శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి.. ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారి తీసిన శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(CEA)తో  విచారణకు అదేశించాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పవర్ ప్లాంట్ దుర్ఘటనలో క్రిమినల్ కోణం ఉందని వాస్తవాలు అన్నీ బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ప్రధానికి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదం వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుతు సరఫరా చేసే ఈ ప్లాంట్ లో ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి, ప్లాంట్ ప్రమాదంపై వాస్తవాలు సీబీఐ విచారణ తోనే నిజాలు బయటకు వస్తాయని రేవంత్ తన లేఖలో పేర్కోన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల కారణంగా జెన్కో ట్రాన్స్కో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయని, టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని ఆయన కోరారు.   శ్రీశైలం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ గతంలోనూ రేవంత్ ప్రధానికి లేఖ రాశారు. ప్రమాద సంకేతాలపై సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా వారు స్పందించ లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సిబ్బంది ప్రాణాలు, వేల కోట్ల రూపాయల ప్రజా సంపద కాలి బూడిద అయ్యిందన్నారు. ఈ మొత్తం అంశంపై నిజానిజాలు బయటకు రావాలంటే.. దీనిపై నిస్పాక్షింగా విచారణ జరగాలన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని.. బాధిత కుటుంబాలకు రూ. కోటి సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గతంలోనూ ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.    అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిఐడీ విచారణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సిబ్బంది స్పందిస్తున్నారు. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో బ్యాటరీలు మార్చాలని రెండేళ్లుగా కోరుతున్నా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఇంజనీర్లు సిఐడీ టీమ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అవసరమైతే సీఎం జగన్‌ ను కలుస్తా: బాలకృష్ణ

హిందూపురం అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈరోజు హిందూపురం ప్రభుత్వాసుపత్రిని బాలకృష్ణ సందర్శించారు. ఇటీవల బాలకృష్ణ హిందూపురం ఆసుపత్రికి రూ.55 లక్షల విలువ చేసే కొవిడ్ వైద్యపరికరాలు, మందులను ప్రకటించారు. ఈరోజు ఆయన స్వయంగా వాటిని ఆసుపత్రికి అందజేశారు.   ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం విషయంలో ఎంత దూరమైన వెళతానని, దానిని జిల్లాగా ప్రకటించాలని, అవసరమైతే సీఎం జగన్‌ ను కూడా కలిసి కోరుతానని తెలిపారు.   మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే కూడా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం ఎక్కువగా ఉండేదని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలసి పని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా అందరూ కలసి పని చేయాల్సి ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఒక్క రూపాయి జరిమానా కడతారా?.. జైలుకు వెళ్తారా?

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కు అత్యున్నత న్యాయస్థానం ఒక్క రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్‌ 15 లోగా కోర్టులో రూపాయి డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. డిపాజిట్‌ చేయకపోతే మూడు నెలల జైలు శిక్షతోపాటు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్ పై నిషేధం ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది.    న్యాయ వ్యవస్థను, సుప్రీంకోర్టు పని తీరును విమర్శిస్తూ జూన్ 27, 29 తేదీల్లో ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద ట్వీట్లు చేశారు. దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులు ఇందుకు బాధ్యులని ట్వీట్‌ లో పేర్కొన్నారు.   మరో ట్వీట్‌లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తీరుని తప్పబట్టారు. ఎలాంటి మాస్క్, హెల్మెట్‌ ధరించకుండా నాగ్‌పూర్‌ లోని రాజ్‌భవన్‌లో ఓ బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల విలువైన బైక్‌ ని నడిపారని.. హెల్మెట్‌ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.  ఈ ట్వీట్లను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. ఈ ట్వీట్లు కించపరిచే విధంగా, కోర్టు ధిక్కార స్వభావంతో ఉన్నట్లు ఆగస్టు 14న ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది. అయితే, సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పేందుకు గడువు ఇచ్చినప్పటికీ ప్రశాంత్ భూషణ్ అందుకు అంగీకరించలేదు. అవి తాను నిజాయితీతో వ్యక్తం చేసిన అభిప్రాయాలని, అందువల్ల తాను క్షమాపణ చెప్పబోనని ప్రశాంత్ భూషణ్ తేల్చి చెప్పారు.   ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు వాదనల సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ పనితీరు పట్ల ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకున్నారని తెలిపారు. వాక్ స్వాతంత్ర్యాన్ని కాదనలేం కానీ ఇతరుల హక్కులను కూడా గౌరవించాలన్నారు.   కాగా, ప్రశాంత్‌ భూషణ్‌ ఇప్పుడు ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తారా? లేక మూడు నెలల జైలు శిక్షతో పాటు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్ కి దూరంగా ఉండటానికి సిద్దమవుతారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 

139 మంది అత్యాచారం కేసులో ట్విస్ట్.. డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే వారిపై కేసులు

తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ 139 మందిలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉండటంతో.. ఈ విషయం పెను సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది. డాలర్‌ బాయ్‌ అనే వ్యక్తి ఒత్తిడి వల్లనే తాను ప్రముఖులపై కేసులు పెట్టానని బాధిత యువతి చెప్పింది.   నిజానికి ఈ కేసు వెలుగులోకి రాగానే ఈ కేసుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధిత యువతిని కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, ఈ కేసులో పలువురి ప్రముఖుల పేర్లు వినిపించడంతో.. వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసుకి తమకి సంబంధం లేదని, కావాలనే మా పేర్లు ఇరికించారని ప్రముఖులు చెప్పుకొచ్చారు. అంతేకాదు, డబ్బులు డిమాండ్ చేస్తూ మాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పోలీసులు తమకి న్యాయం చేయాలని కోరారు. దీంతో ఈ కేసు మలుపు తిరిగి, డాలర్‌ బాయ్‌ అనే పేరు తెరమీదకి వచ్చింది. ఈ డాలర్‌ బాయ్‌ అనే వ్యక్తి యువతిని ట్రాప్ చేసి, ప్రముఖుల నుండి డబ్బులు గుంజడం కోసం ఇదంతా చేపిస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి. బాధిత యువతి ఆ డాలర్‌ బాయ్‌ బండారం బయట పెట్టింది.   బాధితురాలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. "డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే కొందరి పేర్లు పెట్టాల్సి వచ్చింది. నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు. చిత్ర హింసలకు గురి చేశాడు. నాలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడు. నాపై లైంగికదాడి జరిగింది వాస్తవమే. కానీ సెలబ్రిటీలు లేరు. నేను బయట 50 శాతం వేధింపులకు గురైతే, 50 శాతం డాలర్ బాయ్ వేధించాడు. అనవసరంగా నా వల్ల ఇబ్బంది పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నా." అని చెప్పుకొచ్చింది.   కాగా, డాలర్‌ బాయ్‌ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అతని వల్ల బాధితురాలికి జరిగిన అన్యాయం తప్పుదోవ పట్టడంతో పాటు, పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు మానసిక వేదనికి గురయ్యారు. అంతేకాదు, మరో ఇద్దరు యువతులను కూడా అతను ట్రాప్ చేశాడని తెలుస్తోంది. ఇలాంటి వారి మూలంగా భవిష్యత్ లో ఎవరైనా తమకి అన్యాయం జరిగిందని చెప్పాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని, కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి.

కరోనాపై గెలిచిన టీడీపీ నేత అచ్చెన్న.. త్వరలోనే డిశ్చార్జ్  

మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెనాయుడు కరోనా కోరల బారినుండి బయటపడ్డారు. తాజాగా ఆయనకు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా తేలింది. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడగా ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. తాజాగా వచ్చిన ఈ రిపోర్ట్ తో ఇటు టీడీపీ శ్రేణులు అటు ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఈరోజు.. రేపట్లోగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడికి శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళవద్దని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 70 రోజుల పాటు అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

