బీజేపీలో చేరిన టీడీపీ ఫైర్‌బ్రాండ్‌!!

  టీటీడీపీలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోత్కుపల్లి బీజేపీలో చేరడానికి ముందు.. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో చర్చించిన తరువాత బీజేపీలో చేరారు.  కొన్నాళ్లక్రితం టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మోత్కుపల్లి.. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీకి దూరం అయ్యాక మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. టీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ నుంచి సంకేతాలు రావడంతో చర్చలు ఫలించి బీజేపీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి మోత్కుపల్లి చేరిక ఎలాంటి లాభం తెస్తుందో వేచి చూడాలి.  

పట్టపగలు తహశీల్దారు సజీవ దహనం

  రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహశీల్దారుగా పని చేస్తున్న విజయారెడ్డి అనే మహిళను ఓ దుండగుడు సజీవ దహనం చేసాడు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు తహసీల్దార్ విజయపై పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు ఈ ఘటనకు పాల్పడిన అనంతరం తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సిబ్బందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.    తహసీల్దార్ కార్యాలయంలోకి దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు. విజయారెడ్డితో మాట్లాడాలంటూ నిందితుడు ఆమె చాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే తొలుత తహసీల్దార్ విజయారెడ్డి అటెండర్ అడ్డుకొన్నారు. మీటింగ్ పూర్తైన తర్వాత విజయారెడ్డి ఛాంబర్లోకి దుండగుడు వెళ్లినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆమె చాంబర్‌లోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోసి వెంటనే నిప్పంటించాడు. అయితే దుండగుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు..? విధుల్లో ఉన్న తహసీల్దార్‌పై ఎందుకు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం ఘటనా స్థలానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేరుకున్నారు.

బాబు ఆదేశాలను బేఖాతర్ చేసిన గంటా.. జనసేన లాంగ్ మార్చ్ కు డుమ్మా

  జనసేన లాంగ్ మార్చ్ టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంగ్ మార్చ్ కు హాజరుకావాలని టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశించినప్పటికి రాకపోవటంతో ఆయన టీడీపీని వీడాలని గంటా డిసైడయ్యారనే పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఉన్న వ్యక్తిగత విబేధాలే కారణమని కొందరు వాటిని తోసిపుచ్చుతున్నారు.  విశాఖలో ఏ పార్టీ నుండి పోటీ చేసినా గెలుపు మాత్రం గంటాదే. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన గంటా ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు. అప్పట్నుంచీ గంటా ఏ పార్టీ లోకి వెళ్తారా అనే ఆసక్తి  రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓసారి వైసీపీ లో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ గంటా మాత్రం తన మనసులో మాటను బయటపెట్టలేదు. అధినేత ఆదేశించినా లాంగ్ మార్చ్ కి హాజరు కాకపోవడంతో మరోసారి గంటా దారెటు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంటా పార్టీ మారతారా మారితే ఏ పార్టీ ఇదే అంశానికి సంబంధించి పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. గత కొంతకాలంగా గంటాని చూసినట్లయితే ఒక ప్రణాళికతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు గానే చెప్పొచ్చు.  పవన్ కళ్యాణ్ స్వయంగా టీడీపీని కూడా  కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వనించారు. దానికి టీడీపీ స్పందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా అటు మాజీమంత్రులైన చింతకాయల అయ్యన్న పాత్రుడుతో పాటు గంటా శ్రీనివాసరావును, అచ్చెన్నాయుడుని పాల్గొవాలని ప్రత్యేకంగా ఆదేశించారు. అధినేత ఆదేశం సైతం బేఖాతర్ చేస్తూ ఆయన నిన్న కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు టిడిపిలో ఇటు పొలిటికల్ సర్కిల్ లోనూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.నిన్న గంటా విశాఖలో అందుబాటు లోనే ఉన్నారు.. అయినా కావాలనే గైర్హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ తో కూడా గంటాకు చిన్న గ్యాప్ ఏర్పడింది. మెగాఫ్యామిలికీ..  చిరంజీవికి చాలా సన్నిహితమైన వ్యక్తి. ఈ మధ్యకాలంలో చిరంజీవి ఎక్కడికి వెళ్లినా సరే ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కాని పవన్ కల్యాణ్ తో మాత్రం చిన్నపాటి గ్యాప్ ఇప్పటికి ఉంది. ఈ నేపథ్యంలో అటు గ్యాప్ పరంగానే దూరంగా ఉన్నారనేది ఒక వాదనైతే ఇటు పార్టీ మారుతున్నందుకే ఆయన రాలేదనేది ఒక వాదన. జనసేన లాంగ్ మార్చ్ కు వస్తే తప్పుడు సంకేతాలు వచ్చే అవకాశాలున్నాయని కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న వాదన. ఈ వాదనలకు తెర పడాలంటే స్వయంగా గంటానే తన మనసులోని మాట బయట పెట్టాల్సి ఉంది.

