కార్యకర్తల ప్రశ్నల వర్షం.. చంద్రబాబు తీరు ఇప్పుడైనా మారుతుందా?
posted on Nov 6, 2019 @ 5:44PM
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు అంటారు. అలాగే ఉంది ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఒక్కొక్క జిల్లాలో మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులను పరామర్శించడం, నియోజక వర్గాల ఇన్ చార్జిలతో కలిసి భోజనం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల మూడు రోజుల పాటు విజయవాడలో కృష్ణా జిల్లాకు చెందిన పదహారు నియోజక వర్గాల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అనేక విషయాలు పార్టీ పెద్దల దృష్టికొచ్చాయి.
కొన్ని నియోజక వర్గాల్లో బహునాయకత్వ ఉండడం ఎమ్మెల్యేకి, క్యాడర్ కి మధ్య దూరం పెరగడం, వాటిని చంద్రబాబు పట్టించుకోకపోవటం, ద్వితీయ శ్రేణి నేతలకు సైతం సరైన గౌరవం ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో నష్టం చేశాయని తేలింది. ఈ విషయాలను ఆయా నియోజక వర్గాల నేతలు స్వయంగా చంద్రబాబుకి నివేదించడం గమనార్హం. ఇదిలా ఉంటే విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పార్టీ నేత నాగుల్ మీరా వర్గాల మధ్య చంద్రబాబు సమక్షంలోనే వివాదం జరిగింది. ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. నాగుల్ మీరా తమకు మద్దతు ఇవ్వలేదని జలీల్ ఖాన్ వర్గీయులు ఆరోపించారు. జలీల్ ఖాన్ తమను కలుపుకు వెళ్లలేదని ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని నాగుల్ మీర వర్గీయులు ప్రత్యారోపణలు చేశారు.
ఈ పరిణామంతో విసిగిపోయిన చంద్రబాబు ఇటువంటి వివాదాలు ఎవరికీ మంచిది కాదని ఎవరికైనా పార్టీ సుప్రీం అని అందరూ విధేయులుగా ఉండాలని ఆ రెండు వర్గాల వారికి స్పష్టం చేశారు. ఇటువంటి నియోజకవర్గాల్లో వివాదాలను సర్దుబాటు చేసేందుకు సీనియర్ నేతలను పంపుతామని హామీ ఇచ్చారు. పరిష్కారం కాకపోతే నేరుగా తానే జోక్యం చేసుకుంటానని కూడా వివరించారు. గన్నవరం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే వంశీ మోహన్ ఈ సమీక్షకు హాజరు కాలేదు కానీ స్థానిక కార్యకర్తలు నేతలు మాత్రం పెద్ద ఎత్తున హాజరయ్యారు. అక్రమంగా బనాయించిన కేసు విషయంలో భయపడ్డం మంచిది కాదని వంశీకి తాను సూచించానని మరోసారి మీ ద్వారా ఆయనకి ఈ విజ్ఞప్తి చేస్తున్నానని కార్యకర్తలతో అధినేత చంద్రబాబు చెప్పారు.
ఎవరున్నా లేకున్నా తమ పార్టీకి అండగా ఉంటామని ఈ సందర్భంగా గన్నవరం తెలుగు తమ్ముళ్లు బాబుకి భరోసా ఇచ్చారు. మరికొన్ని నియోజక వర్గాల్లో కూడా ఇటువంటి సమీక్ష జరిగింది. అయితే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అధికారంలో ఉన్న ఐదేళ్లలో మిమ్మల్ని కలవలేకపోయాం అని, మీరు పార్టీని వదిలేసి అధికారులతో బిజీ బిజీగా గడిపారని, విడిపోయిన రాష్ట్రం అంటూ చాలా కష్టపడ్డారని, దీంతో సరైన ప్రాధాన్యం లేక పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో యాక్టివ్ గా పనిచెయ్యలేదని నేరుగా చంద్రబాబుతోనే చెప్పారు. మిమ్మల్ని కలిసేందుకు ఎన్నిసార్లు వచ్చినా అపాయింట్ మెంట్ దొరకలేదని కొందరు చెప్పిన తీరు చూసి చంద్రబాబు కూడా చలించిపోయారు.
ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వచ్చినా కూడా తమకు నిరాదరణ ఎదురయిందని మరికొందరు పార్టీ అధినేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల మనోభావాలు విన్న చంద్రబాబు వారికొక విషయం స్పష్టం చేశారు. ఇక ముందు పరిస్థితి గతంలో మాదిరిగా ఉండదని పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇది తన మాటగా నమ్మాలని వివరించారు. కృష్ణజిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో పార్టీకి ట్రీట్మెంట్ తానే చేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మైలవరం నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ అక్కడ టిడిపి పరాజయం పాలవడానికి గల కారణాలపై చంద్రబాబు లోతుగా ఆరా తీశారు.
ఒక్కసారి జగన్ కు చాన్సిద్దాం అనే భావన, కొన్నివర్గాలు టిడిపికి దూరం కావడమే ఓటమికి కారణాలని తేల్చారు. ఆయా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల పనితీరు ఉందంటూ చంద్రబాబు కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ లోక్ సభ స్థానం పరిధి లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓటమి చెందినా, ఎంపీ అభ్యర్ధి కేశినేని నానికి మెజారిటీ రావడం ఆయన గెలుపొందడం కూడా కొంతమంది కార్యకర్తలు ప్రస్తావించారు. టాటా ట్రస్టు ద్వారా కేశినేని నాని చేపట్టిన కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం వివాదాలకు అతీతంగా వ్యవహరించడం వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ తో పాటు లోక్ సభలో ప్రధాని మోదీని నేరుగా నిలదీసిన తీరు కూడా ఆయన విజయానికి కారణమయ్యాయి అని ఈ సందర్భంగా మరికొందరు నేతలు విశ్లేషించారు. ఇలా ప్రతి నియోజక వర్గం లోని ప్లస్సులూ మైనస్సులూ చంద్రబాబు టిడిపి ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. తద్వారా వచ్చే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు.