దేశవ్యాప్తంగా సెక్యూరిటీ అలర్ట్... అయోధ్య తీర్పుపై కేంద్రం అటెన్షన్...
అత్యంత వివాదాస్పదమైన అయోధ్య తీర్పు త్వరలో వెలువడనుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మత ఘర్షణలు, ఉద్రిక్తలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. తీర్పు ఎలాగున్నా ఏమీ మాట్లాడొద్దంటూ మంత్రులకు ప్రధాని మోడీ ఆదేశించారు. మరోవైపు, ఆరెస్సెస్, బీజేపీ నేతలు... ఎక్కడికక్కడ ముస్లింలను కలిసి సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర హోంశాఖ... భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అలాగే, సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్, వ్యాఖ్యానాలు చేయొద్దని ఆంక్షలు విధించారు. ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేసినా, వైరల్ చేసినా, లైకులు, షేర్లు చేసినా చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసిన కేంద్రం... ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేస్తే జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక, వివాదాస్పద అయోధ్య స్థలం దగ్గర యూపీ పోలీసులు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, మల్టిఫుల్ ప్లాన్స్ తో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఒక ప్లాన్ ఫెయిలైతే... క్షణాల్లో మరో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి పరిస్థితిని కట్టడి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. వివాదాస్పద స్థలం దగ్గర 12వేల మంది పోలీసులను మోహరించగా, అదనంగా 4వేల పారామిలటరీ బలగాలను యూపీకి పంపింది కేంద్రం. వీళ్లే కాకుండా మరిన్ని దళాలను ఉత్తరప్రదేశ్ అంతటా మోహరించనున్నారు. ఇక, సుప్రీం తీర్పు నేపథ్యంలో... అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చింది.
నవంబర్ 17లోగా సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం విస్తృత జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయోధ్యలో సభలు, సమావేశాలు నిషేధించడంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా వేదికలను పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. అలాగే, పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేసేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ఇక, గ్రామాల్లో సైతం ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా 16మంది వాలంటీర్లను నియమించారు. ఇక, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి పెద్దఎత్తున అరెస్టులు చేయాల్సి వస్తే... జనాన్ని ఉంచడానికి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలనే తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు వాటిని ఖాళీ చేయిస్తున్నారు.