పంచాయతీరాజ్ శాఖలో భారీ అవినీతి :- సీఎం సార్ మీరే దిక్కు అంటున్న కాంట్రాక్టర్లు

  రాజ్యం బాగుండాలంటే రాజు ఒక్కడే బాగుంటే సరిపోదు కదా.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత రివర్స్ టెండరింగ్ అంటూ ఆయన నిధులను ఆదా చేస్తుంటే శాఖాధికారులు మాత్రం స్వాహా చెయ్యడానికి చూస్తున్నారు.గ్రామాల్లోని రోడ్లు..మౌలిక వసతులలో పెను మార్పులు తీసుకురావడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదలైంది. అలాంటి ప్రాజెక్టుకు అవినీతి మరక అంటిస్తున్నారు. టెండర్ లు పూర్తయి ఒప్పందం చేసుకున్న పనులను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఏపీలోని పట్టణాలను.. నియోజకవర్గాలను.. కలుపే రోడ్లను అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అధికారుల సుదీర్ఘ కసరత్తు తరువాత వందల కిలోమీటర్లలో రోడ్లు నిర్మించి ఈ ప్రాజెక్టుకు బ్యాంకు నుంచి రుణం పొందగలిగారు. ఏపీ రూరల్ రీస్ట్రచరింగ్ ప్రాజెక్టు పేరిట మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు కు ఏషియన్ బ్యాంక్ రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. దీంతో అధికారులు 55 ప్యాకేజీల కింద రెండు మూడు నియోజికవర్గాల రోడ్లను కలిపి టెండర్లకు పిలిచారు. టెండర్ లు దక్కించుకున్న కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. కొందరు పనులు కూడా మొదలు పెట్టారు. అయితే పంచాయతీ రాజ్ శాఖలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై అవినీతి నీడలు కమ్ముకొంటున్నాయి. టెండర్ లు అగ్రిమెంట్ పూర్తయిన పనులను నిలిపేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కోట్లకు సంభందించిన పనులు కావడంతో దీని పై పంచాయతీ రాజ్ శాఖలోని పెద్దలకు కన్నుపడింది. నిబంధనల ప్రకారం ఆ టెండర్లను రద్దు చేయటం సాధ్యం కాకపోవడంతో ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారితో కొత్త పంచాయితీ మొదలుపెట్టారనే వాదన వినిపిస్తుంది. తాము సూచించిన వారి పేరుతో ఎస్ యూ ఖాతా తెరవాలని ఓ ఉన్నతాధికారి ఒత్తడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ లు వెళ్లి జిల్లా మంత్రులను.. ముఖ్య నాయకులను.. కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ జిల్లా మంత్రి స్వయంగా దీని పై పంచాయతీ రాజ్ శాఖ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఆ ఉన్నతాధికారి ఒత్తిళ్లు ఆగలేదని సమాచారం. ఒప్పందాలు జరిగిన సమయంలో తాము కొంత ఖర్చు పెట్టుకున్నామని.. ఇప్పుడు కొత్త గా ఇబ్బందులు సృష్టిస్తే పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్ లు వాపోతున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా జరిగితే మండల.. నియోజకవర్గ స్థాయిలో అనూహ్య మార్పులు వస్తాయి. మౌలిక సదుపాయాలు పెరిగి  ఊర్ల రూపురేఖలు మారిపోతాయి. అయితే స్వయంగా ఏషియన్ బ్యాంక్ నిధులు ఇచ్చిన ఇలాంటి ప్రాజెక్టుకు అవినీతి లెక్కలతో అడ్డు తగలడంపై పెద్ద చర్చే జరుగుతుంది. పనులు రద్దు అయితే ప్రాజెక్టుకు ఆర్థిక కష్టాలు తప్పవని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఎలాగైనా ఈ సమస్య ను సీఎం దృష్టి కి తీసుకెళ్లి కొత్తగా మొదలైన అకౌంట్ వివాదానికి ముగింపు పలకాలని కాంట్రాక్టర్ లు భావిస్తున్నారు.    

సమ్మె ఆగదు.. ఉద్యోగాల్లో తిరిగి చేరేది లేదు.. :- ఆర్టీసీ జేఏసీ 

  సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపకుండా విధుల్లోకి వచ్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. ఉద్యోగాలు తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని.. అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తేనే మీరు చెప్పినట్లు యూనియన్లు రద్దు చేసుకుంటామన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలచి.. లేబర్ యాక్ట్ ప్రకారం చర్చలు జరిపితే మంచిదన్నారు. కేసీఆర్  ఇచ్చే వార్నింగ్ లకు భయపడి కార్మికులెవరూ తిరిగి విధుల్లో చేరే ఆలోచనకు రావొద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. పోరాటం మొదలు పెట్టాం..ధైర్యంగా ముందు వెళదామని.. ఆత్మద్రోహం చేసుకుని విధుల్లోకి చేర వలసిన అవసరం లేదని చెప్పారు. నిరుద్యోగుల విజ్ఞప్తితో నవంబర్ 5న చేయాలనుకున్న సడక్ బంద్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలతో సమాణికులని చెప్పినందుకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు జేఏసీ నేతలు. నవంబర్ 5 అర్థరాత్రి లోగా ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా 5వేల బస్సులు ప్రైవేట్ కు ఇస్తే.. చివరకు 5వేల బస్సులు మాత్రమే మిగులుతాయని జోస్యం చెప్పారు.కేసీఆర్ చెప్పిన విధంగా చూస్తే 5వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరం అవుతారని.. మిగతా 23వేల మంది కార్మికులను ఏం చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అశ్వత్థామరెడ్డి. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వం కోరినట్లు యూనియన్లను వైండప్ చేస్తామని తెలియజేసారు. కార్మికులను భయపెట్టేలా సీఎం మాట్లాడారని జేఏసీ నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం(నవంబర్ 3,2019) టీఎంయూ కార్యాలయంలో సమావేశం అయ్యారు ఆర్టీసీ జేఏసీ నేతలు. భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్  చేసిన కామెంట్స్ పై చర్చించారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోందని జేఏసీ నేతలు ఆరోపించారు. నవంబర్ 4 నుండి డిపో మేనేజర్లు సమ్మెకు మద్దతివ్వాలని జేఏసీ నేతలు కోరారు.  

