తెలంగాణ హైకోర్టులో జడ్జీలను నియమించాలి
posted on Aug 27, 2020 @ 11:46AM
కేంద్ర మంత్రిని కోరిన రాష్ట్ర బిజేపి
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను తెలంగాణ రాష్ట్ర బిజేపీ కోరింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉందని, కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని కిషన్ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచి, వెంటనే న్యాయమూర్తులను నియమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతాయని ఆయన వివరించారు. న్యాయమూర్తులు సరైన సంఖ్యలో లేకపోవడంతో కేసులు వాయిదా పడుతూ న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారు అనేక సమస్యలు ఎదుర్కోంటున్నారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు 46 నుంచి 48 మంది జడ్జీలు పనిచేయడానికి అనువుగా ఉన్నాయని గుర్తుచేశారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ సేవలు వేగంగా అందడానికి వీలుగా న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరారు.