సొంత పార్టీ నేతల నుంచే ప్రాణహాని.. కలకలం రేపుతోన్న వైసీపీ ఎంపీ లేఖ
వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తనకు ప్రాణాహాని ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఒక ఎంపీ తనకి సొంత పార్టీ నేతల నుంచే ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్ కు లేఖ రాయడం సంచలనంగా మారింది. కాగా, ఈ లేఖపై స్పందించిన స్పీకర్.. దానిని కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలుస్తోంది. అంతేగాక స్పీకర్‌తో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. త్వరలో ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసి ఎంపీ ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.
మరోవైపు, ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన వ్యక్తిగత కార్యదర్శి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎంపీని చంపుతామని బెదిరిస్తూ, కులదూషణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలని కోరుతూ ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని నలుగురు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శ్రీవారి భూముల అమ్మకం, ఇసుక కొరత, ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి ఇలా పలు అంశాలపై మీడియా ముఖంగా జగన్ సర్కార్ ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ఈ అంశాలపై సీఎం జగన్ కలిసి మాట్లాడాలని ప్రయత్నించారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యలను తట్టుకోలేని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారు. కొందరు స్థానిక వైసీపీ నేతలైతే ఆయనను నియోజకవర్గంలో తిరగనివ్వమని, చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదు చేశారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.