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. వారిలో ఒకే ఒక్క వ్యక్తి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండడం పోలీసులు గమనించారు. అతని కాల్ డేటా పరిశీలించగా గతంలో మృతి చెందిన అనేక మంది ఫోన్ నెంబర్ లు ఆ కాల్ లిస్ట్ లో కనిపించాయి. మృతుల బంధువులు ఇచ్చిన సమాచారంతో హంతకుడు శివను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.

సీబీఐ కోర్టు తీర్పు తెచ్చిన తిప్పలు.. తలలు పట్టుకుంటున్న వైసీపీ నేతలు!!

  చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అనే నానుడిని తలపించేలా ఉందట ఇటీవల సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ కు ఎదురైన చుక్కెదురు పరిణామం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చ. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది మందికి గ్రామ వాలంటీర్ లుగా పోస్టులు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, నవరత్నాల పథకాల అమలుతో వడివడిగా అడుగులు వేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక్క సారిగా బ్రేక్ పడినట్లయింది. నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంలో పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్టు సంస్థను వైదొలగాలని ఇచ్చిన ప్రీ క్లోజర్ నోటీసుపై హై కోర్టు ముందస్తు స్టే ఇవ్వడం ఆ తర్వాత తొలగించిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. వెనువెంటనే మేఘా ఇంజనీరింగ్ కూడా పనులు ప్రారంభించింది, జల విద్యుత్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్ లో మిగిలి పోయిన పనులను 4987 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవగా ఇందులో 12.6 శాతం తక్కువకు మెగా ఇంజనీరింగ్ టెండర్లు దక్కించుకోవడంతో సుమారు 625 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. మరోవైపు వైయస్సార్ రైతు భరోసా వైయస్సార్ వాహన మిత్ర పెన్షన్ ల వయస్సు పెంపు, ఆరోగ్యశ్రీ, వైయస్సార్ కంటివెలుగు వంటి పథకాలను అమలు చేస్తున్నామని అర్హులైన వారికి పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా లబ్ధిని అందిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. నిజానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన పాదయాత్రకు బయలుదేరే ముందు కూడా సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అప్పుడు కూడా కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది, పాద యాత్ర చేస్తూ కూడా జగన్ ప్రతి గురువారం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్లి శుక్రవారం కోర్టుకు హాజరై అదే రోజు సాయంత్రానికి పాద యాత్ర జరిగే ప్రాంతానికి చేరుకొని మరుసటి రోజు యాత్ర ప్రారంభించారు. పాద యాత్ర ఇలా సాగింది, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండడంతో అనేక బరువు బాధ్యతలుంటాయని సమీక్షా సమావేశాలతో పాటు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం అవసరం అవుతుందని హైదరాబాద్ కు రావాలంటే సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే అరవై లక్షలు ఖర్చవుతుందని చెప్పడం అతిశయోక్తి అని సిబిఐ తన అఫిడవిట్ లో పేర్కొంది. కాగా సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలు ప్రజాబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళాయి. జగన్ ఎంపీగా ఉన్న సమయంలోనే సాక్షులను ప్రభావితం చేశారని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున ఇంకా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలమిచ్చినట్టు అవుతుందని వారు అస్త్రాలుగా మల్చుకునేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద సిబిఐ కోర్టులో జగన్ కు ఎదురైన చుక్కెదురు పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అంశంగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. తమకు ప్రజలిచ్చిన తీర్పులకు తమ ప్రభుత్వం వేగానికి ఈ తాజా పరిణామం స్పీడ్ బ్రేకర్ లాంటిదని దీన్ని ఎలాగైనా దాటుకుని ముందుకెళ్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సడెన్ బ్రేక్ కారణంగా నెమ్మదించిన జగన్ సర్కార్ జోరందుకునేదెప్పుడో అదెలాగో చూడాలి.

ఏపీ రాజధానిపై మళ్లీ మొదలైన రగడ!!

  ఏపీ రాజధాని పై మరోసారి రగడ మొదలైంది. బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి అమరావతిని చంపేశారంటూ ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు.. అసలక్కడ ఏముంది అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక బొత్స విమర్శలకు టిడిపి నేతలు కౌంటర్లిస్తున్నారు. అమరావతిలో ఏముందో తమ హయాంలో ఏమేం నిర్మించామో ప్రజలకు చూపిస్తామంటూ టిడిపి నేతలు అమరావతి పర్యటనకు వెళ్లారు. మాజీ మునిసిపల్ మంత్రి నారాయణ, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా నాయకత్వంలో పలువురు తెలుగుదేశం నాయకులూ ఉండవల్లి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం నుంచి అమరావతికి వెళ్లారు. కొందరు బస్సులో మరికొందరు కార్లలోనూ తెలుగుదేశం నాయకులు అమరావతికి చేరుకున్నారు.  రాజధాని సమగ్రాభివృద్ధి రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి సూచనలు చేయాలంటూ జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటోంది. అయితే కమిటీ నియామకం పై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కమిటీతో ఏం చేశారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసుల్లో ఉన్నవారు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. నిన్న గాజువాకలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పులివెందులలో రాజధానిని, అక్కడికి దగ్గర లో ఉండే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. పవన్, చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ కు వైసీపీ నేతలు కూడా ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.  

గాంధీ సంకల్ప యాత్ర బండి సంజయ్ కు రెండు విధాలుగా ఉపయోగపడిందా..?

