పదిశాతం పోలీసుల్లో కరోనా
posted on Aug 27, 2020 @ 12:48PM
కరోనా పై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యసిబ్బందిని, పోలీసులను కరోనా కలవరపెడుతోంది. లాక్ డౌన్ సమయంలో సమర్థవంతంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ లో ఇప్పుడు కరోనా భయబ్రాంతాలకు గురిచేస్తుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర పోలీసు ల్లో దాదాపు పదిశాతం మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. పోలీస్ శాఖలో ఇప్పటివరకు మొత్తం 5,684 మందికి కోరోనా వచ్చింది. వారిలో 2,384మంది కోలుకున్నారు. 3,357మందిలో చాలామంది హోంఐసోలేషన్ లో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 44మంది పోలీసులు కరోనాతో చనిపోయారని పోలీస్ శాఖ చెప్తోంది. వీరిలో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు వివిధ స్థాయిలో పనిచేసే పోలీసులు ఉన్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ లో దాదాపు 1,967మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,053మంది కోలుకోగా 891 చికిత్స తీసుకుంటున్నారు. 23మంది మరణించారు. ఇక జిల్లాల విషయానికి వస్తే వరంగల్ లో 526మంది పోలీసులు కరోనా పాజిటివ్ గా నమోదు అయ్యారు. వారిలో 163మంది కోలుకున్నారు. 361మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పోలీసులు చనిపోయారు. కరోనా పాజిటివ్ గా నమోదు అయిన పోలీసులకు 17రోజుల సెలవుతో పాటు ఐదువేల రూపాయల ఆర్థిక సాయం పోలీసు శాఖ అందిస్తోంది. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలోను కలుపుకుని మొత్తం 54 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు.
కరోనా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న వారిలో వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు ఉన్నారు. మరి వీరిలో ఎంతశాతం మంది కరోనా కోరల్లో చిక్కారో లెక్కలు తీస్తే ఎక్కువ సంఖ్యే బయటకు వస్తుందేమో ..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి ప్రత్యేక సహాయం అందించాలని కోరుతున్నారు.