తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భయపెడుతున్న లెక్కలు
posted on Jun 23, 2020 @ 10:00AM
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,189 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 872 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అంటే, 27.34 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ లో సోమవారం ఒక్కరోజే ఏకంగా 713 మందికి కరోనా నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. సోమవారం ఏడుగురు మృతిచెందగా.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 217కి చేరింది.
కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 60,243 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్ రేట్ 14.39 శాతం ఉంది. జాతీయ స్థాయిలో ఇది 6.11 శాతం ఉండగా, తెలంగాణలో రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక గత ఐదారు రోజులుగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కరోనా టెస్టుల పాజిటివ్ రేట్ 20 శాతం పైగా ఉంది. పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి పైగా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం మాములు విషయం కాదు. కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.