  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సూత్రాన్ని ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులను ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశించింది. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ ఎంపీలను వారి వారి నియోజకవర్గాలలో తిరగాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. తన పార్లమెంటరీ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో మొత్తం కలియ తిరిగారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాంధీ సంకల్ప యాత్ర ఎంపి బండి సంజయ్ కుమార్ కు రెండు రకాలుగా ఉపయోగపడిందని బిజెపి నాయకులు విశ్లేషిస్తున్నారు. ఒకటి పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆయన పాద యాత్ర చేసి నియోజక వర్గ కార్యకర్తలను కలుసుకునే వీలు పడిందనీ, రెండోది ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునే అవకాశం దొరికిందని వారు అంటున్నారు. వాస్తవానికి బండి సంజయ్ కుమార్ కు ఒక్క కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా నియోజక వర్గాల్లో పెద్దగా పట్టులేదట. ఆయా నియోజకవర్గాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదట. ఈనేపధ్యంలో బిజెపి అధిష్టానం తలపెట్టిన గాంధీ సంకల్ప యాత్ర ఎంపి సంజయ్ కుమార్ కు ఒక అవకాశంలా దొరికిందని స్థానిక పార్టీ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయనకు అన్ని నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం రాలేదట. అప్పుడు ఏ నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేక పోయారట. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయనకి తెలియదట. అలాగే కరీంనగర్ ప్రజలకు మినహా మిగతా నియోజకవర్గాల్లోని చాలామంది బండి సంజయ్ కుమార్ మొహం చూడలేదట, అయితే యూత్ లో మాత్రం ఆయనకు బాగా క్రేజ్ ఉంది. యువత చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి బండి సంజయ్ ఈజీగా గుర్తుపట్టగలిగారట. ఆయన పాటలకు మాటలకు యూత్ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే సామాన్య జనం మాత్రం బండి సంజయ్ కుమార్ ఎవరో తెలీకుండానే ఓట్లేశారని స్వయంగా ఆయన సన్నిహితులే తెలిపారు. మోదీ వేవ్ సహా టిఆర్ఎస్ మీద ప్రజలకున్న అసంతృప్తి వల్లే గెలిచారని ప్రచారం జరిగింది. ఈ తరహా చర్చలకు ఒకే యాత్రతో ఆయన సమాధానం చెప్పాలంటున్నారు. గాంధీ సంకల్ప యాత్ర ద్వారా జనాలకు దగ్గరవ్వటంతో పాటు పార్టీ బలాబలాలు కూడా తెలుసుకుంటున్నారు. పార్లమెంటరీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో క్యాడర్ ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పురపాలక పరిధుల్లో ఎక్కువ సమయం గడిపేలా గాంధీ సంకల్ప యాత్రను ఆయన షెడ్యూల్ చేసుకున్నారు. అయితే మిగతా మున్సిపాలిటీలన్నీ ఒకెత్తయితే ఒక్క కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మాత్రం సంజయ్ కు మరో ఎత్తు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడ జరిగే పుర పోరు ఆయనకొక అగ్నిపరీక్షలా మారనుందట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బిజెపి చూపిన ఊపు ఇప్పుడు ఆ పార్టీ వైపు ఉంటుందా లేదా అన్నది మునిసిపల్ ఎన్నికల్లో తేలిపోనుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రి పదవి వచ్చింది. ఈ క్రమంలో బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇక్కడ అధికార టీఆర్ఎస్ ను ఏ మేరకు ఢీకొంటారన్న చర్చ జరుగుతుంది. బిజెపి కార్పొరేటర్లు అనుకున్నన్ని సీట్లల్లో గెలవకపోతే కరీంనగర్ లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. టీఆర్ఎస్ తోనే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ దక్కిందని ఆయన అన్నారు, ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. మొత్తం మీద బండి సంజయ్ కు గాంధీ సంకల్ప యాత్ర కొన్ని విషయాలను బోధించింది. మరి ఆయన యాత్రకు ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

