ఒక్క పైసా బాకీ లేమంటూ అఫిడవిట్లు... ఆర్టీసీపై అటోఇటో తేల్చేయనున్న కేసీఆర్...
posted on Nov 7, 2019 9:24AM
తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మతోపాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అండ్ జీహెచ్ఎంసీ కమిషనర్లను హైకోర్టు ఏకిపారేయడంతో... వాళ్లంతా సమగ్ర సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేశారు. ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ లెక్కలకు.... మీరు చెబుతున్న మాటలకు పొంతన లేదంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో.... ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ మరోసారి కౌంటర్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై క్లారిటీ ఇచ్చారు.
సునీల్ శర్మ రిపోర్ట్ ప్రకారం ఒక్క ముక్కలో చెప్పాలంటే.... ఆర్టీసీకి ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా బాకీ లేదంటూ తేల్చిచెప్పారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కంటే 867 కోట్లు ఎక్కువే వచ్చాయంటూ సునీల్ శర్మ... హైకోర్టుకు నివేదించారు. వేర్వేరు పద్దుల కింద ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇచ్చిందన్నారు. రుణ పద్దు కింద విడుదలైన నిధులను, వడ్డీని ప్రభుత్వం ఎన్నడూ అడగలేదని నివేదించారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాలని చెప్పిన 14వందల 42కోట్లను... చట్టప్రకారం రీఎంబర్స్‌మెంట్ కోరడమే తప్ప... డిమాండ్ చేయలేమని సునీల్ శర్మ తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఫైనాన్స్, మున్సిపల్ అండ్ జీహెచ్ఎంసీ కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీకి 3వేల 6కోట్లు చెల్లించాల్సి ఉండగా.... అంతకంటే ఎక్కువగా ప్రభుత్వం 3వేల 903 కోట్లు ఇచ్చిందని తెలిపారు. మోటారు వాహనాల పన్ను కింద ...ఆర్టీసీయే ప్రభుత్వానికి 540కోట్లు చెల్లించాల్సి ఉందని ఆర్థికశాఖ అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్న రామకృష్ణారావు... రుణ పద్దు కింద ఇచ్చినవి విరాళమేనని స్పష్టం చేశారు.
అలాగే, జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే... ఆర్టీసీకి సాయం చేస్తుందన్న GHMC కమిషనర్... చట్టప్రకారమైతే ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని తన అఫిడవిట్‌లో తెలిపారు. జీహెచ్‌ఎంసీకి మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు ఇచ్చామని, కానీ ఇప్పుడు లోటు బడ్జెట్‌లో ఉందని, దాంతో ఆర్టీసీకి నిధులిచ్చే పరిస్థితి లేదన్నారు.
మరోవైపు, ఆర్టీసీ సమ్మె, కోర్టు విచారణ, ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతులపై దాదాపు 8గంటలపాటు కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేట్ ఆపరేటర్లకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇచ్చేందుకు న్యాయపరమైన చిక్కుల్లేకుండా విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. ఇదిలాఉంటే, హైకోర్టు విచారణ తర్వాత ఆర్టీసీపై సీఎం కేసీఆర్ అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సర్కారు తీరును ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... మరి ఈసారి ఎలా రియాక్టవుతుందోనన్న ఉత్కంఠ ఇరువర్గాల్లో కొనసాగుతోంది.