ఏపీలో క‌ల‌క‌లం.. వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా!!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా ఏపీలో కూడా ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిందని సమాచారం. ఆయన ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారు. యూఎస్ నుంచి రావడంతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఎమ్మెల్యే.. పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఏపీ లో ఒక ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ రావడం ఇదే తొలిసారి. ఎమ్మెల్యే గన్ మెన్ కి కూడా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు సమాచారం.

వారిని విచారిస్తే అసలు నిజాలు తెలుస్తాయి.. పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి

నకిలీ పత్రాలతో వాహనాలు కొని నడుపుతున్నారని ఆరోపణల పై అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి అయన కుమారుడు అస్మిత్ రెడ్డి ని మొన్నశుక్రవారం కోర్టు ఆదేశాలతో రెండు రోజులకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ సందర్బంగా జరిగిన విచారణలో.. ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో ఆ వివరాలను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు తెలిపినట్లుగా అయన తరఫు లాయర్ రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్ళీ కడప జైలుకు తరలించారు. హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టుగా రవికుమార్ రెడ్డి చెప్పారు. విచారణ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తగిన ఆధారాలతో జేసీ ప్రభాకరరెడ్డి సమాధానమిచ్చారని అయన తెలిపారు.

కుంభకోణాన్ని బయటపెట్టిన వ్యక్తి పై వేధింపులకు దిగడం ఏంటి?

108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డారు.  "ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకూ కాలపరిమితి ఉంటే... 15 నెలల ముందే 2019 సెప్టెంబరు 20న కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో ఎందుకు తెచ్చినట్టు?" అని చంద్రబాబు ప్రశ్నించారు. "అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగా 10 నెలల ముందుగానే 2020 ఫిబ్రవరి 13న జీవో 116 తో బీవీజీ సంస్థఒప్పందాన్ని ఎందుకు రద్దుచేశారు? ఫైనాన్స్‌ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్సులను జీవో 117తో నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారు?" అని నిలదీశారు. "ఒక్కొక్క పాత అంబులెన్సుకు రూ.47 వేలు, కొత్త అంబులెన్సుకు రూ.90 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు పెంచి... వైసీపీ ఎంపీ అల్లుడికి చెందిన సంస్థకు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటి? అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి?" అని చంద్రబాబు విరుచుకు పడ్డారు. "అంబులెన్స్ స్కామ్ వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం... కుంభకోణాన్ని బయటపెట్టిన తెలుగుదేశం నేత పట్టాభిరామ్ పై వేధింపులకు దిగడం ఏంటి? హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది తెలుగుదేశం." అని చంద్రబాబు పేర్కొన్నారు.

మంత్రి బొత్స అమరావతి పర్యటన వెనక అసలు కథేంటి?

సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి భూములిచ్చిన రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా మూడు రాజధానుల గురించి గవర్నర్ ప్రసంగం లో ప్రస్తావించారు. ఐతే నిన్న మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలింపు పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. కరోనా నుంచి బయటపడిన తర్వాతే దీని పై మాట్లాడతామని స్పష్టం చేశారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి లోని పలు ప్రాంతాల్లో చేస్తున్న పర్యటనలు ఆ ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను అయన పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనలు అటు రైతులు, ఇటు ప్రతిపక్ష పార్టీలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఈ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు తలొగ్గి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొంత మంది భావన. ఐతే ఈ పర్యటనల వెనుక మరో కోణం కూడా ఉందని మరి కొందరి వాదన. అదేంటంటే కొద్దీ రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో ప్రజలు వైసిపి ప్రభుత్వానికి బ్రహ్మరధం పడుతున్నారని ఐతే కృష్ణ, గుంటూరు జిల్లాలలో మాత్రం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ వచ్చిందట. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయేవరకు మూడు రాజధానుల ఊసెత్తకుండా గడిపి తర్వాత మెల్లగా రాజధాని ని తరలిస్తారని మరో వాదన. ఈ వాదనకు మద్దతుగా వారు హైలైట్ చేస్తున్న అంశం ఏంటంటే.. సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కొద్ది రోజు౭ల క్రితం కొంత మంది ఆర్కిటెక్ట్ లు మరియు అధికారులతో కలిసి విశాఖలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి రాజధానికి కావాల్సిన భవనాలను గుర్తించే ప్రయత్నం జరిగింది. దీంతో జగన్ ప్రభుత్వం అసలు ఉద్దేశ్యమేమిటో అని అటు ప్రజలు ఇటు విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.

