టీఆర్ఎస్ లో అసమ్మతి భగ్గుమనడం ఖాయమా?
posted on Aug 24, 2020 @ 3:28PM
అధికార టీఆర్ఎస్ లో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీలో కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కొక్కటిగా భగ్గుమంటున్నాయి. అసమ్మతి నేతలు క్రమంగా తమ వాయిస్ పెంచుతున్నారు. బీటీ బ్యాచ్ నాయకుల తీరుపై గుర్రుగా ఉన్న యూటీ వర్గం నేతలు.. బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ లో తాను చెప్పిందే వేదమన్న భావనలో ఉన్న సీఎం కేసీఆర్ కు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గానే పరోక్షంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న, శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ చేస్తున్న ప్రకటనలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. కొన్ని కులాలే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయంటూ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ను ఉద్దేశించేనని పార్టీలో చర్చ జరుగుతుంది. కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని స్వామి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కులాలపై సంచలన కామెంట్లు చేసిన స్వామిగౌడ్.. మరింత దూకుడు పెంచి.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని బహిరంగంగా ప్రశంసించడం టీఆర్ఎస్ అగ్రనేతలకు మింగుడు పడటం లేదు. మండలి చైర్మన్ పదవీ కాలం ముగిసాక ప్రత్యక్ష రాజకీయాలకు స్వామి గౌడ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తనకు జరుగుతున్న అవమానాలను భరించలేకే స్వామిగౌడ్ ఓపెన్ అయ్యారని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొరపొచ్చాల కారణంగానే స్వామి గౌడ్ ఇలా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
కొన్ని రోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ కూడా తన కామెంట్లతో కారు పార్టీలో కలకలం రేపారు. కేసీఆర్ క్యాబినెట్ నుంచి తనను తప్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. తాము గులాబీ జెండా ఓనర్లమనీ, అడుక్కునే వాళ్లం కాదని తేల్చి చెప్పారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని.. బతికొచ్చినోన్ని కాదని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందన్నారు. రాజేందర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ లో తీవ్ర దుమారం రేగింది. ఈటెల పార్టీ మారుతారని, ఆయనతో చాలా మంది నేతలు వెళతారని ప్రచారం జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన కేసీఆర్... ముఖ్య నేతలతో చర్చించి వివాదానికి తెర దించారు. ఈటలను బుజ్జగించారు. అయినా రాజేందర్ పార్టీలో సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మొదటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే రాజేందర్.. ఇటీవల అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. తన శాఖాపరమైన కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. నియోజకవర్గ సమస్యలపైనే ఫోకస్ చేస్తున్నారు. దీంతో సమయం చూసి ఈటల మరోసారి బాంబు పేల్చడం ఖాయమనే చర్చ జరుగుతోంది.
పార్టీ ఆవిర్బావం నుంచి కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న మంత్రి హరీష్ రావు కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. రెండో టర్మ్ లో మొదట హరీష్ ను కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆయనను సిద్దిపేట నియోజకవర్గం వరకే పరిమితం చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే పోర్టు ఫోలియోలో ప్రమోషన్ ఇచ్చినట్లుగా ఆర్థికశాఖను అప్పగించారు. దీంతో ప్రజల్లో తిరిగే హరీష్ రావు జనాల్లోకి వెళ్లకుండా పోయారు. హరీష ఎక్కువగా జనాల్లోకి వెళ్లకుండా ఉండాలనే కుట్రతోనే ఆయనకు ఆర్థికశాఖను అప్పగించారనే ప్రచారం జరిగింది. హరీష్ కూడా ఆర్థికమంత్రిగా ఉన్నప్పటికి ఒక్క జిల్లాలో మాత్రమే తిరుగుతున్నారు. కరోనా కల్లోలంలోనూ ఆయన ఇతర జిల్లాలకు వెళ్లలేదు. కేసీఆర్ ఆదేశాలనే హరీష్ సిద్దిపేటకే పరిమితమయ్యారని తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హరీష్ వర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా సమయం చూసుకుని తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు గులాబీ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణ ఉద్యమంలో పని చేసిన చాలా మంద నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీటీ బ్యాచ్ హవా సాగుతుండటంతో వారంతా ఏమి చేయలేకపోతున్నారు. కేటీఆర్ కోటరి వల్లే సమస్య లంటున్న అసమ్మతి నేతలు.. త్వరలోనే తమ తడాఖా చూపిస్తామని చెబుతున్నారు. దీంతో త్వరలోనే టీఆర్ఎస్ లో అసమ్మతి భగ్గుమనడం ఖాయమని తెలుస్తోంది.