ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్‌

ఏపీలో ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 18 వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉంది. 26న నామినేషన్లను పరిశీలన, 29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. జులై 6న పోలింగ్‌ జరగనుంది. శాసనసభ్యుల కోటాలో ఈ  స్థానం భర్తీ కానుంది. జులై 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

అక్కడ జగన్ బొమ్మ చెల్లకే నన్ను బతిమాలారు.. వైసిపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైసిపిలో కాస్త గట్టిగా వాయిస్ వినిపిస్తున్న వ్యక్తి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పై కోర్టులలో ఇబ్బందులు తప్పవని ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. మొన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదని అయన వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే విషయం పై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద రాజు.. రఘురామకృష్ణం రాజు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు ,. మీరు జగన్ దయతో ఎంపీ అయ్యారని, అలాగే పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ను అయ్యారని విమర్శించారు.  దీని పై స్పందించిన ఎంపీ రఘురాం తాను వైసీపీ ఎంపీగా గెలవడం నిజమని ఐతే పార్టీలోకి తనంతట తానుగా రాలేదని.. తనను కాళ్ళా వేళ్ళా బతిమాలితేనే వచ్చానని అయన అన్నారు. నరసాపురం టీడీపీకి కంచుకోట అని రాష్ట్రమంతా గెలిచినా ఇక్కడ కూడా గెలవాలనే ఉద్దేశ్యంతో తనను రావాలని కోరితే పార్టీలోకి వచ్చానని అన్నారు. అంతకు ముందు కూడా ఒకసారి పార్టీలోకి రావాలని పార్టీ నాయకులూ అడిగితె ఛీ కొట్టానని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పాలకొల్లు లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 19 వేల మెజారిటీతో, ఉండి నుండి కొత్త అభ్యర్థి 12 వేల మెజారిటీతో గెలిచారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. అదే వైసిపి నేతలు తణుకు, నరసాపురం లలో తక్కువ మెజారిటీతో గట్టెక్కారని అన్నారు. నరసాపురం లో అయన బొమ్మ చూపించి నెగ్గే పరిస్థితి లేదని రఘురాం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు ఎంపీ సీటు ఎలా వచ్చిందో అసలు విషయం ఎమ్మెల్యే ప్రసాద రాజుకు కూడా తెలుసునని అలాగే ఆయనతో ఎవరు మాట్లాడించారో తనకు తెలుసునని ఆయన అన్నారు. మిగిలిన వారిలాగా తనకు డబ్బులు కలెక్ట్ చేయడం తెలీదని అయన ఎద్దేవా చేసారు. తనను విమర్శిచినందుకు ప్రసాద రాజుకు త్వరలో మంత్రి పదవి వస్తుందన్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న కరోనా

గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొద్ది రోజుల క్రితం జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐన విషయం తెలిసిందే. ఆ తరువాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా కు అస్వస్థత కారణంగా కరోనా పరీక్షలు చేయగా ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ లకు ముత్తిరెడ్డిని కలవడం ద్వారా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు వెమ్మెల్యేలు హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి తో కలిసిన పార్టీ నేతలు, అధికారులు ఆందోళనలో ఉన్నారు.

తరతమ భేదం లేకుండా అందరిని చుట్టేస్తున్న కరోనా

భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మన దేశం కరోనా కేసుల విషయం లో నాలుగో స్థానానికి చేరుకొంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా రోజు కు రెండు వందలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి వద్ద 12 ఏళ్లుగా గన్ మాన్ గా ఉన్న సురేష్ మొన్న శుక్రవారం మృతి చెందారు. ఐతే ఆయనకు కరోనా పరీక్ష చేయగా చనిపోయిన తరువాత పాజిటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్యే తో పాటు .. సెక్యూరిటీ సిబ్బంది, ఆఫీసు సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా మొత్తం ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. ఐతే ఎమ్మెల్యేకు మాత్రం రెండు సార్లు చేసిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.  తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సూర్యరావుపేట లో నిన్న కొత్తగా 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలో ఇప్పటికే 14 కేసులు ఉండగా మొత్తం కేసులు 40 కి చేరాయి. మరో పక్క గుంటూరు డీఎంహెచ్ ఓ ఆఫీసులో పని చేసే అధికారికి పాజిటివ్ గా నిర్దారణ ఐంది. దీంతో ఆ ఆఫీసులో పని చేసే వారికి పరీక్షలు చేసారు. ఇదే అధికారి గుంటూరు కలెక్టర్ ఆఫీసుకు కూడా వెళ్ళివచ్చినట్లుగా తేలడంతో ఈ రోజు కలెక్టరేట్ లోని ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలు చేస్తారని తెలుస్తోంది.

పాక్ లో భారత్‌కు చెందిన ఇద్దరు అధికారులు మిస్సింగ్

పాకిస్థాన్‌లో ఇండియన్ హై కమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. పాక్ లోని ఇస్లామాబాద్‌లో గల ఇండియన్ హై కమిషన్‌లో పనిచేస్తోన్న ఆ ఇద్దరు అధికారులు.. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఒక్కసారిగా అదృశ్యమైనట్లు ఇండియన్ హై కమిషన్ తెలిపింది. అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ప్రభుత్వానికి ఇండియన్ హై కమిషన్ సమాచారం ఇచ్చింది.  కాగా, ఇటీవల న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్ లో పని చేసే ఇద్దరు అధికారులని గూఢచార్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం వారిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత భారత హై కమిషన్‌కు చెందిన అధికారులు అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది.

కడప స్టీల్ ‌ప్లాంట్ పై సీఎం జగన్ సమీక్ష.. ఈక్విటీ కింద రూ.500 కోట్లు

కడప స్టీల్ ‌ప్లాంట్ ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో జరిపిన చర్చల తాలూకు వివరాలను సీఎంకి అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్స్‌ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను సీఎంకి తెలిపారు. ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై సమావేశంలో‌ చర్చించారు. ప్రతిపాదనలు చేసిన సంస్థలతో చర్చలు జరపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం దిశగా మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

భూమా అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో పొలం దారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో, ఇరు వర్గాలను ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఒక వర్గానికి చెందిన వ్యక్తిని విఖ్యాత్ రెడ్డి స్టేషన్ నుంచి తీసుకెళ్ళాడంటూ ఆయనపై పోలీసులు నమోదు చేశారు.  పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ ను పోలీస్ స్టేషన్ నుంచి విఖ్యాత్ రెడ్డి తీసుకెళ్లారట. దీంతో, పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి, సదరు నిందితుడిని మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విఖ్యాత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 353, 224, 225, 212 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఇలా చేస్తే కేసు నుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా: విజయసాయి

ఈఎస్ఐ స్కాం ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం.. తప్పు చేసి అరెస్ట్ అయింది గాక, మళ్లీ రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడుతోంది. తాజాగా అచ్చెన్న వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు గుప్పించారు. "అచ్చెన్న అరెస్టును బిసిల అణచివేతగా రంగు పులుముతున్న బాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు ‘విజనరీ’." అంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. "కరోనా తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా.. అని చిటికెలేసిన ఉత్త’ర కుమారుడు ముందే వచ్చాడు.. వెళ్లి పోయాడు. ఏదీ, ఏం జరగలేదే? కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్. అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట." అంటూ చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు గుప్పించారు. "అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే. ఆయన ద్వారానే భూముల కొనుగోళ్లు, వ్యాపారాల్లో వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టారని సొంత పార్టీలో చర్చించుకుంటున్నారు. బాబు రాయమంటేనే సిఫారసు లేఖలు రాసానని అంగీకరించి, గుట్లు మట్లన్నీ చెప్పేస్తే కేసునుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా." అంటూ విజయసాయి సంచలన ట్వీట్ చేశారు.

ఏపీలో 5 వేలు దాటిన కరోనా కేసులు... తాజాగా రెండు మరణాలు

ఏపీలో గత 24 గంటల్లో 15,173 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తం 5087 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్నూల్, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 86కి చేరింది. గత 24 గంటల్లో 47 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో, ఇప్పటిదాకా మొత్తం 2,770 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 2,231 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మూన్‌ పై ప్లాట్ కొనుగోలు చేసిన సుశాంత్ కి ఆర్థిక ఇబ్బందులా?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అందరిని కదలించివేస్తోంది. సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సుశాంత్ మృతిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మృతి వెనుక కుట్ర ఉందని, ఎవరో హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరీస్తున్నారేమోనని కొందరు అనుమానపడుతున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు ఇదే కారణమంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సుశాంత్ తన గర్ల్ ఫ్రెండ్ కి అవకాశం ఇవ్వాలంటూ చేజేతులా పలు సినిమాలు వదులుకున్నాడని, తన ప్రవర్తన కారణంగా తన దగ్గర పనిచేసే వాళ్ళని దూరం చేసుకున్నాడని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు తగ్గిపోయి, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో.. ఒంటరిగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నాడని అంటున్నారు. అయితే, సుశాంత ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమనే ప్రచారాన్ని పలువురు ఖండిస్తున్నారు. సుశాంత్ ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు తీసుకుంటాడు. అడ్వర్టైజ్‌మెంట్లకు రూ.కోటి వరకు తీసుకుంటాడు. సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ సహా పలు చోట్లు పెట్టుబడిగా కూడా పెట్టాడు. సుశాంత్ లైఫ్ స్టైల్ కూడా రిచ్ గానే ఉంటుంది. సుశాంత్ దగ్గర చాలా కార్లు, బైకులు ఉన్నాయి. ల్యాండ్ రోవర్, మాసెరటి క్వార్టర్‌పోర్ట్, బీఎండబ్ల్యూ లాంటి కార్లతో పాటు.. మంచి స్పోర్ట్స్ బైక్ లు ఆయన సొంతం. బాలీవుడ్‌కు రాకముందు చాలా టీవీ సిరియల్స్ లలో నటించాడు. టీవీ షోస్ చేశాడు. ఇలా సుశాంత్ సంపదానికి ఎప్పుడూ డోకా లేదు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా‌ బాగానే సంపాదించాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు ఉండవచ్చని అంచనా. అంతే కాదు.. అంతరిక్షం అంటే సుశాంత్ కి ఎంతో ఇష్టం. అందుకేనేమో ఏకంగా.. చంద్రుడిపైనే ప్లాట్‌ కొనుగోలు చేశాడు. ఆలా మూన్‌పై ప్లాట్ కొనుగోలు చేసిన తొలి బాలీవుడ్ యాక్టర్‌గా సుశాంత్ నిలిచారు. సీ ఆఫ్ మాస్కోవీలో ఈయన ప్లాట్ ఉంది. 14ఎల్ఎక్స్00 అనే పవర్‌ఫుల్ టెలీస్కోప్‌తో ప్లాట్‌ను చూసి.. ఇంటర్నేషనల్ లూనర్ ల్యాండ్స్ రిజిస్ట్రీ ద్వారా ఈ ల్యాండ్ సొంతం చేసుకున్నాడు సుశాంత్. అలాంటి వ్యక్తి మృతికి ఆర్థిక ఇబ్బందులు కారణం అవుతాయా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి!

విశాఖ తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబుపై వైసీపీ  కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.  రామకృష్ణాపురంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రామకృష్ణబాబు వెళ్లిన సమయంలో అధికార పార్టీకి చెందినవారు ఎమ్మెల్యేపై చెప్పులు, కొప్పరి చిప్పలు, రాళ్లు విసిరారు. అవి టీడీపీ కార్యకర్తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.  వైసీపీ మద్దతుదారుల తీరుకి నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తమపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు అభివృద్ధి నిరోధకులని ఆరోపించారు. రైడీలను తీసుకువచ్చి రాళ్లతో దాడి చేయించారని రామకృష్ణబాబు మండిపడ్డారు.

సుశాంత్ కి తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ.. పైకి చెప్పలేని ఏదో బాధ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ విష‌యం తెలిసిందే. 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో.. ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మృతి వెనుక కుట్ర ఉందని, ఎవరో హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరీస్తున్నారేమోనని కొందరు అనుమానపడుతున్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ సింగ్ మృతితో ఆయన చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చూస్తే సుశాంత్ కి తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ ఉందని, అలాగే పైకి చెప్పలేని బాధ ఏదో అనుభవించాడని అర్థమవుతుంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుశాంత్..‌ జూన్‌ 3న చివరి సారిగా తన తల్లి గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ కవితాత్మక పోస్ట్‌ పెట్టాడు. 'మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు.. చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బ్రతుకుతున్నా' అంటూ సుశాంత్ పోస్ట్ పెట్టాడు. తన తల్లి ఫోటోను కూడా అతడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 2002లో తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకుంటూ సుశాంత్ ప్రేమతో పెట్టిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం అతడి ఆత్మహత్య నేపథ్యంలో వైరల్‌గా మారింది. సుశాంత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ అందరినీ భావోద్వేగానికి లోను చేస్తోంది.

అమెరికాలో మరో ఘోరం.. మళ్ళీ అట్టుడుకుతోంది

అమెరికా లో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ పై శ్వేత జాతి పోలీసుల దాష్టీకం కారణంగా మృతి చెందగా అల్లర్లు చెలరేగి ప్రధాన నగరాలు అట్టుడికిన విషయం తెలిసిందే. తాజాగా అటువంటి ఘటన అట్లాంటాలో చోటుచేసుకుంది. అట్లాంటాలోని వెండీ రెస్టారెంట్‌ వద్ద కారులో వస్తున్న రేషార్డ్‌ బ్రూక్స్‌ అనే 27 ఏళ్ల వ్యక్తిని ఆపిన పోలీసులు, అతడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా దానికి బ్రూక్స్‌ ప్రతిఘటించాడు. ఈ క్రమంలో బ్రూక్స్ పోలీసుల వద్ద ఉన్న టీజర్ గన్ (మైల్డ్ కరెంట్ షాక్ ఇచ్చే పరికరం) ను లాక్కొని ఒక పోలీసును బెదిరించి పారిపోతున్న సమయంలో మరో పోలీస్ అతని పై వెనుక నుండి కాల్పులు జరపడం తో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు బ్రూక్స్ ను హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తుండగానే మృతి చెందాడు. ఐతే ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో అట్లాంటా మొత్తం అట్టుడికి పోయింది. ఈ ఘటన జరిగిన చోట ఉన్న వెండీస్‌ రెస్టారెంట్‌ను నిరసనకారులు పూర్తిగా తగులబెట్టారు. ప్రధాన రహదారులన్నింటినీ నిర్బంధించి నిరసనలకు దిగారు. ఐతే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ, నగర పోలీసు చీఫ్‌ ఎరికా షీల్డ్స్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం.. కాల్పులు జరిపి ఆ ఘటన మొత్తానికి కారణమైన పోలీసు అధికారిని తొలగిస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటెల్‌లో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. నగరంలో కొంత ప్రాంతాన్ని వారు అక్రమించుకుని దానికి "క్యాపిటల్‌ హిల్‌ అటానమస్‌ జోన్" అని పేరు పెట్టి దానిని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. నగరంలోకి రాకపోకలు జరగకుండా రహదారుల్ని నిర్బంధించారు. సియాటెల్ కు చెందిన పోలీసు శాఖను పూర్తిగా రద్దు చేయాలని, సాయుధ దళాల్ని నిషేధించాలని నిరసనకారులు డిమాండ్‌ చేసారు. ఐతే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెక్రోసాఫ్ట్‌, బోయింగ్‌, వాల్‌మార్ట్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలన్నీ సియాటెల్‌లోనే ఉండటంతో ఈ ఘటన అమెరికాకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సియాటెల్ నగరాన్ని అదుపులోకి తీసుకోవాలని ‌ పదే పదే చెబుతున్నా.. ఆందోళనకారులకు సానుభూతి తెలుపుతున్న మేయర్‌, గవర్నర్‌లు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో ట్రంప్‌ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటె.. బానిసత్వాన్ని ప్రోత్సహించిన జాన్‌ మెక్‌డొనో విగ్రహాన్ని న్యూ ఓర్లాన్స్‌లోని నిరసనకారులు ధ్వంసం సమీపంలోని మిస్సిసిపీ నదిలో కలిపేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సుశాంత్ సింగ్ మృతి వెనుక కుట్ర.. ఆత్మహత్య కాదు, హత్యే!!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ విష‌యం తెలిసిందే. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు, హత్య అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  సుశాంత్ మృతిపై అనుమానాలున్నాయ‌ని, వెంట‌నే  న్యాయ విచారణ జ‌రిపించాల‌ని సుశాంత్ మావయ్య డిమాండ్ చేశారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని, అత‌ని మృతి వెనుక ఏదో కుట్ర ఉండ‌వ‌చ్చ‌ని అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్‌ది ముమ్మాటికి  అయి ఉంటుందని, పోలీసులు నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిపై బంధువులే కాదు, రాజకీయ నాయకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిని హత్య చేశారని జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ ఆరోపించారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని పప్పు యాదవ్ డిమాండ్ చేశారు.