గాలిపటంతో పాటు గాలిలోకి చిన్నారి

తైవావ్ పతంగుల పండుగలో ఊహించని సంఘటన జరిగింది. ఆ సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మూడేళ్ల చిన్నారి గాలిపటంతో సహా ఆకాశంలోకి ఎగిరి కొన్ని క్షణాల పాటు చెక్కర్లు కొట్టి కిందికి రావడం ఆశ్యర్యాన్ని కలిగించింది.   ప్రతి ఏటా జపాన్ లోని సముద్రతీర పట్టణమైన నాన్లియోవోలో పతంగుల పండుగ జరుగుంది. వివిధ ఆకారాల్లో, సైజుల్లో ఇక్కడ గాలిపటాలను ఎగురువేస్తారు. చిన్నాపెద్దా అంతా సంతోషంగా గాలిపటాలు ఎగురువేస్తున్న సమయంలో మూడేళ్ల చిన్నారి గాలిపటంతో సహా గాలిలోకి ఎగిరింది. అమాంతం గాలిలోకి కొన్ని మీటర్ల ఎత్తువరకు ఎగిరిన ఆ చిన్నారి గాలిపటంతో సహా కొద్ది క్షణల పాటు గాలిలోనే చెక్కర్లు కొట్టింది. అంతా నివ్వెరపోయి చూస్తుండగానే గాలిపటాన్ని గట్టిగా పట్టుకుని ఆ చిన్నారి వేసిన కేకలతో అందరూ అప్రమత్తం అయ్యారు. నారింజ రంగు గాలిపటం చివరన వేలాడుతూ గాలిలో మెలికలు తిరిగిన ఆ దృశ్యాన్ని వీడియోలో రికార్డు అయ్యింది. అక్కడ ఉన్నవారికి అందనంత ఎత్తుకు ఎగిరిన గాలి పటం గాలివాటానికి తిరిగి నేలపైకి రావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.    గాలి పటం తోక చిన్నారికి చుట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ పాపాయికి ఎలాంటి గాయలు తగలలేదని, అయితే చాలా భయపడిందని నిర్వాకులు వెల్లడించారు. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాలిపటాలు ఎరుగవేసే సమయంలో వాటికి దూరంగా ఉండాలని ఈ సంఘటన తర్వాత కైట్ ఫెస్టివల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు.

అమిత్ షా ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత అనారోగ్యంతో మళ్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.   ఆగస్టు 2న అమిత్ షా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరి 12రోజుల చికిత్స తర్వాత ఆగస్టు 14న డిశ్చార్జి అయ్యారు. అయితే నాలుగురోజుల తర్వాత తిరిగి అనారోగ్యం బారిన పడటంతో ఆగస్టు 18న ఎయిమ్స్(ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ )లో చేరారు. అత్యంత నిపుణులైన వైద్యబృందం ఆధ్వర్యంలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు.  కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి అనారోగ్యంబారిన పడటంతో ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్ అవినీతి పై కేంద్రం కన్ను.. త్వరలోనే జైలుకి: సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ సర్కార్ హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రంజాన్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులను తగ్గించి చూపించిన సర్కార్.. హిందువుల పండగైన గణేశ్ ఉత్సవాల సందర్భంగా కేసులు పెరిగాయని చెప్పడం హిందూ సమాజం పై చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు. గడచిన మూడు రోజులుగా వినాయక నిమజ్జనాలను కూడా అడ్డుకుంటున్నారని అయన విమర్శించారు. కేసీఆర్ సర్కార్ రంజాన్ సందర్భంగా కేసులను తగ్గించి చూపే ప్రయత్నం చేసి... ఇప్పుడు గణేశ్ నవరాత్రుల సందర్భంగా కేసులను పెంచి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడిందని.. అందులో భాగంగా ప్రాజెక్టుల అంచనాలను పెంచుతూ, కమీషన్లు తీసుకుంటూ కేసీఆర్ కుటుంబం, అక్రమాలకు తెగబడుతూ బడా కంపెనీలకు దాసోహమైందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ పాల్పడుతున్న అవినీతిపై కేంద్రం ఒక కన్ను వేసిందని, వారి ఆర్ధిక లావాదేవీలన్నిటిని ఎప్పటికప్పుడు గమనిస్తోందని.. త్వరలోనే కేసీఆర్ జైలుకెళ్ళటం కూడా ఖాయమని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు.    అంతేకాకుండా కరోనా మహమ్మారి కట్టడిలో కేసీఆర్ పభ్రుత్వం పూర్తిగా విఫలమై చేతులెత్తేసిందని, దీంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే విషయాన్నీ గవర్నర్‌ ప్రస్తావించగా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆమెను విమర్శించే స్థాయికి టీఆర్‌ఎస్‌ నాయకత్వం దిగజారిందని సంజయ్ విమర్శించారు. కరోనా విషయమై ఇప్పటికే పలు సందర్భాల్లో గవర్నర్‌ లేఖలు రాసినప్పటికీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను తెలంగాణ సర్కార్ విస్మరించడం వల్ల అనేక రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయన అన్నారు. నిరుద్యోగ భృతిని తెలంగాణ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడంలేదని, కేంద్రం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ల్లో కేసీఆర్‌ మాట్లాడేది ఒకటైతే.. తర్వాత కేంద్రం మెచ్చుకుందని చెప్పుకుంటూ రాష్ట్ర మంత్రులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. ఎందుకిలా చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

సౌత్ చైనా సముద్రంలో భారత్ యుద్ధనౌక

నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించే తత్వం డ్రాగన్ కంట్రీ సొంతం. దశాబ్దాలుగా ఇదే తీరును అవలంభిస్తూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది. గత కొద్దినెలలుగా భారత్ చైనా సరిహద్దుల్లో దాగుడుమూతలు ఆడుతూ యుద్ధానికి సిద్ధం అన్న సంకేతాలను పంపుతోంది. అయితే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఈసారి చైనా ఆటలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. శాంతిని కాంక్షిస్తూ యుద్ధవాతావరణాన్ని చల్లపరిచేందుకు చైనా అధికారులతో భారత్ జరుపుతున్న ద్వైపాక్షిక చర్చలు సరైన ఫలితాలను ఇవ్వడంలేదు. చర్చలు ఫలవంతం కాకుంటే పరిస్థితులు మరోవిధంగా ఉంటాయని ఇప్పటికే భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.    చైనాతో యుద్ధం అంటూ వస్తే ఈ సారి గట్టి గుణపాఠమే చెప్పాలన్న లక్ష్యంతో భారత్ సైన్యం ఉంది. ఇందులోభాగంగానే భారతవైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన రాఫెల్ లాంటి యుద్ధవిమానాలను చేర్చుతోంది. మరోవైపు నౌకాదళాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్లుతోంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించాలన్న చైనా ప్రయత్నాలను పసికట్టి డ్రాగన్ కంట్రీ ఎత్తులకు భారత్ పై ఎత్తు వేసింది. దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకను పంపింది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని మలక్కా జలసంధి సమీపంలో ఈ యుద్ధనౌక మోహరించింది. భారత్ కు మద్దతుగా దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కూడా తన యుద్ధనౌకలను మోహరించింది. కొద్దిరోజుల కిందటే ఇక్కడ అమెరికా, భారత్ కలిసి నావికా దళ విన్యాసాలను నిర్వహించాయి.    అయితే దక్షిణ చైనా సముద్రంలో ద్వీపాలను కృత్రిమంగా ఏర్పాటుచేసిన చైనా లిబరేషన్ ఆర్మీ భారత్,  అమెరికా యుద్ధనౌకలు రావడాన్ని వ్యతిరేకిస్తోంది.

కరోనా రోగుల్లో అకస్మిక మరణాలను నివారిస్తున్న మందు

కోవిద్ 19 వైరస్ ను అరికట్టడమే ప్రస్తుతం ప్రపంచమానవాళి ముందున్న అతి పెద్దసవాల్ గా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న వ్యాప్తిని నివారించడంతో పాటు కోవిద్ సోకినవారిలో అకస్మిక మరణాలను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు వైద్య పరిశోధకులు. ఈ నేపథ్యంలో కరోనా సోకినవారిలో రక్తం గడ్డకడ్డడం, రక్తనాళాల్లో వచ్చే వాపు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించారు. దీన్ని నివారించేందుకు సాధారణ వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టినప్పుడు రక్తనాళాల్లో రక్తప్రసారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తాన్ని పలుచగా చేసేందుకు ఇచ్చే ఔషధాన్ని కోవిద్ రోగులకు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయి అని వైద్యలు అంటున్నారు. రక్తాన్ని పలుచన చేసే ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్(లో మాలిక్యూలర్ వెయిట్ హెపారిన్) మందును కరోనా రోగులకు ఇస్తున్నారు. ఇది అకస్మిక మరణాలను నివారిస్తోందని గుర్తించారు. చర్మం కిందిపొరలకు ఇచ్చే ఇంజెక్షన్ ద్వారా ఈ మందుకు రోగి శరీరంలోకి పంపిస్తారు. ఇప్పటివరకు కోవిద్ వైరస్ సోకిన వారిలో దాదాపు 90శాతం అసక్మిక మరణాలను ఈ మందు నివారించిందని వైద్యలు వెల్లడించారు.   ఊపిరితిత్తులపై ప్రభావం చూసే కోవిద్ వైరస్ రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలకు కూడా కారణం అవుతోంది. దాంతో కరోనా రోగుల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని నివారించడానికి కరోనా రోగులకు చికిత్సలో భాగంగా ప్రొఫైలాక్టిక్ థెరపీలో దేశవ్యాప్తంగా ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్ మందును ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధం ఉపయోగించడం వల్ల  రికవరీ రేటు ఎక్కువగా ఉంటుందని వైద్యలు అంటున్నారు. కరోనా వచ్చిందని  భయపడకుండా చికిత్స చేయించుకుంటే చాలావరకు నయం అవుతుంది.

దీపావళి నాటికి అదుపులోకి కరోనా.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చల్లని కబురు

కరోనా తో భారత్ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో గడచిన 24 గంటలలో 78,761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ విషయం పై మాట్లాడుతూ కరోనా వైరస్ మనకెన్నో కొత్త విషయాలు నేర్పిందని అన్నారు. ఈ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న జీవన‌శైలిలో వివిధ‌ మార్పులు చేసుకుంటూ, తగిన జాగ్ర‌త్త‌ల‌తో ప్రజలు మెలగాలని అన్నారు.    అనంత్‌కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషన్ ఫస్ట్’ వెబినార్ ‌లో మంత్రి మాట్లాడుతూ రాబోయే దీపావళి నాటికి వైర‌స్ వ్యాప్తిని కొంత‌వ‌ర‌కూ అదుపులోకి తీసుకురాగ‌లుగుతామ‌ని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ కూడా రెడీ అవుతుందన్నారు. డాక్ట‌ర్ దేవీ ప్ర‌సాద్ శెట్టి, డాక్ట‌ర్ సీ ఎన్ మంజునాథ్ త‌దిత‌ర నిపుణులు తెలిపిన విధంగా కొంతకాలం త‌రువాత కరోనా కూడా మిగిలిన వైర‌స్‌ల మాదిరిగానే ఒక సాధరణ స‌మ‌స్య‌గా మిగిలిపోతుంద‌ని అయన అన్నారు.

కాళేశ్వరం పంపులు బంద్.. విపక్షాలకు వరం.. డిఫెన్స్ లో గులాబీ దళం

టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విపక్షాలకు అస్త్రంగా మారుతోంది. రెండో ఏడాది కూడా ఎత్తిపోతల పంపులు ఎక్కువ రోజులు ఆన్ కాలేదు. అంతేకాదు ఎత్తిపోసిన కొద్దిపాటి నీరు కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో తిరిగి సముద్రం పాలైంది. దీంతో కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా వాయిస్ పెంచాయి విపక్షాలు. కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అనుకూలంగా మలుచుకుంటూ జనంలోకి వెళుతున్నాయి. తాము ముందు నుంచి చెబుతున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదని తేలిందంటున్నారు విపక్ష నేతలు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నా లక్ష కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్ట్  పంపులు ఆన్ చేయడం లేదని, ప్రాజెక్టు నిరుపయోగంగా పడి ఉన్నాయని చెబుతున్నారు. ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులు కట్టడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ వైట్ ఎలిఫెంట్ గా మారిందని  ఆరోపిస్తున్నారు.  ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు, ఎత్తిపోతలకయ్యే వందల కోట్ల రూపాయల కరెంట్ ఖర్చు వృధా అవుతున్నాయనే వాదనను  ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.    ఆసియాలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రికార్డ్ సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి వివాదాలున్నాయి. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని టీఆర్ఎస్ చెబుతుండగా.. కాళేశ్వరంతో ఉపయోగం లేదని, అవసరం లేకున్నా కమీషన్ల కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజలపై భారం మోపారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివాదాలు సాగుతుండగానే ప్రాజెక్ట్ ను గత ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌21న సీఎం కేసీఆర్‌ కన్నెపల్లిలో మోటార్లను స్టార్ట్ ‌‌ చేసి నీటి పంపింగ్‌ ‌‌‌‌‌‌‌ప్రారంభించారు. అప్పుడు ప్రాణహితలో వరద లేకపోవడంతో గంట సేపటికే బంద్‌ చేశారు. ఆ తర్వాత జులై 6 నుంచి 29 వ‍రకు 5 మోటార్లను నిరంతరాయంగా నడిపించి 11.88 టీఎంసీలను అన్నారం బ్యారేజీలోకి పంపింగ్‌‌‌‌‌‌‌‌చేశారు. తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తారు. దీంతో ఎత్తిపోసిన నీరంతా సముద్రం పాలైంది. అప్పుడు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. విపక్షాల ఆరోపణలపై  స్పందించిన సర్కార్..  ప్రాజెక్ట్ ఇంకా మొత్తం పూర్తి కాలేదని, వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో గోదావరి నీటిని ఎత్తిపోస్తామని ప్రకటించింది. జూన్ చివరలో ఎత్తిపోతల ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ కూడా చెప్పారు.    సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ఈసారి కూడా జరగలేదు. రెండో ఏడాదిలో ప్రస్తుతం వర్షాకాల సీజన్ మొదలై.. రెండు నెలలు ముగుస్తున్నా ఎత్తిపోతల మాత్రం కొన్ని రోజులే సాగింది. జూలైలోనే గోదావరిలో వరద వచ్చినా కాళేశ్వరం పంపులు ఆన్ కాలేదు. ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి దాదాపు 10 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి మిడ్ మానేరుకు తరలించారు. ఇంతలోనే భారీ వర్షాలు , వరదలు రావడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చింది. ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములు నిండిపోయాయి. వరదలతో కాళేశ్వరం పంపులన్ని బంద్ చేశారు. అంతేకాదు మేడిగడ్డ నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లికి ఎత్తిపోసిన నీరు కూడా.. ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో మేడిగడ్డ మీదుగా తిరిగి సముద్రం పాలైంది. మిడ్ మానేరు, ఎల్ఎండీ గేట్లు కూడా ఎత్తడంతో ఎత్తిపోసిన నీరంతా కిందకు వెళ్లింది. 10 రోజుల్లోనే ఎత్తిపోతలకు 20 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందని, ఆ నీటిని తిరిగి వదిలేయడంతో ఆ డబ్బంతా నీటిలో కొట్టుకుపోయిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.   కాళేశ్వరం ద్వారా ఏటా 225 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి ఏడాది ఎత్తిపోతల మాములుగానే సాగింది. అప్పటికి అనంతగిరి, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లు పూర్తి కాలేదు. దీంతో మిడ్ మానేరు వరకే లిఫ్టింగ్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఆగస్టు వరకు పంపులు ఆన్ చేయలేదు. ఇదే అంశంపై ఇప్పుడు విపక్షాలు కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా వాయిస్ పెంచాయి. లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టి.. పంపులను ఆన్ చేయడం లేదని, ప్రణాళిక లేకుండా కట్టడం వల్లే ప్రజాధనం వృధా అవుతుందని మండి పడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు పంప్ హౌజ్ లు ఆన్ చేయాల్సిన అవసరం ఉండని ముందు నుంచే చెబుతున్నామని , వరదలు లేని సమయంలోనే ఎత్తిపోతల చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, ఎల్ ఎండీని పూర్తిగా నింపడంతో ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. అనంతగిరి, రంగనాయక సాగర్, కొండ పొచమ్మ సాగర్ తో మెదక్ జిల్లాలోనూ నీటి సమస్య తీరిందంటున్నారు.

సంబరాల నుంచి సైలెంట్.. తెలంగాణ బీజేపీ దూకుడుకు బ్రేక్? అంతా కేంద్రం వల్లే..