పవన్ కళ్యాణ్ టీడీపీ దత్తపుత్రుడు అయితే మీకు అధికారమే లేదు :- టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

    ఆదివారం ( నవంబర్ 3న ) విశాఖలోని మద్దిలపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించింది. దీనికి టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగసభలో అచ్చెన్న నాయుడు పాల్గొని ప్రసంగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు చేస్తోందని..టీడీపీ దత్తపుత్రుడు అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోంది.. ఇతర పార్టీలు నిర్వహించే కార్యక్రమాలను జరగకుండా చేయాలనే ఉద్దేశంలోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇసుక సంక్షోభం పై ఐదు నెలల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తూనే ఉన్నామని.. అయినా వైసీపీ ప్రభుత్వానికి కానీ సీఎం జగన్‌కు కానీ చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఎద్దేవా చేశారు.  ఇసుక కొరత వల్ల పనులు లేక మనోవేదనతో కొంతమంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే..సామాజిక మరణాలు అంటారా ? అంటూ వైసీపీ మంత్రులను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని టీడీపీ దత్తపుత్రుడు అంటారా ? ఆయన కలిసి ఉన్నప్పుడు జరిగింది ఇంకా మరిచిపోలేక ఇవ్వని మాట్లాడుతున్నట్లు ఉన్నారని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన చూసి కూడా చలించకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వెంటనే ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరియు టీడీపీ పార్టీ జనసేనకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా..ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా అన్ని పార్టీలు..ప్రజలు వ్యవహరించాలని సూచించారు.  

తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తారా? ఆర్టీసీ ఎండీపై నిప్పులు చెరిగిన హైకోర్టు

  తెలంగాణ హైకోర్టు తన దూకుడు కొనసాగిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సర్కారు తీరును ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... మరోసారి పదునైన మాటలను వదిలింది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై తప్పుడు లెక్కలు చెప్పారంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మపై నిప్పులు చెరిగింది. కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. సునీల్ శర్మ రిపోర్ట్‌పై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు.... అఫిడవిట్‌లోని అంశాలకు.... అసెంబ్లీలో మంత్రి చెప్పిన వివరాలు... పరస్పర విరుద్ధంగా ఉన్నాయని మండిపడింది. ఒకే అంశంపై రెండు వేర్వేరు రిపోర్టులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఇచ్చిన నివేదికతో ఆర్టీసీ రిపోర్ట్ ను సరిపోల్చి.... నవంబర్ ఆరులోపు మరోసారి నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌కు హైకోర్టు ఆదేశించింది. అయితే, జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి 1786కోట్లు రావాల్సి ఉండగా, కేవలం 336కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి తెలిపిందని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌... హైకోర్టుకు నివేదించారు. అంతేకాదు సెక్షన్‌ 112 (30) ప్రకారం... హైదరాబాద్‌లో నడిపే ఆర్టీసీ బస్సుల నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్‌ఎంసీ అంగీకరించలేదన్నారు. ఇక, నిర్వహణ, డీజిల్ భారం అధికం కావడంతో... ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నా, ఆర్టీసీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిపారు. అలాగే, సమ్మె కారణంగా ఇప్పటివరకు 82కోట్ల నష్టం వాటిల్లిందని హైకోర్టుకు తెలిపారు సునీల్ శర్మ. అయితే, బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై కావాలనే తప్పుడు లెక్కలతో నివేదిక ఇచ్చారంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మపై హైకోర్టు మండిపడింది. అంతేకాదు చట్ట ప్రకారం ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదో చెప్పాలని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. నవంబరు ఆరులోపు లెక్కలను సరిజేసి మరోసారి నివేదికివ్వాలన్న హైకోర్టు.... సీఎస్‌, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్‌‌లను ఏడున తమముందు హాజరుకావాలంటూ ఆర్డర్స్ జారీ చేసింది.  

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం..! అమిత్ షా దగ్గరకు అశ్వద్ధామరెడ్డి..?

  ఒకవైపు కేసీఆర్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది... మరోవైపు ఆత్మగౌరవాన్ని చంపుకొని విధుల్లోకి వెళ్లొద్దంటూ యూనియన్లు పిలుపునిస్తున్నాయి. దాంతో, ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని వినియోగించుకోవాలా? లేక జేఏసీ చెప్పినట్లు వినాలో తెలియక ఆర్టీసీ కార్మికులు నలిగిపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రితో కేసీఆర్ డెడ్ లైన్ ముగియనుండటంతో కార్మికులు ఎటూతేల్చుకోలేకపోతున్నారు. విధుల్లో చేరాలా? వద్దా? అని తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే, హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో కొందరు కార్మికులు విధుల్లో చేరడంపై యూనియన్ లీడర్లు మండిపతుతున్నారు. రీ-జాయిన్ అవుతున్న కార్మికులను అడ్డుకుంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, విధుల్లో చేరుతున్న కార్మికులను ఎవరైనా అడ్డుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీస్ బాస్ లు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని, అలా చేరిన వారికి చట్టప్రకారం రక్షణ కల్పిస్తామని... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు తెలిపారు. బెదిరింపులకు పాల్పడినా, భౌతికదాడులకు దిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, సర్కారు విధించిన గడువులోపు ఎంతమంది కార్మికులు విధులకు హాజరవుతారనేది ఉత్కంఠగా మారింది. ఒకరిద్దరు పిరికివాళ్లు మాత్రమే విధుల్లో చేరుతున్నారని, మిగతా కార్మిక లోకమంతా సమ్మెలోనే కొనసాగుతున్నారంటోన్న జేఏసీ... సీన్‌ను హస్తినకు మార్చాలని నిర్ణయించింది. కేసీఆర్ డెడ్ లైన్ తో ఆర్టీసీ సమస్యను ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సమస్యను వివరించాలని నిర్ణయించారు. అలాగే, కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఆర్టీసీ కార్మిక జేఏసీ... తొమ్మిదిన ట్యాంక్ బండ్ పై భారీ నిరసనకు ఏర్పాట్లు చేస్తోంది.  

