కేసీఆర్ మాటంటే కార్మికులకు లెక్క లేదా? అమిత్-షాకి టీబీజేపీ ఏం రిపోర్ట్ ఇచ్చింది?
posted on Nov 7, 2019 @ 10:45AM
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పట్టు సడలించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు డెడ్ లైన్లు పెట్టినా బెదిరింపులకు దిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. మంగళవారం అర్ధరాత్రిలోపు బేషరతుగా విధుల్లో చేరాలంటూ కేసీఆర్ ఇచ్చిన ఆఖరి డెడ్-లైన్ ను ఆర్టీసీ కార్మికులు లైట్ తీస్కున్నారు. కేసీఆర్ డెడ్‌లైన్‌ను 99.99శాతం కార్మికులు లెక్కే చేయలేదు. మొత్తం 49వేల కార్మికుల్లో కేవలం 350మంది మాత్రమే రీ-జాయిన్ అయ్యారు.
వాళ్లలోనూ సగం మంది మళ్లీ డుమ్మాకొట్టారు. కేసీఆర్ బెదిరింపులకు, డెడ్‌లైన్లకు బెదిరేది లేదని, ఇలాంటి డెడ్‌లైన్లను చాలా చూశామంటోన్న ఆర్టీసీ కార్మికులు... తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
డెడ్ లైన్ సంగతి పక్కనబెడితే, ట్యాంక్ బండ్ పై తొమ్మిదిన నిర్వహించే మిలియన్ మార్చ్ కు ఆయా పార్టీల మద్దతును ఆర్టీసీ జేఏసీ కూడగడుతోంది. ముందుగా బీజేపీ నేతలను కలిసి ఆర్టీసీ కార్మికులు మద్దతు కోరారు. అయితే, ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... ఆర్టీసీ సమ్మెను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్న లక్ష్మణ్... ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులతో చర్చలు జరపాలని కేసీఆర్ కు సూచించారు.
అయితే, ఇప్పటికే 5వేల100 రూట్ల ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. మరో 5వేల మార్గాలను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, తెలంగాణను ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మార్చబోతున్నామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, తాజా పరిణామాలపై... హైకోర్టు ఎలా స్పందిస్తుందోనని ఇరువర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.