దుర్గమ్మ దర్శనం మరింత ఖరీదు.. ఫోటో దిగాలన్నా అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే

  విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం మరింత ఖరీదు కానుంది. జేబు నిండా డబ్బులుంటేనే తప్ప భక్తులు అమ్మ వారిని దర్శించుకోలేరన్న వార్తలు  వినిపిస్తున్నాయి. భక్తుల జేబులను గుల్ల చేసే విధంగా దేవస్థానం అధికారులు నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మ వారిని దర్శించుకునేందుకు వెళ్లే సమయంలో భక్తులు తమ వెంట సెల్ ఫోన్ లు, కెమెరాలు తీసుకువెళ్లకూడదు అనే నిబంధన ఉంది. వాటిని సంబంధిత కౌంటర్ లలో భద్రపరుచుకోవాలి అంటే ఒక్కో వస్తువుకు ఐదు రూపాయలు చెల్లించాల్సి  ఉంటుంది. ఇవి కాకుండా ఇతర సామాన్లు కూడా భద్రపరుచుకోవాలి అంటే వాటికి కూడా రుసుము చెల్లించాల్సిందే. ఇందుకు సంబంధించిన టెండర్ లకు పిలవాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు ముచ్చటపడి దేవాలయ ప్రాంగణాల్లో గుర్తుగా ఫొటోలు దిగాలి అనుకోవడం మరియు సెల్ఫీ తీసుకోవాలి అంటే ఇక పై కుదరదనే చెప్పొచ్చు. కొండ పైనున్న చిన్న రాజగోపురం, మహామండపం, ఏడో అంతస్తు పై పెద్ద రాజగోపురం ఫొటో దిగేందుకు లైసెన్స్ పొందిన ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ లను ఆశ్రయించాలి. వారు చెప్పిందే రేటు, ఇచ్చిందే ఫొటో అన్నట్లు గా స్పాట్ ఫోటోలకు లైసెన్స్ హక్కు కల్పించనున్నారు. ఈ నెల(నవంబర్ 13న) సీల్డ్ టెండర్ లు తెరిచి అర్హులైన వారికి దేవస్థానం అధికారులు లైసెన్స్ లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన 16 నెలల కాలపరిమితితో టెండర్ లను ఆహ్వానించారు. గతంలో చెప్పుల స్టాండ్ లు, క్లాక్ రూములు, సెల్ ఫోన్ లు, కెమెరాలు వంటి వస్తువులను భద్రపరిచే కౌంటర్ లను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చేవారు. భక్తుల నుంచి అదనపు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..భక్తులే ఫ్రీగా సామన్లు భద్రపరుచుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భక్తులు తమ వస్తువుల భద్రపరుచుకునేందుకు ఫొటోలు తీసుకునేందుకు మళ్లీ రుసుము చెల్లించాలి అంటూ ప్రస్తుత ఈవో సురేష్ బాబు నిర్ణయించారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. దేవుడిని చూడటానికి డబ్బు చెల్లించాలి.. మా వస్తువులు మేము తెచ్చుకోకుండా ఉండాలంటే కూడా డబ్బు చెల్లించాలి.. దేవుడి దగ్గరికి వచ్చినందుకు గుర్తుగా ఒక ఫోటో దిగాలన్నా కూడా మీరు అడిగినంత డబ్బు చెల్లించాలి.. ఇవేం నిబంధనలు అంటూ భక్తులు మండిపడుతున్నారు.  

ఢిల్లీ ఇన్ డేంజర్ జోన్... సరి-బేసి పద్దతిలో కాలుష్యాన్ని అరికట్టనున్న కేజ్రీవాల్

  ఢిల్లీ నగరం డేంజర్ జోన్ లో పడింది. వాయు కాలుష్య భూతం జనాల్ని మింగేందుకు సిద్ధంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హస్తిన లో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరడంతో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానానికి చేరింది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది .ఢిల్లీ తో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నేటి నుంచి ప్రభుత్వం సరి బేసి విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం రెండు వందల ట్రాఫిక్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసింది. సరి బేసి విధానం పై ఢిల్లీ పౌరులకు అవగాహన కల్పించేందుకు 5000 మంది వాలంటీర్ లకు శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం.  ఇవాళ్టి నుంచి 1,3, 5, 7,9 వంటి బేసి అంకెలతో ముగిసే వాహనాలను నవంబర్ 4, 6, 8,12, 14 తేదీల్లో రోడ్ల పైకి అనుమతించరు. అదే విధంగా 0, 2, 4, 6, 8 వంటి సరి సంఖ్య కలిగివున్న వాహనాలు కూడా నవంబర్ 5, 7, 9, 11, 13, 15 తేదీల్లో రోడ్ల పైకి అనుమతించబోమని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు.ఇక సరి బేసి విధానం ఈ నెల 17 తేదీతో ముగుస్తుంది. అప్పడు కూడా కాలుష్యం స్థాయి తీవ్రంగా ఉంటే సరి బేసి విధానాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల రిజిస్ర్టేషన్ నెంబర్ ఉన్న వాహనాలకు కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. బైకులను.. ఎలక్ట్రిక్ వాహనాలను..ఈ పరిమితుల నుంచి మినహాయించారు. అంబులెన్స్ లు , స్కూల్ వాహనాలు, వీఐపీ వాహనాలని కూడా మినహాయించారు. సరి బేసి విధానాన్ని ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.4000 జరిమాన విధించనున్నారు.  మరోవైపు ఈ విధానాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీధుల్లో కారులో వెళుతూ నిబంధనలని దిక్కరించారు రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్. ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం అనేక అత్యవసర నియంత్రణలు చేపట్టిందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రజలు సరి బేసి నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము ఎవ్వరినీ నిందించాలనుకోవడం లేదని.. రాజకీయాలు పక్కన పెట్టి ఈ కాలుష్య కోరల్లో నుండి బయటపడేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. ఇటు బాలీవుడ్ నటులు కూడా ఢిల్లీ కాలుష్యం పై తమ వైఖరిని  ప్రకటించారు. ముఖానికి ముసుగు ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నటి ప్రియాంకా చోప్రా. ఢిల్లీ గాలి కాలుష్యం పై ట్విట్టర్ లో ఆందోళన వ్యక్తం చేశారు నటుడు రిషి కపూర్.  ప్రస్తుతం ఢిల్లీ లోని వేర్వేరు ప్రాంతాల్లో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పైగానే నమోదవుతోంది. మాస్క్ లు లేకుండా బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి రావటానికి భౌగోళిక వాతావరణ పరిస్థితులకు తోడు మానవ తప్పిదాలు ఎక్కువగా కారణం అవుతున్నాయి. ఢిల్లీతో సహా కొన్ని ఉత్తరాది నగరాల్లో వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యాన్ని అమాంతం పెంచేస్తున్నాయి.కాన్పూర్ ఐఐటీ చేసిన అధ్యయనం ప్రకారం ఢిల్లీలో విడుదలయ్యే కాలుష్యంలో అత్యధిక వాటా వాహనాలదే అని తేల్చింది. వాహనాల రాకపోకల కారణంగా రోడ్ల మీద నుంచి వాతావరణం లోకి చేరే దుమ్ము ధూళితో 36శాతం.. వాహనాల కారణంగా 25 శాతం కాలుష్యం ఏర్పడుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వంట గదుల నుంచి విడుదలయ్యే కాలుష్యం వాటా 22 శాతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో భారీ పరిశ్రమల కారణంగా మరో 22 శాతం కాలుష్యం విడుదలవుతోందనే స్పష్టం చేసింది.

సుజిత్ మరణం మరవకముందే.. బోరు బావిలో పడి మరో చిన్నారి మృతి

  దేశంలో టెక్నాలజీ పెరుగుతూనే ఉంది. కూర్చున్న చోటు నుంచే ప్రపంచ నలుమూలల్లో ఏ పనైనా చేయగలిగే సామర్ధ్యం ఉంది. కానీ నీటి కోసం తవ్విన బోరు బావిని పూడ్చలేరు.. తెలిసి తెలియక ఆడుకుంటూ అందులో పడిన చిన్నారులను కాపడలేరు. బోరు బావిలో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తమిళనాడులో చిన్నారి సుజిత్ విషాద గాధను మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. హర్యాణ , కర్నాల్ జిల్లాలో శివాని అని ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయింది. హరిసింగ్ పురా గ్రామానికి చెందిన ఈ చిన్నారి సాయంత్రం తమ పొలంలో ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయింది. కొంతసేపటికి తల్లిదండ్రులు బోరు బావిలో చిన్నారి పడినట్టుగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులను.. అధికారులను.. ఆశ్రయించారు. చిన్నారి 60 అడుగుల లోతులో ఉన్నట్టుగా గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. శివానిని విజయవంతంగా బయటకు తీశారు.. కానీ ఆసుపత్రికి తరలించేలోపే శివాని ప్రాణాలు కోల్పోయింది. ఐదేళ్ల చిన్నారిని ప్రాణం లేకుండా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు చెందారు. ఇండియా నుంచి అమెరికాకి సెకన్లలో ఫోన్.. మెసేజ్.. చేయగలిగే టెక్నాలజీని కనుగొన్నారే కానీ కళ్లముందు 60 అడుగుల లోతులో ఉన్న చిన్నారి ప్రాణాలను సురక్షితంగా కాపాడే టెక్నాలజీని ఎప్పుడు కనిపెడతారో అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్.. బీజేపీ పై డౌట్!!

  ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారంటూ ఉండరు. మనం చేసే ప్రతి పనికి ఫోన్ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాట్సాప్..ఫేస్బుక్..ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియా లొనే సగం జీవితం గడిపేస్తున్నాము. ఇంతకు ముందు ఇంట్లో చొరబడి దొంగలు దోచుకున్నారు అనేవారు.. ఇప్పుడు ఎవరో ఫోన్ హ్యాకింగ్ చేసి నా సమాచారం దోచుకున్నారని అంటున్నారు. సామాన్యుల ఫోన్ లే హ్యాకింగ్ కి గురవుతుంటే..బడా బాబులు.. ముఖ్యనేతల మొబైలను వదులుతారా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాకింగ్ కు గురైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే అది నిజమేనేమో అని సందేహం కలుగుతుంది.  ఇజ్రాయిల్ కు చెందిన పెగాసన్ స్పైవేర్ సంస్థ కొందరు ఫోన్ లోని వాట్సాప్ లోకి చొరబడింది అన్న వార్తల నడుమ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఇప్పటి వరకూ స్పైవేర్ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్ల లోకి చొరబడిందని.. అందులో ప్రియాంక గాంధీ కూడా ఉన్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ కు గురైన వారందరికీ స్పైవేర్ సంస్థ ఒక సందేశం పంపించిందని..అదే సందేశం ప్రియాంక గాంధీకి కూడా పంపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ ఫోన్ లు కూడా హ్యాకింగ్ కి గురైనట్లు కాంగ్రెస్ చెబుతోంది. ఇది బీజేపీ పనేనని ప్రభుత్వమే హ్యాకింగ్ చేయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. స్పైవేర్ సంస్థ వాట్సాప్ లోకి చొరబడినట్లు స్వయంగా సంస్థనే సోషల్ మీడియాలో వెల్లడించింది. నాయకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉద్యమ నేతలకు ముప్పు ఉందని.. వీరి ఫోన్లోని సమాచారం ఇతర దేశాలకు చేరే ప్రమాదముందని వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపధ్యం లోనే స్పైవేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

అయోధ్య కేసులో తుది తీర్పు... యూపీ , మధ్యప్రదేశ్ లో హై అలర్ట్

  అయోధ్య తీర్పు వెల్లడికానున్న నేపథ్యంలో దేశం అంతటా అప్రమత్తమవుతున్నారు. యూపీ సీఎం ఆదిత్య నాథ్ తన మంత్రులను అలర్ట్ చేశారు. తీర్పు రానున్న కారణాన ఎవ్వరు నోరు జారవద్దని ఆదేశించారు. యూపీ ఒక్కటే కాకుండా అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పోలీసులకు సెలవులను రద్దు చేసింది. వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం మరికొద్దిరోజుల్లో తుది తీర్పు ప్రకటించనుంది. ఎన్నో ఏళ్లు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత వచ్చే ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు వచ్చినా దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  అలర్ట్ అవుతున్నాయి. తీర్పు వచ్చే వరకు నోటికి పని చెప్పకుండా ఉండమని తన మంత్రులకు.. సహచరులకు.. యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ కాస్త గట్టి గానే హెచ్చరించారని తెలుస్తుంది. సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించక ముందే అధికార ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నట్లు అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని మంత్రులకు యోగి సూచించారు. ఈ విషయంలో బిజెపి అధిష్టానం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ.. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా వేడుకలూ చేసుకోకూడదనే నిబంధన విధించింది. తీర్పు తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. మిలాద్ ఉన్ నబి, గురునానక్ జయంతి లాంటి పర్వదినాల్లో అయోధ్య కేసు తీర్పు వెలువడనుంది. దీంతో శాంతి భద్రతలను దృష్టి లో పెట్టుకొని నవంబరు 1 నుంచి పోలీస్ అధికారులు సిబ్బంది ఎలాంటి సెలవులు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ  ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు పోలీసులు సెలవు పెట్టకూడదని అందులో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే సీనియర్ల అనుమతి తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చరిత్రాత్మక నిర్ణయం కావడంతో దేశంలోని అందరి కళ్ళు అయోధ్య తీర్పు పైనే ఉన్నాయి.

స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్ళారా విజయసాయిరెడ్డి గారు: పవన్

  ఆదివారం జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై  విరుచుకపడ్డారు. టీడీపీకి టీం బి..టీడీపీకి దత్తపుత్రుడు..డీఎన్ఏ..అంటూ తన గురుంచి ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేసే హక్కు వైసీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారన్నారు. ఎందరో మహనీయులు అంబేద్కర్..కాన్షీరాం..లాంటి వారే పరాజయం చెందారని వైసీపీ నేతలకు గుర్తు చేశారు. దెబ్బ తిన్నా మళ్లీ పైకి లేస్తా అన్నారు.  వ్యక్తిగతంగా తాను అందరికి చాలా గౌరవం ఇస్తానని..2004లోనే నా జోలికి రావొద్దని బొత్సకి కబురు పంపించానని తెలిపారు. విజయసాయిరెడ్డి  స్థిమితం లేనట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారని.. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని..జీవితంలో చాలాసార్లు దెబ్బలు తిన్నానని పవన్ స్పష్టంగా చేసారు. ఎన్నికల్లో నిలబడలేకుండా..దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులనే రాజ్యసభకు పంపిస్తారు కానీ..సూట్ కేసుల కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా విమర్శలు చేస్తుంటే..సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు సంవత్సరాల జైలులో ఉన్న వ్యక్తి విమర్శలు చేస్తారా ? అని ప్రశ్నించారు. తనకు భయం లేదని..ఇంటి ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందన్నారు. అయినా విజయసాయిరెడ్డి ఏదో స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్లినట్లు నీతులు మాట్లాడుతున్నారని పవన్ సెటైర్లు వేశారు.

పంచాయతీరాజ్ శాఖలో భారీ అవినీతి :- సీఎం సార్ మీరే దిక్కు అంటున్న కాంట్రాక్టర్లు

  రాజ్యం బాగుండాలంటే రాజు ఒక్కడే బాగుంటే సరిపోదు కదా.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత రివర్స్ టెండరింగ్ అంటూ ఆయన నిధులను ఆదా చేస్తుంటే శాఖాధికారులు మాత్రం స్వాహా చెయ్యడానికి చూస్తున్నారు.గ్రామాల్లోని రోడ్లు..మౌలిక వసతులలో పెను మార్పులు తీసుకురావడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదలైంది. అలాంటి ప్రాజెక్టుకు అవినీతి మరక అంటిస్తున్నారు. టెండర్ లు పూర్తయి ఒప్పందం చేసుకున్న పనులను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఏపీలోని పట్టణాలను.. నియోజకవర్గాలను.. కలుపే రోడ్లను అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అధికారుల సుదీర్ఘ కసరత్తు తరువాత వందల కిలోమీటర్లలో రోడ్లు నిర్మించి ఈ ప్రాజెక్టుకు బ్యాంకు నుంచి రుణం పొందగలిగారు. ఏపీ రూరల్ రీస్ట్రచరింగ్ ప్రాజెక్టు పేరిట మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు కు ఏషియన్ బ్యాంక్ రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. దీంతో అధికారులు 55 ప్యాకేజీల కింద రెండు మూడు నియోజికవర్గాల రోడ్లను కలిపి టెండర్లకు పిలిచారు. టెండర్ లు దక్కించుకున్న కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. కొందరు పనులు కూడా మొదలు పెట్టారు. అయితే పంచాయతీ రాజ్ శాఖలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై అవినీతి నీడలు కమ్ముకొంటున్నాయి. టెండర్ లు అగ్రిమెంట్ పూర్తయిన పనులను నిలిపేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కోట్లకు సంభందించిన పనులు కావడంతో దీని పై పంచాయతీ రాజ్ శాఖలోని పెద్దలకు కన్నుపడింది. నిబంధనల ప్రకారం ఆ టెండర్లను రద్దు చేయటం సాధ్యం కాకపోవడంతో ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారితో కొత్త పంచాయితీ మొదలుపెట్టారనే వాదన వినిపిస్తుంది. తాము సూచించిన వారి పేరుతో ఎస్ యూ ఖాతా తెరవాలని ఓ ఉన్నతాధికారి ఒత్తడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ లు వెళ్లి జిల్లా మంత్రులను.. ముఖ్య నాయకులను.. కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ జిల్లా మంత్రి స్వయంగా దీని పై పంచాయతీ రాజ్ శాఖ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఆ ఉన్నతాధికారి ఒత్తిళ్లు ఆగలేదని సమాచారం. ఒప్పందాలు జరిగిన సమయంలో తాము కొంత ఖర్చు పెట్టుకున్నామని.. ఇప్పుడు కొత్త గా ఇబ్బందులు సృష్టిస్తే పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్ లు వాపోతున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా జరిగితే మండల.. నియోజకవర్గ స్థాయిలో అనూహ్య మార్పులు వస్తాయి. మౌలిక సదుపాయాలు పెరిగి  ఊర్ల రూపురేఖలు మారిపోతాయి. అయితే స్వయంగా ఏషియన్ బ్యాంక్ నిధులు ఇచ్చిన ఇలాంటి ప్రాజెక్టుకు అవినీతి లెక్కలతో అడ్డు తగలడంపై పెద్ద చర్చే జరుగుతుంది. పనులు రద్దు అయితే ప్రాజెక్టుకు ఆర్థిక కష్టాలు తప్పవని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఎలాగైనా ఈ సమస్య ను సీఎం దృష్టి కి తీసుకెళ్లి కొత్తగా మొదలైన అకౌంట్ వివాదానికి ముగింపు పలకాలని కాంట్రాక్టర్ లు భావిస్తున్నారు.    

సమ్మె ఆగదు.. ఉద్యోగాల్లో తిరిగి చేరేది లేదు.. :- ఆర్టీసీ జేఏసీ 

  సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపకుండా విధుల్లోకి వచ్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. ఉద్యోగాలు తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని.. అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తేనే మీరు చెప్పినట్లు యూనియన్లు రద్దు చేసుకుంటామన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలచి.. లేబర్ యాక్ట్ ప్రకారం చర్చలు జరిపితే మంచిదన్నారు. కేసీఆర్  ఇచ్చే వార్నింగ్ లకు భయపడి కార్మికులెవరూ తిరిగి విధుల్లో చేరే ఆలోచనకు రావొద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. పోరాటం మొదలు పెట్టాం..ధైర్యంగా ముందు వెళదామని.. ఆత్మద్రోహం చేసుకుని విధుల్లోకి చేర వలసిన అవసరం లేదని చెప్పారు. నిరుద్యోగుల విజ్ఞప్తితో నవంబర్ 5న చేయాలనుకున్న సడక్ బంద్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలతో సమాణికులని చెప్పినందుకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు జేఏసీ నేతలు. నవంబర్ 5 అర్థరాత్రి లోగా ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా 5వేల బస్సులు ప్రైవేట్ కు ఇస్తే.. చివరకు 5వేల బస్సులు మాత్రమే మిగులుతాయని జోస్యం చెప్పారు.కేసీఆర్ చెప్పిన విధంగా చూస్తే 5వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరం అవుతారని.. మిగతా 23వేల మంది కార్మికులను ఏం చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అశ్వత్థామరెడ్డి. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వం కోరినట్లు యూనియన్లను వైండప్ చేస్తామని తెలియజేసారు. కార్మికులను భయపెట్టేలా సీఎం మాట్లాడారని జేఏసీ నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం(నవంబర్ 3,2019) టీఎంయూ కార్యాలయంలో సమావేశం అయ్యారు ఆర్టీసీ జేఏసీ నేతలు. భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్  చేసిన కామెంట్స్ పై చర్చించారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోందని జేఏసీ నేతలు ఆరోపించారు. నవంబర్ 4 నుండి డిపో మేనేజర్లు సమ్మెకు మద్దతివ్వాలని జేఏసీ నేతలు కోరారు.  

పవన్ కళ్యాణ్ టీడీపీ దత్తపుత్రుడు అయితే మీకు అధికారమే లేదు :- టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

    ఆదివారం ( నవంబర్ 3న ) విశాఖలోని మద్దిలపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించింది. దీనికి టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగసభలో అచ్చెన్న నాయుడు పాల్గొని ప్రసంగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు చేస్తోందని..టీడీపీ దత్తపుత్రుడు అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోంది.. ఇతర పార్టీలు నిర్వహించే కార్యక్రమాలను జరగకుండా చేయాలనే ఉద్దేశంలోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇసుక సంక్షోభం పై ఐదు నెలల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తూనే ఉన్నామని.. అయినా వైసీపీ ప్రభుత్వానికి కానీ సీఎం జగన్‌కు కానీ చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఎద్దేవా చేశారు.  ఇసుక కొరత వల్ల పనులు లేక మనోవేదనతో కొంతమంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే..సామాజిక మరణాలు అంటారా ? అంటూ వైసీపీ మంత్రులను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని టీడీపీ దత్తపుత్రుడు అంటారా ? ఆయన కలిసి ఉన్నప్పుడు జరిగింది ఇంకా మరిచిపోలేక ఇవ్వని మాట్లాడుతున్నట్లు ఉన్నారని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన చూసి కూడా చలించకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వెంటనే ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరియు టీడీపీ పార్టీ జనసేనకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా..ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా అన్ని పార్టీలు..ప్రజలు వ్యవహరించాలని సూచించారు.  

తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తారా? ఆర్టీసీ ఎండీపై నిప్పులు చెరిగిన హైకోర్టు

  తెలంగాణ హైకోర్టు తన దూకుడు కొనసాగిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సర్కారు తీరును ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... మరోసారి పదునైన మాటలను వదిలింది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై తప్పుడు లెక్కలు చెప్పారంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మపై నిప్పులు చెరిగింది. కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. సునీల్ శర్మ రిపోర్ట్‌పై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు.... అఫిడవిట్‌లోని అంశాలకు.... అసెంబ్లీలో మంత్రి చెప్పిన వివరాలు... పరస్పర విరుద్ధంగా ఉన్నాయని మండిపడింది. ఒకే అంశంపై రెండు వేర్వేరు రిపోర్టులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఇచ్చిన నివేదికతో ఆర్టీసీ రిపోర్ట్ ను సరిపోల్చి.... నవంబర్ ఆరులోపు మరోసారి నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌కు హైకోర్టు ఆదేశించింది. అయితే, జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి 1786కోట్లు రావాల్సి ఉండగా, కేవలం 336కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి తెలిపిందని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌... హైకోర్టుకు నివేదించారు. అంతేకాదు సెక్షన్‌ 112 (30) ప్రకారం... హైదరాబాద్‌లో నడిపే ఆర్టీసీ బస్సుల నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్‌ఎంసీ అంగీకరించలేదన్నారు. ఇక, నిర్వహణ, డీజిల్ భారం అధికం కావడంతో... ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నా, ఆర్టీసీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిపారు. అలాగే, సమ్మె కారణంగా ఇప్పటివరకు 82కోట్ల నష్టం వాటిల్లిందని హైకోర్టుకు తెలిపారు సునీల్ శర్మ. అయితే, బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై కావాలనే తప్పుడు లెక్కలతో నివేదిక ఇచ్చారంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మపై హైకోర్టు మండిపడింది. అంతేకాదు చట్ట ప్రకారం ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదో చెప్పాలని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. నవంబరు ఆరులోపు లెక్కలను సరిజేసి మరోసారి నివేదికివ్వాలన్న హైకోర్టు.... సీఎస్‌, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్‌‌లను ఏడున తమముందు హాజరుకావాలంటూ ఆర్డర్స్ జారీ చేసింది.  

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం..! అమిత్ షా దగ్గరకు అశ్వద్ధామరెడ్డి..?

  ఒకవైపు కేసీఆర్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది... మరోవైపు ఆత్మగౌరవాన్ని చంపుకొని విధుల్లోకి వెళ్లొద్దంటూ యూనియన్లు పిలుపునిస్తున్నాయి. దాంతో, ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని వినియోగించుకోవాలా? లేక జేఏసీ చెప్పినట్లు వినాలో తెలియక ఆర్టీసీ కార్మికులు నలిగిపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రితో కేసీఆర్ డెడ్ లైన్ ముగియనుండటంతో కార్మికులు ఎటూతేల్చుకోలేకపోతున్నారు. విధుల్లో చేరాలా? వద్దా? అని తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే, హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో కొందరు కార్మికులు విధుల్లో చేరడంపై యూనియన్ లీడర్లు మండిపతుతున్నారు. రీ-జాయిన్ అవుతున్న కార్మికులను అడ్డుకుంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, విధుల్లో చేరుతున్న కార్మికులను ఎవరైనా అడ్డుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీస్ బాస్ లు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని, అలా చేరిన వారికి చట్టప్రకారం రక్షణ కల్పిస్తామని... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు తెలిపారు. బెదిరింపులకు పాల్పడినా, భౌతికదాడులకు దిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, సర్కారు విధించిన గడువులోపు ఎంతమంది కార్మికులు విధులకు హాజరవుతారనేది ఉత్కంఠగా మారింది. ఒకరిద్దరు పిరికివాళ్లు మాత్రమే విధుల్లో చేరుతున్నారని, మిగతా కార్మిక లోకమంతా సమ్మెలోనే కొనసాగుతున్నారంటోన్న జేఏసీ... సీన్‌ను హస్తినకు మార్చాలని నిర్ణయించింది. కేసీఆర్ డెడ్ లైన్ తో ఆర్టీసీ సమస్యను ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సమస్యను వివరించాలని నిర్ణయించారు. అలాగే, కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఆర్టీసీ కార్మిక జేఏసీ... తొమ్మిదిన ట్యాంక్ బండ్ పై భారీ నిరసనకు ఏర్పాట్లు చేస్తోంది.  

కేసీఆర్ వార్నింగ్ తో కార్మికుల్లో అలజడి... స్ట్రాంగ్ కౌంటర్ కు జేఏసీ ఎమర్జెన్సీ మీటింగ్

  లాస్ట్ ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలతో ఆర్టీసీ కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం... మరోవైపు యూనియన్ల మధ్య నలిగిపోతున్న కార్మికులు... ఏంచేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. ఆర్టీసీ కార్మికులు అన్-కండీషనల్ గా విధుల్లోకి చేరాలని, లేదంటే ఆర్టీసీని వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ కేసీఆర్ హెచ్చరించడంతో కార్మికుల్లో అలజడి అంతర్మధనం మొదలైంది. ఇప్పటికే పలు డిపోల్లో ఆర్టీసీ కార్మికులు రిపోర్ట్ చేస్తూ డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. ఒకవైపు డిమాండ్లు సాధించుకోవాలన్నా పట్టుదల ఉన్నా... మరోవైపు రెండు నెలలుగా జీతాల్లేకపోవడం... ఇంకోవైపు కేసీఆర్ హెచ్చరికలతో... కార్మికుల్లో ఆత్మస్థైర్యం సన్నిగిల్లుతోంది. వివిధ కారణాలతో ఇప్పటికే 20మందికి పైగా కార్మికులు మరణించడంతో.... ఇక చేసేదేమీలేక కొందరు విధులకు హాజరుకావాలని నిర్ణయించుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులు భేషరతుగా విధుల్లోకి చేరాలని, లేదంటే ఆర్టీసీని వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలతో ఆర్టీసీ కార్మిక జేఏసీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి అన్ని డిపోల జేఏసీ నేతలు హాజరుకానున్నారు. కార్మికుల అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ముఖ్యంగా కార్మికులకు భరోసా కల్పించడంతోపాటు ఆత్మస్థైర్యం నింపనున్నారు. అదే సమయంలో కేసీఆర్ హెచ్చరికలకు స్ట్రాంగ్ గా కౌంటర్ రియాక్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

