90 రోజుల్లో ఏపీలోని ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు
posted on Jun 22, 2020 @ 5:08PM
కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. 104 వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. 104 వాహనాల్లో కోవిడ్ శాంపిల్ సేకరణ చేపట్టాలని.. షుగర్, బీపీ లాంటి వాటికి పరీక్షలు చేసి అక్కడే మందులివ్వాలని సూచించారు. అవసరమైన వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేయాలని ఆదేశించారు. రాబోయే 90 రోజుల్లో ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో కోవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్ ఉండాలని తెలిపారు. ప్రతి నెలలో ఒకరోజు తప్పనిసరిగా గ్రామానికి 104 వాహనం వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం చేస్తున్న కోవిడ్ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలన్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో 50 శాతం కోవిడ్ పరీక్షలు, మిగతా 50 శాతం పరీక్షలు మిగిలిన చోట్ల చేయాలని ఆదేశించారు. కొన్ని పరీక్షలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకునేవారికి కేటాయించాలన్నారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేవారికి కూడా కోవిడ్ పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.