కుంభకోణాన్ని బయటపెట్టిన వ్యక్తి పై వేధింపులకు దిగడం ఏంటి?
posted on Jun 22, 2020 @ 5:57PM
108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డారు.
"ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకూ కాలపరిమితి ఉంటే... 15 నెలల ముందే 2019 సెప్టెంబరు 20న కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో ఎందుకు తెచ్చినట్టు?" అని చంద్రబాబు ప్రశ్నించారు.
"అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగా 10 నెలల ముందుగానే 2020 ఫిబ్రవరి 13న జీవో 116 తో బీవీజీ సంస్థఒప్పందాన్ని ఎందుకు రద్దుచేశారు? ఫైనాన్స్ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్సులను జీవో 117తో నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారు?" అని నిలదీశారు.
"ఒక్కొక్క పాత అంబులెన్సుకు రూ.47 వేలు, కొత్త అంబులెన్సుకు రూ.90 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు పెంచి... వైసీపీ ఎంపీ అల్లుడికి చెందిన సంస్థకు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటి? అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి?" అని చంద్రబాబు విరుచుకు పడ్డారు.
"అంబులెన్స్ స్కామ్ వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం... కుంభకోణాన్ని బయటపెట్టిన తెలుగుదేశం నేత పట్టాభిరామ్ పై వేధింపులకు దిగడం ఏంటి? హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది తెలుగుదేశం." అని చంద్రబాబు పేర్కొన్నారు.