ధోనీ హీరో సుశాంత్ ఆత్మహత్య

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్.. ‘ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య  చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. సుశాంత్ సింగ్ లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. డిప్రెషన్‌తో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా, సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ కూడా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 8న ముంబైలోని మలాద్‌లో ఓ భవంతి 14వ అంతస్తు నుంచి దూకి దిశా బలవన్మరణానికి పాల్పడ్డారు. దిశా ఆత్మహత్య చేసుకున్న వారానికే, సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలన సృష్టిస్తోంది. దిశా ఆత్మహత్య ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు సుశాంత్ ను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దాంతో సుశాంత్ కొంత మానసిక వేదనకు గురయ్యాడని సమాచారం. అయితే, సుశాంత్ చాలా రోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని.. ఆయన మానసిక స్థితి కూడా బాగోలేదని సన్నిహితులు అంటున్నారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టు పోలీసులు, ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణమేంటో స్పష్టంగా తెలియడంలేదు. 1986 జనవరి 21న పట్నాలో జన్మించిన సుశాంత్‌ సింగ్‌.. పలు టీవీ సీరియళ్లలో నటించారు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'ఎంఎస్ ధోని', 'కేదారనాథ్', 'చిచ్చోరె' లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా బోలెడంత భవిష్యత్ ఉన్న సుశాంత్.. ఇలా ఆత్మహత్య చేసుకొని తన ప్రస్థానానికి ముగింపు పలకడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.

త్వరలో ఈటల పదవి గోవిందా.. రేవంత్ రెడ్డి సంచలనం

కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ శనివారం జర్నలిస్టులు హైదరాబాద్‌లో చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మద్దతు పలికారు. జర్నలిస్టులు దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకొని వారికీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కనీసం 50 వేల పరీక్షలు చేయలేదని దీంతో రాష్ట్రం లో కరోనా అదుపు తప్పిందని.. దాన్ని సాకుగా చూపిస్తూ త్వరలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల ను పదవి నుండి తప్పించబోతున్నారని సంచలన ప్రకటన చేసారు. ప్రతి కరోనా రోగికి ప్రభుత్వం మూడున్నర లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతోందని మరి జర్నలిస్ట్ మనోజ్ చికిత్స కోసం ఎంత ఖర్చు చేసారో చెప్పాలని అయన డిమాండ్ చేసారు. జ‌ర్న‌లిస్టులు నిర‌స‌న చేప‌ట్టడం లో ప్ర‌భుత్వ వైఫల్యాన్నిసూచిస్తోందని రేవంత్ అన్నారు. సామాన్యుడికి క‌రోనా వ‌స్తే గాంధీలో చికిత్స అందిస్తున్నార‌ని.. అదే అధికార పార్టీ ఎమ్మెల్యేకు క‌రోనా వ‌స్తే య‌శోధ ఆసుప‌త్రిలో చికిత్స చేయిస్తున్నారు అని రేవంత్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా జ‌ర్న‌లిస్టుల సంక్షేమ నిధికి 2ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయాన్నిఅయన ప్ర‌క‌టించారు.

అచ్చెన్న పరామర్శకు వచ్చిన బాబు.. అనుమతించని అధికారులు

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు అనారోగ్య కారణాలతో గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోగా జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం బాబుకు అనుమతి ఇవ్వలేమని జైళ్ల శాఖ తేల్చిచెప్పింది. ఐతే చంద్రబాబు చేసిన మరో విజ్ఞప్తి పై జిజిహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. మేజిస్ట్రేట్ నుండి అనుమతి తీసుకోవాలని సూపరింటెండెంట్ బాబుకు సూచించారు. ఇదే సందర్బంలో అచ్చెన్న తాజా ఆరోగ్య పరిస్థితి గురించి అయన అడిగి తెలుసుకున్నారు.  అక్కడే ఉన్న విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అభివృద్ధి కోసం అచ్చెన్న కుటుంబం కృషి చేసిందని.. ప్రస్తుత ప్రభుత్వ పాలన నవరత్నాలు.. నవ మోసాలుగా ఉన్నాయని పోరాడుతుంటే అచ్చెన్నాయుడి పై లేని పోని కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారన్నారు. అచ్చెన్నను ఇరికించడం కోసం తప్పుడు రికార్డులను సృష్టించారని.. ప్రతిష్ట కలిగిన అయన కుటుంబంపై వైసిపి నాయకులు బురద జల్లుతున్నారన్నారు. పలువురు టీడీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకుంటున్నారని అయన విమర్శించారు. వాస్తవాలు ప్రజల ముందు పెడతాం.. దోషులు ఎవరో త్వరలో తెలుస్తుంది. వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దేశంలో ఉన్న చట్టాన్ని ఏపీలో అమలు చేయడంలేదని బాబు మండిపడ్డారు.

యనమల, చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

టీడీపీ నేతలను వరుసగా కేసులు, అరెస్ట్ లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కాగా, మరో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడికి రెండో వివాహం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించారని.. కొందరు తనను బెదిరించారని మంజు ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన భర్త పిల్లి రాధాకృష్ణ కు అతని తల్లిదండ్రులైన పిల్లి అనంతక్ష్మి, పిల్లి సత్యనారాయణలు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని దీనికి మాజీ మంత్రులు యనమల‌ రామకృష్ణుడు, నిమ్మకాయల‌ చినరాజప్ప లు ఒత్తాసు పలికారని ఆమె ఆరోపించింది. దీనితో వీరందరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  2011లో పిల్లి రాధాకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు బాధితురాలు చెబుతోంది. అయితే రెండు రోజుల క్రితం మాజీ మంత్రి యనమల‌ రామకృష్ణుడు స్వగ్రామంలో రాధాకృష్ణ రెండో వివాహం జరిపించేందుకు ప్రయత్నించారని, దీనికి పెళ్లి పెద్దలుగా మాజీ మంత్రులు యనమల‌, చినరాజప్పలు హాజరయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ వివాహాన్ని అడ్డుకుని పెళ్లికి హాజరైన మాజీ మంత్రుల‌పై కూడా కేసు నమోదు చేశారు.