ఏపీలో రాజకీయ దుమారం.. ముగ్గురు వీఐపీల రహస్య భేటీ.. సీసీ టీవీ ఫుటేజ్ లీక్
posted on Jun 23, 2020 @ 12:55PM
ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ.. బీజేపీ నేతలతో రహస్య భేటీ అయ్యారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో నిమ్మగడ్డ రహస్యంగా భేటీ అయిన సీసీ టీవీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సుమారు గంటసేపు వీరి రహస్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగా ఈ ముగ్గురు రహస్యంగా సమావేశమవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ భేటీలో ఏం చర్చించారు? నిమ్మగడ్డకు బీజేపీ అండగా నిలుస్తుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పార్క్ హయత్ లాంటి హోటల్‌లో జరిగిన రహస్య భేటీకి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎవరో కావాలనే సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టారన్న వాదనలు విపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ భేటీ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపే అవకాశముంది.