తెలంగాణలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అడిష‌న‌ల్ కలెక్టర్

తెలంగాణలో కీసర ఎమ్మార్వో రికార్డ్ స్థాయిలో కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంగతి మరిచిపోక ముందే తాజాగా ఏసీబీ వలలో మరో పెద్ద తిమింగలం చిక్కింది. ఒక భూ వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు మెద‌క్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేష్ ఏకంగా రెండు కోట్ల‌కు పైగా లంచం డిమాండ్ చేయ‌టంతో పాటు కొటి 12 ల‌క్ష‌ల‌ను న‌గ‌దు రూపంలో అందుకుని, మ‌రో కోటి రూపాయ‌ల ప్రాప‌ర్టీని త‌న కుటుంబీకుల పేరుకు మార్చాల‌ని డిమాండ్ చేస్తున్న విషయాన్ని పసిగట్టిన ఏసీబీ అయన నివాసాల పై దాడి చేసి సోదాలు జరుపుతోంది. దీనికి సంబంధించిన ఒక చెక్కు ను తీసుకోవడంతో పాటు ఒక ప్రాప‌ర్టీని కూడా ఇప్ప‌టికే న‌గేష్ తన సంబంధికుల పేరు మీద రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ భూవివాదం కేసులో అసిస్టెంట్ కలెక్టర్ న‌గేష్ ఆడియో క్లిప్స్ తో స‌హా దొరికిపోయిన‌ట్లుగా సమాచారం. ప్రస్తుతం న‌గేష్, ఆయ‌న బంధువుల ఇళ్ల‌లోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.

బిగ్ షాక్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌.. 

కరోనా వైరస్ తో విలవిలలాడుతున్న ప్రపంచానికి పెద్ద ఆశా కిరణంగా కనిపించిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో తేడా రావడంతో... తాజాగా ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్‌ని తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు తెలిసింది. ప్రపంచంలోనే కరోనాకి బెస్ట్ వ్యాక్సిన్ అని దేశదేశాలు నమ్ముతున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రాజెనెకా ఫార్మా కంపెనీలు సిద్ధం చేసిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ని ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా కంపెనీ ప్రకటించింది. దీనికి గల ప్రధాన కారణం... బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఒక వాలంటీర్ కు వ్యాక్సిన్ రియాక్షన్ ఇచ్చింది. అయితే ఆ వ్యక్తికీ "తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని దీంతో వ్యాక్సిన్ ఇచ్చి దానిపై సమీక్షించే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది" అని తాజాగా తన స్టేట్‌మెంట్‌లో ఆస్త్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. దీంతో ఎందుకైనా మంచిదని ట్రయల్స్ తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా ప్రకటించింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందో అప్పుడే చెప్పలేమన్న ఫార్మా కంపెనీ ఆ వ్యక్తి త్వరలో కోలుకుంటారని భావిస్తున్నట్లు చెప్పింది.   అయితే ఈ ట్రయల్స్ నిలిపివేత అన్నది వ్యాక్సిన్ ప్రయోగాలలో సహజంగా జరిగే ప్రక్రియేనని, ట్రయల్స్‌లో కనుక ఎవరికైనా తేడా వస్తే ఇలాగే చేస్తారని.. దీనిపై దర్యాప్తు జరపడం ద్వారా ట్రయల్స్‌పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే నిలిపివేసినట్లుగా తెలిపింది. అయితే వ్యాక్సిన్ తయారీ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకుగాను ఇలా ఎందుకు జరిగిందో త్వరగా తెలుసుకుని మళ్ళీ ప్రయత్నిస్తాం" అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.   ఇదే సమయంలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం ఏమి చిన్న విషయం కాదంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రభావం... ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయ్యేందుకు కారణం కాగలదని వారు అంటున్నారు. అంతేకాకుండా మిగిలిన వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు కూడా ఇటువంటి విషయాల్ని సీరియస్‌గా తీసుకోవాలని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రష్యా తన వ్యాక్సిన్ మొదటి రెండు దశల ట్రయల్స్ పూర్తవగానే వ్యాక్సిన్ తయారైపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తి వైపు అడుగులు కూడా వేస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వ్యాక్సిన్ ఏదైనా మూడు దశల్లోనూ మంచిదని తేలితేనే దాన్ని ప్రజలకు అందివ్వాలంటోంది. దీనికి గల ముఖ్య కారణం మూడో దశ ట్రయల్స్ లో ఎక్కువ మందిపై పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకపోతె అపుడు వ్యాక్సిన్ సరైనదని చెప్పేందుకు వీలవుతుందని అంటోంది. తాజాగా ఆక్స్‌ఫర్డ్-ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ కూడా ఈ కారణంగానే... మూడు దశలూ సంపూర్ణంగా పూర్తి చేశాకే... వ్యాక్సిన్ రిలీజ్ చెయ్యాలని నిశ్చయించుకుంది.   ప్రపంచంలో ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ని అమెరికాలో ఆగస్టులో ప్రారంభించింది. దీంట్లో 30వేల మంది పాల్గొంటున్నారు. అంతకుముందు రెండు, మూడో దశ ట్రయల్స్‌ని బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలో చేపట్టారు. అయితే మొదటి, రెండో దశల్లో... కొంత మందికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి చిన్నచిన్న సమస్యలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఓ వ్యక్తికి కాస్త తీవ్ర సమస్యలు రావడంతో ట్రయల్స్ నిలిపివేసింది.

కేపిటల్ పై అదే కన్ఫ్యూజన్.. సోము మరో బాంబ్! 9వేల ఎకరాలెక్కడో..