90 రోజుల్లో ఏపీలోని ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు

కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. 104 వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. 104 వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణ చేపట్టాలని.. షుగర్, బీపీ లాంటి వాటికి పరీక్షలు చేసి అక్కడే మందులివ్వాలని సూచించారు. అవసరమైన వారిని పీహెచ్‌సీకి రిఫర్‌ చేయాలని ఆదేశించారు. రాబోయే 90 రోజుల్లో ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలని తెలిపారు. ప్రతి నెలలో ఒకరోజు తప్పనిసరిగా గ్రామానికి 104 వాహనం వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం చేస్తున్న కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 50 శాతం కోవిడ్‌ పరీక్షలు, మిగతా 50 శాతం పరీక్షలు మిగిలిన చోట్ల చేయాలని ఆదేశించారు. కొన్ని పరీక్షలు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకునేవారికి కేటాయించాలన్నారు. ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి కూడా కోవిడ్‌ పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్

కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన ఆయన.. తొలుత సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆపై రూ.5 కోట్ల ఆర్థిక సాయం తాలూకు చెక్, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. రూ.4కోట్ల రూపాయల చెక్‌ను సంతోష్ బాబు భార్యకు.. రూ.కోటి చెక్‌ను సంతోష్ బాబు తల్లిదండ్రులకు అందజేశారు. కల్నల్‌ సంతోష్ బాబు కుటుంబానికి హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలానికి సంబంధించిన పత్రాలను, అలాగే సంతోష్ బాబు‌ భార్యను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం అందజేశారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత!

108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ నేత పట్టాభిరామ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని.. దీనిపై సీఎం, ఆరోగ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మరోవైపు, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్‌ ని అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసిందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్కామ్ చేసినోళ్లని వదిలేసి, దాన్ని బయట పెట్టినోళ్లని అరెస్ట్ చేయాలనుకోవడం ఏంటని మండిపడ్డారు. "స్కామ్ చేసినోళ్ళని వదిలి, బయటపెట్టిన వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత! రివర్స్ టెండరింగ్ లో భారీగా మిగిలిపోయింది అంటూ బిల్డప్ ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం,108లో ప్రజాధనం ఎందుకు వృధా అయ్యిందో చెప్పలేక టిడిపి నాయకుల్ని అరెస్ట్ చెయ్యాలనుకుంటుంది." అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "టిడిపి నాయకులపై అక్రమ కేసులు,అరెస్టులతో వైకాపా నేతల ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ మాఫియాల ఆగడాలు బయటకు రాకుండా చెయ్యాలనే జగన్ రెడ్డి గారి ప్రయత్నం ఫలించదు." అని లోకేష్ పేర్కొన్నారు.

కరోనా ఎఫెక్ట్... టిఫిన్ బండి నడుపుతున్న హెడ్ మాస్టర్

కరోనా వైరస్ అటు ప్రభుత్వాలను ఇటు సామాన్యులను కూడా కుదేలు చేస్తోంది. తల్లి తండ్రులు కూలి పనికి వెళుతుంటే పాఠశాలలకు వెళ్ళవలసిన పిల్లలు తోపుడు బండి వద్ద ఉండి ఫ్రూట్స్ అమ్ముతున్న ఫోటోలు చూస్తున్నాం. ఒక ఆర్ టి సి ఉద్యోగి కుటుంబ పోషణ కోసం హెయిర్ సెలూన్ పని చేయడం కూడా చూసాం. తాజాగా ఒక ప్రయివేట్ పాఠశాల ప్రిన్సిపాల్ తన కుటుంబాన్ని పోషించడానికి టిఫిన్ బండి నడుపుతున్నారు. ఖ‌మ్మంలో ఓ ప్రైవేట్ పాఠశాల లో ప్రిన్సిప‌ల్ గా పని చేస్తున్న వ్యక్తికి వచ్చే శాలరీ తో మొన్నటి వరకు జీవితం హాయిగానే సాగిపోయింది. ఐతే కరోనా దెబ్బకు ప్రయివేట్ స్కూల్స్ క్లోజ్ అవ్వడం తో కొంత మంది పాఠశాల యాజమాన్యాలు మ‌ళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే వ‌ర‌కు టీచర్లకు సిబ్బందికి జీతాలిచ్చే ప‌రిస్థితి లేద‌ని చేతులెత్తేశాయి. దీంతో కుటుంబ పోష‌ణ‌ కోసం రెండు వేల రూపాయలతో ఓ తోపుడు బండి కొని భార్య‌తో క‌లిసి దాని పై ఇడ్లీలు, దోసెలు అమ్ముతూ దాని పై వచ్చే రెండు మూడు వందల సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. మరో చోట ప్రయివేట్ కాలేజ్ లెక్చరర్ కుటుంబ పోషణ కోసం రోజు కూలీ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి నెలకొంది. దేశంలో చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి ఇంచుమించుగా ఇలాగే ఉంది.

వైసీపీ కార్యకర్తల శ్యాడ్ సాంగ్.. రేనా చూడు రేనా చూడు, లైవ్ పెట్టలేని దుస్థితి చూడు...

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే.. సీఎం వైఎస్ జగన్, విజయసాయిలపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పిస్తున్నారు. "కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి. ఏమిటీ పరాభవం." అంటూ రాజ్యసభ ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు వేశారు. "నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక ఎమ్మెల్యేని, బాబు గారి దూత కలిసి పార్టీని వదిలి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాడట. తక్షణం 5 కోట్లు అరేంజ్ చేసారట. ఇంకో పదేళ్లు పవర్ లేకపోయినా దేనికీ ‘లోటు’ లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానా దోచినోడికి ఇదో లెక్కా." అంటూ మరో ట్వీట్ తో చంద్రబాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు. కాగా, విజయసాయి విమర్శలకు బుద్ధా వెంకన్న కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. "రేనా చూడు రేనా చూడు, లైవ్ పెట్టలేని దుస్థితి చూడు, దమ్ములేని మాట చూడు, తొంటి చేతి వాచీ చూడరా.. అని వైకాపా కార్యకర్తలు ఏడుస్తూ పాడుతున్నారు. మీ చెవిన పడలేదా విజయసాయి గారు." అంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. "ప‌బ్జీ ఆట‌కు పోతురాజు.. ప‌నిచేయ‌డానికి తిమ్మరాజు అని సొంత ఎంపీ అంటున్నారు వైఎస్ జగన్ ని. మీరేమో ట్వీట్లతో జాకీలేసి లేపి ఎక్క‌డికో తీసుకెళ్లాల‌నుకుంటారు. ఆయ‌న తాడేప‌ల్లి గ‌డ‌ప‌దాటి రారు." అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. కరోనాను కట్టడి చెయ్యడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైందంటూ బీజేపీ ఆందోళనలకు దిగింది. హైదరాబాద్ కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించింది. ఈ క్రమంలో బండి సంజయ్‌‌ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అంతేకాదు... ఆయన వెంట వచ్చిన బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంధర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారు విఫలమైందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ని టెస్టులు చేశారు. ఇక్కడ ఎన్ని చేశారో చెప్పాలని ప్రశ్నించారు. డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నా వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారని.. సీఎం‌, మంత్రులు జోకర్ల లాగా మారారని విమర్శించారు.  హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా ను ఆరోగ్య శ్రీ కింద చేర్చాలని డిమాండ్ చేసారు. మోడీ సర్కారు రాష్ట్రానికి చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించారాంటూ అయ్యన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ కేసుతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ కక్షతో తనపై అక్రమంగా కేసు బనాయించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయ్యన్న దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణకు రావాల్సిన కోబాస్‌ యంత్రాన్ని కోల్‌కతాకు తరలించిన కేంద్రం!!

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని, కరోనా పరీక్షలు చాలా తక్కువగా చేస్తోందని జేపీ నడ్డా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహించడానికి ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా కారణమైందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కరోనా పరీక్షలు సరిగా చేయడం లేదన్న విమర్శలకు చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ఆర్‌) కింద 'కోబాస్‌ 8800' అనే యంత్రాన్ని బుక్‌ చేసింది. అమెరికాకు చెందిన రోచే కంపెనీ ఈ యంత్రాన్ని తయారు చేసింది. మంత్రి కేటీఆర్‌ రాంకీ సంస్థతో మాట్లాడి సీఎస్ఆర్‌‌ కింద ఈ యంత్రాన్ని తెప్పించాలని కోరారు. దాంతో ఆ సంస్థ ‘కోబాస్‌ 8800’ను బుక్‌ చేసింది. దాని విలువ సుమారు రూ.7 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. ఈ యంత్రంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా 5వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని సమాచారం.  కాగా, రాష్ట్ర ప్రభుత్వం అమెరికా నుంచి తెప్పించిన కోబాస్‌ 8800 యంత్రంపై కేంద్రం కన్ను పడిందట. కోబాస్‌ 8800‌ యంత్రం 4 రోజుల క్రితమే చెన్నైకి చేరింది. దీని కోసం హైదరాబాద్ నిమ్స్‌లో భారీ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే.. కేంద్ర ప్రభుత్వం మరొకటి తలిచింది. చెన్నై చేరిన కోబాస్‌ 8800 యంత్రాన్ని కేంద్రం కోల్‌కతాకు తరలించిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ధ్రువీకరించారు. రాష్ట్రం కోసం తీసుకొచ్చిన యంత్రాన్ని కోల్ కతాకు తీసుకెళ్లే విషయంలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందని.. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించినట్లుగా ఈటెల వ్యాఖ్యానించారు. తెలంగాణతో పోలిస్తే.. పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వారికి ఆ యంత్రం తో అవసరం ఎక్కువగా ఉంటుందన్న మాట కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావటంతో.. హైదరాబాద్ కు రావాల్సిన యంత్రం.. కోల్ కతాకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా తెలంగాణ కోసం సీఎస్ఆర్‌ కింద కోబాస్‌ 8800 యంత్రాన్నే బుక్‌ చేశారు. ఆ రెండు యంత్రాలతోపాటు రాష్ట్రంలో సీసీఎంబీ, ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో కలిపి రోజుకి సుమారు 15 వేల టెస్టులు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్రం మాత్రం ఒక రాష్ట్రానికి రెండు యంత్రాలు ఎందుకంటూ ఒక యంత్రాన్ని కేసులు ఎక్కువగా బెంగాల్ కి తరలించిందని సమాచారం. కాగా, ఈ విషయాలన్ని బీజేపీ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన క్రమంలో బయటకు రావటం గమనార్హం. ఓ వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు వచ్చే యంత్రాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్తే, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని చర్చలు మొదలయ్యాయి.

108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో అవినీతి.. మరో టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధం!!

ఏపీలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు కాగా, కొందరు టీడీపీ నేతలు అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా, మరో టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. టీడీపీ నేత పట్టాభిరామ్‌ ఇంటి వద్ద కొందరు పోలీసుల పహారా కాస్తున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశముందని సమాచారం. 108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియా సాక్షిగా చూపించారు. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై సీఎం, ఆరోగ్యమంత్రి సమాధాం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్‌ ని అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులని కార్యకర్తలని అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల కుంభకోణం 300 కోట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. బాద్యులయిన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏంచర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు." అని దేవినేని ట్వీట్ చేశారు.

సొంత పార్టీ నేతల నుంచే ప్రాణహాని.. క‌ల‌క‌లం రేపుతోన్న వైసీపీ ఎంపీ లేఖ

వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తనకు ప్రాణాహాని ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఒక ఎంపీ తనకి సొంత పార్టీ నేతల నుంచే ప్రాణహాని ఉందని  లోక్‌సభ స్పీకర్ కు లేఖ రాయడం సంచలనంగా మారింది. కాగా, ఈ లేఖపై స్పందించిన స్పీకర్‌.. దానిని కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలుస్తోంది. అంతేగాక స్పీకర్‌తో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. త్వరలో ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా కలిసి ఎంపీ ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు, ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన వ్యక్తిగత కార్యదర్శి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎంపీని చంపుతామని బెదిరిస్తూ, కులదూషణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలని కోరుతూ ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని నలుగురు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శ్రీవారి భూముల అమ్మకం, ఇసుక కొరత, ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి ఇలా పలు అంశాలపై మీడియా ముఖంగా జగన్ సర్కార్ ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ఈ అంశాలపై సీఎం జగన్ కలిసి మాట్లాడాలని ప్రయత్నించారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యలను తట్టుకోలేని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారు. కొందరు స్థానిక వైసీపీ నేతలైతే ఆయనను నియోజకవర్గంలో తిరగనివ్వమని, చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదు చేశారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

స్టేట్ హోంలో కలకలం.. 57 మంది బాలికలకు కరోనా.. ఐదుగురు గర్భవతులు!

ఉత్తర ప్రదేశ్‌లో కాన్పూరులోని ఓ ప్రభుత్వ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం, వారిలో ఐదుగురు గర్భంతో ఉన్నట్టు తెలియడం ప్రకంపనలు సృష్టిస్తోంది. యూపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు షెల్టర్‌ హోంలో ఉంటున్న బాలికలకు కరోనా‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో ఐదుగురు బాలికలు గర్భంతో ఉన్నట్టు తెలియడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి కాన్పూర్‌ ఎస్‌ఎస్‌పీ దినేష్‌ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. షెల్టర్ హోంలో ఉన్న బాలికలు గర్భవతులు కావడం, వారిలో ఒకరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌, మరొకరికి హెపటైటిస్‌ సీ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.  ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు పూనం కపూర్‌.. హోంలో చేరిన తర్వాత ఎవరూ గర్భం దాల్చలేదని.. వారందరూ లైంగిక దాడి బాధితులని పేర్కొన్నారు. కాన్పూర్‌ జిల్లా కలెక్టర్‌ బ్రహ్మదేవ్‌ రామ్‌ తివారి ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ఆశ్రమంలోని సిబ్బంది ఇటీవల ఇద్దరు బాలికలతో కలిసి కాన్పూర్ హాస్పిటల్‌కు వెళ్లారని, అక్కడ కరోనా రోగులతో కాంటాక్ట్ అయిన తర్వాత వీరికి వైరస్ సోకిందని తెలిపారు. వివిధ శిశు సంక్షేమ కమిటీల నుంచి ఇక్కడి హోంకు ఐదుగురు బాలికలు వచ్చారు. వారంతా లైంగిక దాడి బాధితులు. ఇక్కడికి రావడానికి ముందే వారు గర్భవతులుగా ఉన్నారని కలెక్టర్‌ వివరణ ఇచ్చారు.

తెలంగాణను హడలెత్తిస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే ఏకంగా 730 కేసులు

తెలంగాణలో రోజురోజూకీ కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. పబ్లిక్ హాలిడే ఐన ఆదివారం రోజున ఏకంగా రిక్డార్డు స్థాయిలో 730 కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో నే 659 కేసులు నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో 71 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7802కు చేరింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి తెలంగాణ లో 210 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్క రోజు ఏడుగురు మరణించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 3731 మంది కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 3861 మంది కరోనా వైరస్ చికిత్స తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం లో 57,054 మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా, 49,252 మంది కి వైరస్ నెగిటివ్‌గా తేలింది. ఒక పక్క నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తో అయన ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరో పక్క హోమ్ మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. అక్కడ పని చేసే భద్రతా సిబ్బంది ఒకరికి పాజిటివ్ అని తేలడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. హోమ్ మంత్రి క్వార్టర్స్ వద్ద విధులలో ఉన్న ఒక హోమ్ గార్డ్ కు కూడా కరోనా నిర్ధారణ ఐన నేపథ్యంలో మంత్రి మహమూద్ అలీ ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు.

రాజధాని రైతుల పిటిషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

చంద్రబాబు హయాంలో అప్పటి ఏపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి వేలాది మంది రైతులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం రాజధానికి భూమి ఇచ్చిన వారికి ప్రభుత్వం ఏటా కౌలు ఇస్తూ వస్తోంది. ఐతే గత ఏడాది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మూడు భాగాలు చేసి కర్నూల్, వైజాగ్, అమరావతిలలో వరుసగా జ్యుడిషయల్ కేపిటల్, అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్, లెజిస్లేటివ్ కేపిటల్ గా మార్పు చేస్తున్నట్లుగా  ప్రకటించారు. దీంతో తాజాగా అమరావతి ప్రాంత రైతులకు ఇవ్వవలసిన కౌలు ఇంతవరకు చెల్లించక పోవడం తో ఆ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్డీఏను ఆదేశించాలని వారు పిటిషన్ దాఖలు చేసారు. దీంతో వార్షిక కౌలు విషయంలో ఏపీ హైకోర్టు సీఆర్డీఏ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం కౌలుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జూన్ 23వ తేదీలోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఆర్డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

కూతురు, అల్లుడిపై ఏపీ మంత్రి గన్‌మెన్ దాడి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ మంత్రి తానేటి వనిత గన్‌మెన్‌ చంద్రారావు రెచ్చిపోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడిపై దాడి చేశాడు. ఐదు నెలల క్రితం పోలీసుల సమక్షంలో చంద్రారావు కూతురు ప్రేమపెళ్లి చేసుకుంది. అప్పటినుండి కూతురిపై కోపం పెంచుకున్నాడు. కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని చంద్రారావు.. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అన్న కనికరం కూడా లేకుంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై కూతురు, అల్లుడిని తరుముతూ దాడి చేశాడు. కూతురు వేడుకుంటున్నా చంద్రారావు వదిలిపెట్టలేదు.  ఈ ఘటన పై ఎస్పీ నారాయణ నాయక్ స్పందించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీసులు చంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై  ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది.