ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి
దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 2019 సంవత్సరంలో 18వేలకు పైగా ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. ఇక, 13వేలకు పైగా ఆత్మహత్యలతో తమిళనాడు రెండోస్థానంలో నిలిచింది. 12 వేలకు పైగా ఆత్మహత్యలతో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో నిలవగా.. నాలుగైదు స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక నిలిచాయి. తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. ఆంధ్రప్రదేశ్ లో 6,465 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇక, దేశవ్యాప్తంగా 10,281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్ర 3,927 ఆత్మహత్యలతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (1,992), ఆంధ్రప్రదేశ్ (1,029), మధ్యప్రదేశ్ (541), తెలంగాణ (499) లు ఉన్నాయి.
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటంపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు.
"రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారు వైఎస్ జగన్. వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ది అన్నారు. ఆఖరికి విత్తనాలు,ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అసమర్థ వైకాపా ప్రభుత్వం." అని లోకేష్ విమర్శించారు.
"ఇచ్చిన ప్రతీ హామీలో మోసం. ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారు. 15 నెలల్లో జగన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి." అని లోకేష్ వ్యాఖ్యానించారు.