మున్సి-పోల్స్‌పై కేసీఆర్ పరేషాన్... గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తో వెనుకంజ

ఒకవైపు ఆర్టీసీ సమ్మె... మరోవైపు విపక్షాల మూకుమ్మడి దాడి చేసినా హుజూర్‌నగర్ బైపోరులో మంచి విజయం సాధించడంతో గులాబీ బాస్ పట్టలేని ఆనందంతో కనిపించారు. హుజూర్ నగర్ సక్సెస్ ఊపులోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి విపక్షాలను చిత్తుచిత్తుగా ఓడిద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకే, ఎప్పుడైనా మున్సిపోల్స్ కు సిద్ధంగా ఉండాలని అటు అధికారులకు, ఇటు పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అయితే, ఆ స్పీడ్ ఇప్పుడు కనిపించడం లేదట. అసలిప్పుడు మున్సిపోల్స్‌కు వెళ్లాలా? వద్దా అనే అయోమయంలో పడ్డారని అంటున్నారు. హుజూర్ నగర్ విజయంతో మాంచి జోష్ మీదున్న కేసీఆర్ కి షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారట గులాబీ లీడర్లు. హుజూర్ నగర్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించకపోయినా... స్టేట్‌ వైడ్ గా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్‌ ఉంటుందని కేసీఆర్ కి రిపోర్ట్స్ ఇచ్చారట. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో మున్సిపోల్స్ కు వెళ్తే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊహించని నష్టం జరిగే ప్రమాదముందని కేసీఆర్ కి సూచించారట. హుజూర్ నగర్ బైపోల్‌ వేరు... మున్సిపల్ ఎన్నికలు వేరని... ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే అది మరింత తీవ్రంగా ఉందంటూ జనాగ్రహాన్ని కేసీఆర్ కి నివేదించారట. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ నేతలు యాక్టివ్ పనిచేస్తుండటంతో... అర్బన్ ఏరియాస్ లో ఆ పార్టీకి ఆదరణ పెరిగిందని రిపోర్ట్ ఇవ్వడంతో గులాబీ బాస్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. వరుస ఎన్నికలు-వరుస విజయాలతో దూకుడు మీదున్న టీఆర్ఎస్‌... మున్సి-పోల్స్‌పై మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ విజయంతో గులాబీ బాస్‌ ఎన్నడూలేనంత జోష్‌లో కనిపించినా.... గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తో మున్సిపల్ ఎన్నికలపై పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకకుండా మున్సిపోల్స్ కు వెళ్తే మాత్రం పార్టీకి ఊహించని నష్టం జరగడం ఖాయమని పార్టీ లీడర్లు తేల్చిచెప్పడంతో కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నారట. దాంతో, ఆర్టీసీ ఇష్యూ ముగిసిన తర్వాతే మున్సిపల్ పోరుకి వెళ్లాలని నిర్ణయించారట.  

ఎన్సీపీతో చర్చలకు సిద్ధమైన శివసేన.......

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద ని అనుకున్నారంతా. ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపి శివసేనకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. శివసేన నేతల నుంచి రోజుకో ప్రకటన రావడంతో మహా రాజకీయల్లో మహా ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యమంత్రి పదవిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకొమని బిజెపి చెప్పడంతో శివసేన ఇతర పార్టీల వైపు చూపు తిప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు సీట్లు సాధించిన భాజాపా తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా శివసేన సవాల్ విసిరింది. అలా జరగని పక్షంలో ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి రెండో అతి పెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు అవకాశముంటుందని పరోక్షంగా బిజెపిని హెచ్చరించింది. ప్రజల కోరిక మేరకు ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటిస్తూ వచ్చిన ఎన్సీపీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే  శివసేనతో పొత్తుకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది. ఇదే విషయమై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు శరద్ పవార్. అటు రాష్ట్ర తాజా రాజకీయ పరిణామా లను ఫడ్నవీస్ హోమంత్రి బిజెపి అధినేత అమిత్ షాను కలిసి వివరించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో చర్చలు జరిగితే అది సీఎం పదవిపైనే జరుగుతాయని శివసేన స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలేవీ జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతి నిధి సంజయ్ రౌత్ అన్నారు. తాజా పరిస్థితుల్లో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కు సంజయ్ రౌత్ సందేశం పంపించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆ సమయంలో ఓ సమావేశంలో ఉండడంతో సంజయ్ రౌత్ తో మాట్లాడలేకపోయానన్న అజిత్ పవార్ త్వరలోనే ఆయనతో ఫోన్ లో సంభాషించి వివరా లు తెలుసుకుంటానన్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనేది శరద్ పవార్ నిర్ణయిస్తారని అజిత్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు ఏడుతో ముగిసిపోనుంది, ఈలోగా ప్రభుత్వ ఏర్పాటు జరగాలి లేదంటే అది రాష్ట్రపతి పాలనకు దారితీసే అవకాశముంది. రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ లో నూట ఐదు సీతతో బిజెపి పెద్ద పార్టీ గా అవతరించిన మెజారిటీ మాత్రం సాధించలేదు. ఇంకా నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. యాభై ఆరు సీట్లతో శివసేన రెండో పెద్ద పార్టీ గా నిలవగా తర్వాతి స్థానాల్లో ఎనసిపి యాభై నాలుగు సీట్లతో కాంగ్రెస్ నలభై నాలుగు సీట్లతో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది.  