కేసీఆర్ వార్నింగ్ తో కార్మికుల్లో అలజడి... స్ట్రాంగ్ కౌంటర్ కు జేఏసీ ఎమర్జెన్సీ మీటింగ్

  లాస్ట్ ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలతో ఆర్టీసీ కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం... మరోవైపు యూనియన్ల మధ్య నలిగిపోతున్న కార్మికులు... ఏంచేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. ఆర్టీసీ కార్మికులు అన్-కండీషనల్ గా విధుల్లోకి చేరాలని, లేదంటే ఆర్టీసీని వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ కేసీఆర్ హెచ్చరించడంతో కార్మికుల్లో అలజడి అంతర్మధనం మొదలైంది. ఇప్పటికే పలు డిపోల్లో ఆర్టీసీ కార్మికులు రిపోర్ట్ చేస్తూ డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. ఒకవైపు డిమాండ్లు సాధించుకోవాలన్నా పట్టుదల ఉన్నా... మరోవైపు రెండు నెలలుగా జీతాల్లేకపోవడం... ఇంకోవైపు కేసీఆర్ హెచ్చరికలతో... కార్మికుల్లో ఆత్మస్థైర్యం సన్నిగిల్లుతోంది. వివిధ కారణాలతో ఇప్పటికే 20మందికి పైగా కార్మికులు మరణించడంతో.... ఇక చేసేదేమీలేక కొందరు విధులకు హాజరుకావాలని నిర్ణయించుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులు భేషరతుగా విధుల్లోకి చేరాలని, లేదంటే ఆర్టీసీని వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలతో ఆర్టీసీ కార్మిక జేఏసీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి అన్ని డిపోల జేఏసీ నేతలు హాజరుకానున్నారు. కార్మికుల అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ముఖ్యంగా కార్మికులకు భరోసా కల్పించడంతోపాటు ఆత్మస్థైర్యం నింపనున్నారు. అదే సమయంలో కేసీఆర్ హెచ్చరికలకు స్ట్రాంగ్ గా కౌంటర్ రియాక్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

మున్సి-పోల్స్‌పై కేసీఆర్ పరేషాన్... గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తో వెనుకంజ

ఒకవైపు ఆర్టీసీ సమ్మె... మరోవైపు విపక్షాల మూకుమ్మడి దాడి చేసినా హుజూర్‌నగర్ బైపోరులో మంచి విజయం సాధించడంతో గులాబీ బాస్ పట్టలేని ఆనందంతో కనిపించారు. హుజూర్ నగర్ సక్సెస్ ఊపులోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి విపక్షాలను చిత్తుచిత్తుగా ఓడిద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకే, ఎప్పుడైనా మున్సిపోల్స్ కు సిద్ధంగా ఉండాలని అటు అధికారులకు, ఇటు పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అయితే, ఆ స్పీడ్ ఇప్పుడు కనిపించడం లేదట. అసలిప్పుడు మున్సిపోల్స్‌కు వెళ్లాలా? వద్దా అనే అయోమయంలో పడ్డారని అంటున్నారు. హుజూర్ నగర్ విజయంతో మాంచి జోష్ మీదున్న కేసీఆర్ కి షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారట గులాబీ లీడర్లు. హుజూర్ నగర్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించకపోయినా... స్టేట్‌ వైడ్ గా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్‌ ఉంటుందని కేసీఆర్ కి రిపోర్ట్స్ ఇచ్చారట. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో మున్సిపోల్స్ కు వెళ్తే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊహించని నష్టం జరిగే ప్రమాదముందని కేసీఆర్ కి సూచించారట. హుజూర్ నగర్ బైపోల్‌ వేరు... మున్సిపల్ ఎన్నికలు వేరని... ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే అది మరింత తీవ్రంగా ఉందంటూ జనాగ్రహాన్ని కేసీఆర్ కి నివేదించారట. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ నేతలు యాక్టివ్ పనిచేస్తుండటంతో... అర్బన్ ఏరియాస్ లో ఆ పార్టీకి ఆదరణ పెరిగిందని రిపోర్ట్ ఇవ్వడంతో గులాబీ బాస్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. వరుస ఎన్నికలు-వరుస విజయాలతో దూకుడు మీదున్న టీఆర్ఎస్‌... మున్సి-పోల్స్‌పై మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ విజయంతో గులాబీ బాస్‌ ఎన్నడూలేనంత జోష్‌లో కనిపించినా.... గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తో మున్సిపల్ ఎన్నికలపై పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకకుండా మున్సిపోల్స్ కు వెళ్తే మాత్రం పార్టీకి ఊహించని నష్టం జరగడం ఖాయమని పార్టీ లీడర్లు తేల్చిచెప్పడంతో కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నారట. దాంతో, ఆర్టీసీ ఇష్యూ ముగిసిన తర్వాతే మున్సిపల్ పోరుకి వెళ్లాలని నిర్ణయించారట.  

ఎన్సీపీతో చర్చలకు సిద్ధమైన శివసేన.......

