ఎంత పని చేశాడు.. పాపం లోకేష్.. పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఆసక్తికర చర్చ!!
posted on Sep 8, 2020 @ 10:58AM
తాము ఏం చేయకపోయినా ఏదో చేశామని మాయమాటలు చెప్పి జిందాబాద్ లు కొట్టించుకునే నాయకులు కొందరు.. తాము ఎంతో చేసినా దానిని చెప్పుకోలేక మాటలు తడబడి నవ్వులపాలయ్యే నాయకులు మరికొందరు. ఆ రెండో కోవకి వచ్చే నాయకుడే నారా లోకేష్. ఆయన దొడ్డిదారిన మంత్రి అయ్యారని విమర్శలు, ఆయన మాట తడబడుతుందని జోకులు వినిపిస్తాయి కానీ.. ఆయన తనకి అప్పగించిన బాధ్యతకు నూటికి నూరు శాతం న్యాయం చేశారని, ఆయన పనితీరుకు ఆయన పనిచేసిన శాఖలకు వచ్చిన ఎన్నో అవార్డులే నిదర్శనం అని చాలా తక్కువమందికి తెలుసు. కారణం, ఆయన ఎంతో చేసినా.. ఆ చేసిన దానిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ప్రత్యర్థులు కూడా ఆయన పనిని కాకుండా, ఆయన మాట తీరుని టార్గెట్ చేస్తూ.. ఆయనని నవ్వులపాలు చేశారు. అయితే, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అన్నట్టుగా.. ఇప్పుడు లోకేష్ పనితీరు గురించి చర్చలు మొదలయ్యాయి.
ఇటీవల ఏపీ సచివాలయం క్యాంటీన్ లో జరిగిన ఒక చర్చ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పంచాయతీ రాజ్ శాఖలో దళిత ఉద్యోగుల మధ్య జరిగిన సంభాషణ.. అక్కడే వున్న ఒక జర్నలిస్టు ఆసక్తిగా విన్నాడు. వారు ఏం మాట్లాడుకున్నారంటే!.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేష్ పనిచేసేప్పుడు అనేక నూతన కార్యక్రమాలు చేపట్టాడు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సీసీ రోడ్లు, మరుగు దొడ్ల నిర్మాణం, ఎల్ఈడి బల్బులు, తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎన్టీఆర్ సుజల, ఉపాధి హామీ పథకం ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఆ సందర్భంగా జరిగే ప్రతీ రివ్యూ మీటింగ్ లో లోకేష్ ఒక విషయం మాత్రం తరచూ గుర్తు చేసేవారట. ఎల్ఈడి బల్బులు బిగించే కార్యక్రమం 'చంద్రకాంతి'. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు జరిగిన రివ్యూ మీటింగ్ లో ప్రతీ గ్రామంలో ఎస్సీ కాలనీ నుండే 'చంద్రకాంతి' కార్యక్రమం ప్రారంభం కావాలని అధికారులకు గట్టిగా సూచన చేసారట. ఇదే కాదు ఏ పథకమైనా ఎస్సీ, ఎస్టీ కాలనీలకి తొలి ప్రాధాన్యం ఇవ్వమని ఆదేశించేవారట. ప్రతీ పథకం లాంచింగ్‌కీ ఇదే నిబంధన లోకేష్ చెబుతుండడం..అధికారులు పాటించడం అలవాటుగా మారిపోయింది. అయితే, అప్పుడు రివ్యూ మీటింగ్ లలో వున్న అధికారులు.. ఇదేదో దళితుల్ని దువ్వి ఓట్లు వేయించుకునే ప్లానింగ్ అనుకునేవారట. ఒకసారి ఓ ఉన్నతాధికారి అక్కడి నుంచే ఎందుకు అని రివ్యూ మీటింగ్‌లో అడిగితే...ప్రతీ గ్రామంలోనూ ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఆలస్యంగా పనులు ప్రారంభించడం, సకాలంలో పూర్తి చేయకపోవడం, నాణ్యత లేకపోవడం, వారు కూడా ఎవరినీ నిలదీయకపోవడంతో.. అభివృద్ధికి దూరం అవుతున్నారని.. అందుకే అభివృద్ధి పనులేమైనా ముందుగా అక్కడ నుంచి ప్రారంభించి.. విజయవంతంగా పూర్తిచేశాకే మిగిలిన చోట్ల మొదలుపెట్టాలనేది తన ఆలోచన అని చెప్పారట. అలాగే కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత ప్రోగ్రెస్ మీద జరిగే రివ్యూ మీటింగుల్లో కూడా ఎస్సీ కాలనీల్లో పని ఎంత వరకూ వచ్చింది అని అడిగి మరీ తెలుసుకునేవారట. ఒక వేళ పొరపాటున ఏ అధికారి అయినా కొన్ని సమస్యల వలన ఇతర కాలనీల్లో పనులు ప్రారంభించాం అంటే అధికారులకు క్లాస్ పీకేవారట. నేను ఎస్సీ కాలనీల్లో ప్రారంభించమంటే మీరు ఇతర ప్రాంతాల్లో ఎందుకు మొదలుపెట్టారు అని సీరియస్ గా మందలించేవారట.
ఇలా గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా లోకేష్ పనితీరుని, దళితులకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేసుకున్న దళిత ఉద్యోగులు.. ఇప్పటి ప్రభుత్వ పనితీరుని కూడా పోల్చుతూ చర్చించుకున్నారు. అప్పుడు ఎస్సీ, ఎస్టీ కాలనీలకి తొలి ప్రాధాన్యం అని లోకేష్ చెబితే అధికారులం అంతా ఆశ్చర్యపోయేవారమని.. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు, శిరోముండనం, భూములు లాక్కోవడం, మానభంగాలు, ఇల్లు తగలబెట్టడం లాంటి ఘటనలు ఎస్సీ కాలనీల నుంచే ప్రారంభమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు అండగా నిలిచి అధికారంలోకి తెచ్చుకున్న జగన్ గారు ఉంటే అభివృద్ధి అంతా ఎస్సీ కాలనీలకే దక్కుతుంది అనుకుంటే.. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అయ్యిందని, పోలీస్ స్టేషన్ లోనే దళితుల్ని కొట్టి చంపడం, శిరోముండనం చెయ్యడం, మానభంగాలు ఇలా రోజుకో ఘటనతో దళితులపై దాడులు చేసేందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నంత ఘోరంగా పాలన వుందని అధికారులు చర్చించుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ కాలనీల నుంచి మొదలవ్వాలని పనిచేసిన మంత్రి నారా లోకేష్ ఓడిపోయి.. అరాచకం ఏదైనా ఎస్సీ కాలనీల నుంచే మొదలు పెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రావడం దళితులకు తీరని అన్యాయం జరిగిందంటూనే.. పాపం, మంచి చేసిన లోకేష్ ఓడిపోయారంటూ అధికారులు సానుభూతి వ్యక్తం చేయడం రికార్డు చేసిన జర్నలిస్టు.. ఒక ఆర్టికల్‌గా రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో లోకేష్ పనితీరుపై చర్చ మొదలైంది. లోకేష్ మాటల మనిషి కాదని, చేతల మనిషని.. ఆయన చేసిన మంచిపనులేంటో, ఆయనేంటో ఎప్పటికైనా ప్రజలందరికి తెలిసొస్తుందని టీడీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు.