పార్టీ ఫిరాయింపు రాజకీయాలను సహించేది లేదు : జగన్
posted on Nov 6, 2019 @ 2:06PM
నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతోంది అన్నట్టుగా ఉందట పార్టీ ఫిరాయింపుల విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం. తెలుగుదేశం మాదిరిగా తాను పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించబోమని శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శాసన సభ్యులుగా ఉండి పార్టీకి రాజీనామా చేయకుండా ఎవరైనా ఫిరాయిస్తే వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలా జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ మారేందుకు ప్రతిబంధకంగా మారింది. ఆయన పార్టీ మారాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సింది. ఇప్పటికే టిడిపికి శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు రాసిన వాట్సప్ లేఖలో వంశీ పేర్కొన్నప్పటికీ స్పీకర్ కు మాత్రం నేరుగా తన లేఖను పంపలేదు.
ఈ నేపథ్యంలో వంశీతో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ చర్చలు దాదాపుగా విఫలమయ్యాయి, మరోవైపు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు, ఈ భేటీ తరువాత వంశీ ఈ నెల 7 న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. అయితే వంశీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే సీఎం జగన్ ప్రకటన ప్రకారం అంతకుముందే ఆయన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందే అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటనేది తెలుగుదేశం పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. వల్లభనేని వంశీకి టిడిపి టికెట్ ఇచ్చి గెలిపించింది ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ కు సిద్ధమైందట ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా లేఖను నేరుగా చంద్రబాబుకే పంపించాలని ఆయనే దాన్ని స్పీకర్ కు పంపేలా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉన్నట్టు సమాచారం.
తద్వారా చంద్రబాబు పైనే ఈ నెపాన్ని నెట్టవచ్చు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇలా వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్ ఎండ్ లెస్ లవ్ స్టోరీలా కొనసాగుతుండగా తెలుగుదేశం పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గోడదూకుతారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు, కోస్తాలోని ఇరువురి ఎమ్మెల్యేలతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందులో కోస్తా లోనూ ఓ ఎమ్మెల్యేను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు, ఆయన తనను వ్యాపారపరంగా అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తాను పార్టీ వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రిపై ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇటీవల మీడియా ప్రతి నిధులు ఆయన్ను సంప్రదించగా ప్రతి రోజు శీలం ఎక్కడ నిరూపించుకుంటామని ఆయన ప్రశ్నించారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వంశీ మరో ఇరువురిని తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేస్తే చంద్రబాబుకు ప్రతి పక్ష హోదా కూడా పోతుందనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఇక గోడమీద పిల్లుల్లా ఉన్నవారికి తాజాగా సిబిఐ కోర్టులో చుక్కెదురు కావడం వెనుకాడేలా చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడంతో పాటు సిబిఐ వేసిన కౌంటర్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు గోడ దూకుదామనుకుంటున్న టిడిపి ఎమ్మెల్యేలను పునరాలోచనలో పడవేశాయి. క్రిమినల్ నేరాల కంటే ఆర్థిక నేరాలు తీవ్రమైనవని, ఇటువంటి కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ తన కౌంటర్ లో పేర్కొనడం ప్రజా బాహుళ్యంలోకి వెళ్లింది.
దీంతో తెలుగుదేశం పార్టీ నుంచి ఫ్యాన్ పార్టీ పంచన చేరుదామనుకుంటున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం డైలమాలో పడ్డారని సమాచారం. అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం కొందరు నేతలు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారట తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉంటే తటస్థ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తే తాము సిద్ధంగా ఉన్నామని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అంతగా రుచించలేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి వారు ఒకే అయినప్పటికీ తాము చెప్పినప్పుడే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో ఆ ముగ్గురు నేతలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది, మున్ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.