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై భారతీయ జనతా పార్టీలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం చెబుతుండగా.. రాష్ట్ర నేతలు మాత్రం ఎవరి కోణంలో వారు రోజుకోలా మాట్లాడుతూ అయోమయం స్పష్టిస్తున్నారు. పార్టీ చీఫ్ సోము వీర్రాజు తన ప్రకటనలతో రాజధానిపై మరింత గందరగోళపరుస్తున్నారు.    కన్నా లక్ష్మినారాయణ చీఫ్ గా ఉన్నప్పుడు కమలంపార్టీలో కేపిటల్ పై ఫుల్ క్లారిటీ ఉండేది. అమరావతి రైతుల ఉద్యమానికి కన్నా మద్దతు కూడా ఇచ్చారు. పాలనా వికేంద్రకరణకు వ్యతిరేకంగా, జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వరుసగా ప్రకటనలు చేసారు. సోమ్ము వీర్రాజుకు పార్టీ పగ్గాలు వచ్చాకే  కన్ఫ్యూజన్ పెరుగుతోంది. అమరావతిలో ఒకలా. విశాఖలో మరోలా.. రాయలసీమలో ఇంకోలా మాట్లాడుతుండటంతో రాజధానిపై సోము వీర్రాజు స్టాండ్ ఏంటన్నది ఎవరికి అర్ధం కావడం లేదు.    తాజాగా విశాఖ పర్యటనలో రాజధానిపై మరో సంచలన వ్యాఖ్య చేశారు సోము వీర్రాజు. తాము 2024లో అధికారంలోకి వస్తే 9 వేల ఎకరాల్లో రాజధాని కట్టి చూపిస్తామన్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తప్పులే చేస్తున్నాయన్నారు. అమరావతిలో రైతులకు 64 వేల ప్లాట్లు ఇచ్చేస్తామని  తెలిపారు. అయితే రాజధాని ఎక్కడన్నది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోము వీర్రాజు చెప్పిన 9 వేల ఎకరాల రాజధాని ఎక్కడన్న దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. విశాఖలో మాట్లాడారు కాబట్టి విశాఖలోనే అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుండగా.. రాజధాని కోసం ఇప్పటికే భూములు సేకరించిన అమరావతి గురించే సోము చెప్పారని మరికొందరు చెబుతున్నారు.    ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించిన కొన్ని రోజులకే  ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. 13 జిల్లాలున్న రాష్ట్రానికి 13 రాజధానులు ఉంటే తప్పేంటన్నారు. అయితే సోము పార్టీ పగ్గాలు తీసుకుంటున్న కార్యక్రమంలోనే ఆయనకు షాకిచ్చారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. రాష్ట్రానికి ఒక్క రాజధానే ఉండటమే మంచిదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నారు మాధవ్. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో.. ఒక్క రాజధాని ఉన్న సరైన పాలన జరగడం లేదా అని రాంమాధవ్ ప్రశ్నించారు. కన్నా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రాజధానిపై సోము వీర్రాజు అయోమయంగానే మాట్లాడేవారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటూనే చంద్రబాబు పాలనపై విమర్శలు చేసేవారు. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదంటూనే..పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు‌ మంచి జరుగుతుందనేవారు సోము వీర్రాజు.    కేంద్ర సర్కార్ వైఖరి, బీజేపీ జాతీయ నేతల అభిప్రాయాలు, రాష్ట్ర నేతల తీరు భిన్నంగా ఉండటంతో రాజధానిపై కమలనాధులకు స్పష్టత లేనట్లు కనిపిస్తోంది. అమరావతికి మద్దతుగా కన్నా మాట్లాడుతున్నా హైకమాండ్ వారించ లేదు. రాంమాధవ్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించారు. దీంతో అమరావతి వైపే బీజేపీ హైకమాండ్ అని భావించారు. ఇప్పుడు సోము వీర్రాజు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. అధిష్టానం ఆదేశాలు లేకుండా ఆయన ముందుకు వెళ్లరని చెబుతున్నారు. దీంతో ఏపీ రాజధాని విషయంలో బీజేపీ డబుల్ రోల్ పోషిస్తుందనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. టీడీపీ కూడా ఇదే ఆరోపిస్తోంది. ఇప్పటికైనా బీజేపీ స్పష్టమైన వైఖరి చెబితే బాగుంటుందనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సి. పార్థసారథి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సి. పార్థసారథిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ఆయన ఏప్రిల్ లో ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా పదవీవిరమణ చేశారు. విజయనగరం ఆర్డివోగా ఉద్యోగప్రస్థానం ప్రారంభించిన సి. పార్థసారథి ఐఎఎస్ అధికారిగా అనేక శాఖల్లో పనిచేశారు. ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసే సమయంలో ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన కల్పించడానికి విశేషకృషి చేశారు. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదివిన ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. వ్యవసాయశాఖ కమిషనర్ గా తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పార్థసారథి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.

పీవీకి భారతరత్న.. ఏపీలోనూ తీర్మానం చేయాలన్న ఐవైఆర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్నఇవ్వాలన్న తీర్మానం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టగా ఎంఐఎం వ్యతిరేకించింది. ఎంఐఎం సభ్యులు సభకు గైరాజరు అయ్యారు. దేశ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, ఆర్థిక సంస్కర్తగా పీవీ చేసిన సేవలను సభ్యులు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం భారతరత్న ఇవ్వాలని సభలో మాట్లాడిన సభ్యులంతా స్పష్టం చేశారు. అసెంబ్లీ లో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. పీవీ సేవలను గుర్తించి శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, దక్షిణాది నుంచి ప్రధానికిగా దేశానికి సేవచేసిన పీవీ మన ఠీవీ అని ముఖ్యమంత్రి కొనియాడారు.   తెలంగాణ అసెంబ్లీ చేసిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీవీకి భారతరత్నపై తీర్మానం చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఇగోలకు, పట్టింపులకు పోకుండా తెలంగాణ తరహాలో ఏపీలోనూ తీర్మానం చేయాలని ఐవైఆర్ సూచించారు.

అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్తత.. హిందూ సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది

తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం లో మంత్రుల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతర్వేది దేవస్థానానికి భారీగా చేరుకున్న విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగదల్, హిందూ చైతన్య వేదిక తదితర సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.    అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన రథం శనివారం అర్ధరాత్రి దాటాక దగ్దమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో హిందూధర్మిక సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఉదయం ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరి నిరసనకు పూనుకున్నారు.    ఆలయం వద్దకు ర్యాలీగా బయలు దేరిన హిందూ సంఘాలను పాశర్లపూడి బ్రిడ్జీపై పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో.. జైశ్రీరామ్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుపడినప్పటికీ  హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.   ఇదిలా ఉంటే అగ్నికి ఆహుతైన స్వామి వారి రథాన్ని పరిశీలించేందుకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు వచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు ఆలయం లోనికి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆలయం హైటెన్షన్ నెలకొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.   రథం అగ్నికి ఆహుతవడానికి తేనెతుట్టె కారణమని చెప్పటంపై ధార్మిక సంఘ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథం దగ్ధం అవటానికి కారణం కొబ్బరిచెట్టు ఎందుకెక్కావు అంటే దూడ మేతకు అన్నట్లుగా ఉందన్న రీతిలో చెబుతున్నారని మండిపడుతున్నారు. హిందూ ఆలయాలు ఒకరి హయాములో కూల్చితే మరొకరి జమానాలో కాల్చివేస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవాలయాలు కూల్చిన ప్రతిసారీ ఏదో కారణం చూపి నేరస్తులను తప్పిస్తున్నారని, ఫలితంగా ఇదొక అలుసుగా మారిందని అగ్రహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కూడా పిచ్చివాళ్లకు కాల్చివేయ్యటానికి హిందు ఆలయాలు మాత్రమే తెలుసా అని ఆగ్రహంతో ప్రశ్నించారు. వెంటనే రధం నిర్మాణం ముఖ్యం కాదని,హిందూ ఆలయాలపై తరచూ ఇలాంటి దుశ్చర్యలు జరగటం వెనుక కారకులు,కారణాలు ఏమిటనేది తేల్చాల్సి ఉంది అని హిందు ధార్మిక  కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ దూకుడు.. సెప్టెంబర్ 17న రచ్చేనా! 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందివచ్చే అన్ని అవకాశాలను ఉపయోగిచుకుంటోంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్. కరోనా, వరదలు, సచివాలయం కూల్చివేత.. ఇలా అన్ని అంశాలపై కారు పార్టీని కార్నర్ చేస్తున్నారు కాషాయ నేతలు. తాజాగా సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తోంది బీజేపీ. తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ఎప్పటినుంచో డిమండ్ చేస్తోంది బీజేపీ. ఇప్పుడు ఇదే డిమాండ్ తో యాత్ర చేపట్టారు బండి సంజయ్.    రెండు రోజుల యాత్రను యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక నుంచి ప్రారంభించారు. సాయుధ రైతాంగ పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి-రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు బండి సంజయ్. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను సందర్శిస్తున్నారు బండి సంజయ్. తెలంగాణ అమరవీరుల చరిత్రను ఈ తరానికి అందించడమే తమ యాత్ర లక్ష్యమంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబరు 17 ను విమోచన దినంగా  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న కేసీఆర్, అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17 ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా కేసీఆర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి గద్దె దింపుతామని.. 2023లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు బండి సంజయ్.    1948, సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణ వేరుపడింది. ఆ రోజును తెలంగాణ విమోచన దినంగా జరపాలన్నది బీజేపీ డిమాండ్. అయితే సెప్టెంబర్ 17న విలీన దినంగా జరపాలని కొన్ని సంఘాలు, విద్రోహ దినోత్సవమని మరికొన్ని సంఘాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఆరేండ్లవుతున్నా అధికారికంగా నిర్వహించడం లేదు. ఇదే అస్త్రంగా బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలు రానున్నాయి. దుబ్బాక అసెంబ్లీ బైపోల్ కూడా జరగనుంది. ఈ ఎన్నికలకు బూస్ట్ గా విమోచన పోరాటం కలిసివస్తుందని బీజేపీ భావిస్తోంది.    ఇక సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల్లోనూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మండల తహశీల్దార్లకు వినతి పత్రాలు అందిస్తున్నారు. దీన్ని మరింత తీవ్రతరం చేసి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ఒత్తిడి తెస్తామంటున్నారు బీజేపీ నేతలు. అయినా సర్కార్ స్పందించకపోతే సెప్టెంబర్ 17న మెరుపు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కోణంలో రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ... బలమైన ఆధారాలతోనే అంటున్న బీహార్ డీజీపీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి వెనుక డ్రగ్స్ మాఫియా ఉందన్న కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.    దీనిపై తాజాగా బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రియాకు వ్యతిరేకంగా చాలా బలమైన ఆధారాలే సంపాదించినట్టుందని అయన అభిప్రాయపడ్డారు. "రియా నుంచి ఎన్సీబీ అధికారులు బహుశా డ్రగ్స్ కు సంబంధించి పూర్తి సమాచారం రాబట్టి ఉంటారని.. అంతేకాకుండా ఆమెకు డ్రగ్స్ విక్రేతలతో గల సంబంధాలు కూడా కచ్చితంగా వెల్లడై ఉంటాయి. అందుకే ఈ కేసులో డ్రగ్స్ కోణంలో రియా పాత్ర స్పష్టం కావడంతో ఆమెను అరెస్ట్ చేసి ఉంటారు" అని పాండే అభిప్రాయపడ్డారు.

మాకు అధికారం ఇస్తే రాజధాని అక్కడే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ 

ఏపీ రాజధానిపై ఇప్పటివరకు ప్రజలను పెద్ద కన్ఫ్యూషన్ లో ఉంచిన ఏపీ బీజేపీ ఫైనల్ గా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అంశం పై స్పందిస్తూ ప్రజలు మాకు అధికారం ఇస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని... అంతేకాకుండా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ లు పోను మిగిలిన 9000 ఎకరాలలో రాజధానిని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేసారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఈ విషయం పై ఎవరికీ తోచినట్లుగా వారు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజధాని విషయంలో ఏపీలోని బీజేపీ నాయకులు ఒక మాట చెప్పగానే ఢిల్లీ నుండి జివిఎల్ వంటి వారు దానిని ఖండించడం మనం చూసాం. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనతోనైనా ఈ దాగుడుమూతలకు తెర పడుతుందేమో చూడాలి.

సో'న‌యా' మార్గ్?!

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అంత‌ర్ముఖంగా ఏమి ఆలోచిస్తున్నారు? అంత‌ర్గ‌తంగా ఏమి చేస్తున్నారు? పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగి రెండు వారాలైంది. నివురు గ‌ప్పిన నిప్పు బైట‌ప‌డింద‌నుకున్నారు. అది మంచికే జ‌రిగింద‌ని కొంద‌రు సంతోషించారు. కాదు..అది విఘాత‌మ‌ని మ‌రికొంద‌రు మ‌థ‌న‌ప‌డ్డారు. పార్టీలోనే నాయ‌క‌త్వశ్రేణిలో అయోమ‌యం. ఇక కేడ‌ర్ సంగ‌తి చెప్పేదేముంది! మొత్తంమీద నాయ‌క‌త్వలోప‌మే ఇంత దూరం తెచ్చింద‌ని సోనియ‌గాంధీ గ్ర‌హించారు. గారాల కొడుకు రాజ‌కీయంగా ఇంకా ఎదిగిరాలేద‌నే ఆమె అనుకుంటున్నారు. అందుకే ఆ బిడ్డ‌డికి మ‌రికొంత స‌మ‌యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆలోగా తాను క్రియాశీలం కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుక‌నుగుణంగానే వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం సాగింది. రెండు రోజుల్లో ఆమె మోడీ స‌ర్కారు మీద వ్యూహాత్మ‌క యుద్దం మొద‌లెట్టాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ఇచ్చిన జ‌వ‌స‌త్వాల‌తో ఆమె రంగంలోకి దిగారు. యుద్ధానికి ఆయుధాలు కావాలి. మోడీ ప్ర‌భుత్వం నుంచి ఆయుధాలు దొర‌క‌టం క‌ష్ట‌మేమీ కాదు. కాని అవ‌న్నీ ఇప్ప‌టికే రాహుల్‌గాంధీ ఉప‌యోగించేశారు. అలా దొరికిన‌వ‌న్నీ వాడేసి చివ‌రికి అస్త్ర స‌న్యాసం చేసి కూచున్నారు. ఆ సంగ‌తి సోనియాగాంధీకి తెలుసు. అందుకే తాజా అస్త్రం ప‌ట్టుకున్నారు. నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌న్న ఒక‌చిన్న ఆయుధం ప‌ట్టుకుని రంగంలోకి దూకారు.   ఏడుగురు ప్ర‌తిప‌క్ష ముఖ్య‌మంత్రుల‌తో అర్జంటుగా వీడియో కాన్ఫ‌రెన్సులో యుద్ద వ్యూహాన్ని వివ‌రించారు. ఆ యుద్దంలోని ఔచిత్యాన్ని ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌లేదు. దిగ‌క‌దిగ‌క పెద్ద‌మ్మ చాలా కాలం త‌ర్వాత రంగంలోకి దిగిన‌ప్పుడు ఆమెకి సంఘీభావం ప్ర‌క‌టించ‌డం త‌ప్ప మ‌రేమీ చేయ‌కూడ‌ద‌ని వారూ ముందే తీర్మానించుకున్నారు. ఎందుకంటే ఆమె తీసుకున్న కార్య‌క్ర‌మం అలాంటిది. ప‌స ఉందా లేదా అన్న‌ది కాదు. అది అంత బ‌ల‌మైందా కాదా అన్న‌ది ఆమె ఆలోచించ‌లేదు. ఆమాట‌కొస్తే అది ఆమె ఆలోచ‌న కూడా కాదు. అందుకే అందులోని హేతుక‌త గురించి ఆమె ఆలోచించే అవ‌కాశం లేదు. నీట్, జేఈఈ ప‌రీక్ష‌లు ఆశావ‌హ యువ‌తకు ఎంత ప్ర‌ధాన‌మైన‌దో ఆక్ష‌ణంలో వారెవ్వ‌రూ ఆమెకు సూచించ‌లేదు. క‌రోనా మాత్ర‌మే గుర్తుంది కాని, క‌రోనాతోపాటు యావ‌త్ ప్ర‌పంచం స‌హ‌జీవ‌నం చేస్తూ ఆత్మ‌ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌తో ముందుకు సాగుతున్న ఈ ద‌శ‌లో అంత‌టి జాతీయ ప‌రీక్ష‌ల‌ను జ‌ర‌పొద్ద‌ని కేంద్రాన్ని డిమాండు చేసే అంశానికి దేశ‌వ్యాప్తంగా పెద్ద‌గా మ‌ద్ద‌తు రాలేదు. ఇక్క‌డ మ‌ద్ద‌తు అంటే ఆ ప‌రీక్ష‌ల‌తో సంబంధం లేని ఏ ఇత‌ర వ‌ర్గాల మ‌ద్ద‌తు అని కాదు. ప‌రీక్ష‌ల‌తో నేరుగా జీవితాలే ముడిప‌డి ఉన్న విద్యార్ధులు, వారి త‌ల్లిదండ్రులే ఇక్క‌డ ప్రామాణికం. ముఖ్య‌మంత్రులు భేష్ భేష్ అన్నారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ ముందుగానే యుద్ద‌రంగంలో కాలు మోపారు. ఆమెకి ఈమె నైతిక స్ధ‌యిర్యాన్నిస్తే ఈమెకి ఆమె పెద్ద గొంతుకై నిలిచారు. మొత్తంమీద ఒక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించారు. సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. న్యాయ‌ప‌రమైన పోరాటానికి జ‌న‌సంఘీభావం, దానికితోడు విశ్వ‌స‌నీయ‌త వ‌స్తుంద‌నుకున్నారు. కాని ఈ అంశంమీద సుప్రీంకోర్టు అభిమ‌తం వేరుగా ఉంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోయారు. మ‌రోవంక రాజ‌కీయ పోరాటానికి తెర‌తీశారు. నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేశారు. దాన్ని ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఏతావాతా జ‌రిగిందేమిటంటే నీట్, జేఈఈ పోరాటం విద్యార్ధుల చేతిలోనుంచి రాజ‌కీయ పార్టీల చేతుల్లోకి వెళ్లి అది రాజ‌కీయాంశంగా మారిపోయింది. ఎప్పుడైతే రాజ‌కీయ రంగు పులుముకుందో దాని తీవ్ర‌త త‌గ్గిపోయింది. ప్ర‌ధాని మోడీ ఏదైతే కోరుకున్నారో అదే జ‌రిగింది. ప్ర‌ధాని మోడీ ప‌ని సులువైంది. రాజ‌కీయ ప్ర‌త్యర్ది అయిన కాంగ్రెస్ పార్టీ ఏది కోరితే దానికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో ఆరితేరిన న‌రేంద్ర మోడీ ఇక ఆ అంశం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అప్ప‌టికే నీట్, జేఈఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సోనియాగాంధీ తొలి అస్త్రం అలా నీరుగారింది. అస‌లు ఈ నీట్ ఉద్య‌మానికి కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేద‌న్న‌ది మ‌రొక వాద‌న‌. పార్టీ నాయ‌త్వ బాధ్య‌త‌లు త‌న‌కు త‌ప్ప‌క‌పోవ‌డం వ‌ల్ల గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గా క్రియాశీల‌కంగా ఉండాల‌న్న అత్యుత్సాహంతో ఆమె కోట‌రీ స‌భ్యులు ఆమెని ఇలా రంగంలోకి దింపిన‌ట్టు తెలుస్తున్న‌ది.    డెబ్బ‌య్ మూడు సంవ‌త్స‌రాల వ‌యస్సులో ఏ బాద‌ర‌బందీ లేకుండా విశ్రాంత జీవ‌నం గ‌డ‌పాల్సిన త‌రుణంలో ఆమె త‌ప్ప‌నిస‌రై పార్టీ కాడిని భుజాన వేసుకుని ఒంట‌రి ప‌య‌నం సాగిస్తున్నారు. ఆందుకే ఆమె పోరాటంలో ప‌దును ఉండ‌టంలేదు. అలాగ‌ని ఆమె పూర్తిగా కాంగ్రెస్ పార్టీని స‌హ‌చ‌ర స‌భ్యుల‌కు వ‌దిలేయ‌డానికి సుముఖంగా లేరు. న‌యానో భ‌యానో బుజ్జ‌గించో బ‌తిమిలాడో కొడుక్కే ప‌ట్టాభిషేకం చేయాలని ఆమె గ‌ట్టిగా కోరుకుంటున్నారు. ఇది ఆమెలో వ‌చ్చిన కొత్త ఆలోచ‌న కాదు. ద‌శాబ్దం పైచిలుకుగా ఆమె ఎదురుచూస్తున్నారు. మ‌ధ్య‌లో రాహుల్ గాంధీకి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. కాని ఆయ‌న ఆ ప‌గ్గాలు వ‌దిలేశారు. ఇష్టంగా కాదు. వైరాగ్యంతో. త‌న‌కు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇవ్వ‌డం లేద‌ని. సోనియాగాంధీ త‌న కుమారుణ్ణి అలా స్వేచ్ఛ‌గా వ‌దిలేయ‌డానికి సుముఖంగా లేర‌ని పార్టీలోని ఒక వ‌ర్గం నాయ‌కులే బాహాటంగా చెబుతుంటారు. సీనియ‌ర్ల‌తో సాహ‌చ‌ర్యం చేస్తూ రాహుల్ పార్టీని న‌డ‌పాల‌న్న‌ది ఆమె అభిమ‌తంగా ఉంది. అనుభ‌వం, ప‌రిప‌క్వ‌త లేని రాహుల్ గాంధీ కొన్నేళ్ల‌పాటు సీనియ‌ర్ల నీడ‌లో ఉండ‌టం అటు పార్టీకి, ఇటు త‌న‌యుడికి శ్రేయ‌స్క‌ర‌మ‌న్న‌ది ఆమె భావ‌న‌గా చెబుతున్నారు. అందుకే మొన్న వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో నాయ‌క‌త్వ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆమె తాను దిగిపోతాన‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, శాశ్వ‌త ప్రాతిప‌దిక మీద కార్యాచ‌రణ అవ‌స‌ర‌మ‌ని భావించారు. అందుకు అనుగుణంగా కొంత‌కాలం పాటు త‌న‌కు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి, ఎప్ప‌టిక‌ప్పుడు కార్య‌క్ర‌మాల‌తో పార్టీని స‌జీవంగా ఉంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగానే మొన్న‌టి ఉద్య‌మం. అయితే అది వ‌ట్టిపోవ‌డంతో మ‌ళ్లీ సందిగ్దంలో ప‌డ్డారు. ప్ర‌ధాని మోడీని ఎదుర్కోవాలంటే ఎలాంటి కార్యాచ‌ర‌ణ అవ‌స‌ర‌మ‌న్న‌దాని మీద కాంగ్రెస్ పార్టీలో స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు. సీనియ‌ర్లు ఒక పంథాను అనుస‌రిస్తుంటే, కొత్త‌త‌రం మ‌రొక పంథాలో పోతున్న‌ది. అందుకే రాహుల్‌గాంధీ ప్ర‌తి ఒక్క అంశాన్నీ చేప‌ట్టినా అది రెండు త‌రాల రెండు వ‌ర్గాల మ‌ధ్య చీలి శ‌ల్య‌మైపోతున్న‌ది. ఈ విష‌యం సోనియాగాంధీ గ్ర‌హించినా పార్టీ స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ‌తీసిన‌ట్టుంటుంద‌న్న భావ‌న‌, భ‌యంతో ఆమె మిన్న‌కుండిపోతున్న‌ట్టు ఒక వ‌ర్గం నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.   సోనియాగాంధీ కొత్త మార్గాన్ని ఎంచుకోవాల‌ని తీర్మానించుకున్న‌ప్ప‌టికీ ఆమెకి దారీతెన్నూ చూసే దిక్సూచిలాంటి స‌హాయ‌కులు లేకుండా పోయారు. ప్ర‌త్య‌ర్ధిని ఎదుర్కోవాలంటే చొర‌వ‌, సాహ‌సం ఉండాలి. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్ధిని ఎదుర్కోవాలంటే అస్త్ర‌శ‌స్త్రాలుండాలి. మోడీని ఎదుర్కోవాలంటే మ‌రో మోడీ కావాలి. మోడీలాంటి వ్యూహ‌క‌ర్త ఉండాలి. అది ఆమె గ్ర‌హిస్తే కాంగ్రెస్ కు కొత్త సార‌థి దొరికిన‌ట్టే. లేదా రాహుల్‌గాంధీని మ‌రో మోడీలా ఆమె త‌యారుచేయ‌గ‌ల‌దా? అంత‌టి శ‌క్తే ఆమెకి ఉంటే ఆమే త‌న‌కు తానుగా మ‌రో మోడీ రూపంలో క‌ద‌న‌రంగంలోకి దూక‌రా! మోడీలా వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌రా!! -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

