సీబీఐ కోర్టు తీర్పు తెచ్చిన తిప్పలు.. తలలు పట్టుకుంటున్న వైసీపీ నేతలు!!
posted on Nov 6, 2019 @ 4:41PM
చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అనే నానుడిని తలపించేలా ఉందట ఇటీవల సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ కు ఎదురైన చుక్కెదురు పరిణామం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చ. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది మందికి గ్రామ వాలంటీర్ లుగా పోస్టులు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, నవరత్నాల పథకాల అమలుతో వడివడిగా అడుగులు వేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక్క సారిగా బ్రేక్ పడినట్లయింది. నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంలో పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్టు సంస్థను వైదొలగాలని ఇచ్చిన ప్రీ క్లోజర్ నోటీసుపై హై కోర్టు ముందస్తు స్టే ఇవ్వడం ఆ తర్వాత తొలగించిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.
వెనువెంటనే మేఘా ఇంజనీరింగ్ కూడా పనులు ప్రారంభించింది, జల విద్యుత్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్ లో మిగిలి పోయిన పనులను 4987 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవగా ఇందులో 12.6 శాతం తక్కువకు మెగా ఇంజనీరింగ్ టెండర్లు దక్కించుకోవడంతో సుమారు 625 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. మరోవైపు వైయస్సార్ రైతు భరోసా వైయస్సార్ వాహన మిత్ర పెన్షన్ ల వయస్సు పెంపు, ఆరోగ్యశ్రీ, వైయస్సార్ కంటివెలుగు వంటి పథకాలను అమలు చేస్తున్నామని అర్హులైన వారికి పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా లబ్ధిని అందిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు.
నిజానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన పాదయాత్రకు బయలుదేరే ముందు కూడా సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అప్పుడు కూడా కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది, పాద యాత్ర చేస్తూ కూడా జగన్ ప్రతి గురువారం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్లి శుక్రవారం కోర్టుకు హాజరై అదే రోజు సాయంత్రానికి పాద యాత్ర జరిగే ప్రాంతానికి చేరుకొని మరుసటి రోజు యాత్ర ప్రారంభించారు. పాద యాత్ర ఇలా సాగింది, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండడంతో అనేక బరువు బాధ్యతలుంటాయని సమీక్షా సమావేశాలతో పాటు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం అవసరం అవుతుందని హైదరాబాద్ కు రావాలంటే సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే అరవై లక్షలు ఖర్చవుతుందని చెప్పడం అతిశయోక్తి అని సిబిఐ తన అఫిడవిట్ లో పేర్కొంది. కాగా సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలు ప్రజాబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళాయి. జగన్ ఎంపీగా ఉన్న సమయంలోనే సాక్షులను ప్రభావితం చేశారని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున ఇంకా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలమిచ్చినట్టు అవుతుందని వారు అస్త్రాలుగా మల్చుకునేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
మొత్తం మీద సిబిఐ కోర్టులో జగన్ కు ఎదురైన చుక్కెదురు పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అంశంగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. తమకు ప్రజలిచ్చిన తీర్పులకు తమ ప్రభుత్వం వేగానికి ఈ తాజా పరిణామం స్పీడ్ బ్రేకర్ లాంటిదని దీన్ని ఎలాగైనా దాటుకుని ముందుకెళ్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సడెన్ బ్రేక్ కారణంగా నెమ్మదించిన జగన్ సర్కార్ జోరందుకునేదెప్పుడో అదెలాగో చూడాలి.