త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి శత మొట్టికాయ ఉత్సవం!!
posted on Aug 27, 2020 @ 5:45PM
అమరావతి రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరుగుతుందని నర్సాపురం వైసీపీ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళ్లుండి మనసులేని ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను కళ్లు లేని మనసున్న న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. న్యాయం పూర్తిగా అమరాతి రైతుల పక్షాన నిలుస్తుందన్నారు. న్యాయం జరుగుతుందన్న మనోధైర్యంతో మహిళలు, రైతులు ముందుకువెళుతున్నారని అన్నారు. గాంధేయమార్గంలో న్యాయంకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
అన్యాయంపై అమరావతి రైతులు పాక్షికంగా విజయం సాధించారన్నారు. స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి పూనుకోవడం దుస్సాహసమేనని వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యాయవాదులు తమవైపు వాదించడానికే కాదు.. వాదించకుండా ఉండటానికీ జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయాలు వెచ్చిస్తోందని రఘురామరాజు ఆరోపించారు. ప్రజాధనం వృథా చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.
పనికిరాని వారిని అందరినీ తెచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. న్యాయపరమైన విషయాల్లో సీఎం జగన్‌కు సలహాలు ఇచ్చేవారు లేరనుకుంటానని, సీఎం అనవసరంగా పడి ఉన్న సలహాలదారులును తప్పించి.. మంచి వారిని న్యాయ సలహాదారులగా పెట్టుకోవాలని రఘురామరాజు సూచించారు.
త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి శత మొట్టికాయ ఉత్సవం జరుగుతుందని ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోర్టుల్లో 70కి పైగా మొట్టికాయలు పడినప్పుడు తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శత మొట్టికాయ ఉత్సవం ఎంతో దూరంలో లేదనిపిస్తుందని పేర్కొన్నారు. నీలం సంజీవరెడ్డి, ఎన్ జనార్థన్‌రెడ్డి హయాంలో కోర్టులు చిన్న కామెంట్ చేశాయని రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఈ భూమ్మీద ఎక్కడా లేని చిత్రవిచిత్ర బ్రాండ్లన్నీ ఏపీలోనే అమ్ముతున్నారని మండిపడ్డారు. గోల్డ్ మెడల్ లు, ప్రెసిడెంట్ మెడల్స్, నోబెల్ ప్రైజ్ వంటివి అమ్ముతున్నారని, ప్రజలు ఈ మెడల్స్ స్వీకరించవద్దు అని ఆయన కోరారు. ఎస్పీ వై రెడ్డి ఫ్యాక్టరీ లీజుకి తీసుకుని ఇలాంటి బ్రాండ్లను తయారు చేస్తున్నారన్నారని ఆరోపణలు చేశారు. ఇలాంటి బ్రాండ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని రఘురామరాజు వ్యాఖ్యానించారు.