భారీగా పెరిగిన భూ దందాలు.. రాజకీయ నాయకులను సైతం మోసం చేస్తున్న పోలీసులు

  రాజేంద్ర నగర్ నియోజక వర్గ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో భూ దందాలు భారీగా పెరిగాయి. సదరు స్టేషన్ కు భూముల ఫిర్యాదు వెళ్తే చాలు స్టేషన్ ఆఫీసర్ కాసులు పండించుకుంటున్నారు. నేరుగా ఆయనే సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదాలకు సంబంధించి ఎవరైనా బాధితులు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతి అంతా విని నేను బిజీగా ఉన్నాను, మీరు ఫిర్యాదు చేసి మళ్లీ రేపు ఒకసారి రండి అని చెబుతారు. తర్వాత రోజు ఫిర్యాదు దారుడు రాగానే అయ్యో నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఆ భూమి విషయంలో కమిషనర్ మొన్ననే ఫోన్ చేశారు నీవు వచ్చినపుడు నాకు ఈ విషయం గుర్తులేదు. వివాదం పెద్దది చేసుకోవద్దు సెటిల్ మెంట్ చేసుకో అని సూచిస్తారు. అవసరమైతే నేనే వాళ్లను ఇక్కడకు పిలుస్తానని చెబుతారు, అలా చెప్పి అవతలి వాళ్లను కూడా సెటిల్ మెంట్ కు పిలుస్తారు. రెండవ పార్టీ రాగానే వాళ్లకూ కథ చెప్పి అవతలి వాళ్లను కూడా సెటిల్ మెంట్ కు పిలుస్తారు. వాళ్ల తరఫున డీజీ గారు ఫోన్ చేస్తారు, వివాదాన్ని పెద్దది చేసుకోవద్దు ఈ రోజే ఏదో ఒకటి తేల్చుకోవాలని ఒత్తిడి తెచ్చి ఆయనే సెటిల్ మెంట్ చేస్తారు. ఇద్దరి నుంచి వాటాలు తీసుకుంటారు, లేదంటే మరో పార్టీని తీసుకొచ్చి వివాదాస్పద భూమిని వారిద్దరి నుంచి అమ్మించి చెరికొంత ఇచ్చి ఆయన వాటా ఆయన తీసుకుంటాడు. వివాదాస్పద భూముల్లో గోడలు కట్టేందుకు ఆయన అనధికారికంగా అనుమతులు ఇస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఓ వివాదాస్పద భూమిలో ఒకరు గోడ కట్టేందుకు వెళ్లారు, ఈ విషయం ఆయన వరకూ వెళ్ళింది. ఆయన వెంటనే పనులు నిలిపివేశారు, తర్వాత వారితో బేరం మొదలుపెట్టారు. 2.06 ఎకరాల భూమిలో గోడ కట్టేందుకు సదరు స్టేషన్ ఆఫీసర్ రెండు కోట్లు డిమాండ్ చేశారు. చివరకు 25 లక్షలకు డీల్ కుదిరింది, 2 గంటలులో పని పూర్తి చేయాలని షరతుతో ఆయన అనుమతి ఇచ్చారు. ఈ స్టేషన్ లో ఆయన కంటే ముందు పని చేసిన మరో అధికారి కూడా భారీగా భూదందాలు చేసి కోట్ల వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఏకంగా ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీనే నడుపుతున్నారు, అనేక చోట్ల భూవివాదాల్లో పోలీసులు జోక్యం పెరుగుతుంది. నగర శివారులోని అనేక మండపాల్లో పలువురు పోలీసు అధికారులపై భూదందా ఆరోపణలొస్తున్నాయి. కొందరు స్థానిక రాజకీయ నేతలను కలుపుకొని భూదందాలు చేస్తున్నారు. రికార్డుల ప్రక్షాళనను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు, చిన్న రైతులకు అన్యాయం చేస్తున్నారు. విజయవాడ హైవేకు సమీపంలోని ఓ భూమి విషయంలో కూడా స్థానిక పోలీస్ అధికారులు మితిమీరిన జోక్యం చేసుకున్నారు. దీనిని ప్రత్యర్ధులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపారు, విచారణ అనంతరం బాధ్యులైన ఇద్దరు అధికారులను బదిలీ చేశారు. ఎన్నారైల భూములను పోలీసులు రాజకీయ నాయకులు కలిసి మింగేస్తున్నారు. తమ భూములు కబ్జా చేశారంటూ ఎన్నారైలు చేసిన ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పేరొందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఇలానే పోలీసుల దెబ్బకు బాధితుడిగా మారి న్యాయం కోసం తిరుగుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్గజ నేతలతో పోటీ పడిన ఆయన ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. అయినా ఆ నాయకుడికి కష్టాలు మాత్రం తగ్గలేదు, ఆయనకున్న భూమిని కొందరు కబ్జా చేశారు. ఇందులో స్థానిక పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆయన ఉన్నతాధికారులకు చెప్పారు, సదరు అధికారిని బదిలీ చేశారు. కానీ ఆయనకు మాత్రం న్యాయం జరగలేదు, మేడ్చల్ నియోజక వర్గంలోని ఘట్ కేసర్ మండల పరిధిలో 25 ఎకరాల భూమి విషయంలో పోలీసులు గ్రేటర్ లోని ఓ ముఖ్య రాజకీయ నేతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూమికి నలుగురు హక్కు దారులు ఉండగా ఒక హక్కుదారుల నుంచి భూమి మొత్తాన్ని ప్రభుత్వ పెద్దల్లో ఒకరికి కుడి భుజంగా వ్యవహరించే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు. ఇందుకోసం ఒక వ్యక్తికే 38 ఈ సర్టిఫికెట్ ఇప్పించి అతని నుంచి భూమి కొనుగోలు చేశారు. దీని పై మిగతా రైతులు అభ్యంతరం చెప్పిన మూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ జరిపించేశారు. ఈ విషయంలో స్థానిక రెవిన్యూ అధికారులు పోలీసులు సదరు ప్రజాప్రతినిధికి అండగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ భూములు అనుభవిస్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. భూ వివాదాలు వచ్చినప్పుడు రికార్డులు పరిశీలించి అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఇప్పుడు సరి కొత్త ట్రెండ్ మొదలైంది. భూ వివాదాలపై ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వారికి అక్కడ చుక్కెదురవుతుంది. రికార్డులు మార్చినప్పుడు లేదా భూమి కబ్జాకు గురైనప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో పోలీసులు రికార్డులను పరిశీలించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పై పొజీషన్ లో ఎవరు ఉన్నారనే విషయం తెలుసుకొని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పొజిషన్ మాత్రమే తాము చూస్తామని మిగతా వ్యవహారాలు కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇస్తున్నారు. తన భూమి ఆక్రమణకు గురైందని ఇటీవల ఓ రాజకీయ నాయకుడు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. భూమిని స్వాధీనం లోకి తీసుకునేందుకు వెళ్తే కబ్జాదారునికి అనుకూలంగా స్థానికులు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయినా సదరు పోలీసు ఉన్నతాధికారి కూడా కబ్జా దారునికి అనుకూలంగానే సమాధానం ఇవ్వడంతో ఆయన కంగుతిన్నారు. ఇలాంటి ఘటనలు అధికంగా మేడ్చల్ జిల్లా పరిధిలో జరుగుతున్నాయి.

