కరోనా ఎఫెక్ట్... టిఫిన్ బండి నడుపుతున్న హెడ్ మాస్టర్
posted on Jun 22, 2020 @ 3:29PM
కరోనా వైరస్ అటు ప్రభుత్వాలను ఇటు సామాన్యులను కూడా కుదేలు చేస్తోంది. తల్లి తండ్రులు కూలి పనికి వెళుతుంటే పాఠశాలలకు వెళ్ళవలసిన పిల్లలు తోపుడు బండి వద్ద ఉండి ఫ్రూట్స్ అమ్ముతున్న ఫోటోలు చూస్తున్నాం. ఒక ఆర్ టి సి ఉద్యోగి కుటుంబ పోషణ కోసం హెయిర్ సెలూన్ పని చేయడం కూడా చూసాం. తాజాగా ఒక ప్రయివేట్ పాఠశాల ప్రిన్సిపాల్ తన కుటుంబాన్ని పోషించడానికి టిఫిన్ బండి నడుపుతున్నారు.
ఖమ్మంలో ఓ ప్రైవేట్ పాఠశాల లో ప్రిన్సిపల్ గా పని చేస్తున్న వ్యక్తికి వచ్చే శాలరీ తో మొన్నటి వరకు జీవితం హాయిగానే సాగిపోయింది. ఐతే కరోనా దెబ్బకు ప్రయివేట్ స్కూల్స్ క్లోజ్ అవ్వడం తో కొంత మంది పాఠశాల యాజమాన్యాలు మళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే వరకు టీచర్లకు సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితి లేదని చేతులెత్తేశాయి. దీంతో కుటుంబ పోషణ కోసం రెండు వేల రూపాయలతో ఓ తోపుడు బండి కొని భార్యతో కలిసి దాని పై ఇడ్లీలు, దోసెలు అమ్ముతూ దాని పై వచ్చే రెండు మూడు వందల సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. మరో చోట ప్రయివేట్ కాలేజ్ లెక్చరర్ కుటుంబ పోషణ కోసం రోజు కూలీ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి నెలకొంది. దేశంలో చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి ఇంచుమించుగా ఇలాగే ఉంది.