టీఎస్ అసెంబ్లీలో తీర్మాణం.. ఎంఐఎం దూరం.. అందుకేనా! 

తెలంగాణ అసెంబ్లీలో అరుదైన ఘటన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ఎంఐఎం మద్దతు ఇవ్వలేదు. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం.. అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ పెట్టిన ఓ తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడం ఇదే ఫస్ట్ టైమ్. మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని  అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పీవీ తెలంగాణ ఠీవి  అని కొనియాడారు. దేశ ప్రతిష్టను పీవీ ఇనుమడింపజేశారని... పలు సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని చెప్పారు. మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లు భారతరత్నకు పీవీ అన్ని విధాలా అర్హుడని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.    అయితే పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి ఎంఐఎం దూరంగా ఉంది. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో బాబ్రీ మసీద్ ను కూల్చి వేశారు. ఈఘటన వెనక పీవీ పాత్ర ఉందని ముస్లిం సంఘాల నుంచి ఆరోపణలున్నాయి. కరసేవకులను అయోధ్య రాకుండా కట్టడి చేయడంలో పీవీ సర్కార్ నిర్లక్ష్యంగా వహించందని గతంలో ఎంఐఎం కూడా ఆరోపించింది. ఈ కారణంగానే పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వలేదని అనుకుంటున్నారు. అటు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ కార్యక్రమాల్లోనూ ఎంఐఎం నేతలెవరు పాల్గొనడం లేదు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడాన్ని మాత్రమే ఇప్పటివరకు ఎంఐఎం వ్యతిరేకించలేదు. అయితే తీర్మానానికి దూరంగా ఉంటూ ఆయనపై తమకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఎంఐఎం.    దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా నిలిచారు పీవీ నరసింహరావు. అయన హయాంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వాటి వల్లే దేశంలో ఆర్థికంగా బలపడిందని చెబుతారు. కారణాలేవైనా పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ ఆయన సొంత రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గగనతలంలో మహిళా శక్తి...!