పార్టీ ఫిరాయింపు రాజకీయాలను సహించేది లేదు : జగన్

    నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతోంది అన్నట్టుగా ఉందట పార్టీ ఫిరాయింపుల విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం. తెలుగుదేశం మాదిరిగా తాను పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించబోమని శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శాసన సభ్యులుగా ఉండి పార్టీకి రాజీనామా చేయకుండా ఎవరైనా ఫిరాయిస్తే వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలా జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ మారేందుకు ప్రతిబంధకంగా మారింది. ఆయన పార్టీ మారాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సింది. ఇప్పటికే టిడిపికి శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు రాసిన వాట్సప్ లేఖలో వంశీ పేర్కొన్నప్పటికీ స్పీకర్ కు మాత్రం నేరుగా తన లేఖను పంపలేదు. ఈ నేపథ్యంలో వంశీతో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ చర్చలు దాదాపుగా విఫలమయ్యాయి, మరోవైపు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు, ఈ భేటీ తరువాత వంశీ ఈ నెల 7 న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. అయితే వంశీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే సీఎం జగన్ ప్రకటన ప్రకారం అంతకుముందే ఆయన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందే అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటనేది తెలుగుదేశం పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. వల్లభనేని వంశీకి టిడిపి టికెట్ ఇచ్చి గెలిపించింది ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ కు సిద్ధమైందట ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా లేఖను నేరుగా చంద్రబాబుకే పంపించాలని ఆయనే దాన్ని స్పీకర్ కు పంపేలా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉన్నట్టు సమాచారం. తద్వారా చంద్రబాబు పైనే ఈ నెపాన్ని నెట్టవచ్చు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇలా వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్ ఎండ్ లెస్ లవ్ స్టోరీలా కొనసాగుతుండగా తెలుగుదేశం పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గోడదూకుతారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు, కోస్తాలోని ఇరువురి ఎమ్మెల్యేలతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందులో కోస్తా లోనూ ఓ ఎమ్మెల్యేను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు, ఆయన తనను వ్యాపారపరంగా అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తాను పార్టీ వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రిపై ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇటీవల మీడియా ప్రతి నిధులు ఆయన్ను సంప్రదించగా ప్రతి రోజు శీలం ఎక్కడ నిరూపించుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వంశీ మరో ఇరువురిని తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేస్తే చంద్రబాబుకు ప్రతి పక్ష హోదా కూడా పోతుందనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఇక గోడమీద పిల్లుల్లా ఉన్నవారికి తాజాగా సిబిఐ కోర్టులో చుక్కెదురు కావడం వెనుకాడేలా చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడంతో పాటు సిబిఐ వేసిన కౌంటర్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు గోడ దూకుదామనుకుంటున్న టిడిపి ఎమ్మెల్యేలను పునరాలోచనలో పడవేశాయి. క్రిమినల్ నేరాల కంటే ఆర్థిక నేరాలు తీవ్రమైనవని, ఇటువంటి కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ తన కౌంటర్ లో పేర్కొనడం ప్రజా బాహుళ్యంలోకి వెళ్లింది. దీంతో తెలుగుదేశం పార్టీ నుంచి ఫ్యాన్ పార్టీ పంచన చేరుదామనుకుంటున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం డైలమాలో పడ్డారని సమాచారం. అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం కొందరు నేతలు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారట తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉంటే తటస్థ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తే తాము సిద్ధంగా ఉన్నామని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అంతగా రుచించలేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి వారు ఒకే అయినప్పటికీ తాము చెప్పినప్పుడే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో ఆ ముగ్గురు నేతలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది, మున్ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.  

 ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది, విధుల్లోకి 373 మంది మాత్రమే, మిగతావారు సమ్మెలో కొనసాగింపు...

.   ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ విధించిన గడువు ముగిసింది. 373 మంది మాత్రమే విధుల్లో చేరారు, మిగిలిన వారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు 150 మంది రాత్రి తొమ్మిదిన్నర వరకు 240 మంది రాత్రి ఒంటి గంట వరకు 373 మంది విధుల్లో చేరారు. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విషయంలో కుటుంబ సభ్యులతో సన్నిహితులతో చర్చించి విధుల్లోకి చేరినట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు, కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రైవేటు బస్సులకు పర్మిట్ లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్టు ఆర్టీసీ వెల్లడించింది. నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు 1937 అద్దె బస్సుల్ని కలుపుకొని మొత్తం 6484 బస్సులు నడిచినట్లు తెలిపింది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిల పక్ష నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆర్టీసిని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున దానిని మూసెయ్యాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందే నని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె 33వ రోజుకి చేరింది, ఇప్పటికైనా ప్రభుత్వం జేఏసీ తో చర్చలు జరిపి కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఈ నెల 7న నిర్వహించే సడక్ బంద్ లో భాగంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెన్ డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. 9న నిర్వహించే చలో ట్యాంక్ బండ్ ను కూడా విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట వీడట్లేదు, డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. పలు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కార్మికులు రోడ్లపై బైఠాయించారు. తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉన్నతాధికారులు హామీతో ధర్నాను విరమించిన ఢిల్లీ పోలీసులు...

