భారత అక్షరాస్యత రేటు 77.7శాతం
posted on Sep 8, 2020 @ 1:48PM
96.2శాతంతో మొదటిస్థానంలో కేరళ
66.4శాతంతో ఆఖరి స్థానంలో ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో 72.8శాతం
భారతదేశంలో అక్షరాస్యత రేటుపై జరిగిన సర్వే ఫలితాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసింది. ‘హౌస్‌హోల్డ్ సోషల్ కన్సంప్షన్: ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ‘జాతీయ నమూనా సర్వే’ నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఒక నివేదిక తయారుచేశారు. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లో 64,519 మందిని.. పట్టణప్రాంతాల్లో 49,238 మందిని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణ ప్రాంతాలవారిలో 4 శాతం మంది ఇళ్లల్లో, పట్టణప్రాంతాల వారిలో 23శాతం మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నట్టు వెల్లడైంది. ఇక అక్షరాస్యత వివరాలకు వస్తే దేశంలో అక్షరాస్యత రేటు 77.7శాతం కాగా గ్రామీణ ప్రాంతాల్లో 73.5 శాతం, పట్టణప్రాంతాల్లో 87.7శాతంగా ఉంది.
రాష్ట్రాల వారీగా అక్షరాస్యత రేటును పరిశీలిస్తే గతంలో మాదిరిగానే కేరళ 96.2శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. 88.7 శాతం అక్షరాస్యతతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్ (87.6శాతం), హిమాచల్‌ప్రదేశ్(86.6శాతం), అసోం (85.9శాతం) ఉన్నాయి. ఇక అడ్డడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ 66.4శాతం ఉండగా, రాజస్థాన్ 69.7 శాతం, బీహార్ 70.9 శాతం, తెలంగాణ 72.8 శాతం, యుపి 73 శాతం, మధ్యప్రదేశ్ 73.7 శాతం అక్షరాస్యత రేటు కలిగి ఉన్నాయి.
ఇక స్త్రీ, పురుషుల్లో గమనిస్తే దేశవ్యాప్తంగా పురుషుల్లో 84.7శాతం, మహిళల్లో 70.3శాతంగా అక్షరాస్యత రేటు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మహిళల అక్షరాస్యత రేటు పురుషుల అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉందని సర్వేలో తేలింది. కేరళలో పురుషుల అక్షరాస్యత 97.4 శాతం, మహిళల్లో 95.2 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతం, మహిళల్లో 59.5 శాతం .
స్వాతంత్య్ర భారతవని వయసు 75ఏండ్లు. దానికి కొంచెం ఎక్కువ గా మన దేశ అక్షరాస్యత. ప్రజలను ఓటర్లుగా మాత్రమే గుర్తించే పాలకుల స్వార్థం కారణంగా అక్షరాలు రాని వారి శాతం 22.3గా ఉంది. కేజీ టూ పీజీలు, బేటీ బచావో పథకాలు ఏవీ కూడా అక్షరాస్యతను పెంచలేకపోయాయి. వందేళ్ల సంబురాల నాటికైనా నూరుశాతం అక్షరాస్యత సాధించగలుగుతామా..! సందేహమే...!