విజయారెడ్డి మర్డర్ వెనుక పొలిటికల్ పవర్... మాట విననందుకే దారుణంగా చంపేశారా?
posted on Nov 7, 2019 @ 10:37AM
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.... కాంగ్రెస్ లీడర్ మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి హత్య వెనుక నీ హస్తముందంటే.... నీ హస్తముందంటూ మంచిరెడ్డి అండ్ మల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ముమ్మాటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హస్తముందంటోన్న కాంగ్రెస్ లీడర్ మల్‌రెడ్డి రంగారెడ్డి.... విజయారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఎన్నోసార్లు బెదిరించారని, మాట వినకపోవడంతోనే, తన అనుచరుడు ద్వారా తహశీల్దారుని హత్య చేయించారని ఆరోపించారు. మంచిరెడ్డి భూకబ్జాలను తాను తహశీల్దార్ విజయారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, తనపై ఎమ్మెల్యే ఒత్తిడి ఉందంటూ చెప్పిందన్నారు. కబ్జా భూమిని సీజ్ చేయొద్దంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి బెదిరించినట్లు విజయారెడ్డి చెప్పిందన్న మల్‌రెడ్డి.... ఆమె ధైర్యవంతురాలు కాబట్టే.... ఆ భూమిని సీజ్ చేసి.... గవర్నమెంట్ ల్యాండ్ అంటూ బోర్డు పెట్టించిందని, అందుకే తన అనుచరుడు సురేష్ ద్వారా విజయారెడ్డిని హత్య చేయించాడని ఆరోపించారు.
అయితే, కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై మూడుసార్లు ఓడిపోయిన ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో భూకబ్జాలు చేసింది మల్‌రెడ్డి సోదరులు, బంధువులే అన్నారు. తహశీల్దార్ విజయారెడ్డిని చంపిన సురేష్ కుటుంబ సభ‌్యుల భూములను మల్‌రెడ్డి బంధువులే కొనుగోలు చేశారంటూ ఆధారాలను మీడియాకి రిలీజ్ చేశారు.
ఇదిలాఉంటే, విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉండొచ్చని ఆమె భర్త సుభాష్ రెడ్డి అనుమానిస్తున్నారు. నిందితుడు సురేష్ వెనుక రాజకీయ శక్తి ఉందని, అదెవరో తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.