    ఢిల్లీ పోలీసులు శాంతించారు, పదకొండు గంటల పాటు సాగిన ధర్నాను విరమించారు. పోలీసు సిబ్బంది డిమాండ్లన్నీ నెరవేర్చుతాం అంటూ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. తీస్ హజారీ కోర్టుల సముదాయంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య శనివారం గొడవలు జరిగాయి. దీని పై ఢిల్లీ హై కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు పోలీసులు. ఢిల్లీ హై కోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ వేస్తామని పోలీసులు ఆందోళన విరమించి విధుల్లో చేరాలంటూ ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ సతీష్ గొల్చా కోరారు. గాయపడిన పోలీసులకు 25,000 పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు సిపి. శనివారం రోజున తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్ లకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్ లు కూడా గాయపడ్డారు. దీని పై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్ట్ ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను భాదించింది. సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు, ఘర్షణకు పోలీసులు తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని పోలీసులు ఆరోపించారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన పదకొండు గంటల పాటు జరిపిన ధర్నాను విరమించారు.  

వైసీపీ ఎస్సీ ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం... రాష్ట్రపతి ఆదేశాలతో కదులుతోన్న డొంక... 

  ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీకి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవే కారణమనే ప్రచారం జరుగుతోంది. వినాయకచవితి రోజు జరిగిన ఒక గొడవలో తనను కులం పేరుతో దూషించారని ఆమె ఫిర్యాదు చేయడం, తూళ్లూరు పోలీసులు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో... బాధితులు... జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఉండవల్లి శ్రీదేవి అసలు ఎస్సీ హిందువు కాదని, ఆమె క్రిస్టియన్ అంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో, ఉండవల్లి శ్రీదేవి... హిందువో... క్రిస్టియనో... తేల్చాలంటూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎల్వీ సుబ్రమణ్యానికి ఆదేశాలు వచ్చాయి. అయితే, ఉండవల్లి శ్రీదేవి... క్రిస్టియన్ కాదు... హిందువు అంటూ రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని, దానికి ఎల్వీ ఒప్పుకోకపోవడంతో... ఆకస్మిక బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎప్పట్నుంచో ఉంది. ఎస్సీలు... క్రైస్తవ్యంలోకి వెళ్తే... వాళ్లు రిజర్వేషన్లను కోల్పోతారని, వాళ్లు బీసీ-సీగా పరిగణించబడతారని రాజ్యాంగం చెబుతోంది. అమెండ్-మెంట్ 1950 పేరా 3లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఎస్సీలు.... క్రైస్తవ్యాన్ని స్వీకరించి.... క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే చేస్తున్నప్పటికీ... సర్టిఫికెట్స్ ప్రకారం మాత్రం ఎస్సీలుగా కొనసాగుతున్నారు. దీనిపై దళితుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్రైస్తవ్యంలోకి మారినవాళ్లు... ఎస్సీ హోదాను వదులుకోకపోవడంతో.... నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుందనే పోరాటాలూ జరుగుతున్నాయి. అయితే, ఇఫ్పుడు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... హిందువా? లేక క్రిస్టియనా? తేల్చాలంటూ ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచే సీఎస్ కు ఆదేశాలు రావడంతో.... తేనెతుట్టెను కదిపినట్లయ్యింది. ఎందుకంటే, ఉండవల్లి శ్రీదేవి... తాను క్రిస్టియన్ అని చెప్పుకోవడం... చర్చికి వెళ్లడం... ఇంట్లో కార్యక్రమాలను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేయడం... ఇలా ఎన్నో ఆధారాలు ఉండటంతో... ఒకవేళ ఆమె క్రిస్టియన్ అంటూ రాష్ట్రపతికి నివేదిక ఇస్తే.... శాసనసభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదముంది. అదే జరిగితే, ఇది ఒక్కరితోనే ఆగిపోదు... ఎందుకంటే... ఒక్క తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవే కాదు.... స్వయంగా హోంమంత్రి మేకతోటి సుచరితే... తన కుమార్తె వివాహాన్ని... క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారు. అందుకు పెళ్లి వీడియోలే రుజువు. ఇలా చెప్పుకుంటూ పోతే... ఎస్సీ కోటాలో ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల్లో అధిక శాతం క్రైస్తవులుగానే ఉన్నారనేది బహిరంగ సత్యం. ఒకవేళ కులం వివాదంలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు పడితే... అది మిగతా ఎస్సీ ప్రజాప్రతినిధులపైనా పడటం ఖాయం. ఎందుకంటే అట్రాసిటీ కేసులు, మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న హిందూ సంస్థలు, కొన్ని వర్గాలు.... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధుల క్రైస్తవ మూలాలపై ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

విజయారెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు!!

  తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి, పోలీసులు హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పలు కీలక ఆధారాలు సేకరించింది. విజయారెడ్డి ఆఫీస్ లోని గడియారం మధ్యాహ్నం 1:55 నిమిషాలకు ఆగిపోయింది. ఈ ఆధారంతో దర్యాప్తు చేసిన క్లూస్ టీం సంఘటన 1:45 నిమిషాలకు జరిగినట్టు నిర్ధారించారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే విజయా రెడ్డి ప్రాణాలు విడిచినట్టు నిర్ధారణకొచ్చారు. సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ తహశీల్దార్ ఆఫీస్ దగ్గర పది నిమిషాలకు పైగానే తిరుగుతూ మంటలార్పే ప్రయత్నం చేశాడు. సగం మంటలు ఉండగానే మండల కార్యాలయం నుంచి నడుచుకుంటూ 2:35 నిమిషాల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. నిందితుడు సురేష్ తన వెంట రెండు లీటర్ల బాటిల్ లో పెట్రోల్ కలిపిన కిరోసిన్ తెచ్చుకున్నట్లు విచారణలో తేలింది. దాన్ని విజయారెడ్డిపై చల్లాడు, అయితే అది ఆమె ఒంటిపై ముందున్న టేబుల్ కుర్చీపై పక్కన పేపర్లపై పడింది అలాగే సురేష్ పై కూడా పడింది. క్షణాల్లోనే తనతో పాటు తెచ్చుకున్న అగ్గిపెట్టెతో మంటలు అంటించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా విజయా రెడ్డికి మంటలు అంటుకోవడంతో పాటు చుట్టు పక్కల కూడా వ్యాపించాయి. కిరోసిన్ అందులో కలపడంతో వెంటనే దట్టంగా పొగలు వచ్చాయి, ఈ పొగతో ఆమె ఛాంబర్ లో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడం కార్బన్ మోనాక్సైడ్ గది అంతా వ్యాపించడంతో ఆమె దాని పీల్చుకుంది దీంతో నిమిషాల వ్యవధి లోనే విజయారెడ్డి ప్రాణాపాయ స్థితికి చేరి తన ఛాంబర్ నుంచి బయటకు మంటలలో కాలుతూ వచ్చి డోర్ దగ్గర కుప్పకూలిపోయింది. కర్టెన్స్ కు మంటలంటుకోవడంతో కాలిపోయాయి. ఈ మంటల వేడికి తలుపు పై భాగంలో ఉన్న గోడ గడియారం 1:55 నిమిషాలకు ఆగిపోయింది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంగుళాన్ని గాలించి ముప్పై రకాలైన నమూనాలను సేకరించింది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు, కిరోసిన్ ఆనవాళ్లు లభించాయని ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు క్లూస్ టీం అధికారులు. కిరోసిన్ కు ఎక్కువ సేపు మండే స్వభావం ఉంటుంది, పెట్రోల్ త్వరగా అంటుకున్న ఆవిరి స్వభావం ఎక్కువగా ఉండటంతో పాటు అంతే త్వరగా మంటలు కూడా ఆరిపోయే అవకాశాలుంటాయి. దీంతో నిందితుడు కిరోసిన్ లో పెట్రోల్ కలుపుకొని వచ్చినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అటు గౌరల్లిలో రోడ్డు పక్కన చిన్న దుకాణంలో పెట్రోల్ కొన్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. తహసీల్దార్ ఛాంబర్ లో మంటలు అంటుకోవడానికి ఉపయోగించిన కిరోసిన్, పెట్రోల్ ఆనవాళ్లు అగ్గిపెట్టె, పూర్తిగా కాలిపోయన రెండు లీటర్ల బాటిల్ తదితర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. దీనిపై మరింత స్పష్టత వచ్చాకే అధికారికంగా చెబుతామన్నారు పోలీసులు. నిందితుడు మధ్యాహ్నం 1:45 నిమిషాలకు చాంబర్ లోకి వెళ్లి ఆమెను సజీవ దహనం చేశాడు. తనక్కూడా మంటలంటుకున్న సురేష్ కార్యాలయం వద్దనే కొద్దిసేపు ఉన్నాడు, ఎవరో బాధితులు తమ పని కాకపోవడంతో ఒంటికి నిప్పంటించుకున్నారనే భావనలో అక్కడున్న వారు భావించారు. తన ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేసుకునేందుకు బట్టలు విప్పేసిన సురేష్ అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మండల ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మధ్యాహ్నం 02:25 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు దర్యాప్తుకు కీలకంగా మారాయి.

70 ఏళ్ళ వయస్సులో కంకరను కరకరా నమిలేస్తున్న ఓ వృధ్ధుడు..!!

