ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది, విధుల్లోకి 373 మంది మాత్రమే, మిగతావారు సమ్మెలో కొనసాగింపు...
posted on Nov 6, 2019 @ 1:50PM
.
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ విధించిన గడువు ముగిసింది. 373 మంది మాత్రమే విధుల్లో చేరారు, మిగిలిన వారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు 150 మంది రాత్రి తొమ్మిదిన్నర వరకు 240 మంది రాత్రి ఒంటి గంట వరకు 373 మంది విధుల్లో చేరారు. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విషయంలో కుటుంబ సభ్యులతో సన్నిహితులతో చర్చించి విధుల్లోకి చేరినట్టు సమాచారం.
మరోవైపు ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు, కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రైవేటు బస్సులకు పర్మిట్ లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్టు ఆర్టీసీ వెల్లడించింది. నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు 1937 అద్దె బస్సుల్ని కలుపుకొని మొత్తం 6484 బస్సులు నడిచినట్లు తెలిపింది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిల పక్ష నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆర్టీసిని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున దానిని మూసెయ్యాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందే నని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె 33వ రోజుకి చేరింది, ఇప్పటికైనా ప్రభుత్వం జేఏసీ తో చర్చలు జరిపి కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఈ నెల 7న నిర్వహించే సడక్ బంద్ లో భాగంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెన్ డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి.
9న నిర్వహించే చలో ట్యాంక్ బండ్ ను కూడా విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట వీడట్లేదు, డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. పలు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కార్మికులు రోడ్లపై బైఠాయించారు. తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.