ఏపీ గవర్నర్ మౌనానికి కారణం అదేనా?
కారణాలేమిటో తెలియదుకాని, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈమద్యకాలంలో సైలెంట్ అయ్యారు. కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో విపరీతంగా ప్రబలుతున్న నేపధ్యంలో, ఆయన వయసు రీత్యా ఎలాంటి కార్యక్రమాలకి హాజరు అవడం గాని, సందర్శకులకు కలవడం గాని చేయడంలేదని రాజ్ భవన్ వర్గాలు అంటున్నప్పటికీ, కనీసం పండుగలు పబ్బాలప్పుడు కూడా మెసేజిలు కూడా ఇవ్వడం మానేశారు..
సహజంగా ఏదైనా పండగలకో, మరేఇతర కార్యక్రమాలకో రాజ్ భవన్ నుండి రాష్ట్ర ప్రజలకు సందేశాలు రావడం సహజం. అలాంటిది, కనీసం అత్యంత ప్రాముఖ్యమున్న వినాయక చవితికి కూడా గవర్నర్ వద్దనుండి ఎలాంటి సందేశం లేదంటే, పరిస్థితిని సులభంగానే అర్థంచేసుకోవచ్చు.
దీనికి కారణాలేయమైనప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ వర్గాలు మాత్రం దీనిని వేరే కోణంలో చూస్తున్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ విషయంలో అయితే నేమి, రాజధాని మార్పు, సీఆర్డీయే చట్టం రద్దు విషయంలో అయితే నేమి, రాజ్ భవన్ కొంత విమర్శలు ఎదుర్కొన్న మాట నిజం. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో అయితే నేరుగా సుప్రీమ్ కోర్ట్ గవర్నర్ విడుదల చేసిన ఆర్డినెన్సు ను పూర్తిగా చెల్లదని చెప్పడంతో, రాజ్ భవన్ వర్గాలు కొంత ఆశ్చర్యానికి గురైన మాట వాస్తవం.
ఇక, మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ చట్టం రద్దు విషయాలైతే ప్రస్తుతానికి హై కోర్ట్ దాటి సుప్రీమ్ కోర్ట్ వరకు వెళ్ళాయి. దేశ అత్యున్నత న్యాయస్తానం నిర్ణయం ఇంకా రానప్పటికీ, వీటిపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంతవరకు విమర్శలకు గురైనాయి.
అప్పటినుండే, రాష్ట్ర గవర్నర్ మౌనం వహించారని రాజకీయ విశ్లేషకుల వాదన. కోవిద్ నేపథ్యంలో అయితేనేమి, ఆయన వయసు రీత్యా అయితేనేమి, గవర్నర్ ప్రత్యక్ష్యంగా జనబాహుళ్యంలోకి రాకపోయినా, కనీసం ఆన్లైన్ ద్వారా నయినా కొన్నీ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నప్పటికీ, ఎందుకో తెలియదుకాని, ఆయన మౌనం వహించారు.
సుమారు అదే వయసులో వున్న హిమాచల ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దాదాపు ప్రతి రోజు ఏదోవిధంగా వార్తల్లో ఉంటూనే వున్నారనేది అందరికి తెలిసిందే. ఇక తెలంగాణా గవర్నర్ తమిళసై అయితే దాదాపు ప్రతిరోజు ఏదోఒక కార్యక్రంలో పాల్గొంటూనే వున్నారు. లేదా కనీసం రాజ్ భవన్ నుండి ఏదోఒక సందేశాన్నైనా విడుదల చేస్తారు.
అలాంటిది, ఆంధ్ర గవర్నర్ కనీసం వినాయక చవితి శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రజలకు అందించలేదు. చివరిసారిగా బిశ్వభూషణ్ హాజరైన కార్యక్రమం, జగన్ కేబినెట్లో ఇద్దరు మంత్రులు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మరియు అప్పలరాజు లకు జులై 22 న ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు మాత్రమే. అప్పుడు కూడా రాష్ట్రం కోవిద్ మహమ్మారి గుప్పట్లోనే వుంది. ఇంకా చెప్పాలంటే, లాక్ డౌన్ అప్పట్లో చాలా పకడ్బందీగా అమలవుతున్న సమయం. కానీ, ఆయన దీనికి హాజరవడం, కొంతమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత, ఇక కేవలం ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఆయన రెండు సార్లు కలవడం జరిగింది. అదికూడా ఆ రెండు ఆర్డినెన్సు లు విడుదల చెయ్యడానికి మాత్రమే.
ఎందుకో తెలియదుకాని, జగన్ కూడా మూడు రాజధానుల విషయంలో విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత, ఆయన కూడా రాజ్ భవన్ కు వెళ్లిన దాఖలాలు కనబడ్డంలేదు. కోవిడా, మరే ఇతర కారణలా, ఏది ఏమైనప్పటికి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈ మధ్య కొంత మౌనంగానే వుంటున్నారనేది మాత్రం వాస్తవం.