  అన్నంలో చిన్న ఇసుక రవ్వ వస్తేనే విలవిల్లాడిపోతాం, నోటితో బఠానీలు నమలాలంటేనే బెంబేలెత్తిపోతుంటాం కానీ, ఓ వృద్ధుడు కంకర రాళ్లను సైతం కరకరా నమిలేస్తున్నాడు. డెబ్బై ఏళ్ళ వయస్సులోనూ రాళ్లను ఉండ్రాళ్లలా కొరికి పాడేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఈ స్టోన్ మ్యాన్ సంచలనంగా మారాడు. పేరు సత్తిరెడ్డి వయసు డెబ్బై ఏళ్లు సాధారణంగా ఈ వయసులో పళ్లూడిపోయే స్థితిలో ఉంటారు వృద్ధులు. కానీ, ఈ స్టోన్ మ్యాన్ సత్తిరెడ్డి మాత్రం రోజు రోజుకూ పళ్లను బలంగా మార్చుకుంటున్నాడు. రాళ్ళను అన్నంలా నమిలి పిప్పి చేస్తున్నాడు. ఓ దశలో తన పళ్లు ఊడిపోయే స్థితికి వచ్చాయి అంటున్నాడు సత్తిరెడ్డి. ఆ సమయంలో ఏ డాక్టర్ కు చూపించుకోలేదు. కేవలం మూలికలతో తన పళ్లు బాగుపడ్డాయని చెబుతున్నాడు. పళ్లు గట్టిపడటం కోసం తానే కొత్త రకం మూలికను తయారు చేశాను అన్నాడు. అప్పట్నుంచీ పళ్లు గట్టిపడి రాళ్లు నమిలే స్థితికి వచ్చానంటున్నాడు స్టోన్ మ్యాన్ సత్తిరెడ్డి. సత్తిరెడ్డిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతోందంటున్నారు గ్రామస్తులు. అన్నంలో రాళ్ళొస్తేనే విలవిల్లాడతాం అని, అలాంటిది రాళ్లనే అన్నంలా తినడం చూస్తుంటే ముచ్చటగా ఉందన్నాడు గ్రామ సర్పంచ్. తన దగ్గరున్న మూలికను సీఎం కేసీఆర్ కి కూడా ఇస్తానంటున్నాడు సత్తిరెడ్డి. గతంలో పంటి నొప్పితో కేసీఆర్ భాదపడ్డట్లు విన్నాననీ అవకాశమొస్తే ఆయన పళ్లను కూడా తన పళ్ళ లాగా మారుస్తాను అని సత్తిరెడ్డి అంటున్నాడు. అవసరమైతే పళ్ళకు సంబంధించిన యాడ్స్ లో నటించటానికి కూడా సిద్ధమని ప్రకటించాడు.

గతంలో కంటే ప్రస్తుత జిడిపి వృధ్ధి రేటు మరింత తగ్గుతుందా..?

  ఆర్థిక వృద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా వృద్ధి రేటులో ఏమాత్రం పెరుగుదల కనిపించడం లేదు. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలోనూ నిరాశే మిగల్చడం ఇందుకు కారణంగా మారింది. జిడిపి 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నా వృద్ధి రేటు మాత్రం పెరగడం లేదు. రెండో త్రైమాసికం లోనూ జిడిపి కోలుకునే అవకాశం లేదని ఎస్.బి.ఐ నివేదించడం పరిస్థితికి అద్దం పడుతోంది. గతంతో పోలిస్తే మరింత దిగజారే అవకాశమే ఉందని చెబుతుండడం కలవరానికి గురి చేస్తోంది. ఈ సారి ఐదు శాతానికి దిగువనే వృద్ధి రేటు ఉండచ్చని ఎస్.బి.ఐ అంటోంది. 2012,2013 నాటి అంచనా స్థాయికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికం సరి సమానంగా వుండనుందని చెబుతోంది. పడిపోయన వినియోగ సామర్థ్యం, క్షీణించిన పెట్టుబడులు సేవా రంగంలో మందగమనం వంటివి జిడిపి పెరుగుదలకు బ్రేక్ వేస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిడిపి గాడిలో పడాలంటే ఇంకా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అక్టోబర్, డిసెంబర్ మధ్య కాస్త కోలుకోవచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్ లో 3.1 లక్షల కోట్లు ప్రభుత్వం ద్వారా ఖర్చు కావడం ఇందుకు దోహదపడుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జిడిపి గాడిన పడచ్చని ఆశాభావం వ్యక్తం చేసినా మార్పు మాత్రం రాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని పరిశీలించిన దేశ విదేశీ ఆర్థికవేత్తలు, నిపుణులు వివిధ అధ్యయనాలు జిడిపి అంచనాలని తగ్గిస్తూ పోతున్నాయి. ఇంతకు ముందున్న 6.2 శాతాన్ని కూడా అందుకోవడం కష్టమనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. క్షీణించిన రుణ వృద్ధి రేటు తిరిగి బలపడుతుందన్న ఆశతో ఉన్నారు. సెప్టెబర్ నెలారంభం నుంచి రుణాలకు డిమాండ్ పెరిగిందని 1.08 లక్షల కోట్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. త్వరలో ఆర్.బి.ఐ నిర్వహించబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమీక్షలోనూ 0.15 శాతం వడ్డీ తగ్గించే ఆస్కారం ఉందని అభిప్రాయ పడుతున్నారు.  

