కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గం
posted on Aug 26, 2020 @ 4:36PM
కౌలు చెల్లించాలని కోరుతూ విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయ ముట్టడికి రాజధాని రైతులు, మహిళలు బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు కౌలు డబ్బులు ఇస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాట నిలబెట్టుకోక పోవడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కౌలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఆర్‌డీఏ కార్యాలయం ముట్టడికి వస్తున్న రైతులను, మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. కరకట్ట, మంగళగిరి మీదుగా విజయవాడకు వచ్చే మార్గాల్లో రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు మద్దతుగా వచ్చిన సీపీఎం మధు, బాబూరావులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులపై పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన అమరావతి రైతులను విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
మరోవైపు, ఆరు నెలలుగా అమరావతి పెన్షన్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాటు, ఈ సంవత్సరం వార్షిక కౌలు కూడా చెల్లించకపోవడంతో.. అమరావతి రైతులు, రైతు కూలీలు చేపట్టిన బిక్షాటన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. వెంకటపాలెం చలివేంద్రం చెక్ పోస్ట్ వద్ద డీఎస్పీ బృందం, దళిత జేఏసీ అమరావతి నాయకులను రైతులను అడ్డుకోవడం జరిగింది. దళిత రైతులు, రైతు కూలీలు వచ్చిపోయే ప్రయాణికులను భిక్షాటన చేస్తూ.. ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇచ్చి దగాపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమరావతి పెన్షన్ చెల్లించక నడిరోడ్డున పడ్డాము. మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. ఆకలి పస్తులతో జీవనం సాగిస్తున్నాం, కావున దయచేసి ధర్మం చేయండి అని వారు భిక్షాటన చేయడం జరిగింది.