ఉన్నతాధికారులు హామీతో ధర్నాను విరమించిన ఢిల్లీ పోలీసులు...
posted on Nov 6, 2019 @ 1:44PM
ఢిల్లీ పోలీసులు శాంతించారు, పదకొండు గంటల పాటు సాగిన ధర్నాను విరమించారు. పోలీసు సిబ్బంది డిమాండ్లన్నీ నెరవేర్చుతాం అంటూ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. తీస్ హజారీ కోర్టుల సముదాయంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య శనివారం గొడవలు జరిగాయి. దీని పై ఢిల్లీ హై కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు పోలీసులు. ఢిల్లీ హై కోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ వేస్తామని పోలీసులు ఆందోళన విరమించి విధుల్లో చేరాలంటూ ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ సతీష్ గొల్చా కోరారు.
గాయపడిన పోలీసులకు 25,000 పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు సిపి. శనివారం రోజున తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్ లకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్ లు కూడా గాయపడ్డారు. దీని పై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్ట్ ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను భాదించింది. సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు, ఘర్షణకు పోలీసులు తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని పోలీసులు ఆరోపించారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన పదకొండు గంటల పాటు జరిపిన ధర్నాను విరమించారు.