విజయారెడ్డి హత్యతో మొదలైన భయం.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించుకున్న ఎమ్మార్వో

  అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ హత్యతో అధికారుల గుండెల్లో భయం మొదలైంది. అంతేకాదు ఈ హత్య తరువాత జరిగిన కొన్ని సంఘటనలు కూడా అధికారులను మరింత ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళా రైతు.. పాసు పుస్తకాలను ఇవ్వడంలో కొనసాగుతున్న జాప్యంపై సిబ్బందిని గట్టిగా నిలదీశారు. తన వద్ద నుంచి లంచంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ కొట్టినంత పనిచేసారు. దీంతో, షాక్ కు గురైన రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక కడప జిల్లాలో తహసీల్దార్‌ చాంబర్‌ లో ఓ వ్యక్తి తనపై పెట్రోల్‌ పోసుకున్న ఘటన కలకలం రేపింది. కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ మూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ, పని జరగకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే అక్కడున్న సిబ్బంది సమయానికి స్పందించి ఆ రైతుని కాపాడారు. ఈ వరుస ఘటనలతో రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారు. తమ మీద ఎప్పుడు ఎవ్వరు దాడి చేస్తారోనన్న భయం వారిలో మొదలైంది. భయంతో బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. అదే భయంతో ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దారు ఉమా మహేశ్వరి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తన చాంబర్ లో తను కూర్చునే కుర్చీ ముందు ఓ తాడును కట్టించారు. సిబ్బందిని మాత్రమే తాడు దాటి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. అర్జీలు ఇచ్చే వారు ఎవరైనా తాడుకు అవతల ఉండి మాత్రమే వాటిని అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు. కొందరు అధికారులైతే.. రెవెన్యూ కార్యాలయాల ముందు భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి వారిలో భయం పోగొట్టి, వారు ప్రశాంతంగా పనిచేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

విజయారెడ్డిని ఎందుకు చంపాల్సి వచ్చింది? నిందితుడు సురేష్ స్టేట్-మెంట్ ఏమిచ్చాడు?

  తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న నిందితుడు సురేష్ నుంచి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు.... ఈ ఘాతుకం వెనుక ఇంకెవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. అయితే, విజయారెడ్డి హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తన తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టా పాసు పుస్తకాల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగితిరిగి విసిగిపోయే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు సురేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. తమ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే, రెవెన్యూ అధికారులు మాత్రం ఇతరుల పేరు మీద దస్తావేజులు, పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారని, దీనిపై గ్రామసభల్లో అనేకసార్లు ప్రశ్నించామని, అలాగే తమ పేరిట పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వాలని తహశీల్దార్ విజయారెడ్డిని వేడుకున్నానని, కానీ ఆమె పట్టించుకోలేదని, ఆ కోపంతోనే పెట్రోల్ పోసి తగలబెట్టేశానని పోలీసులకు, మెజిస్ట్రేట్ కు సురేష్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసలీ భూముల వివాదమేంటో ఒకసారి చూద్దాం... అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి గ్రామంలో... పలురువు రైతులు.... 1954లో రాజా ఆనందరావు నుంచి భూములు కొనుగోలు చేశారు. అనంతరం కాలంలో ఆర్‌వోఆర్‌ చట్టం కింద పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. అప్పట్నుంచి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, సాగుదారులుగా కొనసాగుతున్నారు. అయితే, 2014లో సడన్‌గా తెరపైకి వచ్చిన యాసిన్ అండ్ హయత్ లు‌.... తమ దగ్గర రక్షిత కౌలుదారుల చట్టం కింద హక్కులు ఉన్నాయంటూ కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాలతో అప్పటివరకు సాగు చేసుకుంటున్న రైతులకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు విచారణ తర్వాత ఆ భూమిపై హయత్‌-యాసిన్ తోపాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ 2016 అక్టోబర్ 25న ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆ భూములను‌ వాళ్లు... ఇద్దరు రియల్టర్లకు విక్రయించారు. అయితే, అప్పటివరకు సాగుదారులుగా ఉన్న రైతులు... జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించగా, ఆర్డీవో ఆదేశాలనే సమర్ధించడంతో... తిరిగి హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉండగా, సర్వే నెంబర్ 87 నుంచి 101 వరకున్న దాదాపు 130 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది.  అయితే, ఈ భూములు హైదరాబాద్‌కి సమీపంలో ఉండటం... అలాగే, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండటంతో... రాజకీయ నేతలు, కబ్జాదారులు, రియల్టర్ల కన్ను వీటిపై పడింది. దాంతో, ఇటీవల సర్వే నెంబర్ 92, 93, 94, 96ల్లో 40 ఎకరాల భూమిని ఓ రాజకీయ నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరగడంతో... ఆ భూములకు చెందిన 11 కుటుంబాలు హైకోర్టులో మరో కేసు వేశారు. ఈ కేసులపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే... మరోవైపు రెవెన్యూ అధికారులు... లంచాలకు కక్కుర్తిపడి ఇతరుల పేరు మీద దస్తావేజులు చేసినట్లు తెలుస్తోంది. ఈ 40 ఎకరాల్లోనే నిందితుడు సురేష్‌, అతని పెదనాన్నకు 8 ఎకరాల భూమి కూడా ఉండటంతో.... స్థానిక తహశీల్దార్ విజయారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున తాను కలుగజేసుకోలేనని విజయారెడ్డి చెప్పింది. కానీ, ఆ భూములకు ఇతరుల పేరు పట్టాలివ్వడంతోపాటు దస్తావేజులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బాధిత రైతులు గ్రామ సభల్లో నిలదీయడమే కాకుండా, అనేకసార్లు గొడవకి దిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా, ఇతరుల పేరు మీద పట్టాలు ఇవ్వడంతో బాధిత రైతులు రగిలిపోయారు. ఆ బాధిత కుటుంబాల్లో ఒకడైన సురేష్... తహశీల్దార్ విజయారెడ్డి ఉండగా... ఆ భూములు ఇక తమకు దక్కవేమోనన్న ఆందోళనతో... పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.