గాంధీ సంకల్ప యాత్ర బండి సంజయ్ కు రెండు విధాలుగా ఉపయోగపడిందా..?
posted on Nov 6, 2019 @ 3:51PM
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సూత్రాన్ని ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులను ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశించింది. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ ఎంపీలను వారి వారి నియోజకవర్గాలలో తిరగాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. తన పార్లమెంటరీ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో మొత్తం కలియ తిరిగారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాంధీ సంకల్ప యాత్ర ఎంపి బండి సంజయ్ కుమార్ కు రెండు రకాలుగా ఉపయోగపడిందని బిజెపి నాయకులు విశ్లేషిస్తున్నారు.
ఒకటి పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆయన పాద యాత్ర చేసి నియోజక వర్గ కార్యకర్తలను కలుసుకునే వీలు పడిందనీ, రెండోది ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునే అవకాశం దొరికిందని వారు అంటున్నారు. వాస్తవానికి బండి సంజయ్ కుమార్ కు ఒక్క కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా నియోజక వర్గాల్లో పెద్దగా పట్టులేదట. ఆయా నియోజకవర్గాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదట. ఈనేపధ్యంలో బిజెపి అధిష్టానం తలపెట్టిన గాంధీ సంకల్ప యాత్ర ఎంపి సంజయ్ కుమార్ కు ఒక అవకాశంలా దొరికిందని స్థానిక పార్టీ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయనకు అన్ని నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం రాలేదట. అప్పుడు ఏ నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేక పోయారట.
ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయనకి తెలియదట. అలాగే కరీంనగర్ ప్రజలకు మినహా మిగతా నియోజకవర్గాల్లోని చాలామంది బండి సంజయ్ కుమార్ మొహం చూడలేదట, అయితే యూత్ లో మాత్రం ఆయనకు బాగా క్రేజ్ ఉంది. యువత చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి బండి సంజయ్ ఈజీగా గుర్తుపట్టగలిగారట. ఆయన పాటలకు మాటలకు యూత్ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే సామాన్య జనం మాత్రం బండి సంజయ్ కుమార్ ఎవరో తెలీకుండానే ఓట్లేశారని స్వయంగా ఆయన సన్నిహితులే తెలిపారు. మోదీ వేవ్ సహా టిఆర్ఎస్ మీద ప్రజలకున్న అసంతృప్తి వల్లే గెలిచారని ప్రచారం జరిగింది. ఈ తరహా చర్చలకు ఒకే యాత్రతో ఆయన సమాధానం చెప్పాలంటున్నారు.
గాంధీ సంకల్ప యాత్ర ద్వారా జనాలకు దగ్గరవ్వటంతో పాటు పార్టీ బలాబలాలు కూడా తెలుసుకుంటున్నారు. పార్లమెంటరీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో క్యాడర్ ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పురపాలక పరిధుల్లో ఎక్కువ సమయం గడిపేలా గాంధీ సంకల్ప యాత్రను ఆయన షెడ్యూల్ చేసుకున్నారు. అయితే మిగతా మున్సిపాలిటీలన్నీ ఒకెత్తయితే ఒక్క కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మాత్రం సంజయ్ కు మరో ఎత్తు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడ జరిగే పుర పోరు ఆయనకొక అగ్నిపరీక్షలా మారనుందట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బిజెపి చూపిన ఊపు ఇప్పుడు ఆ పార్టీ వైపు ఉంటుందా లేదా అన్నది మునిసిపల్ ఎన్నికల్లో తేలిపోనుంది.
ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రి పదవి వచ్చింది. ఈ క్రమంలో బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇక్కడ అధికార టీఆర్ఎస్ ను ఏ మేరకు ఢీకొంటారన్న చర్చ జరుగుతుంది. బిజెపి కార్పొరేటర్లు అనుకున్నన్ని సీట్లల్లో గెలవకపోతే కరీంనగర్ లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. టీఆర్ఎస్ తోనే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ దక్కిందని ఆయన అన్నారు, ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. మొత్తం మీద బండి సంజయ్ కు గాంధీ సంకల్ప యాత్ర కొన్ని విషయాలను బోధించింది. మరి ఆయన యాత్రకు ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.