మద్యం షాపులు మాకొద్దు మూసేయండి.. హైదరాబాద్ లో ప్రజల తిరుగుబాటు

  మద్యం టెండర్లు వచ్చాయంటే చాలు వైన్ షాప్ ఓనర్లు ఎగబడిపోతారు.. కానీ తెలంగాణలో కథ రివర్స్ అయ్యింది. మద్యం షాపు మాకొద్దంటూ భయపడిపోతున్నారు. జనాలు నివసిస్తూ.. ఆడపిల్లలు.. చిన్నపిల్లలు.. తిరిగే ప్రాంతాల్లో వెలిసే కొత్త వైన్ షాపులపై జనం మండిపడుతున్నారు. ఇప్పటికే ఉన్న ఒకటి, రెండు వైన్ షాపుల వల్లే చాలా ఇబ్బందిగా ఉంటే అదే చోట మరో బ్రాందీ షాపు వెలుస్తుండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పలుచోట్ల మహిళలు వైన్ షాపుల ముందు ఆందోళనలకు దిగారు. నగరంలోని పార్శిగుట్టలో ఒకే వీధిలో రెండు బార్లు, మూడు వైన్ షాపులు ఏర్పాటు చెయ్యడంతో స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. కొత్త షాపు ప్రారంభించడానికి వచ్చిన యజమానిని అడ్డుకొని నిలదీయడంతో అతని అనుచరులు మహిళలపై దాడికి దిగారు. ఈ దాడిలో ఓ మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అది చూసిన మహిళలకు ఆగ్రహం కట్టలు తెంచుకొంది. చేతిలో చీపుళ్లు పట్టుకుని ఆందోళన చేయడంతో.. వీరి నిరసనకు ప్రజా సంఘాలు, సీపీఐతో పాటు తెలంగాణ జనసమితి నేతలు మద్దతు తెలియజేశారు. వైన్ షాపులు ఏర్పాటును విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు.వైన్ షాప్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చిలకలగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  సికింద్రాబాద్ చిలకలగూడ దగ్గర కూడా వైన్ షాప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. చిలకలగూడ అమృత వైన్స్ ఎదుట ధర్నాకు దిగారు. ఇళ్ళ మధ్య వైన్ షాపు పెట్టడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల దగ్గర లో ఇళ్ల మధ్య లో మద్యం దుకాణా లు ఏర్పాటు చేయొద్దంటూ కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్ టీయూ రోడ్డులో స్థానికులు ఆందోళనకు దిగారు. రెండు మద్యం దుకాణాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వైన్ షాపులు ఆలయాలకు దూరంగా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. మీ సేవ సెంటర్ నడుపుకుంటున్న కొందరు మహిళలు, సాయంత్రం ట్యూషన్ మరియు స్కూల్ నుంచి వచ్చె ఆడపిల్లలకు, సాయంత్రం ఆలయాలకు వెళ్లి వచ్చె ముసలివారి సైతం ఈ మందు దుకాణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో మెడికల్  ఎమర్జన్సీ కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఈ అంశం పై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మినరల్ వాటర్ ప్రజల రోగాలకు స్టాటర్

  బావిలో నీరు తాగే రోజుల నుంచి బాటిల్లో నీళ్లు తాగే రోజులకు వచ్చేసారు ప్రజలు. మినరల్ వాటర్ లేనిదే గొంతులోకి నీళ్లు దిగటంలేదు. అసలు మనం తాగే నీరు ఎంత వరకు సురక్షితం..! మినరల్ వాటర్ మంచిదేనా..!? లేక డబ్బులు పెట్టి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నామా?? వాటర్ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మినరల్ వాటర్ ఎంతో సురక్షితమని ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిళ్లు కోనుకొని తాగేస్తాం. ఆ నమ్మకమే వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వాటర్ ప్లాంట్లు దర్శనమిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి.. వాల్టా చట్టాన్ని కాళరాసి..మినరల్ వాటర్ మాఫియా వ్యాపారం మూడు బోర్లు ఆరు ట్యాంకర్ లు అనే విధంగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట్ ప్రాంతంలో  బోరు నీళ్ళని బాటిళ్ లలో నింపుతున్నారు.బల్కంపేట లో మెజార్టీ ప్రజలకు నీటిని అమ్ముతున్న వాటర్ బాటిల్ యూనిట్ లో బాటిళ్లకు నీరు నింపడం మొదలు.. సీల్ వేసే క్యాప్ ను చూస్తే వంద శాతం బ్యాక్టీరియా కనిపిస్తుంది.క్యాన్లలో పడుతున్న పైపు బాటిళ్లను ఒకసారి పరిశీలిస్తే ఎంత అశుభ్రంగా ఉన్నాయో తెలుస్తుంది.కనీస ప్రమాణాలు  పాటించకుండా.. తాము మిగిలిన వారికంటే ఎక్కువ శ్రద్ధతో నీటిని విక్రయిస్తున్నామని కొందరు వ్యాపారులు సమర్ధించుకుంటున్నరు.వీళ్లు తయారు చేసే వాటర్ బాటిళ్లలో అసలు ఏది నకిలీ.. ఏది ఒరిజినల్.. అనేది తెలీడం లేదు. అన్ని బాటిళ్లు బ్రాండెడ్ లాగానే కనిపిస్తాయి.. కానీ లోపల నీరు ఎన్ని రోజులు వాడొచ్చు అనే విషయంపై ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. పెద్ద పెద్ద హోటళ్ల పరిస్థితి కూడా ఇంతే..ఇక రైల్వేస్టేషన్ , బస్ స్టాండ్ ప్రాంతాల్లో డూప్లికేట్ బ్రాండ్ తో యధేచ్ఛగా వాటర్ బాటిల్స్ దందా కొనసాగుతోంది. అవి తాగి జనం అనారోగ్యం పాలవుతున్నారు. అయితే రద్దీ ప్రాంతాల్లో తాము బ్రాండెడ్ నీటినే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని  చెప్తున్నారు అధికారులు. ఏదేమైనా ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. బాటిల్ మీద సగం లాభం వస్తున్నప్పుడు ప్రజల గురుంచి పట్టించుకునే అవసరం వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటున్నారు ప్రజలు.