మంత్రి బొత్స అమరావతి పర్యటన వెనక అసలు కథేంటి?
posted on Jun 22, 2020 @ 5:47PM
సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి భూములిచ్చిన రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా మూడు రాజధానుల గురించి గవర్నర్ ప్రసంగం లో ప్రస్తావించారు. ఐతే నిన్న మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలింపు పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. కరోనా నుంచి బయటపడిన తర్వాతే దీని పై మాట్లాడతామని స్పష్టం చేశారు.
తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి లోని పలు ప్రాంతాల్లో చేస్తున్న పర్యటనలు ఆ ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను అయన పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనలు అటు రైతులు, ఇటు ప్రతిపక్ష పార్టీలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఈ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు తలొగ్గి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొంత మంది భావన.
ఐతే ఈ పర్యటనల వెనుక మరో కోణం కూడా ఉందని మరి కొందరి వాదన. అదేంటంటే కొద్దీ రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో ప్రజలు వైసిపి ప్రభుత్వానికి బ్రహ్మరధం పడుతున్నారని ఐతే కృష్ణ, గుంటూరు జిల్లాలలో మాత్రం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ వచ్చిందట. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయేవరకు మూడు రాజధానుల ఊసెత్తకుండా గడిపి తర్వాత మెల్లగా రాజధాని ని తరలిస్తారని మరో వాదన. ఈ వాదనకు మద్దతుగా వారు హైలైట్ చేస్తున్న అంశం ఏంటంటే.. సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కొద్ది రోజు౭ల క్రితం కొంత మంది ఆర్కిటెక్ట్ లు మరియు అధికారులతో కలిసి విశాఖలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి రాజధానికి కావాల్సిన భవనాలను గుర్తించే ప్రయత్నం జరిగింది. దీంతో జగన్ ప్రభుత్వం అసలు ఉద్దేశ్యమేమిటో అని అటు ప్రజలు ఇటు విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.