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ.. కొన్ని రోజులుగా దూకుడు పెంచింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి వచ్చే ఏ  ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. కరోనా భయపెడుతున్నా ప్రజా సమస్యలపై స్పీడ్ గా స్పందిస్తోంది బండి సంజయ్ టీమ్. ఎక్కడ సమస్య ఉన్నా.. అక్కడికి వెళ్లి సర్కార్ తీరును ఎండగడుతున్నారు కమలనాధులు. సంజయ్ స్పీడ్ తో బీజేపీ కేడర్ లోనూ జోష్ పెరిగింది. ప్రజా పోరాటంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నాబీజేపీ ముందుందనే చర్చ జనాల్లోనూ జరుగుతోంది. ఏపీతో జరుగుతున్న జల వివాదంతో మొదట కేంద్రం స్పందన తెలంగాణ బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. కేంద్రం ఏపీ ప్రభుత్వానికి వరుస లేఖలు రాయడంతో సంజయ్ టీమ్ సంబరాలు చేసుకుంది. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగల్లేదు. ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం యూ టర్న్ తీసుకోవడంతో సంబరాలు చేసుకున్న తెలంగాణ బీజేపీ నేతలే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.    కృష్ణా జల వివాదం, ఏపీ సర్కార్ కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందని బహిరంగా ప్రకటనలు చేశారు. అంతేకాదు కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ మొదట మౌనంగా ఉండటంతో... ఇదే అస్త్రంగా టీఆర్ఎస్ సర్కార్ పై దాడికి దిగారు తెలంగాణ బీజేపీ నేతలు. టీఎస్ నేతల ఫిర్యాదుపై కేంద్రం కూడా వేగంగానే స్పందించింది. రాయలసీమ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరపడ్డారు. తమ పోరాటం వల్లే ఏపీ ప్రాజెక్టులకు బ్రేక్ పడిందని చెప్పుకున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని, తామే పాలమూరు రైతులకు నష్టం జరగకుండా చూశామని గొప్పలు చెప్పుకున్నారు. జల వివాదంలో బండి సంజయ్ టీమ్ పోరాటానికి తెలంగాణ ప్రజల్లో మైలేజీ కూడా వచ్చినట్లు కనిపించింది. ఇదే స్పూర్తిగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలంగాణ కమలనాధులు కార్యాచరణ రచించారు.             అయితే తెలంగాణ బీజేపీ నేతల స్పీడ్ కు బ్రేకేసింది కేంద్ర సర్కార్ తాజా నిర్ణయం.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో జరుగుతున్న విచారణలో.. ఏపీ వాదనను సమర్ధించేలా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమేనని స్పష్టం చేసింది. దానివల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని తెలిపింది. ప్రాజెక్ట్ కు  పర్యావరణ అనుమతులు అవసరం లేదని  క్లారిటీ ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని వెల్లడించింది. ఎన్జీటీలో కేంద్రం వేసిన అఫిడవిట్ తో తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ తగిలింది. ఇంతకాలం తామే కేంద్రానికి ఫిర్యాదు చేసి ఏపీ ప్రాజెక్టులను అడ్డుకున్నామని చెప్పి న నేతలు... ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కేంద్రం అఫిడవిట్ తో తాము చేస్తున్న పోరాటమంతూ బూడిదలో పోసిన పన్నీరులా మారిందని  ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే మంచి అవకాశం కోల్పోయామని చెబుతున్నారు. పార్టీ దూకుడుకు వెళుతున్న సమయంలో ఇలా జరగడమేంటనీ తెలంగాణ కమలనాధులు మధనపడుతున్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ స్కీంపై తెలంగాణ బీజేపీ నేతలు అత్యూత్సాహం ప్రదర్శించారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.  రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు జాతీయ పార్టీ నేతలు ఆచితూచి వ్యవహరించాలని, దూకుడుగా వెళితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.

అన్‌లాక్-4 గైడ్‌లైన్స్.. మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. సినిమా థియేటర్లు?

అన్‌లాక్-4 కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. అయితే కంటైన్‌మెంట్ జోన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. దేశంలో దశలవారీగా మెట్రో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.     సెప్టెంబర్ 21 నుంచి క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. 100 మందికి మించకుండా సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని నిబంధన విధించింది. అదే విధంగా సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అంతరాష్ట్ర రవాణాకు కూడా అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.    సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ పై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఆన్‌లైన్/డిస్టెన్స్ లెర్నింగ్‌ కొనసాగేందుకు, ప్రోత్సహించేందుకు అనుమతించినట్టు పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగనుంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులు 

మొన్న మార్చిలో కరోనా వ్యాప్తితో ప్రభుత్వాలు పాఠశాలలను మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో మళ్ళీ పాఠశాలలను తిరిగి తెరిచే పరిస్థితి కనిపించడంలేదు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1 నుండి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నట్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీని కోసం విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై సర్వే చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఐతే ఇంట్లో టీవీలు లేని విద్యార్థుల కోసం వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించామని ఆమె చెప్పారు.    అంతేకాకుండా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ ను తయారు చేసినట్టు ఆమె తెలిపారు. దీని కోసం రోజుకు కేవలం మూడు గంటల పాటు మాత్రమే డిజిటల్ క్లాసులు ఉండాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా విద్యార్థుల కళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఒక్కో క్లాసును అరగంట నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే నిర్వహించాలని చెప్పింది.    కరోనా కారణంగా విద్యార్థులు చదువు విషయంలో విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర తమ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఆమె కోరారు. అయితే ఇప్పటికీ ఇంట్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని వారికి మరి ప్రభుత్వం ఏవిధంగా సదుపాయాలు సమకూరుస్తుందో వేచి చూడాలి.

దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు

ఏపీలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత యువకుడికి శిరోముండనం, అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడి ఆత్మహత్య ఇలా నిత్యం ఏపీలో ఏదోక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో దళితుడిపై అధికార పార్టీకి చెందిన నాయకుడు దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేష్.. అధికార పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు.   రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది అని లోకేష్ విమర్శించారు. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైసీపీ నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.. అంటూ, దీనికి సంబంధించిన వీడియోను లోకేష్ షేర్ చేశారు. శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితుల పై దమనకాండ కొనసాగిస్తున్నారు జగన్ రెడ్డి అని విమర్శించారు. దళితులపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

గవర్నర్ తో సీఎం భేటీ

రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ లో ముఖ్యమంత్రి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుల నియామకంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మూడుస్థానాలు ఖాళీ కావడంతో అసెంబ్లీ సమావేశాల లోగా వాటిని భర్తీ చేయాల్సి న విషయంపై చర్చజరిగినట్లు సమాచారం.    సచివాలయం నూతన సచివాలయం నిర్మాణం పై కూడా ముఖ్యమంత్రి గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, ప్రాజెక్టుల్లో పెరిగిన నీటిసామర్ధ్యం, వరద సహాయ చర్యలపై చర్చించారు. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండల సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై గవర్నర్ కు వివరించారు. గవర్నర్ ను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదు.. తుది వరకు బాధ్యతగా నిలబడతాం

ఏపీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు అన్ని పార్టీలకు అవకాశమివ్వాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని తరలింపుపై కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.   ఈ విషయంపై చర్చించేందుకు ఈరోజు జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్న పిమ్మట కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కౌంటర్ దాఖలుతో పాటు కేసులో తుది వరకు బాధ్యతగా నిలబడాలని, న్యాయనిపుణుల సహకారంతో గడువులోగా కౌంటర్ వేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.   ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజధాని అంశంలో జనసేన తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయంతో ఉందని వెల్లడించారు. ప్రభుత్వాన్ని నమ్మి 28వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని జనసేన బలంగా చెబుతోందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజధాని తరలింపుకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన నేపథ్యంలో, న్యాయనిపుణుల సలహా తీసుకుని గడువులోగా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఈ కేసులో చివరి వరకు బాధ్యతగా నిలబడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.   2019 ఎన్నికల్లో ఘోర ఓటమి, బీజేపీతో దోస్తీ తర్వాత సైలెంట్ అయిన జనసేన.. మళ్ళీ రాజధాని అంశంతో గళం వినిపించాలని చూస్తోంది. రాజధాని అంశంపై మిత్రపక్షమైన బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్న వేళ.. అమరావతి రైతుల కోసం జనసేన ఎంతవరకు పోరాడుతుందో?.. జనసేన పోరాటంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

దళిత యువకుడికి శిరోముండనం.. నూతన్‌ నాయుడు భార్యపై కేసు నమోదు

విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడుకి శిరోముండనం ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు భార్య మధుప్రియ పేరు నమోదైంది. మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న ఇందిర, ఝాన్సీ, వరహాలు, బాలు, సౌజన్య, రవిల పైనా కేసు నమోదు చేశారు.    బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడుకి శిరోముండనం చేశారు. నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే శ్రీకాంత్‌ అనే యువకుడు.. వ్యక్తిగత కారణాలతో చెప్పకుండా పని మానేశాడట. అయితే శుక్రవారం శ్రీకాంత్‌ కు నూతన్‌ భార్య మధుప్రియ ఫోన్‌ చేసి ‘నువ్‌ సెల్‌ఫోన్‌ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’అని పిలిచారు. అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి, శిరోముండనం చేయించారు. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు.   ఎస్సీ, ఎస్టీ ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. తాజాగా శిరోమండనం ఘటనపై సీసీ ఫుటేజ్‌ ను పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా విడుదల చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్‌ కు శిరోముండన చేసినట్లు పక్కాగా ఆధారం లభించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని.. కొంత ఫుటేజ్‌ను తొలగించినట్లు గుర్తించామన్నారు సీపీ. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూతన్‌ నాయుడు భార్యతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.