కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్
posted on Jun 22, 2020 @ 5:04PM
కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన ఆయన.. తొలుత సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆపై రూ.5 కోట్ల ఆర్థిక సాయం తాలూకు చెక్, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. రూ.4కోట్ల రూపాయల చెక్‌ను సంతోష్ బాబు భార్యకు.. రూ.కోటి చెక్‌ను సంతోష్ బాబు తల్లిదండ్రులకు అందజేశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలానికి సంబంధించిన పత్రాలను, అలాగే సంతోష్ బాబు భార్యను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం అందజేశారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.