సింహాచలం అప్పన్న భూముల పై పెద్దల కన్ను.. లీజుకు ఈరోజే నాంది..!
posted on Aug 27, 2020 @ 11:46AM
జగన్ ప్రభుత్వం ఎపి కి కొత్త రాజధానిగా విశాఖను ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. అక్కడ ఆత్యంత ఖరీదైన సింహాచలం అప్పన్న భూముల పై కొంత మంది పెద్దలు కన్నేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సింహాచలం అప్పన్న స్వామి ఆస్తులు లీజుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఈరోజు జరిగే ఆలయ పాలక మండలి భేటీలో నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధమయింది.
సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి సంబంధించిన అత్యంత ఖరీదైన భూములలో కళ్యాణ మండపాలు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. తాజాగా పదహారు ఎకరాలకు పైగా ఉన్న ఆస్తులను 11 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు పాలకమండలి సిద్ధమైంది. అయితే ఇవన్నీ వాణిజ్య పరంగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న స్థలాలు కావడంతో ఈరోజు జరిగే దేవస్థానం పాలకమండలి సమావేశ అజెండాలో ఈ అంశాన్ని చేర్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భూములను లీజుకు ఇచ్చేందుకు వారు చూపుతున్న కారణం.. కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని.. ఆలయ నిర్వహణ చాల ఇబ్బందికరంగా మారిందని దీంతో తప్పక లీజు ద్వారా భూములు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సింహాచలం అప్పన్న దేవస్థానానికి విజయనగరం పూసపాటి రాజ వంశీకులు ఇచ్చిన వేల ఎకరాల భూములు ఉన్నాయి. ప్రస్తుతం వాటి విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఈ ఆలయానికి ట్రస్టీలుగా పూసపాటి వంశీయులైన ఆనందగజపతి రాజు, అయన మరణానంతరం అశోక్ గజపతి రాజు వ్యవహరించారు. ఐతే కొద్దికాలం క్రితం ఈ ఆలాయాన్ని నిర్వహించే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు ఆనందగజపతి రాజు నుండి విడిపోయిన మొదటి భార్య కుమార్తె అయిన సంచయితకు అప్పగించడం పై వివాదం నెలకొంది. అప్పన్న ఆస్తుల పై కన్నేసిన కొంత మంది పెద్దలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాయని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే అప్పన్న దేవస్థానం పాలకమండలి సమావేశం చాల కీలకంగా మారింది.