మహిళా సమానత్వం ఎక్కడా..!?
మహిళా శక్తి దేశప్రగతిలో భాగమైనప్పుడే ఆ దేశం అన్ని రంగాల్లో రాణిస్తుందని గుర్తించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచి వారి స్వశక్తిపై విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని ప్రపంచదేశాలన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇవి చాలావరకు వేదికలపై ప్రసంగాలకే పరిమితం అయ్యాయి.
మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగంలో 1920 పంతొమ్మిదవ సవరణ చేసినందుకు గుర్తుగా ఆగస్టు 26 ను అమెరికాలో మహిళా సమానత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 26 ఆగస్టు 1973 నుంచి ప్రపంచవ్యాప్తంగా మహిళా సమానత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వయం నిర్ణయాత్మక శక్తిగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలని అనేక అంశాలతో ప్రభుత్వాలు కార్యక్రమాలు చేప్పట్టాయి. వ్యక్తిగతంగా, సామూహికంగా నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకుంటూ మహిళలు శక్తిగా ఎదగాలని మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు చేశారు. ఇటీవల మహిళలకు ఆస్తిహక్కు కల్పిస్తూ హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 కూడా అమలు లోకి వచ్చింది.
ప్రపంచంలో అన్నిరంగాల్లో స్వశక్తితో దూసుకుపోతున్న మహిళలకు 19వ శతాబ్దం ఆరంభంలో ఓటు హక్కు కూడా లేదు. సుధీర్ఘ పోరాటంతో పౌరులుగా గుర్తింపు పొందుతూ ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు ఓటు హక్కు పొందిన మొదటి దేశం న్యూజిలాండ్(1893) కాగా ఆ తరు వాత వరుసగా 1902లో ఆస్ట్రేలియా, 1906లో ఫిలాండ్, 1915లో డెన్మార్క్, అతిపెద్ద సోషలిస్ట్ దేశమైన రష్యా 1917లో , 1919లో జర్మనీ, అగ్రరాజ్యంగా భాసిల్లుతున్న అమెరికా 1920లో, రాచరికవ్యవస్థకు ప్రతి కగా ఉన్న ఇంగ్లాండులో 1928 సంవత్సరంలో, 1935లో ఇండియా, 1944లో ఫ్రాన్స్, 1954లో ఇటలీ దేశాల్లో మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు.
మహిళల సమానహక్కు కోసం 19 శతాబ్దంలో ప్రారంభమైన పోరాటం 21న శతాబ్దంలోనూ జరుగుతునే ఉంది. విదేశాల్లో మహిళల ఉద్యమాల ప్రభావంతోనే భారతీయ మహిళ ఉద్య - మిస్తుంది అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్లో ఓటుహక్కు రాక ముందే, ప్రపంచదేశాలు సమాన హక్కుకోసం పోరాటం చేయక , పూర్వమే భారత మహిళలు అనేక రంగాల్లో ముందున్నారు. వేదాలు చదివారు, పురాణాల్లో తమ ఉనికిని చాటుకున్నారు. తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నాలు ఎన్నో చేశారు. వేదాలకు, సనాతన సంప్రదాయలకు పుట్టినట్లు అయిన భారతదేశంలో పురాణాల్లో, ఇతిహాసాల్లో, రాచరిక వ్యవస్థలో ఎందరో వీరవనితల ప్రస్తావన ఉంది. చరిత్రలో ఝాన్సీ, మగువ మంచాల, త్రిలోచన పల్లవి, రుద్ర మదేవి, స్వాతంత్ర్య పోరాటంలో దుర్గాబాయ్, సరోజినీ నాయుడు ఈ కోవలోని ధీరవనితలే. అందుకే భారతీయ మహిళ తరత రాల బాధల నుంచి విముక్తి కోసమే పోరాటాలు చేస్తున్నది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కృషి ఫలింతంగా భారత రాజ్యంగంలో అన్ని రకాల వివక్షలను రద్దుచేసి మహిళలకు సమానత్వాన్ని ఇచ్చారు. సమాన త్వం( నిబంధన14), వివక్షలేకుండా (నిబంధన 15(1), సమానావకాశాలు కల్పించడం(నిబంధన 16), సమానపనికి సమాన వేతనం (నిబంధన 39డి) తదితర హామీలను కల్పించారు. 1950లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించబడింది. అయినప్పటికీ పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో మూడోవంతు మహిళా రిజర్వేషన్లు ఇచ్చారు. అయినప్పటికీ దేశాన్ని స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఈ నాటి వరకు మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదన్న వాస్తవం అందరూ అంగీకరించాల్సిందే.
జనాభాలో సగం ఉన్న మహిళలకు కనీసం 33శాతం అయినా రిజర్వేషన్లు ఇవ్వాలని దశాబ్దాలుగా మహిళా సంఘాలు చేస్తున్న ఉద్యమాల ఫలితంగా 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లు రూపొందింది. మహిళల అధికారాన్ని సహించలేని మహానేతలు చాలామంది ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటునే ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ప్రతిసారి ఇదిగో.. అదిగో అంటూ మహిళల బిల్లును ఊరకాయ పచ్చడిలా ఊరిస్తూ మహిళల ఓటుబ్యాంకుతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు.
మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లుకు 2014లోనే రాజ్యసభ ఆమోదం తెలిపినా, లోక్‌సభ ఆమోదం పొందలేదు. దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో మన నేతలు ఇంకా మీనమేషాలు లెక్కస్తున్నారు. మహిళా రిజిర్వేషన్ బిల్లు ఆమోదించే ఆనవాళ్లు కనిపించడం లేదు. కార్మిక శక్తిగా, ఓటు బ్యాంకు గానే మహిళలను చూస్తున్నారు. దేశానికి స్వ తంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు.
ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో నేటికి వివక్షకు గురవుతున్న మహిళ సమాన హక్కులతో పాటు జీవించే హక్కు కోసం పోరాటం సాగిస్తున్నది.
పురుషాధిక్యత, నిరక్ష్యరాస్యత, లైంగిక దాడులు, వేధింపులు నేడు మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఈ సమస్యల సాధన కోసం ప్రతి మహిళ ఉద్యమిం చాల్సి ఉంది. మహిళల జీవితాలను బలి తీసుకుంటున్న దురాగాతాలను ఎదిరించేందుకు మరో ఉద్యమం రావాలి. లింగవివక్ష లేకుండా అందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు రావాలి. అప్పుడే మహిళ సమానత్వం అన్నది సాధ్యమవుతుంది.