భారీగా పెరిగిన భూ దందాలు.. రాజకీయ నాయకులను సైతం మోసం చేస్తున్న పోలీసులు
posted on Nov 6, 2019 @ 3:27PM
రాజేంద్ర నగర్ నియోజక వర్గ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో భూ దందాలు భారీగా పెరిగాయి. సదరు స్టేషన్ కు భూముల ఫిర్యాదు వెళ్తే చాలు స్టేషన్ ఆఫీసర్ కాసులు పండించుకుంటున్నారు. నేరుగా ఆయనే సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదాలకు సంబంధించి ఎవరైనా బాధితులు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతి అంతా విని నేను బిజీగా ఉన్నాను, మీరు ఫిర్యాదు చేసి మళ్లీ రేపు ఒకసారి రండి అని చెబుతారు. తర్వాత రోజు ఫిర్యాదు దారుడు రాగానే అయ్యో నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఆ భూమి విషయంలో కమిషనర్ మొన్ననే ఫోన్ చేశారు నీవు వచ్చినపుడు నాకు ఈ విషయం గుర్తులేదు. వివాదం పెద్దది చేసుకోవద్దు సెటిల్ మెంట్ చేసుకో అని సూచిస్తారు.
అవసరమైతే నేనే వాళ్లను ఇక్కడకు పిలుస్తానని చెబుతారు, అలా చెప్పి అవతలి వాళ్లను కూడా సెటిల్ మెంట్ కు పిలుస్తారు. రెండవ పార్టీ రాగానే వాళ్లకూ కథ చెప్పి అవతలి వాళ్లను కూడా సెటిల్ మెంట్ కు పిలుస్తారు. వాళ్ల తరఫున డీజీ గారు ఫోన్ చేస్తారు, వివాదాన్ని పెద్దది చేసుకోవద్దు ఈ రోజే ఏదో ఒకటి తేల్చుకోవాలని ఒత్తిడి తెచ్చి ఆయనే సెటిల్ మెంట్ చేస్తారు. ఇద్దరి నుంచి వాటాలు తీసుకుంటారు, లేదంటే మరో పార్టీని తీసుకొచ్చి వివాదాస్పద భూమిని వారిద్దరి నుంచి అమ్మించి చెరికొంత ఇచ్చి ఆయన వాటా ఆయన తీసుకుంటాడు. వివాదాస్పద భూముల్లో గోడలు కట్టేందుకు ఆయన అనధికారికంగా అనుమతులు ఇస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఓ వివాదాస్పద భూమిలో ఒకరు గోడ కట్టేందుకు వెళ్లారు, ఈ విషయం ఆయన వరకూ వెళ్ళింది. ఆయన వెంటనే పనులు నిలిపివేశారు, తర్వాత వారితో బేరం మొదలుపెట్టారు.
2.06 ఎకరాల భూమిలో గోడ కట్టేందుకు సదరు స్టేషన్ ఆఫీసర్ రెండు కోట్లు డిమాండ్ చేశారు. చివరకు 25 లక్షలకు డీల్ కుదిరింది, 2 గంటలులో పని పూర్తి చేయాలని షరతుతో ఆయన అనుమతి ఇచ్చారు. ఈ స్టేషన్ లో ఆయన కంటే ముందు పని చేసిన మరో అధికారి కూడా భారీగా భూదందాలు చేసి కోట్ల వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఏకంగా ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీనే నడుపుతున్నారు, అనేక చోట్ల భూవివాదాల్లో పోలీసులు జోక్యం పెరుగుతుంది. నగర శివారులోని అనేక మండపాల్లో పలువురు పోలీసు అధికారులపై భూదందా ఆరోపణలొస్తున్నాయి. కొందరు స్థానిక రాజకీయ నేతలను కలుపుకొని భూదందాలు చేస్తున్నారు. రికార్డుల ప్రక్షాళనను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు, చిన్న రైతులకు అన్యాయం చేస్తున్నారు. విజయవాడ హైవేకు సమీపంలోని ఓ భూమి విషయంలో కూడా స్థానిక పోలీస్ అధికారులు మితిమీరిన జోక్యం చేసుకున్నారు.
దీనిని ప్రత్యర్ధులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపారు, విచారణ అనంతరం బాధ్యులైన ఇద్దరు అధికారులను బదిలీ చేశారు. ఎన్నారైల భూములను పోలీసులు రాజకీయ నాయకులు కలిసి మింగేస్తున్నారు. తమ భూములు కబ్జా చేశారంటూ ఎన్నారైలు చేసిన ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పేరొందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఇలానే పోలీసుల దెబ్బకు బాధితుడిగా మారి న్యాయం కోసం తిరుగుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్గజ నేతలతో పోటీ పడిన ఆయన ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. అయినా ఆ నాయకుడికి కష్టాలు మాత్రం తగ్గలేదు, ఆయనకున్న భూమిని కొందరు కబ్జా చేశారు. ఇందులో స్థానిక పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆయన ఉన్నతాధికారులకు చెప్పారు, సదరు అధికారిని బదిలీ చేశారు.
కానీ ఆయనకు మాత్రం న్యాయం జరగలేదు, మేడ్చల్ నియోజక వర్గంలోని ఘట్ కేసర్ మండల పరిధిలో 25 ఎకరాల భూమి విషయంలో పోలీసులు గ్రేటర్ లోని ఓ ముఖ్య రాజకీయ నేతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూమికి నలుగురు హక్కు దారులు ఉండగా ఒక హక్కుదారుల నుంచి భూమి మొత్తాన్ని ప్రభుత్వ పెద్దల్లో ఒకరికి కుడి భుజంగా వ్యవహరించే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు. ఇందుకోసం ఒక వ్యక్తికే 38 ఈ సర్టిఫికెట్ ఇప్పించి అతని నుంచి భూమి కొనుగోలు చేశారు. దీని పై మిగతా రైతులు అభ్యంతరం చెప్పిన మూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ జరిపించేశారు. ఈ విషయంలో స్థానిక రెవిన్యూ అధికారులు పోలీసులు సదరు ప్రజాప్రతినిధికి అండగా ఉన్నారు.
ఎప్పటి నుంచో ఈ భూములు అనుభవిస్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. భూ వివాదాలు వచ్చినప్పుడు రికార్డులు పరిశీలించి అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఇప్పుడు సరి కొత్త ట్రెండ్ మొదలైంది. భూ వివాదాలపై ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వారికి అక్కడ చుక్కెదురవుతుంది. రికార్డులు మార్చినప్పుడు లేదా భూమి కబ్జాకు గురైనప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో పోలీసులు రికార్డులను పరిశీలించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పై పొజీషన్ లో ఎవరు ఉన్నారనే విషయం తెలుసుకొని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పొజిషన్ మాత్రమే తాము చూస్తామని మిగతా వ్యవహారాలు కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇస్తున్నారు.
తన భూమి ఆక్రమణకు గురైందని ఇటీవల ఓ రాజకీయ నాయకుడు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. భూమిని స్వాధీనం లోకి తీసుకునేందుకు వెళ్తే కబ్జాదారునికి అనుకూలంగా స్థానికులు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయినా సదరు పోలీసు ఉన్నతాధికారి కూడా కబ్జా దారునికి అనుకూలంగానే సమాధానం ఇవ్వడంతో ఆయన కంగుతిన్నారు. ఇలాంటి ఘటనలు అధికంగా మేడ్చల్ జిల్లా పరిధిలో జరుగుతున్నాయి.