పతంజలి యూటర్న్.. మేం కరోనా మందు తయారు చేయలేదు

కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టామనంటూ పతాంజలి సంస్థ ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పతంజలి యూటర్న్ తీసుకుంది. తాము కరోనాకు ఎలాంటి మందును తయారు చేయలేదని తెలిపింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఔషధ శాఖకు వివరణ ఇచ్చింది. కరోనా కిట్ పేరుతో తాము ఒక ప్యాకేజీని రెడీ చేశామని.. ఇందులో 'దివ్య స్వసరి వతి, దివ్య కొరోనిల్ ట్యాబ్లెట్, దివ్య అను తైల్' ఉంటాయని చెప్పింది. కరోనా కిట్ ను తాము ఇంత వరకు కమర్షిషల్ గా అమ్మలేదని, కరోనా వ్యాధిని ఈ మందు నయం చేస్తుందని తాము ఎక్కడా ప్రచారం చేసుకోలేదని చెప్పింది. ఈ మందు ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఈ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రమే తాము మీడియా సమావేశంలో వెల్లడించామని తెలిపింది.

ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 15 వరకూ పలు కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగాల్సి ఉంది. అయితే, కరోనా విజృభింస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ఎంసెట్ సహా అన్ని ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లా సెట్, పాలీసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలు వాయిదా ప‌డ్డాయి.

ఆయన ఓ తేడా మనిషి.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్దిరోజులుగా సొంత పార్టీ వైసీపీని ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ నేతలు విమర్శించినా, పార్టీ నుంచి షోకాజ్ నోటిస్ వచ్చినా.. ఏ మాత్రం తడబడకుండా విమర్శకు కాస్త గోదావరి వెటకారం జోడించి కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ నేత, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక తేడా మనిషి అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆయనను తాము మనిషిలా గుర్తించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు బీజేపీకి వెళ్లిపోతున్నారు కనుకనే ప్రధాని మోడీ భజన చేస్తున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు.

టిక్​ టాక్ యూజర్స్ పరిస్థితేంటి?.. ఇండియాలో యాప్ పనిచేస్తుందా?

చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లను భారత్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన టిక్​ టాక్ యాప్ కూడా ఉంది. బ్యాన్ తో ఇప్పటికే టిక్ ​టాక్.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ‌ల నుంచి మాయమైంది. దీంతో టిక్ టాక్ ని వ్యతిరేకించే వారు సంతోషపడుతుండగా.. టిక్ టాక్ ని అభిమానించే వారు తెగ బాధపడిపోతున్నారు. అయితే కొందరు మాత్రం.. ప్లే స్టోర్ నుంచి తొలగించినంత మాత్రాన ఏం కాదు. ఇప్పటికే  ఇన్​స్టాల్ చేసుకున్న వారు హ్యాపీగా వాడుకోవచ్చని చెబుతున్నారు. మరికొందరైతే, వెబ్ సైట్ల నుంచి ఏపీకే లను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. దీంతో కొందరు టిక్ టాక్ యూజర్స్ సంతోషపడుతున్నారు. కొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యాప్ ఇన్​స్టాల్​ చేసుంటే ఆ యాప్ నిజంగా​ పని చేస్తుందా?.. ఒకవేళ యాప్ ఉపయోగిస్తే చట్టపరంగా ఇబ్బందులు ఏవైనా ఎదుర్కొనే ప్రమాదం ఉందా?.. అని టిక్ టాక్ యూజర్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే, ఒకవేళ యాప్ ఇన్​స్టాల్ అయి ఉన్నప్పటికీ అది పని చేయదని తెలుస్తోంది. నిషేధించిన ఆ చైనా యాప్స్ అన్నీ ఆన్‌లైన్‌ ఆధారంగా పని చేసేవే. అవి స్మార్ట్‌ ఫోన్లలో ఇన్​స్టాల్ అయి ఉన్నప్పటికీ పని చేయవు. ఆ యాప్‌లలో అప్‌డేట్లు ఇకపై కనపడవు.  బ్యాన్​ విధింపుతో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఈ యాప్స్ కు​ ఇండియాలో డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్​ చేయకుండా బ్లాక్ చేస్తాయి. గతంలో ఓ యాప్ నిషేధానికి గురైతే డేటాతో సంబంధం లేకుండా పని చేసేది. కానీ, నెట్​వర్క్స్​ కూడా ఈ 59 యాప్స్​కి డేటా సరఫరా చేయొద్దని ఆదేశాలు అందడంతో భారత్ ​లో ఇవి పని చేయడం అసాధ్యం. టిక్​ టాక్ ​తో సహా నిషేధానికి గురైన ఏ యాప్​ కూ ఇక అప్​డేట్స్ చూపించవు. అయినా ఫోన్లలో ఆ యాప్స్​ను ఉంచుకుంటే భద్రత తగ్గి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ. ఆ యాప్స్​ను స్మార్ట్‌ఫోన్లలో ఉంచుకోకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో భద్రత తగ్గిపోతుండడంతో వాటి ద్వారా స్మార్ట్‌ ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

దివ్యాంగ ఉద్యోగినిపై దాడి.. దిశ చ‌ట్టం ఎక్క‌డ జగన్ గారు?

నెల్లూరులో దారుణమైన ఘటన జరిగింది. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఉద్యోగినిపై రాడ్ తో దాడి చేశాడు ఓ అధికారి. ఈ అమానుష ఘటన నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో చోటుచేసుకుంది. ఉషారాణి అనే ఆమె ఏపీ టూరిజం కార్యాలయంలో ఒక ఉద్యోగిని. పైగా దివ్యాంగురాలు. కరోనా విలయతాండవం నేపథ్యంలో బాధ్యత గల ఓ పౌరురాలిగా అందరూ మాస్క్‌లు ధరించండని సూచించింది. ఈ విషయం డిప్యూటీ మేనేజర్ భాస్కర రావుకు రుచించలేదు. నాకే చెబుతావా అంటూ ఆగ్రహంతో రగిలిపోతూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. సహచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, దివ్యాంగురాలన్న కనికరం కూడా లేకుండా విచాక్షణరహితంగా చావబాదాడు. దివ్యాంగ ఉద్యోగినిపై దాడి ఘటనపై ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. డిప్యూటీ మేనేజర్‌ భాస్కర రావు‌ను సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు భాస్కర రావు‌ని సస్పెండ్ చేస్తూ ఏపీ టూరిజం శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, భాస్కర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితుల‌కు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చ‌ట్టం ఎక్క‌డ వైఎస్ జగన్ గారు?. పాల‌కులే ప్ర‌తీకారంతో చెలరేగిపోతుంటే కొంద‌రు  అధికారులు అదే పంథాలో అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మ‌హిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన‌ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ని స‌స్పెండ్ చేసి చేతులు దులుపుకోవ‌టం కాదు. క‌ఠినంగా శిక్షించాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు.

చైనా నుండి ప్రపంచానికి మరో గిఫ్ట్.. మరో కొత్త వైరస్ 

ప్రపంచం మొత్తం చైనా నుండి దిగుమతి ఐన కరోనా వైరస్ తో ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఇప్పుడు దీనికి తోడు చైనా సైంటిస్టులు మరో కొత్త వైరస్ ను కనుగొన్నారు. అమెరికాకు చెందిన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ జర్నల్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్ పేరు G4 EA H1N1. ఇది కూడా H1N1 వైరస్ జాతి నుండి వచ్చింది. ఈ H1N1 వైరస్ 2009లో ప్రపంచాన్ని ఒకసారి అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఐతే మనకు మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ కొత్త వైరస్‌ మనుషులకు కూడా సోకుతుంది. ఈ వైరస్ తాజాగా వచ్చిందేమీ కాదట. 2011 నుండి 2018 మధ్య కాలంలో చైనాలోని పది ప్రావిన్సుల్లో ఉన్న పలు పశువుల ఆస్పత్రులు, జంతువధశాలలో ఉండే పందుల నుంచి 30వేల శాంపిల్స్ తీసుకుని సైంటిస్టులు రీసెర్చ్ చేసారు. వాటిలో 179 రకాల స్వైన్‌ ఫ్లూ వైరస్‌లను వారు కనుగొన్నారు. ఐతే ఆ వైరస్‌లు మనుషులకు సోకుతాయా అనే డౌట్ రావడంతో ముంగిస జాతికి చెందిన ఫెర్రెట్‌ అనే జంతువుపై ఆ వైరస్ లను ప్రయోగించారు. ఆ జంతువుకే ఎందుకంటే, మనుషులకు వైరస్‌లు సోకితే ఎంటువంటి లక్షణాలు వస్తాయో అటువంటి లక్షణాలు ఆ జంతువులలో కూడా కనిపిస్తాయి. తాజాగా ఫెర్రెట్ పై జరిపిన రీసెర్చ్ లో ఈ G4 EA H1N1 వైరస్‌ ఎక్కువ ప్రమాదకరమైనదిగా తేలింది. మరి ముఖ్యంగా ఇది మనుషుల్లో కరోనా లాగే త్వరగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆ శాస్త్రవేత్తలు తేల్చారు. మరో ముఖ్య విషయమేంటంటే ఈ కొత్త వైరస్ ఇప్పటికే మనుషులకు సోకింది. అక్కడ పందుల పరిశ్రమల్లో పని చేసే 10 మందిలో ఆ వైరస్ ఉంది. ఐతే మనుషుల్లోకి ఈ వైరస్ వచ్చిన తరువాత ఇది వేగంగా పెరగగలదు అలాగే తన రూపాన్ని కూడా మార్చుకోగలదు. మనం చూస్తున్న కరోనా ఇప్పటికే దాదాపు 60 రకాలుగా రూపాంతరం చెందింది. తాజాగా ఈ జీ4 వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా అనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఈ జీ-4 వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సరిపోదని తేల్చి చెప్తున్నారు. ఐతే మరో వాదన ఏంటంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫ్లూ వ్యాక్సిన్ ఈ వైరస్ పై పని చేయదని ఐతే ఆ వ్యాక్సిన్ లో కొన్ని మార్పులతో దీనిని కంట్రోల్ చేయవచ్చని కొందరు శాస్త్రవేత్తల వాదన. అయినా ఇదెక్కడి గోలండీ బాబు.. చైనా వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచం మొత్తం బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది.

అవును నిజమే.. చైనా హద్దులు దాటింది.. మరి ఆ మంట పెట్టింది ఎవరు? 

