వైసీపీ కార్యకర్తల శ్యాడ్ సాంగ్.. రేనా చూడు రేనా చూడు, లైవ్ పెట్టలేని దుస్థితి చూడు...
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే.. సీఎం వైఎస్ జగన్, విజయసాయిలపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పిస్తున్నారు.
"కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి. ఏమిటీ పరాభవం." అంటూ రాజ్యసభ ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు వేశారు.
"నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక ఎమ్మెల్యేని, బాబు గారి దూత కలిసి పార్టీని వదిలి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాడట. తక్షణం 5 కోట్లు అరేంజ్ చేసారట. ఇంకో పదేళ్లు పవర్ లేకపోయినా దేనికీ ‘లోటు’ లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానా దోచినోడికి ఇదో లెక్కా." అంటూ మరో ట్వీట్ తో చంద్రబాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు.
కాగా, విజయసాయి విమర్శలకు బుద్ధా వెంకన్న కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. "రేనా చూడు రేనా చూడు, లైవ్ పెట్టలేని దుస్థితి చూడు, దమ్ములేని మాట చూడు, తొంటి చేతి వాచీ చూడరా.. అని వైకాపా కార్యకర్తలు ఏడుస్తూ పాడుతున్నారు. మీ చెవిన పడలేదా విజయసాయి గారు." అంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.
"పబ్జీ ఆటకు పోతురాజు.. పనిచేయడానికి తిమ్మరాజు అని సొంత ఎంపీ అంటున్నారు వైఎస్ జగన్ ని. మీరేమో ట్వీట్లతో జాకీలేసి లేపి ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటారు. ఆయన తాడేపల్లి గడపదాటి రారు." అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.