కాసుల కోసం ప్రసాదంలో సైనైడ్ పెట్టి ప్రాణాలు తీసిన దుండగుడు...
posted on Nov 6, 2019 @ 4:56PM
అతని పేరు సింహాద్రి అలియాస్ శివ. చదివింది పదో తరగతి. గతంలో అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పని చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టి దెబ్బతిన్నాడు. ఆపై అడ్డదారిలో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. కాసుల కోసం ప్రాణాలు తీశాడు. అలా ఒకరూ ఇద్దరు కాదు ఇరవై నెలల్లో పది మందిని చంపాడు. అది కూడా సైనైడ్ కలిపిన ప్రసాదమిచ్చి చంపాడు. ఆ సీరియల్ కిల్లర్ బారిన పడి స్వామీజీ నుంచి సామాన్య గృహిణి వరకూ ప్రాణాలు కోల్పోయారు. శివతో పాటు అతనికి సలహాలిచ్చి సహకరించిన మరొకరిని పశ్చిమగోదావరి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏలూరు వెంకటాపురం పంచాయతీ లోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి వాచ్ మ్యాన్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తి బాగా నష్టపోయాడు. ఆ తరువాత వ్యక్తుల బలహీనతలూ, నమ్మకాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగురాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపయ్యే మార్గమంటూ బాగా డబ్బున్న వారిపైన, అప్పుల నుంచి బయటపడాలనుకునే వారిపైనా కన్నేశాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన షేక్ అమనుల్లా అలియాస్ బాబుతో స్నేహం చేశాడు.
మోటార్ వాహనాల విడిభాగాలకు నికెల్ కోటింగ్ వేసే శంకర్ వద్ద సైనైడ్ ఉంది. అదే సైనైడ్ ను ఆయుర్వేద మందులు, ప్రసాదంలో కలిపి హత్యలకు తెర తీశారు. భక్తి పేరిట కొందరికి రైస్ పుల్లింగ్ కాయిన్ కొని పెడతామని ఇంకొందరికీ, గుప్తనిధుల ఉన్నచోటు చూపిస్తామని కొందరికి, బంగారం తెస్తే రెట్టింపు చేస్తామని కొందరికి శివ ముఠా వల వేసింది. సొంత బంధువులనే తొలిగా బలి తీసుకుంది, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పేపర్ మిల్ వద్ద ఉంటున్న కొత్తపల్లి రాఘవమ్మ దగ్గరకు చుట్టపు చూపుగా శివ వెళ్లాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మను ఆయుర్వేదంతో బాగు చేస్తానని నమ్మించాడు. ఆమెకిచ్చే మందులో సైనెడ్ కలిపి చంపేశాడు, ఆమె ఇంట్లోంచి లక్ష రూపాయలకు పైగా నగదుతో ఉడాయించాడు. ఇదే జిల్లా బొమ్మూరులో ఉంటున్న వరుసకు వదినయ్యే సామంత కుర్తీ నాగమణిని కూడా ఇలాగే హత్య చేసి ఐదు లక్షల డబ్బులు నగలుతో పరారయ్యాడు.
గుప్త నిధుల జాడ చూపుతానని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మరికొందరిని హతమార్చాడు. చివరకు అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద మందు అంటూ ఒక స్వామీజీని కూడా సైనైడ్ తో చంపేశాడు. ఏలూరు కేబిడిటి హై స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కాటి నాగరాజు రైస్ పుల్లింగ్ కాయిన్ కోసం తెలిసిన వారినల్లా సంప్రదించాడు. శివ గురించి తెలుసుకున్న నాగరాజు ఆయన్ను కలిశాడు. ఇదే అదునుగా తీసుకున్న శివ ఆ కాయిన్ ఇస్తానని గత నెల 16 వ తేదీన తన వద్దకు పిలిపించుకున్నాడు. అతడు చెప్పినట్టు నాగరాజు రెండు లక్షల రూపాయల నగదు, నాలుగున్నర కాసుల బంగారు నగలు పట్టుకొని ఇంటి నుంచి వెళ్లాడు.
ఏలూరు సమీపంలోని వట్లూరు మినీ బైపాస్ రోడ్డులో శివను కలుసుకున్నాడు. నాగరాజుకు ప్రసాదం అంటూ సైనేడ్ పెట్టాడు. ఆ ప్రసాదం తిన్న నాగరాజు మృతి చెందాడు. అతని వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు శివ అపహరించుకుపోయాడు. అయితే నాగరాజు మృతి చెందిన తీరుపై బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. వారిలో ఒకే ఒక్క వ్యక్తి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండడం పోలీసులు గమనించారు. అతని కాల్ డేటా పరిశీలించగా గతంలో మృతి చెందిన అనేక మంది ఫోన్ నెంబర్ లు ఆ కాల్ లిస్ట్ లో కనిపించాయి. మృతుల బంధువులు ఇచ్చిన సమాచారంతో హంతకుడు శివను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.