భారత చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతం లో కొద్ది రోజుల క్రితం ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఉపగ్రహ ఛాయాచిత్రాల సమాచారం ప్రకారం చైనా సైన్యం 423 మీటర్లు భారత భూభాగం లోకి చొచ్చుకువచ్చినట్లుగా తెలుస్తోంది. 1960లో చైనా పేర్కొన్న సరిహద్దు రేఖను దాటి 423మీటర్ల మేర మన ప్రాంతం లోకి ఆ దేశం చొరబడింది. ఐతే చైనా తో భారత్‌ ఈ రోజు కమాండర్‌ స్థాయి చర్చలు జరపనుంది. ఇప్పటివరకూ రెండు సార్లు చర్చలు జరగగా అవి సరిహద్దుకు అవతలి వైపున్న చైనా వైపున ఉన్న మోల్డోలో జరిగాయి. ఈ రోజు జరిగే చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో జరగనున్నాయి. ఇది ఇలా ఉండగా హిందూ మహా సముద్రంపై భారత్‌ తన నిఘాను పెంచింది. దానితో పాటు అమెరికా, జపాన్‌ నేవీలతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేపట్టింది. భారత యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ రాణా, ఐఎన్‌ఎస్ కులిష్‌ ఇందులో పాల్గొన్నాయి. గల్వాన్‌ లోయను ఆక్రమించి చైనా సైనికులు వేసిన గుడారం అనుకోని విధంగా అగ్నిప్రమాదానికి గురైందని దాంతో ఈ నెల 15న ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. మొట్టమొదటి సారి రెండు దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడు గల్వాన్‌లోని నియంత్రణ రేఖ వెంట రెండు దేశాల సైనికులు ఉండరాదని ఒప్పందం జరిగిందని, ఐతే చైనా సైనికులు మళ్లీ అక్కడకు చేరి గుడారం నిర్మించారని అయన తెలిపారు. దీని పై చైనా సైన్యాన్ని ప్రశ్నించేందుకు భారత సైనికులు వెళ్లగా.. అక్కడ ఉన్న గుడారం అంతుచిక్కని రీతిలో అగ్నికి ఆహుతి అయిపోవడంతో ఘర్షణ మొదలైందని ఆయన అన్నారు. ఇది ఇలా ఉండగా సోషల్‌ మీడియాలో పాకిస్తాన్ భారత్ పై విషప్రచారం చేస్తోంది. పీవోకేలోని గిల్గిట్, స్కర్దు‌ విమానాశ్రయాలలో చైనా 50 జే-10 యుద్ధవిమానాల్ని మోహరించిందని తన సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసున్నాయి. ఐతే ఆ రెండు విమానాశ్రయాలు కలిపినా కూడా ఆ స్థాయిలో ఫైటర్ విమానాల్ని నిలిపేందుకు కావలసిన మౌలికవసతులు లేవని తెలుస్తోంది. ఐతే తాజాగా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలలో అసలు గిల్గిట్‌లో విమానాలు లేవని తేలింది. ఇక అటు చైనా వైపున గల్వాన్‌లో భారీ సంఖ్యలో సైన్యాన్ని సమీకరించింది కానీ అక్కడ నదీ ప్రవాహం అడ్డంకిగా మారింది. చైనా వైపున కొత్తగా నిర్మించిన రహదారులు నదిలో కొట్టుకుపోయినట్లు కూడా తెలుస్తోంది. నదీ తీరాన్ని కృత్రిమంగా చైనా కొంత తగ్గించినప్పటికీ దాన్ని కూడా గల్వాన్‌ నది తిరిగి కలిపేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా చైనాలోని రిజర్వు బలగాలు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధీనంలోకి వచ్చాయి. చైనా సైన్యాన్ని ప్రపంచస్థాయి సైన్యంగా తయారుచేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం అయ్యారు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం 4 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌ లో తెలిపింది. అన్‌లాక్‌ 2.0పై కేంద్రం మార్గదర్శకాల తో పాటు నిన్ననే 59 చైనా యాప్‌లపై నిషేధం ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు జాతినుద్దేశించి ప్రధాని చేయనున్న ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆదివారం తన ‘మన్‌కీ బాత్‌’ లో స్వదేశీ వస్తువులనే కొనాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

'కోవ్యాక్సిన్' క్లినికల్‌ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్!

కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌కు చెందిన 'భారత్‌ బయోటెక్‌' మరో ముందడుగు వేసింది. కరోనా‌ కట్టడికి ‘కోవ్యాక్సిన్‌’ను భారత్‌ బయోటెక్ డెవ‌ల‌ప్ చేసింది. తాజాగా ఈ వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి లభించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేశారు. జంతువుల పై ఇది సానుకూల ఫలితాలను ఇవ్వడంతో ప్రస్తుతం మానవులపై ప్రయోగాలకు సిద్ధమైపోయింది. ఈ ‘కోవ్యాక్సిన్‌’ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. మానవులపై ఫేజ్‌ -1, ఫేజ్‌ -2 పరీక్షలకు అనుమతులు జారీ చేసింది. కరోనా‌‌ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. జులై నెల నుంచి మానవులపై ప్రయోగాలు చేయనుంది. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘కోవ్యాక్సిన్‌’ తయారీ చరిత్రాత్మకం అవుతుందన్నారు.

కొండపోచమ్మ కాల్వకు గండి.. నీట మునిగిన పొలాలు

కొండపోచమ్మ జలాశయం కాల్వకు ఈ ఉదయం గండి పడింది. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేశారు. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7గంటలకు సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కుడి కాలువకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహించింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో కాలువకు నీటివిడుదల నిలిపివేశారు. ఉదయం పూట కావడంతో ప్రమాదం తప్పిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖలో మరో గ్యాస్ లీక్ దుర్ఘటన.. ఇద్దరు మృతి

విశాఖ లో ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరిచిపోక ముందే మరో సారి గ్యాస్ లీక్ దుర్ఘటన చోటుచేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్ సైన్సెస్ లోని రియాక్టర్ నుంచి బెంజీన్ మేడిజోన్ అనే విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటన గురించిన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాద ఘటనపై నలుగురు అధికారులతో కమిటీని నియమించినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మరోవైపు ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం

భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హలో, క్యామ్ స్కానర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను నిషేదిస్తున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. చైనా సరిహద్దు లడఖ్ లో జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో, దేశవ్యాప్తంగా చైనా అంటే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. చైనా వస్తువులు, యాప్స్ బ్యాన్ చేయాలనీ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, టిక్ టాక్ వంటి యాప్ లను నిషేధించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్రం ఈ కీలక నిరణయం తీసుకుంది.

ఒక్క ఘటన..  ఊరంతా క్వారంటైన్

కరోనా పేరు చెపితే చాలు ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ప్రజల్లో ఈ కలవరానికి కారణం అది వ్యాప్తి చెందుతున్న తీరు. మార్చ్ లో మొదటి కేసు నమోదైన తెలంగాణ లో ప్రస్తుతం రోజు సుమారుగా వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. తొలి రోజుల్లో నగరాలలో మొదలైన కరోనా కేసులు ప్రస్తుతం గ్రామాలను కూడా చుట్టుముడుతున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారారం లో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ యువకుడు చనిపోయిన తర్వాత పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఐంది. ఐతే మృతుడికి కరోనా ఉందన్న విషయం తెలియక ఆ గ్రామానికి చెందిన సుమారు 500 మంది అతడి అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల తర్వాత కరోనా టెస్ట్ రిజల్ట్ లో అతడికి కరోనా ఉన్నట్లు తేలడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న వైద్యాధికారులు ఆ యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారంతా హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దాదాపుగా గ్రామం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్ళింది.

హరితహారానికి కొత్త అర్ధం.. వందలాది చెట్లను నరికి మామిడి మొక్కలు నాటారు!!

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రులు సైతం స్వయంగా మొక్కలు నాటి ప్రజల్లో చైతన్య కలిగిస్తున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం అభాసుపాలైంది. ఇన్నిరోజులు హరితహారమంటే మొక్కలు నాటి పచ్చదనం పెంచటం, ప్రకృతిని కాపాడటం అనుకున్నాం. కానీ, హరితహారమంటే ఉన్న పచ్చని చెట్లని నరికి ఆదాయమొచ్చే కొత్త మొక్కలు నాటడమని.. హరితహారానికి తెలంగాణ పోలీస్ అకాడమీ కొత్త అర్ధం చెప్పింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా కొత్త మొక్కలు నాటేందుకు వందలాది చెట్లను అధికారులు నరికించేశారు. హరితహారంలో మామిడి చెట్లను నాటడం ద్వారా భవిష్యత్తులో అకాడమీ ఆదాయాన్ని పెంచవచ్చని ఓ ఉన్నతాధికారి నిర్ణయించారట. అందుకే అక్కడ ఉన్న చెట్లను నరికించేశారు. అయితే ఆదాయం కోసం ఉన్న చెట్లను నరికి కొత్త మొక్కలను నాటడం హరితహారం ఎలా అవుతుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

లీజుకి రామోజీ ఫిల్మ్ సిటీ..!! వాస్తవం ఏంటంటే...

ఆసియాలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా పేరు తెచ్చుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ.మన తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలుస్తోంది. ఐతే కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ ని డిస్ని హాట్ స్టార్ కు లీజుకిచ్చేశారని అటు సోషల్ మీడియాలోనూ ఇటు కొన్ని వెబ్ సైట్లలోనూ కొన్ని వార్తలు వచ్చాయి.. కరోనా కారణంగా అటు షూటింగ్ లు, ఇటు టూరిస్టుల తాకిడి లేకపోవడం తో లీజుకు ఇస్తున్నారని ఆ వార్తల సారాంశం. తాజాగా ఇదే విషయమై ఫిల్మ్ సిటీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రామోజీ ఫిల్మ్‌సిటీని అద్దెకు, లీజుకు ఇచ్చార‌న్న వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని తేల్చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సోనీ పిక్చ‌ర్స్‌, జీ టీవీ వంటి వారిని రామోజీ ఫిల్మ్‌సిటీ లో షూటింగ్ కోసం ఆహ్వానించిన‌ట్టు ప్ర‌క‌టించింది. క‌రోనా మహమ్మారి నేప‌థ్యంలో ముంబైలో షూటింగులు చేసే ప‌రిస్థితి ప్రస్తుతం లేదు. అంతే కాకుండా దేశంలో ఎక్క‌డా కూడా షూటింగులకు అనువైన వాతావ‌ర‌ణం ప్రస్తుతం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని ఫిల్మ్‌సిటీకి వ‌చ్చి షూటింగులు చేసుకోమ‌ని ఆ సంస్థల ప్ర‌తినిధులకు ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. షూటింగుల‌కు అన్ని విధాలా అనువైనది కావడం తో పాటు అన్ని మౌలిక వ‌సతుల్ని ఉచితంగా క‌ల్పిస్తామ‌ని ఫిల్మ్‌సిటీ ఆహ్వానాలు పంపింది. ఆ ఆహ్వానానికి జీ టీవీ, సోనీ పిక్చ‌ర్స్ తమ అంగీకారం తెలిపాయని స‌మాచారం.

జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌‌ను మరో నెల పొడిగించింది. రాష్టంలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా కేసులలో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ తీసేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని, అందువల్లే మరో నెల పొడిగించడం జరిగిందని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు.  మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఇప్పటికే కరోనా కేసులు 1.6 లక్షలు దాటేశాయి. మరణాలు కూడా 7వేలకు పైగా సంభవించాయి. కరోనా వ్యాప్తి ఈ స్థాయిలో ఉన్నందునే లాక్‌డౌన్‌‌ ను పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీ మంత్రి నాని అనుచరుడి దారుణ హత్య

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత హత్య కలకలం రేపింది. మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. మునిసిపల్ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కరరావుని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. గాయపడిన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కత్తి పోటు ఛాతీలో బలంగా దిగడంతో భాస్కర్ రావు గుండెకు బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. కత్తికి సైనేడ్ పూసి పొడిచినట్టు వైద్యులు భావిస్తున్నారు.  భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్‌గా పని చేశాడు. పాతకక్షల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  మరోవైపు, భాస్కరరావు మరణవార్త తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.

అచ్చెన్నాయుడు ఆరోగ్యం పై కమిటీ వేసిన ప్రభుత్వం

ఈఎస్‌ఐ అవినీతి వ్యవహారంలో అరెస్టైన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఆయనకు విధించిన మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో ఈరోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జూన్ 30 వరకు కోర్టు మూసి ఉంచిన కారణంగా విచారణను జూలై ఒకటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఇది ఇలా ఉండగా అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక వైద్యుల కమిటీని నియమించింది. ఏసీబీ అదుపులోకి తీసుకున్న తరువాత అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై అటు పార్టీ నేతలు, ఇటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐదుగురు వైద్యులతో కూడిన ఒక కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి, అలాగే ఆయనకు వైద్యం చేసిన సిబ్బందిని విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వనుంది.

పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత

వైసీపీ నేత,  సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులపై కుక్కలను వదిలారు. ఇటీవల హైదరాబాద్‌లో పీవీపీ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ విల్లాకు సంబంధించి విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి ఇంటికి దాదాపు 20 మందిని వెంటబెట్టుకుని వెళ్లి.. తాను అమ్మిన వీళ్ళను ఆధునీకరించడానికి వీల్లేదంటూ.. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేసి, చంపేస్తానని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పీవీపీపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. విధులకు ఆటంకం కల్గించారని పీవీపీపై కేసు నమోదు చేశారు.  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం.

ఇంట్లోనే ఉండమంటే ఊరంతా తిరిగేసాడు.. దీంతో కొన్ని వందలమందికి టెన్షన్ 

ప్రస్తుతం మనమంతా కరోనా కాలం లో బతుకుతున్నాం. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని ప్రస్థితి. ఐతే కొంత మంది మాత్రం మాకేంటి మేము ఆరోగ్యంగా బాగానే ఉన్నాము. మాకు కరోనా సోకదు అని కనీసం మాస్క్ కూడా లేకుండా తిరిగేస్తున్నారు. అదేమంటే మీ సంగతి మీరు చూసుకోండి అనే జవాబు. ఐతే ఇటువంటి వారి కోసమే ఈ వార్త. అసోంలో ఒక కూరగాయల వ్యాపారికి కొద్ది రోజుల క్రితం దగ్గు రావడం మొదలైంది. దాంతో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెప్పగా అబ్బే కొద్దిగా వేడి చేసింది అందుకే దగ్గు స్టార్ట్ ఐంది అని తన మానాన తాను కూరగాయలు అమ్మడానికి వెళ్ళాడు. అతను కూరగాయలు అమ్ముతూ తిరుగుతుండగా అటు వచ్చిన పోలీసులు గమనించి ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే వేడి చేసి దగ్గు వస్తోందని చెప్పాడు. అతని పరిస్థితి గమనించిన పోలీసులు కరోనా పరీక్ష చేయించుకోమని చెప్పగా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు. ఐతే పోలీసులు మాత్రం ఎందుకైనా మంచిది అని ఒక టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించారు. అంతే కాకుండా మూడ్రోజులు కూరగాయలు అమ్మ వద్దని కరోనా టెస్టు రిజల్ట్ వచ్చే వరకూ ఇంట్లోనే ఉండమని పోలీస్ లు చెప్పి పంపించారు. ఐతే ఇంటికి తిరిగి వస్తూ దారిలో కూడా వెజిటబుల్స్ అమ్ముకుంటూ వెళ్ళాడు. అంతే కాకుండా ఆ వ్యాపారి తన వద్ద ఉన్న కూరగాయలు పాడై పోతున్నాయని చెప్పి వాటిని ఎపుడు అమ్మే ఏరియా లో కాకుండా వేరే ఏరియాలో కూరగాయలు అమ్ముతూ చాల కాలనీలు చుట్టేశాడు. ఇంతలో కరోనా టెస్ట్ రిజల్ట్స్ రావడం తో పాలీసులు అతన్ని వెదుక్కుంటూ అతని ఇంటికి చేరే సరికి ఆ వ్యాపారి ఇంటి దగ్గర లేకపోవడం తో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఫోన్ చేసి అతనిని ఇంటికి రప్పించి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి చెప్పారు. ఐతే పోలీసులకు మాత్రం కొత్త టెన్షన్ స్టార్ ఐంది. టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకు ఇల్లు కదలొద్దని చెప్పినా వినిపించుకోకుండా తిరిగేసిన కారణంగా ఎన్ని వందల మందికి కరోనా అంటించేసాడో అని అటు పోలీసులు ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనకేం కాదన్న నిర్లక్ష్యమే మన కొంపముంచుతుంది. మన నిర్లక్ష్యం కారణంగా ఎందరో బలవుతున్నారు. కాబట్టి, మనం జాగ్రత్తగా ఉంటూ.. మనల్ని, మన వాళ్ళని కాపాడుకుందాం.