రేవంత్ రెడ్డి కొత్త పార్టీ.. తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు రానుందా?
వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. వివిధ రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకుంటూ దూసుకుపోతుంటే.. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో రోజురోజుకి ప్రభ కోల్పోతుంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఆ పార్టీని బాగా దెబ్బ తీస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతని దూరం చేసుకొని.. రాష్ట్రంలో అధికారంతో పాటు, కొంత బలాన్ని కూడా కోల్పోయింది. ఇక, రాజస్థాన్ లో కూడా కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనని తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ నానా తంటాలు పడాల్సి వచ్చింది.
నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీని ఢీ కొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ కీలక పాత్ర పోషించారు. అయితే యువనాయకులైన వీరిని కాదని రెండు రాష్ట్రాల్లోనూ సీనియర్లకు సీఎంలుగా అవకాశమిచ్చింది హైకమాండ్. ఈ నిర్ణయంపై సింధియా, సచిన్ వర్గాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. సీనియర్లతో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. అయితే సీనియర్లు మాత్రం వీరి మార్క్ కనిపించకుండా చేయడం, వీరి వర్గాలను ఎదగనివ్వకుండా చేయడంతో.. యువ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో సింధియాని కోల్పోయిన కాంగ్రెస్ సచిన్ ని మాత్రం కాపాడుకోగలిగింది.
అయితే, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ తీరు మారట్లేదు. ఇప్పుడు ఈ సీనియర్ల, జూనియర్ల పోరు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే పార్టీలో కొనసాగాలని, లేదంటే ప్రాంతీయ పార్టీని స్థాపించి ముందుకు సాగాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డిని తెలంగాణలోని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వి. హనుమంతరావు, జగ్గారెడ్డి వంటివాళ్లు బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాలో పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ఓకే కానీ, రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే అంగీకరించబోమని పలువురు సీనియర్లు చెబుతున్నారు.
ఒక రకంగా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అంత అనుకూల వాతావరణం లేదు. తనతో పాటు పార్టీలో చేరినవారికి కూడా తగిన ప్రాధాన్యం లేదనే ఆసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు సాగాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఆయన కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి నేతలు తగిన సహకారం అందించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ సర్వే పూర్తిగా క్షేత్ర స్థాయికి వెళ్లి చేయలేదు.15 మందితో ఆ సర్వే చేయించారని సమాచారం. రేవంత్ రెడ్డి ఆలోచనకు దక్షిణ తెలంగాణ నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉత్తర తెలంగాణ నుంచి అంతగా మద్దతు లభించడం లేదని సర్వేలో తేలినట్లు సమాచారం. గతంలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి అనుకూల వాతావరణం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అనుకూల వాతావరణం ఉందని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో విస్తృత స్థాయి సర్వేకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 150 మందితో సర్వే చేయించాలని, ఒక్కొక్కరికి పది మంది చొప్పున కేటాయించాలని 15 మందితో కూడిన బృందం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి నుంచి ఆమోదం లభించాల్సి ఉందని సమాచారం.
అసలే, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని కాంగ్రెస్ బలంగా ఎదుర్కోలేకపోతోంది. దానికితోడు బీజేపీ తెలంగాణలో బలపడటానికి పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో సీనియర్లు, జూనియర్ల విభేదాలు ముదిరి రేవంత్ కాంగ్రెస్ ని వీడితే ఆ పార్టీకి మరింత దెబ్బనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సింధియా, సచిన్ ల వ్యవహారాలలోలాగా లేట్ గా రియాక్ట్ అవుతుందో లేక వాళ్ళలాగా రేవంత్ తిరుగుబాటు జెండా ఎగరవేయకముందే మేలుకుంటుందో చూడాలి.