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద ని అనుకున్నారంతా. ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపి శివసేనకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. శివసేన నేతల నుంచి రోజుకో ప్రకటన రావడంతో మహా రాజకీయల్లో మహా ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యమంత్రి పదవిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకొమని బిజెపి చెప్పడంతో శివసేన ఇతర పార్టీల వైపు చూపు తిప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు సీట్లు సాధించిన భాజాపా తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా శివసేన సవాల్ విసిరింది. అలా జరగని పక్షంలో ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి రెండో అతి పెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు అవకాశముంటుందని పరోక్షంగా బిజెపిని హెచ్చరించింది. ప్రజల కోరిక మేరకు ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటిస్తూ వచ్చిన ఎన్సీపీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే  శివసేనతో పొత్తుకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది. ఇదే విషయమై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు శరద్ పవార్. అటు రాష్ట్ర తాజా రాజకీయ పరిణామా లను ఫడ్నవీస్ హోమంత్రి బిజెపి అధినేత అమిత్ షాను కలిసి వివరించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో చర్చలు జరిగితే అది సీఎం పదవిపైనే జరుగుతాయని శివసేన స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలేవీ జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతి నిధి సంజయ్ రౌత్ అన్నారు. తాజా పరిస్థితుల్లో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కు సంజయ్ రౌత్ సందేశం పంపించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆ సమయంలో ఓ సమావేశంలో ఉండడంతో సంజయ్ రౌత్ తో మాట్లాడలేకపోయానన్న అజిత్ పవార్ త్వరలోనే ఆయనతో ఫోన్ లో సంభాషించి వివరా లు తెలుసుకుంటానన్నారు. శివసేనతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనేది శరద్ పవార్ నిర్ణయిస్తారని అజిత్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు ఏడుతో ముగిసిపోనుంది, ఈలోగా ప్రభుత్వ ఏర్పాటు జరగాలి లేదంటే అది రాష్ట్రపతి పాలనకు దారితీసే అవకాశముంది. రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ లో నూట ఐదు సీతతో బిజెపి పెద్ద పార్టీ గా అవతరించిన మెజారిటీ మాత్రం సాధించలేదు. ఇంకా నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. యాభై ఆరు సీట్లతో శివసేన రెండో పెద్ద పార్టీ గా నిలవగా తర్వాతి స్థానాల్లో ఎనసిపి యాభై నాలుగు సీట్లతో కాంగ్రెస్ నలభై నాలుగు సీట్లతో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది.  

మద్యం షాపులు మాకొద్దు మూసేయండి.. హైదరాబాద్ లో ప్రజల తిరుగుబాటు

  మద్యం టెండర్లు వచ్చాయంటే చాలు వైన్ షాప్ ఓనర్లు ఎగబడిపోతారు.. కానీ తెలంగాణలో కథ రివర్స్ అయ్యింది. మద్యం షాపు మాకొద్దంటూ భయపడిపోతున్నారు. జనాలు నివసిస్తూ.. ఆడపిల్లలు.. చిన్నపిల్లలు.. తిరిగే ప్రాంతాల్లో వెలిసే కొత్త వైన్ షాపులపై జనం మండిపడుతున్నారు. ఇప్పటికే ఉన్న ఒకటి, రెండు వైన్ షాపుల వల్లే చాలా ఇబ్బందిగా ఉంటే అదే చోట మరో బ్రాందీ షాపు వెలుస్తుండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పలుచోట్ల మహిళలు వైన్ షాపుల ముందు ఆందోళనలకు దిగారు. నగరంలోని పార్శిగుట్టలో ఒకే వీధిలో రెండు బార్లు, మూడు వైన్ షాపులు ఏర్పాటు చెయ్యడంతో స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. కొత్త షాపు ప్రారంభించడానికి వచ్చిన యజమానిని అడ్డుకొని నిలదీయడంతో అతని అనుచరులు మహిళలపై దాడికి దిగారు. ఈ దాడిలో ఓ మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అది చూసిన మహిళలకు ఆగ్రహం కట్టలు తెంచుకొంది. చేతిలో చీపుళ్లు పట్టుకుని ఆందోళన చేయడంతో.. వీరి నిరసనకు ప్రజా సంఘాలు, సీపీఐతో పాటు తెలంగాణ జనసమితి నేతలు మద్దతు తెలియజేశారు. వైన్ షాపులు ఏర్పాటును విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు.వైన్ షాప్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చిలకలగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  సికింద్రాబాద్ చిలకలగూడ దగ్గర కూడా వైన్ షాప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. చిలకలగూడ అమృత వైన్స్ ఎదుట ధర్నాకు దిగారు. ఇళ్ళ మధ్య వైన్ షాపు పెట్టడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల దగ్గర లో ఇళ్ల మధ్య లో మద్యం దుకాణా లు ఏర్పాటు చేయొద్దంటూ కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్ టీయూ రోడ్డులో స్థానికులు ఆందోళనకు దిగారు. రెండు మద్యం దుకాణాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వైన్ షాపులు ఆలయాలకు దూరంగా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. మీ సేవ సెంటర్ నడుపుకుంటున్న కొందరు మహిళలు, సాయంత్రం ట్యూషన్ మరియు స్కూల్ నుంచి వచ్చె ఆడపిల్లలకు, సాయంత్రం ఆలయాలకు వెళ్లి వచ్చె ముసలివారి సైతం ఈ మందు దుకాణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో మెడికల్  ఎమర్జన్సీ కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఈ అంశం పై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మినరల్ వాటర్ ప్రజల రోగాలకు స్టాటర్

  బావిలో నీరు తాగే రోజుల నుంచి బాటిల్లో నీళ్లు తాగే రోజులకు వచ్చేసారు ప్రజలు. మినరల్ వాటర్ లేనిదే గొంతులోకి నీళ్లు దిగటంలేదు. అసలు మనం తాగే నీరు ఎంత వరకు సురక్షితం..! మినరల్ వాటర్ మంచిదేనా..!? లేక డబ్బులు పెట్టి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నామా?? వాటర్ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మినరల్ వాటర్ ఎంతో సురక్షితమని ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిళ్లు కోనుకొని తాగేస్తాం. ఆ నమ్మకమే వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వాటర్ ప్లాంట్లు దర్శనమిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి.. వాల్టా చట్టాన్ని కాళరాసి..మినరల్ వాటర్ మాఫియా వ్యాపారం మూడు బోర్లు ఆరు ట్యాంకర్ లు అనే విధంగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట్ ప్రాంతంలో  బోరు నీళ్ళని బాటిళ్ లలో నింపుతున్నారు.బల్కంపేట లో మెజార్టీ ప్రజలకు నీటిని అమ్ముతున్న వాటర్ బాటిల్ యూనిట్ లో బాటిళ్లకు నీరు నింపడం మొదలు.. సీల్ వేసే క్యాప్ ను చూస్తే వంద శాతం బ్యాక్టీరియా కనిపిస్తుంది.క్యాన్లలో పడుతున్న పైపు బాటిళ్లను ఒకసారి పరిశీలిస్తే ఎంత అశుభ్రంగా ఉన్నాయో తెలుస్తుంది.కనీస ప్రమాణాలు  పాటించకుండా.. తాము మిగిలిన వారికంటే ఎక్కువ శ్రద్ధతో నీటిని విక్రయిస్తున్నామని కొందరు వ్యాపారులు సమర్ధించుకుంటున్నరు.వీళ్లు తయారు చేసే వాటర్ బాటిళ్లలో అసలు ఏది నకిలీ.. ఏది ఒరిజినల్.. అనేది తెలీడం లేదు. అన్ని బాటిళ్లు బ్రాండెడ్ లాగానే కనిపిస్తాయి.. కానీ లోపల నీరు ఎన్ని రోజులు వాడొచ్చు అనే విషయంపై ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. పెద్ద పెద్ద హోటళ్ల పరిస్థితి కూడా ఇంతే..ఇక రైల్వేస్టేషన్ , బస్ స్టాండ్ ప్రాంతాల్లో డూప్లికేట్ బ్రాండ్ తో యధేచ్ఛగా వాటర్ బాటిల్స్ దందా కొనసాగుతోంది. అవి తాగి జనం అనారోగ్యం పాలవుతున్నారు. అయితే రద్దీ ప్రాంతాల్లో తాము బ్రాండెడ్ నీటినే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని  చెప్తున్నారు అధికారులు. ఏదేమైనా ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. బాటిల్ మీద సగం లాభం వస్తున్నప్పుడు ప్రజల గురుంచి పట్టించుకునే అవసరం వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటున్నారు ప్రజలు.

దేశంలోనే నెం.2.. పొల్యూషన్ లో పోటీ పడుతున్న హైదరాబాద్

  మొదటి స్థానంలో ఉన్న దేశ రాజధానికి పోటీ పడుతుంది హైదరాబాద్ నగరం. కార్పొరేట్ కంపెనీల విషయంలోనే కాదు కాలుష్యం విషయంలో కూడా ఎక్కడా తగ్గటం లేదు. నగరం లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలతో భాగ్యనగర వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దీపావళి పండుగ అనంతరం నగరంలో ఉన్న గాలి నాణ్యత పై ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది దీపావళి రోజు నమోదయిన వాయు కాలుష్యం కంటే ఈ ఏడాది కాలుష్యం పెరిగిందని అందులో స్పష్టంగా తెలిపింది.  గత ఏడాది హైదరాబాద్ లో కాలుష్యం  622మైక్రో గ్రాములు ఉండగా..ఈ ఏడాది 830 మైక్రో గ్రాములకు చేరిందని వెల్లడించింది.  ఇప్పటికే కాలుష్యం కారణంగా దేశ రాజధాని డేంజర్ జోన్ లో పడింది. ఢిల్లీలో మాస్క్ లేకుండా బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అవే పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాబోతున్నాయి. గాలిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటితే ప్రమాదకరమని పీసీబీ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే ఇప్పటికే నగరంలో చాలా చోట్ల ఈ పరిమితి దాటి పోవడంతో భాగ్యనగర వాసులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మ రేణువుల స్థాయిని బట్టి కాలుష్యాన్ని నిర్థారిస్తారు. గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, 10 అని రెండు రకాల కాలుష్య కారక సూక్ష్మజీవులుంటాయి. పీఎం 2.5 అంటే 2.5 మిల్లీ మైక్రాన్ల మందం కలిగిన ప్రమాదకరమైన రేణువులు ఉంటాయి.. వీటినే దహన రేణువులు అని కూడా అంటారు. వస్తువులను కాల్చినప్పుడు గాలిలోకి చేరే మసి..లోహ కణాలు.. వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. పీఎం 10 అంటే 10 మిల్లీ మైక్రాన్ల మందం ఉన్న రేణువులు దుమ్మూ, ధూళీ, పూల పుప్పొడి, బూజు రేణువులు వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. 2.5 పీఎం అంటే పది కంటే అత్యధిక ప్రమాదకరం భాగ్యనగరం లో 720 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వద్ద 2.5 పీఎం వాయు కాలుష్య తీవ్రత నమోదైంది. దీని వలన ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో బయటకు రావడానికి కూడా కష్టం అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.

మంత్రివర్గ సమావేశంలో ముప్పై అంశాలపై చర్చ.. తేలనున్న ఆర్టీసీ భవిష్యత్తు

  ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగబోతుంది. సంస్థ భవిష్యత్తుపై ఈ రోజు జరిగే కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్న సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది మంది పాత సిబ్బందితో.. కొంత తాత్కాలిక సిబ్బందితో.. కొన్ని బస్సులు మాత్రమే తిరుగుతుండటంతో ప్రజల ఇక్కట్లు తొలగట్లేదు. దీంతో సమస్యకు పరిష్కారం కనుగొని ప్రజల ఇక్కట్లకు తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఆర్టీసీ ప్రైవేటీకరణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. విధుల్లో చేరేందుకు అవకాశమిచ్చిన కూడా చేరకుండా సమ్మె కొనసాగించడం పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక పై కార్మికుల గురించి ఆలోచించకుండా ప్రజల రవాణా సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా చర్యలను వేగవంతం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అద్దె బస్సుల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. అద్దె బస్సుల సంఖ్యను ముప్పై శాతాని కి పెంచాలని.. రాష్ట్రంలో ఇరవై శాతం రూట్లను పూర్తిగా ప్రైవేట్ ఆపరేటర్ లకు అప్పగించాలని నిర్ణయించింది. ఆర్టీసీ స్వరూపాన్ని పూర్తిగా మార్చాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తొంది. ఈ అంశాలన్నింటినీ కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీని పై కేబినెట్ లో చర్చించే అవకాశముంది. జిల్లాల పర్యటనపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ముప్పై అంశాల పై ఈ రోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించబోతున్నారు.

పవన్ తో పాటే మిగితా పార్టీలు... వైజాగ్ లాంగ్ మార్చ్

  భవన నిర్మాణ కార్మికుల సమస్యల పై రేపు ఛలో విశాఖపట్నం లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇసుక కొరత కారణంగా లక్షలాది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్షాలు, బిజెపి, టిడిపి స్పందించి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. నవంబర్ 3న విశాఖ లో  పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న లాంగ్ మార్చ్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపి అందులో పాల్గొనాలని ఆయన కోరారు.రెండు రోజుల క్రితం ఏపీలోని అన్ని పార్టీల అధ్యక్షులకు.. కార్యదర్శులకు.. ఫోన్ చేసి వారి మద్దతు కోరారు పవన్ కళ్యాణ్. దాదాపు అన్ని పార్టీలు నిర్మాణ రంగ కార్మికుల సమస్యపై జనసేన తల పెట్టిన లాంగ్ మార్చ్ కు సంఘీభావం తెలపడం జరిగింది.  జనసేన చేపట్టబోయే కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు బిజెపి నాయకులు కన్నా లక్ష్మినారాయణ. అయితే  జనసేన చేస్తున్న ఈ కార్యక్రమంలో కన్నా పాల్గొనాల్సిన అవసరం లేదని బిజెపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ప్రకటించారు. విష్ణువర్ధన్ మాటలను బట్టి చూస్తే పవన్ ఆందోళన బీజేపీలో విబేధాలు సృష్టించినట్లే అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. ఒక్కరు విభేదించినంత మాత్రాన మా మద్దతు మారదు.. చివరిగా మేము సంఘీభావానికి పరిమితం కానున్నట్లు తెలిపాయి బీజేపీ వర్గాలు. ఋజువు చెయ్యలేని మిత్రబంధం తెలుగుదేశం-జనసేన  అంటూ వైసిపి నాయకులు ఎప్పటి నుండో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో కనుక టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొంటే మనఃసాక్షి అంటూ ఇటీవల వైసీపీ చేసిన ఆరోపణలకు కొంత బలం చేకూరుతుందని ఊహిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. వామపక్షాలు మొన్నటి ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేశాయి గనుక ధర్నాలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ ధర్నా వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనేదే రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.  

తనకు తానే రూ.50 లక్షల జరిమానా విధించుకున్న హరీష్ రావు...

  లక్షలు..లక్షలు.. దోచుకున్న నాయకులని చూస్తున్న ఈరోజుల్లో తనకు తానే జరిమానా విధించుకున్నాడు ఒక మంత్రి. అదేంట్రా.. మంత్రి జరిమానా వేసుకోవడం అది కూడా తనకు తానే అని సందేహం రావటం ఖాయం. శుక్రవారం( నవంబర్ 1న ) సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కోసం ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ నియోజయకవర్గ ఎమ్మెల్యేగా హరీష్ రావు సభకు హాజరుకావాలిసి ఉంది. అయితే ఆయన ఏకంగా 4 గంటలు సభకు ఆలస్యంగా వచ్చారు. కావున 11:30కు మొదలు కావలసిన సభ మధ్యాహ్నం 3:30కు మొదలైంది. 4 గంటలు ఆలస్యమైనా ఎంతో ఓపికతో వేచి చూసిన మహిళలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా..తన వల్లే సభ ఆలస్యంగా మొదలైందని మంత్రి హరీష్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని అక్కడి మహిళలు హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేశారు. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆయన అందుకు ఒప్పుకోవడమే కాకుండా వెంటనే రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆయన మాటలు విన్న అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. హరీష్ రావు తనకు తాను జరిమానా విధించుకున్న విధానాన్ని సిద్దిపేట ప్రజలు ప్రశంసించారు. ఇంత నిక్కచ్చిగా ఉండేవాడు..మా నాయకుడు అవ్వడం మా అదృష్టమని హరీష్ రావుని అందనమెక్కిచ్చారు. ప్రజలకు సమస్య అని తెలిస్తే వెంటనే ముందుకు వస్తాడని..అందుకే ఆయనంటే అంత అభిమానమని చెబుతున్నారు సిద్దిపేట ప్రజలు.

ఆర్టీసీ విలీనం... తెలంగాణలో 'నో', ఆంధ్రాలో 'ఎస్'

  తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రెండూ.. రెండు భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక పక్క ఆర్టీసీ సమ్మెలతో తెలంగాణ రాష్ట్రం భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తియ్యటి కబురుని అందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటానికి ఏపీయస్ ఆర్టీసీ పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గత కొద్ది రోజులుగా ఈ విషయంపై పాలక వర్గంలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 52వేల మంది సిబ్బందిని ప్రజా రావాణా శాఖలోకి విలీనం చేసేందుకు ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నట్లు పాలక మండలి తెలియజేసింది.సంస్థలోని పాత బస్సుల స్థానంలో.. తొలి విడతగా 350 విద్యుత్‌ బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది పాలక మండలి. పాలక మండలి నిర్ణయాలను అధికారికంగా ప్రభుత్వానికి నివేదించనున్నారు. జనవరి నుండి ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్హత పొందనున్నారు. 2015 లో తీసుకన్న నిర్ణయం ప్రకారం ఆర్టీసీలో మెడికల్‌ గా అన్‌ ఫిట్‌ అయిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న సర్క్యులర్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్‌ను శాశ్వతంగా రద్దు చేసింది.

పవన్ లాంగ్ మార్చ్ ల్యాండ్ మార్క్ కానుందా? లేక క్రెడిట్ కోసమే జనసేన ప్రయత్నిస్తోందా?

  పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న విపక్షాలకు, ఇసుక రూపంలో బ్రహ్మాస్త్రం దొరికినట్టయ్యింది. లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారంటూ విపక్షాలు ప్రతిరోజు గొడవ చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమైతే, ఇప్పటికే అనేక రూపాల్లో పెద్దఎత్తున నిరసనలు ఆందోళనలు చేపట్టింది. ఇప్పుడు జనసేన తన వంతుగా లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చింది. అంతేకాదు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, ఎన్నికలైన తర్వాత చేపడుతున్న తొలి ఉద్యమం ఇది. ఇప్పటికే అక్కడక్కడా ఇసుక రీచ్‌లలో పర్యటించిన పవన్, అసలు సమస్యేంటి, ప్రభుత్వం చెబుతున్నట్టు ఇసుక దొరుకుతోందా లేదా అని స్వయంగా కార్మికులను, మేస్ట్రీలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఇసుక  సమస్య లేకపోయినా, ఏపీలోనే ఎందుకుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు బాసటగా వైజాగ్‌లో లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చారు. అయితే, భవన నిర్మాణ కార్మికుల తరఫున కలసికట్టుగా పోరాడదామంటూ ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు జనసేనాని. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులకు పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేశారు. ఇక, టీడీపీ, బీజేపీ... పవన్ ఆహ్వానాన్ని మన్నించినా, లాంగ్ మార్చ్ లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్పటికే క్లారిటీ ఇఛ్చారు. కేవలం సంఘీభావం మాత్రమే తెలుపుతామని, లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని స్పష్టతనిచ్చారు. ఇక, మొదట్నుంచీ ధాటిగా నిరసనలు చేపడుతోన్న తెలుగుదేశం కూడా నేరుగా లాంగ్ మార్చ్ లో పాల్గొనే అవకాశం లేదు. ఎందుకంటే, ఇప్పటికే ఇసుకపై పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడుతూ టీడీపీ జనంలోకి వెళ్లింది. ఒకవేళ ఇప్పుడు జనసేన లాంగ్ మార్చ్ లో పాల్గొంటే, ఆ క్రెడిట్ మొత్తం జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశముంటుందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. అందుకే, పవన్ కల్యాణ్ పిలుపునకు సానుకూలంగా స్పందించినా, ప్రత్యక్షంగా లాంగ్ మార్చ్ లో పాల్గొనే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక, మొదటినుంచి జనసేనతో కలిసి నడుస్తున్న వామపక్షాలు మాత్రమే వైజాగ్ లాంగ్ మార్చ్ లో పాల్గొనే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, టీడీపీ, బీజేపీలు... లాంగ్‌ మార్చ్‌ లో పాల్గొనకపోతే, ప్రజా సమస్యలను కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని, ఈ పార్టీలనూ పవన్ ఎండగట్టే అవకాశముందంటున్నారు. మొత్తానికి మెగా ర్యాలీతో లాంగ్‌ మార్చ్‌ను ఒక ల్యాండ్‌ మార్క్‌గా చూపాలని తపిస్తోంది జనసేన.

రాజధాని టీడీపీలో గ్రూపు రాజకీయాలు... బాబుకి బీపీ తెప్పిస్తున్న నేతల చర్యలు

  చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది కొందరు తెలుగుదేశం నేతల పరిస్థితి. ఒకవైపు పార్టీని బతికించుకోవడం కోసం చంద్రబాబు జిల్లాలు తిరుగుతూ, దీక్షలకు పిలుపునిస్తూ, ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు చేస్తుంటే, కొందరు తమ్ముళ్లు మాత్రం, తమలో తాము కొట్టుకుంటూ, చంద్రబాబును మరింత విసుగెత్తిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నేతల మధ్య విభేదాలు చంద్రబాబుకి బీపీ పెంచుతున్నాయట. తాడికొండ నియోజకవర్గ నేతలైతే బాబుకి తలపోటు తెప్పిస్తున్నారట. ఆధిపత్య పోరుతో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయారట. అయితే, ఈ వివాదమంతటికీ మొన్నటి ఎన్నికల్లోనే బీజం పడిందంటున్నారు. అప్పటి తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు తాడికొండ టికెట్ ఇవ్వడం, అతను ఓడిపోవడంతోనే రగడ మొదలైందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. గతంలో తాడికొండ ప్రాతినిథ్యం వహించి, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ మళ్లీ ఈ నియోజకవర్గంపై కన్నేయడంతోనే గొడవ మొదలైందని చెబుతున్నారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా... మొన్నటి ఎన్నికల్లో తాడికొండ నుంచి బరిలోకి దిగాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, పలు సమీకరణలతో చంద్రబాబు....  శ్రవణ్ కుమార్ కు అవకాశమివ్వడంతో... సైలెంటైపోయారు. కానీ, శ్రవణ్ కుమార్ ఓడిపోవడంతో... మళ్లీ తన సొంత నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు డొక్కా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తాడికొండలో అనేకమంది టీడీపీ నేతలను రాజకీయంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించారన్న ఆరోపణలు డొక్కాపై ఉన్నాయి. ఇక, ఇఫ్పుడు టీడీపీలో గ్రూపు రాజకీయాలకు తెరతీశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తాడికొండ టీడీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతలను దక్కించుకునేందుకు శ్రావణ్ కుమార్ వ్యతిరేక వర్గీయులతో జత కట్టారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తాడికొండలో శ్రావణ్ కుమార్ అసలు అందుబాటులో ఉండటం లేదనే ప్రచారం మొదలుపెట్టారట డొక్కా. తన వాదనను చంద్రబాబుతోపాటు నారా లోకేష్ దగ్గరకు తీసుకెళ్లి డొక్కా సక్సెస్ అయినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి డొక్కా అయితేనే, తాడికొండలో గెలుపు సాధ్యమంటూ కేడర్ తోనూ చెప్పించినట్లు తెలుస్తోంది.  అయితే, డొక్కా చర్యలపై మండిపడుతోన్న శ్రావణ్ కుమార్... తన వాదనను అధినేత దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారంటూ డొక్కాపై ఫిర్యాదు చేశారట. ఒకవైపు డొక్కా... మరోవైపు శ్రావణ్ కుమార్... పరస్పర ఫిర్యాదులతో చంద్రబాబుకి తలబొప్పికడుతోందట. అసలు పార్టీ ఘోరంగా ఓడిపోయి కష్టాల్లో ఉంటే.... కలిసి పనిచేయాల్సిన నేతలు ఇలా కొట్టుకుంటూ... పార్టీకి మరింత నష్టం చేస్తున్నారంటూ మండిపడినట్లు తెలుస్తోంది. అయితే, డొక్కా, శ్రావణ్ ఆధిపత్య పోరుతో కేడర్ లో అయోమయం నెలకొందని, ఈ వివాదానికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. లేదంటే రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం కోలుకోవడం కష్టమేనంటున్నారు.

ఆర్టీసీ కార్మికులకు నేను అండగా ఉంటా: పవన్ కళ్యాణ్

  తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజు రోజుకి మరింత ఉధృతం అవుతూనే ఉంది. సమ్మె విషయంపై జేఏసీ లీడర్లు ఇప్పటికే గవర్నర్ ను కూడా కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. అందరి మద్దతు కూడగట్టుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఇతర నేతలుతో పాటు పవన్ కళ్యాణ్ ని కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు.    ‘‘తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంపై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ గారిని.. కొందరు మంత్రులను.. నేను కలవడానికి సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. అయితే ఆర్టీసి సమ్మె కార్మికుల గురించి చర్చించడానికి వారు ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందువల్ల వారిని కలవలేకపోయాను. 3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహణ భాగంగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండటంతో.. వచ్చిన తరువాత మరోసారి కేసీఆర్‌ గారిని కలవటానికి ప్రయత్నిస్తాను. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా నేను ఉంటాను’’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కేసీఆర్‌పై తనకు అపారమైన గౌరవం ఉందని.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరించడం మంచిది కాదని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై ఇవాళ ( నవంబర్ 2న )  తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి వర్గాల నుంచి సమాచారం.

ట్విట్టర్ లీక్స్... బలైన బీజేపీ వైస్ ప్రెసిడెంట్

  సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి , ఈ పేరు నిన్నటి దాకా చాలా కొద్ది మందికే తెలుసు.. అలాంటిది ట్విట్టర్ పుణ్యమా ఈయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు..ఈయనది అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం. ఒక కులాన్ని అదే కులానికి చెందిన ప్రముఖ హీరోని టార్గెట్ చేసి దూషిస్తున్న ట్వీట్లు ఆయన ట్విట్టర్ ఖాతాలో దర్శనమిచ్చాయి. చిన్న చిన్న వాటినే వదలని మన నెటిజన్లు అంతటి మాటలని అంత సులువుగా వదులుతారా.. చివరకి ఆయన ఖాతా మూసేసుకునే దాకా వదలలేదు. అప్పట్లో తళుకుమన్న ఒక తార అంటే తనకి ఎంతో ఇష్టమని తనతో నటించమని ఏకంగా మహేష్ బాబు లాంటి  స్టార్ హీరో పేరు ప్రస్తావించి ఒక ట్వీట్ చేశారు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో..కానీ ఒక నాయకుడిగా తన ఖాతా నుండి ఇలాంటి ట్వీట్లు ఎవ్వరు చేసి ఉండరు. మామూలుగానే ట్విట్టర్ , ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో చురుక్కుగా ఉంటాడు విష్ణువర్ధన్. అలాంటిది ఇంత రచ్చ సోషల్ మీడియాలో జరుగుతున్నా మౌనంగా ఎందుకు ఉన్నారా అని చాలా సేపు అందరూ ఖంగు తిన్నారు. చివరకు ట్విట్టర్ లో జరుగుతున్న యుద్దానికి ఫేస్బుక్ ద్వారా సమాధానం ఇచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి. " నా పేరు మీద గత కొంత కాలంగా వాడుతున్నది ఒక థర్డ్ పార్టీ.. అది వారు ఎవరో వేరే వ్యక్తి నుంచి తీసుకొని నా పేరు మీద వాడుతున్నారు. కావున అప్పుడు ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం చేసిన పోస్టులకు.. కామెంట్లకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. 23 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉండి ప్రతి కులం..మతం పైన అపార గౌరవంతో ఉన్నాను. నేను బాధ్యతగల భారతీయ పౌరుడిని. ఒక కులాన్ని.. మతాన్ని..వ్యక్తిని.. దుర్భాషలాడిన సంఘటనలు నా జీవితంలో జరగలేదు.. జరగబోవు.. " అంటూ ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టారు. ఎవరో రాతలకు ఒక రోజంతా ట్విట్టర్ పక్షులకు విష్ణువర్ధన్ గారు ఆహారమయ్యారని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆయన పోస్టు చదివాక..ఆహా! ఓహో! అలాగా! అందుకే ఏదైనా చేసే ముందు చూసి చెయ్యాలి అంటారు.. ఖాతా చూసి కొనుక్కుంటే ఇంత పని జరిగేదే కాదు అని కూడా కొందరు అంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా చివరికి మంచో..చెడో.. ఒకరోజంతా సోషల్ మీడియా మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి గారి ట్వీట్లే కనిపించాయి.