వ్యక్తిత్వాన్ని చెక్కే శిల్పి గురువే
సామాజిక మాధ్యమాల్లో తమ గురువులను మననం చేసుకుంటున్న నెటిజన్లు
‘‘గురుబ్రహ్మ: గురువిష్ణు:
గురుదేవో: మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ:’’
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన మూర్తిమత్వం గురువు. ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. అందుకే మన పెద్దలు గురువుకు ప్రముఖ స్థానం ఇచ్చారు.. నిజానికి గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది… అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువు అని అర్థం. ఒక రాయికి రూపం తేవాలంటే శిల్పి కావాలి. మట్టిలో దొరికిన మాణిక్యానికి మెరుగులు దిద్దితేనే దాని విలువ ప్రపంచానికి తెలుస్తుంది. అదే విధంగా ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే, మంచిచెడు విచక్షణతో సమాజంలో జీవించాలంటే అతడికి గురువు మార్గదర్శనం ఉండాలి. అందుకే ఉపాధ్యాయుడు లేని విద్య నిష్ఫలం అని పెద్దలు అంటారు. మానసిక పరిపక్వత చెందే దశలో పిల్లలకు విద్య, బుద్ధి, క్రమశిక్షణ నేర్పించి, ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దేవాడు ` గురువు’. ప్రతి ఒక్కరికీ తల్లే తొలి గురువే. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. అఆలు నేర్పిన ఉపాధ్యాయుడి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. గురువువంటే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శిల్పి, నైపుణ్యతను జోడించే నేర్పరి. అలాంటి గురుస్థానం నుంచి దేశ ప్రథమ పౌరుడి స్థానం వరకు ఎదిగిన వ్యక్తి భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన 5 సెప్టెంబర్ ను ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటాం.
నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్.
పుస్తకాలు వేలకొద్దీ ముందున్నా..? వాటిని అర్థం చేసుకుని వాటి పరమార్థాన్ని చెప్పగలిగేవారు లేకుంటే వ్యర్థం. అందుకే గురువు మన జీవితానికి అర్థం చెప్పే ఓ దైవం అన్నారు దాశరథి కృష్ణమాచార్యులు
పురాణాల్లో, ఇతిహాసాల్లోనూ గురువుకు పెద్దపీఠ వేశారు. గురువులుగా కెరీర్ ను ప్రారంభించి తర్వాత కాలంలో సాహిత్యరంగంలో రాణించిన ప్రముఖ తెలుగు కవులు గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు, గుర్రం జాషువ, విశ్వనాథ సత్యనారాయణ, వావిళ్ల రామస్వామి , చిలకమర్తి లక్ష్మీనర్సింహం, రాయప్రోలు సుబ్బారావు, జ్యోతిరావు ఫూలే తదితరులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్న వారిలో అధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. గురువులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించినపుడే సమాజం జాగృత మవుతుంది. మార్గదర్శకులైన గురువులున్నపుడే జాతి సమున్నత శిఖరాలకు చేరుకుంటుంది.
పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉండేది. ఆ తర్వాత విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులతో కేవలం విద్యాబోధనకే గురువులు పరిమితం అయ్యారు. ప్రస్తుతం డిజిటల్ విద్యాబోధనలో విద్యార్థులకు, గురువులకు మధ్య ఇంటర్నెట్ చేరింది. తరగతి గది మొబైల్‌లోకి వచ్చిన ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుడి బాధ్యత మరింత పెరిగింది.
ప్రతిఏటా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని అవార్డులతో సత్కరిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఇంటికే పరిమితమై విద్యార్థులు, ఇంటర్నెట్ కే పరిమితమై టీచర్లు ఉంటున్నారు. అయినా గురువు స్థానం గురువుదే. వాట్సాప్ మెసెజ్, ట్విట్టర్లు, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ జీవితంలో మార్పు చెప్పిన గురువుల గురించి మరోసారి మననం చేసుకుంటున్నారు.