కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయంలో కడిగిపారేసిన సుప్రీం కోర్టు..
posted on Aug 27, 2020 @ 10:02AM
దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు తీసుకున్నరుణాలపై ఆరునెలల మారటోరియం వ్యవధిలో వడ్డీ వసూలు చేసే విషయం పై కేంద్రం తీరును తప్పుబడుతూ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో... మార్చి నెల నుంచి ఆగస్టు వరకు రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ ఆరు నెలల మారటోరియం వసతి కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మారటోరియం సమయంలో కూడా రుణాలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మారటోరియం విషయంలో బ్యాంకులు తమ రుణ చెల్లింపుదారులకు కూడా క్లారిటీ ఇచ్చాయి. తాజాగా మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.
లోన్ మారటోరియానికి సంబంధించి ప్రజల బాధలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో లోన్ మారటోరియాన్ని కేవలం వ్యాపార కోణంలో మాత్రమే ఆలోచించవద్దని, ప్రజల బాధను కూడా పట్టించుకోవాలని సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్(డీఎంఏ) కింద లోన్ మారటోరియం అంశంపై కేంద్రానికి అధికారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో రుణాలు చేసిన వారికీ ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటు లోన్ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేయవచ్చా లేదా అనే అంశంపై కేంద్రం నిర్ణీత సమయంలో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆ సందర్భంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం సమస్య కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల వచ్చిందని కోర్టు పేర్కొంది. మారటోరియం వ్యవధిలో రుణాలపై బ్యాంకులు వడ్డీని మాఫీ చేస్తాయని రుణ చెల్లింపుదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ విషయంలో మరి కొద్దీ రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వనుండటంతో రుణ చెల్లింపుదారుల్లో ఆసక్తి నెలకొంది.