దేశ ప్రగతిరథం ముందుకు కదలడానికి మహిళా శక్తి ఎంతో అవసరం అని నేటి పాలకులు గుర్తిస్తున్నారు. అనేక రంగాల్లో రాణిస్తున్న మహిళలకు వైమానిక దళంలోనూ ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే 1932 లో ప్రారంభమైన భారత వాయుసేనలో 1990 వరకు మహిళలకు ప్రవేశం లేదు. ఆ తర్వాతే మహిళలకు స్థానం కల్పించారు. అది కూడా చాపర్స్, రవాణాకు సంబంధించిన విమాన సర్వీసుల్లోనే మొదట ప్రవేశం కల్పించారు. 991లో మహిళలు చేరడానికి అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు వాయుసేనలో ఉన్న మహిళల సంఖ్య కేవలం13 శాతం మాత్రమే. 1999 నాటి కార్గిల్ వార్  సందర్భంగా 'గుంజన్ సక్షేనా' తో పాటు ఆమె బ్యాచ్ మేట్ 'శ్రీ విద్య రాజన్' చేతన్ హెలికాప్టర్ ద్వారా గాయపడ్డ సైనికులను తరలించడం, నిఘా ను కొనసాగించడం చేశారు. చాపర్స్ , హెలికాప్టర్ వరకే ఉన్న అనుమతిని ఆ తర్వాత ఫైటర్ జెట్ నడపడానికి కూడా ఇచ్చారు. అయితే 2015 తర్వాతనే ఫైటర్ జెట్ లో మహిళలకు ప్రవేశం కల్పించారు.   వాయుసేనలో చేరేందుకు అనేక ఆడంకులను అధిగమించి 2002లో డాక్టర్ పద్మ బందోపాధ్యాయా 'ఎయిర్ మార్షల్' ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు. కానీ పోరాటానికి ముందు వరుసలో నిలించేందుకు మాత్రం 2015 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రధానమంత్రి మోడీ వైమానిక రంగానికి సంబంధించిన అన్నింటిలో మహిళ భాగస్వామ్యం ఉండాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో అది సాధ్యమైంది. మోడీ తీసుకున్న ఆ నిర్ణయం అనేకమంది భారతీయ మహిళల స్వప్నాన్ని నిజం చేసింది. వివిధ దేశాల్లో, సమాజాల్లో, వ్యక్తుల మధ్య, ముఖ్యంగా భారతీయ వైమానిక రంగంలోకి తరతరాలుగా గుడుకట్టుకున్న లింగవివక్షను రూపుమారింది. 2018 లో ఫ్లయిట్ లెఫ్టినెంట్ 'అవని చరుద్వేది' ఒంటరిగా మిగ్ -21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా అవని చతుర్వేది  తన అనుభవాలను పంచుకుంటూ 'ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక మిషన్, దాన్ని ఆపరేట్ చేస్తున్నది ఆడనా మగనా అనేది దానికి తెలియదు. అది ఇద్దరి విషయంలో ఒకేలా నడుచుకుంటుంది. కాబట్టి ఆడ అయినా, మగ అయినా సమర్థవంతంగా నడపగలిగితే చాలు' అంటూ తోటి సహచరులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఇచ్చిన స్పూర్తితో భవన్ కాంత్, మోహనా సింగ్ వంటి మిగతా మహిళలు కూడా సమర్థవంతంగా వాయు సేనలో చేరి తమ సత్తా చాటారు.   ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొదటి మహిళా పైలట్ భవన్ కాంత్ . 2019 లో కంబాట్ మిషన్ ను సమర్థవంతంగా ఫైటర్ జెట్ నడిపి మహిళల శక్తిసామర్ధ్యాలను విశ్వవ్యాపితం చేశారు. ఇక మోహనా సింగ్ అధునాతనమైన 'హావాక్'  ఫైటర్ జెట్ ను నడిపి భారతదేశ చరిత్రలో తన పేరును పదిల పరుచుకున్నారు. వీరి ప్రతిభ, శక్తి సామర్ధ్యాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ సంవత్సరం (2020) రాష్టప్రతి రాంనాధ్ కొంవింద్ చేతుల మీదుగా నారిశక్తి పురస్కారంతో గౌరవించింది. వీరి స్ఫూర్తితో ఎంతో మంది యువతులు భారత సైన్యంలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. 

అసెంబ్లీలో ఆమోదించనున్న బిల్లులు

క్యాబినేట్ లో నిర్ణయం   ఈనెల 9న సభ ముందుకు రెవెన్యూ కొత్త చట్టం   కొత్త చట్టం వచ్చేవరకు నో రిజిష్ట్రేషన్స్   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో భారీ సంష్కరణలకు శ్రీకారం చుట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు తీసుకురావాలని ముందుగానే అనుకున్నప్పటికీ జాతీయ ఎన్నికలు, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రి కె. చంధ్రశేఖర్ రావు కొత్త చట్టాల గురించి, వచ్చే మార్పుల గురించి కూలంకషంగా ఆలోచించి ముసాయిదాలుగా వాటికి సభ ముందుకు తీసుకువస్తున్నారు.  కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈనెల 9న అసెంబ్లీలో ప్రవేశపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చేవరకు రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లకు సెలవులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే  వివిధ శాఖలకు సంబంధించిన ఆర్టినెన్స్ లను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. - ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 - ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 - తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లు - పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు–2018 సవరణ బిల్లు - తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లు - తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020 - ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 - ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002 - ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ - టిఎస్ బిపాస్ బిల్ - తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లు - ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లు   ఈ ఆర్డినెన్స్ ల తో పాటు క్యాబినెట్ కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు, కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా  17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయించిన ఆర్డినెన్స్ లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ అనుమతితో వాటిని అమలు చేస్తారు.

భారత అక్షరాస్యత రేటు 77.7శాతం

96.2శాతంతో మొదటిస్థానంలో కేరళ   66.4శాతంతో ఆఖరి స్థానంలో ఆంధ్రప్రదేశ్   తెలంగాణలో 72.8శాతం   భారతదేశంలో అక్షరాస్యత రేటుపై జరిగిన సర్వే ఫలితాలను నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసింది. ‘హౌస్‌హోల్డ్‌ సోషల్‌ కన్సంప్షన్‌: ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ ‘జాతీయ నమూనా సర్వే’ నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో నిర్వహించిన  సర్వే ఆధారంగా ఒక నివేదిక తయారుచేశారు. 2017 జూలై నుంచి 2018 జూన్‌ వరకు దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లో 64,519 మందిని.. పట్టణప్రాంతాల్లో 49,238 మందిని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణ ప్రాంతాలవారిలో 4 శాతం మంది ఇళ్లల్లో, పట్టణప్రాంతాల వారిలో 23శాతం మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నట్టు వెల్లడైంది. ఇక అక్షరాస్యత వివరాలకు వస్తే దేశంలో అక్షరాస్యత రేటు 77.7శాతం కాగా గ్రామీణ ప్రాంతాల్లో 73.5 శాతం, పట్టణప్రాంతాల్లో 87.7శాతంగా ఉంది.   రాష్ట్రాల వారీగా అక్షరాస్యత రేటును పరిశీలిస్తే గతంలో మాదిరిగానే కేరళ 96.2శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. 88.7 శాతం అక్షరాస్యతతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్‌ (87.6శాతం), హిమాచల్‌ప్రదేశ్‌(86.6శాతం), అసోం (85.9శాతం) ఉన్నాయి. ఇక అడ్డడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ 66.4శాతం ఉండగా, రాజస్థాన్ 69.7 శాతం, బీహార్ 70.9 శాతం, తెలంగాణ 72.8 శాతం, యుపి 73 శాతం, మధ్యప్రదేశ్ 73.7 శాతం అక్షరాస్యత రేటు కలిగి ఉన్నాయి.   ఇక స్త్రీ, పురుషుల్లో గమనిస్తే దేశవ్యాప్తంగా పురుషుల్లో 84.7శాతం, మహిళల్లో 70.3శాతంగా అక్షరాస్యత రేటు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మహిళల అక్షరాస్యత రేటు  పురుషుల అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉందని సర్వేలో తేలింది. కేరళలో పురుషుల అక్షరాస్యత 97.4 శాతం, మహిళల్లో 95.2 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతం, మహిళల్లో 59.5 శాతం .   స్వాతంత్య్ర భారతవని వయసు 75ఏండ్లు. దానికి కొంచెం ఎక్కువ గా మన దేశ అక్షరాస్యత. ప్రజలను ఓటర్లుగా మాత్రమే గుర్తించే పాలకుల స్వార్థం కారణంగా అక్షరాలు రాని వారి శాతం 22.3గా ఉంది. కేజీ టూ పీజీలు, బేటీ బచావో పథకాలు ఏవీ కూడా అక్షరాస్యతను పెంచలేకపోయాయి. వందేళ్ల సంబురాల నాటికైనా నూరుశాతం అక్షరాస్యత సాధించగలుగుతామా..! సందేహమే...!

