మానవతావాది సర్ డోరాబ్జీ టాటా
posted on Aug 27, 2020 @ 4:08PM
సర్ డోరాబ్జీ టాటా
( 27 ఆగస్టు 1859 - 3 జూన్ 1932)
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల విస్తరణలో కీలక వ్యక్తి సర్ డోరాబ్జీ టాటా. భారతీయ పరిశ్రమ పితామహుడుగా పేరుగాంచిన తన తండ్రి ఆశయాల మేరకు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలను అభివృద్ధి చేశారు. పారిశ్రామిక రంగంలో చేసిన కృషికి గాను బ్రిటిష్ ప్రభుత్వం 1910లో సర్ బిరుదు ఇచ్చింది.
డోరాబ్జీ టాటా 27 ఆగస్టు 1859 న ముంబయిలో జన్మించాడు. తల్లిదండ్రులు హీరాబాయి, జమ్సెట్టీ టాటా. పెద్దకుమారుడైన డోరాబ్జీ తన ప్రాథమిక విద్యను ముంబయిలో పూర్తి చేసి 1875లో ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిధిలోని గోన్విల్లే, కైస్ కాలేజీ లో చేరాడు. ఆ తర్వాత ఇండియా తిరిగివచ్చి ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిగ్రీ పట్టా అందు కున్నాడు.
జర్నలిస్టుగా..
రచనరంగంపై ఆసక్తి, సమాకాలీన అంశాలపై అనురక్తితో జర్నలిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. బొంబాయి గెజిట్ లో రెండు సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1884లో తన తండ్రి సూచనల మేరకు వ్యాపారరంగంలోకి వచ్చారు. మొదట కాటన్ పరిశ్రమ విభాగంలో చేరాడు. దేశంలో కాటన్ పరిశ్రమల ఏర్పాటు ఎక్కడ లాభసాటిగా ఉంటుందో తెలుసుకోవడానికి పాండిచ్చేరి, ఫ్రెంచ్ కాలనీ, నాగ్ పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు.
టాటా, భాభా కుటుంబాల మధ్య బంధుత్వం
వ్యాపార విస్తరణలో భాగంగా అనేక నగరాలను సందర్శించిన డోరాబ్జీ మైసూర్ పట్టణానికి వెళ్లారు. ఆ రాష్ట్ర మొదటి ఇండియన్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హోర్మస్టీ భాభాను కలిశారు. ఆ తర్వాత ఆయన ఏకైక కుమార్తె మెహర్ బాయితో డోరాబ్జీ పెండ్లి జరగడంతో టాటా, భాభా కుటుంబాల మధ్య వారధి ఏర్పడింది. ప్రముఖ శాస్త్రవేత్త హోమి జె. భాభా మెహర్ బాయి మేనల్లుడు. భాభా పరిశోధనా సంస్థలకు టాటా గ్రూప్ నిధులను కేటాయించడానికి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వమే కారణం.
తండ్రి ఆశలకు అనుగుణంగా..
భారతదేశంలో "స్వదేశీ ఉద్యమానికి జమ్సెట్టీ టాటా ఎంతో కృషి చేశారు. దేశీయ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించేలా తన కాటన్ మిల్లుకు “స్వదేశీ మిల్” అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇనుము, ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ఎంతగానో శ్రమించారు. అయితే ఆయన కృషి ఫలించలేదు. తండ్రి ఆశయం గురించి తెలిసిన డోరాబ్జీ ఇనుము పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. 1903లో శపూర్ జీ షక్లత్ వాలాతో కలిసి ఇనుము పరిశ్రమ ఏర్పాటుకోసం సరైన ప్రదేశం కోసం వెతికారు. ఒకవైపు ఇనుము పరిశ్రమ కోసం కృషి చేస్తున్న సమయంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించారు. ఇది డోరాబ్జీని బాగా కృంగ దీసింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా పరిశ్రమ స్థాపన కోసం పెట్టుబడులను సేకరించడానికి అనేక సంస్థలను పెట్టుబడుల కోసం సంప్రదించారు. 1906లో లండన్ సంస్థలను కూడా పెట్టుబడులు పెట్టాలని కోరారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వదేశీ పెట్టుబడులతోనే పరిశ్రమను స్థాపించే ప్రయత్నం చేశారు. ఆయన సంకల్పం ఫలించి మూడువారాల్లోనే పరిశ్రమ స్థాపనకు కావల్సిన పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం జార్ఘండ్ లో జంషేడ్ పూర్ లో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ ను సింబల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియాగా మార్చే ప్రయత్నం చేశారు. 1911లో ఇక్కడి నుంచి ఇనుము ఉత్తత్పి ప్రారంభం అయ్యింది.
ఈ తర్వాత మరోసారి 1924లో పరిశ్రమ ను కొనసాగించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. డోరాబ్జీ తన ఆస్తులన్నీ పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టి పరిశ్రమను నిలబెట్టారు. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వేతనాలు కట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనాడు ఈ పరిశ్రమలో వేలాది మంది పనిచేస్తున్నారు. స్వదేశీ ఇనుము తయారు చేయాలన్న తండ్రి ఆశయాలను డోరాబ్జీ నిజం చేశారు.
ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా..
డోరాబ్జీ టాటాకు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. టాటా గ్రూప్ సంస్థల నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేవారు. అంతేకాదు భారతీయ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1924లో ఎన్నికైయ్యారు. పారిస్ లో జరిగిన ఒలంపిక్స్ వెళ్లేందుకు భారత బృందానికి ఆర్థిక సహాయం అందించారు.
మెహర్ బాయి మెమోరియల్ గా..
డోరాబ్జీకి భార్య అంటే చాలా ప్రేమ. 1931లో మెహర్ లుకేమియా బారిన బడి మరణించారు. వారికి పిల్లలు లేరు. భార్యపై ఉన్న ప్రేమతో లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించారు. పరిశోధనలు, ప్రకృతి వైపరీత్యాల కోసం ఈ ట్రస్ట్ ఫండ్ ఇస్తుంది. భారతదేశంలోని అనేక విద్యాసంస్థలకు ఈ ట్రస్ట్ నుంచి నిధులు కేటాయిస్తారు.
మానవాతావాదిగా, పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన డోరాబ్జీ 3 జూన్ 1932లో జర్మనీలోని బాడ్ కిస్సింగెన్‌లో మరణించాడు.