వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత!
posted on Jun 22, 2020 @ 3:37PM
108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని.. దీనిపై సీఎం, ఆరోగ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మరోవైపు, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్ ని అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసిందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్కామ్ చేసినోళ్లని వదిలేసి, దాన్ని బయట పెట్టినోళ్లని అరెస్ట్ చేయాలనుకోవడం ఏంటని మండిపడ్డారు.
"స్కామ్ చేసినోళ్ళని వదిలి, బయటపెట్టిన వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత! రివర్స్ టెండరింగ్ లో భారీగా మిగిలిపోయింది అంటూ బిల్డప్ ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం,108లో ప్రజాధనం ఎందుకు వృధా అయ్యిందో చెప్పలేక టిడిపి నాయకుల్ని అరెస్ట్ చెయ్యాలనుకుంటుంది." అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"టిడిపి నాయకులపై అక్రమ కేసులు,అరెస్టులతో వైకాపా నేతల ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ మాఫియాల ఆగడాలు బయటకు రాకుండా చెయ్యాలనే జగన్ రెడ్డి గారి ప్రయత్నం ఫలించదు." అని లోకేష్ పేర్కొన్నారు.