కంగనా ముంబైలోకి ఎంటరైతే జరిగేది ఇదే..! 

మహారాష్ట్రలోని శివసేన సర్కార్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగనా రనౌత్ ఇప్పటికే అక్కడి అధికార శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో కంగనా సెప్టెంబర్ 9 న ముంబై చేరుకుంటానని స్వయంగా సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది. ఇదే సందర్భంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ ను కూడా కంగనా సవాలు చేసింది. దీంతో ఆమె ముంబై చేరుకుంటే ఎం జరుగుతుందోనని జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె ముంబై చేరుకున్న తరువాత ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు క్వారంటైన్ పేరుతో నిర్బంధించవచ్చని వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం, ముంబై చేరుకున్న కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు నిర్బంధించడానికి బిఎంసి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.   ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ రూల్స్ ప్రకారం, ఎయిర్ లైన్స్ ద్వారా ముంబైలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారిని తప్పకుండా క్వారంటైన్ లో ఉంచాలి. ఇప్పటికే సుశాంత్ కేసు దర్యాప్తుకు వచ్చిన బీహార్ ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని కూడా బిఎంసి ఇలాగే నిర్బంధించింది. ఇక కోవిడ్ ప్రోటోకాల్ కింద ముంబైకి వచ్చే వ్యక్తి 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి.

ఎంత పని చేశాడు.. పాపం లోకేష్.. పంచాయ‌తీరాజ్‌ శాఖ అధికారుల ఆసక్తికర చర్చ!!

తాము ఏం చేయకపోయినా ఏదో చేశామని మాయమాటలు చెప్పి జిందాబాద్ లు కొట్టించుకునే నాయకులు కొందరు.. తాము ఎంతో చేసినా దానిని చెప్పుకోలేక మాటలు తడబడి నవ్వులపాలయ్యే నాయకులు మరికొందరు. ఆ రెండో కోవకి వచ్చే నాయకుడే నారా లోకేష్. ఆయన దొడ్డిదారిన మంత్రి అయ్యారని విమర్శలు, ఆయన మాట తడబడుతుందని జోకులు వినిపిస్తాయి కానీ.. ఆయన తనకి అప్పగించిన బాధ్యతకు నూటికి నూరు శాతం న్యాయం చేశారని, ఆయన పనితీరుకు ఆయన పనిచేసిన శాఖలకు వచ్చిన ఎన్నో అవార్డులే నిదర్శనం అని చాలా తక్కువమందికి తెలుసు. కారణం, ఆయన ఎంతో చేసినా.. ఆ చేసిన దానిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ప్రత్యర్థులు కూడా ఆయన పనిని కాకుండా, ఆయన మాట తీరుని టార్గెట్ చేస్తూ.. ఆయనని నవ్వులపాలు చేశారు. అయితే, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అన్నట్టుగా.. ఇప్పుడు లోకేష్ పనితీరు గురించి చర్చలు మొదలయ్యాయి.   ఇటీవల ఏపీ సచివాలయం క్యాంటీన్ లో జరిగిన ఒక చర్చ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పంచాయతీ రాజ్ శాఖలో దళిత ఉద్యోగుల‌ మధ్య జ‌రిగిన సంభాషణ.. అక్క‌డే వున్న ఒక జ‌ర్న‌లిస్టు ఆస‌క్తిగా విన్నాడు. వారు ఏం మాట్లాడుకున్నారంటే!.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేష్ పనిచేసేప్పుడు అనేక నూతన కార్యక్రమాలు చేప‌ట్టాడు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సీసీ రోడ్లు, మరుగు దొడ్ల నిర్మాణం, ఎల్ఈడి బల్బులు, తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎన్టీఆర్ సుజల, ఉపాధి హామీ పథకం ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఆ సందర్భంగా జరిగే ప్రతీ రివ్యూ మీటింగ్ లో లోకేష్ ఒక విషయం మాత్రం తరచూ గుర్తు చేసేవారట. ఎల్ఈడి బల్బులు బిగించే కార్యక్రమం 'చంద్రకాంతి'. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు జరిగిన రివ్యూ మీటింగ్ లో ప్రతీ గ్రామంలో ఎస్సీ కాలనీ నుండే 'చంద్రకాంతి' కార్యక్రమం ప్రారంభం కావాలని అధికారులకు గట్టిగా సూచన చేసారట. ఇదే కాదు ఏ ప‌థ‌కమైనా ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌కి తొలి ప్రాధాన్యం ఇవ్వ‌మ‌ని ఆదేశించేవార‌ట‌. ప్ర‌తీ ప‌థ‌కం లాంచింగ్‌కీ ఇదే నిబంధ‌న లోకేష్ చెబుతుండ‌డం..అధికారులు పాటించ‌డం అల‌వాటుగా మారిపోయింది. అయితే, అప్పుడు రివ్యూ మీటింగ్ ల‌లో వున్న అధికారులు.. ఇదేదో ద‌ళితుల్ని దువ్వి ఓట్లు వేయించుకునే ప్లానింగ్ అనుకునేవార‌ట‌. ఒకసారి ఓ ఉన్న‌తాధికారి అక్క‌డి నుంచే ఎందుకు అని రివ్యూ మీటింగ్‌లో అడిగితే...ప్ర‌తీ గ్రామంలోనూ ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌లో ఆల‌స్యంగా ప‌నులు ప్రారంభించ‌డం, స‌కాలంలో పూర్తి చేయ‌క‌పోవ‌డం, నాణ్య‌త లేక‌పోవ‌డం, వారు కూడా ఎవ‌రినీ నిలదీయ‌క‌పోవ‌డంతో.. అభివృద్ధికి దూరం అవుతున్నార‌ని.. అందుకే అభివృద్ధి ప‌నులేమైనా ముందుగా అక్క‌డ నుంచి ప్రారంభించి.. విజ‌య‌వంతంగా పూర్తిచేశాకే మిగిలిన చోట్ల మొద‌లుపెట్టాల‌నేది త‌న ఆలోచ‌న అని చెప్పారట. అలాగే కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత ప్రోగ్రెస్ మీద జరిగే రివ్యూ మీటింగుల్లో కూడా ఎస్సీ కాలనీల్లో పని ఎంత వరకూ వచ్చింది అని అడిగి మరీ తెలుసుకునేవారట. ఒక వేళ పొరపాటున ఏ అధికారి అయినా కొన్ని సమస్యల వలన ఇతర కాలనీల్లో పనులు ప్రారంభించాం అంటే అధికారులకు క్లాస్ పీకేవారట. నేను ఎస్సీ కాలనీల్లో ప్రారంభించమంటే మీరు ఇతర ప్రాంతాల్లో ఎందుకు మొదలుపెట్టారు అని సీరియస్ గా మందలించేవారట.    ఇలా గ‌త‌ ప్రభుత్వంలో పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రిగా లోకేష్ పనితీరుని, దళితులకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేసుకున్న దళిత ఉద్యోగులు.. ఇప్పటి ప్రభుత్వ పనితీరుని కూడా పోల్చుతూ చర్చించుకున్నారు. అప్పుడు ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌కి తొలి ప్రాధాన్యం అని లోకేష్ చెబితే అధికారులం అంతా ఆశ్చ‌ర్య‌పోయేవార‌మ‌ని.. ఇప్పుడు వ‌చ్చిన ప్ర‌భుత్వంలో అరాచ‌కాలు, దౌర్జ‌న్యాలు, దాడులు, శిరోముండనం, భూములు లాక్కోవడం, మానభంగాలు, ఇల్లు తగలబెట్టడం లాంటి ఘటనలు ఎస్సీ కాలనీల నుంచే ప్రారంభమవుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దళితులు అండగా నిలిచి అధికారంలోకి తెచ్చుకున్న జగన్ గారు ఉంటే అభివృద్ధి అంతా ఎస్సీ కాలనీలకే దక్కుతుంది అనుకుంటే.. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అయ్యింద‌ని, పోలీస్ స్టేషన్ లోనే ద‌ళితుల్ని కొట్టి చంపడం, శిరోముండనం చెయ్యడం, మానభంగాలు ఇలా రోజుకో ఘటనతో దళితుల‌పై దాడులు చేసేందుకే ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌న్నంత ఘోరంగా పాల‌న వుంద‌ని అధికారులు చ‌ర్చించుకున్నారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఎస్సీ కాల‌నీల నుంచి మొద‌ల‌వ్వాల‌ని ప‌నిచేసిన మంత్రి నారా లోకేష్ ఓడిపోయి.. అరాచ‌కం ఏదైనా ఎస్సీ కాల‌నీల నుంచే మొద‌లు పెడుతున్న జ‌గ‌న్ ‌రెడ్డి ప్ర‌భుత్వం రావ‌డం ద‌ళితుల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందంటూనే.. పాపం, మంచి చేసిన లోకేష్ ఓడిపోయారంటూ అధికారులు సానుభూతి వ్య‌క్తం చేయ‌డం రికార్డు చేసిన జ‌ర్న‌లిస్టు.. ఒక ఆర్టిక‌ల్‌గా రాసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. దీంతో లోకేష్ పనితీరుపై చర్చ మొదలైంది. లోకేష్ మాటల మనిషి కాదని, చేతల మనిషని.. ఆయన చేసిన మంచిపనులేంటో, ఆయనేంటో ఎప్పటికైనా ప్రజలందరికి తెలిసొస్తుందని టీడీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

అయోధ్యలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం

పునాదుల తవ్వకాల చేప్పట్టిన ఎల్ అండ్ టీ   అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ జన్మభూమి వీలైనంత త్వరగా మందిరం పూర్తి చేయాలన్న సంకల్పంతో అయోధ్య ట్రస్ట్ శరవేగంగా పనులు చేస్తోంది. ఆలయనిర్మాణంలో మొదటిభాగంగా పునాదులు తవ్వుతున్నారు. భూమిలో వంద అడుగల మేరకు పునాదులు తవ్వేందుకు భారీ యంత్రాలను సిద్ధం చేశారు. నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఇంజినీర్లు పనులు చేపట్టారు. కాగా, ఈ పునాదులను సీబీఆర్, ఐఐటీ చెన్నై నిపుణులు డిజైన్ చేశారు.  శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన మందిర నిర్మాణ సమితి చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.   ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేసే నాటికే మందిర డిజైన్ మొత్తం పూర్తి అయ్యింది. ఇటీవలే రామ మందిరం లేఔట్ కు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ(ఏడీఏ)కూడా ఆమోదం తెలిపింది. మొత్తం లేఔట్ రెండు లక్షల 74వేల చదరపు మీటర్లు కాగా  ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు  అంత‌స్థుల్లో నిర్మించ‌నున్నారు.

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు.. సీఎం జగన్ తో కొడాలి నాని

కొద్దిరోజుల క్రితం మంత్రి కొడాలి నాని రాజధాని అమరావతి విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు కేటాయించగా.. భూములిచ్చిన రైతులు హైకోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. 55000 మంది పేదలకు పట్టాలు ఇస్తే దానికి వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్న అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండడానికి వీల్లేదని తాజాగా మంత్రి కొడాలి నాని సీఎం జగన్ కు సూచించినట్లుగా తెలిపారు. దీని పై అన్ని పక్షాలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా సీఎం జగన్ ను కోరానని నాని తెలిపారు. అంతే కాకుండా చంద్రబాబుకు జనంలో బలం లేదని ఉన్నదే 23 మంది.. వారిలో కూడా కొంత మంది చేజారి పోయారని అన్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే ఆయనని ఎమ్మెల్యేను చేయడం ఎవరి తరము కాదని అయన సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు సీఎం జగన్ వెన్నంటి ఉండి దుష్ట శక్తులను ఎదుర్కొంటానని అయన అన్నారు.

భారత్ చైనాల మధ్య అర్థరాత్రి కాల్పుల కలకలం..

భారత్, చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలు తగ్గకముందే ఇంకోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఏసి వద్ద చైనా సైన్యం రెచ్చగొట్టేలా వ్యవహరించందని నిన్న లడఖ్‌లోని పాంగ్యాంగ్ సరస్సు ఒడ్డున వాస్తవ నియంత్రణ రేఖను దాటి వచ్చే ప్రయత్నంలో భారత సైనికులు కాల్పులు జరిపారంటూ చైనా ఆరోపించింది. దీనిని తిప్పికొట్టేందుకు చైనా కూడా ఎదురుదాడి చేయవలసి వచ్చిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్ మొట్ట మొదటిగా కాల్పులు జరిపిందని.. ఇండియన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ దాటి షెన్పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిందని చైనా సైనిక ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై భారత వైపు నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.