గన్నవరం వైసీపీలో ఘర్షణ... వెంకట్రావు వర్గీయులపై వంశీ వర్గం దాడి

గన్నవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తరువాతి కాలంలో సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన దగ్గరి నుండి నియోజకవర్గంలోని ఆ పార్టీ గ్రూఫుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీకి చెందిన చిన్న అవుటపల్లి మాజీ సర్పంచి కోట వినయ్ తో పాటు మరి కొందరు వైసీపీ కార్యకర్తలపై.. ఎమ్యెల్యే వంశీ అనుచరుల దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటన పై బాధితులు ఆత్కురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వంశీ పై పోటీ చేసి.. ప్రస్తుతం KDCC చైర్మన్ గా ఉన్న యార్లగడ్డ వెంకటరావు పోలీస్ ‌స్టేషన్‌కి వచ్చి.. బాధితులకు తాను అండగా ఉంటాననీ, అందుకోసమే పోలీస్ ‌స్టేషన్‌కి వచ్చానని అన్నారు. అంతేకాకుండా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఐతే దీని పై పోలీసులు స్పందిస్తూ.. ఘటన పై దర్యాప్తు చేసి... చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో.. రాజ్ నాథ్ తో చైనా రక్షణ మంత్రి తొలి భేటీ 

భారత చైనా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల రక్షణ మంత్రులు తొలి సారి భేటీ అయ్యారు. ప్రస్తుతం మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న సాయంత్రం చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్జితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై కూడా వీరు చర్చించినట్టుగా తెలుస్తోంది. దాదాపు రెండున్నర గంటలపాటు ఇద్దరి మధ్య ఈ సమావేశం జరిగింది. సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథస్థితిని కొనసాగించాలని ఈసందర్భంగా రాజ్‌నాథ్ చైనాను కోరారు. అయితే మే నెలలో లడఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగి రెండు దేశాల సైనికులు కూడా మరణించిన తర్వాత భారత చైనాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి.

త్వరలో బైపోల్ షెడ్యూల్.. దుబ్బాకలో వేడీ.. టఫ్ ఫైటే!

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో అసెంబ్లీ సీటు ఖాళీగా ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, లోక్ సీట్లకు ఎన్నికలు ఉంటాయని సీఈసీ ప్రకటించింది. దీంతో దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. రామలింగారెడ్డి కుటుంబంలో ఎవరికి టిఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినా… తాము ఇక్కడ పోటీ చేయబోమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కావచ్చని అనుకున్నారు. అయితే పీసీసీ మాత్రం దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించింది. గ‌తంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందిన ఖేడ్‌, పాలేరులో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల పోటీకి నిలిపింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా దుబ్బాక‌లో అభ్య‌ర్థిని నిల‌బెట్టాలని నిర్ణయించింది.       టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కారు పార్టీ ఘన విజయాలు సాధించింది. అయితే ఈ సారి దుబ్బాక‌లో వార్ వ‌న్‌సైడ్‌గా ఉండే ప‌రిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని వివిధ సంస్థల సర్వేల్లో తేలుతోంది. దుబ్బాక టికెట్ కోసం అధికార పార్టీలో పోటీ కూడా తీవ్రంగా ఉంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి భార్యకు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నా ఇంకా క్లారిటీ లేదు. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ లో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి త‌న‌యుడు శ్రీనివాస్‌రెడ్డి సైతం ఈ సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే ఆయ‌న కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తార‌న్న టాక్ కూడా ఉంది.    అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కూడా తర్జనభర్జన పడుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మద్దుల నాగేశ్వరరెడ్డిని బరిలోకి దించాలా..? లేక విజయశాంతిని నిలబెట్టాలా అనే ఆలోచనలో ఉంది. గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్‌కు గ్రామ స్థాయి వరకూ ఉన్న కార్యకర్తల బలం, విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాములమ్మ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాములమ్మ కూడా పోటీ చేసే విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.   బీజేపీ త‌ర‌పున ఆ పార్టీ కీల‌క నేత ర‌ఘునంద‌న్ రావు పేరు దాదాపు ఖ‌రారైంది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌చారం కూడా చేప‌ట్టారు. యువ‌కులే టార్గెట్‌గా ఆయ‌న రాజ‌కీయం న‌డుస్తోంది. పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేస్తూ యువకులను, ఇతర పార్టీల వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ర‌ఘునంద‌న్ రావు ఇక్క‌డ నుంచి 2014, 2018 ఎన్నిక‌ల‌తో పాటు 2019 మెద‌క్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. బిగ్‌బాస్ ఫేం క‌త్తి కార్తీక ఇప్ప‌టికే దుబ్బాకలో ప్రచారం ప్రారంభించారు. మ‌రో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ప్ర‌చారం ప్రారంభించేశారు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాకుండానే దుబ్బాక రాజ‌కీయం వేడెక్కింది.

కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు.. తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం 

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారికి సంబంధించి ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత, అదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలను చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు కేవలం 8 లేదా 9, 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోయారని ప్రభుత్వం రిపోర్టులు ఇవ్వడం మీద కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దీని పై వెంటనే సమగ్రమైన నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణాలో పబ్లిక్ హెల్త్ పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు.. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో స్పష్టంగా చెప్పాల‌ని కోరింది. ప్ర‌భుత్వ ఆస్ప‌‌త్రుల్లో సిబ్బంది పెంపు, ఇత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై కూడా పూర్తి వివ‌రాలు అంద‌జేయాల‌ని సూచించింది. తాము వివరణ కోరిన అంశాల‌న్నింటిపైనా ఈ నెల 22వ తేదీలోగా నివేదిక‌లు ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ తప్పుడు రిపోర్టులు ఇస్తే మ‌రోసారి ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిని మళ్ళీ కోర్టుకు పిలవాల్సి వస్తుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చ‌రించింది. ఈ పిటిషన పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 24కు వాయిదా వేసింది.

గొంతు కేన్సర్ వచ్చి పోతావ్.. ఏపీ మంత్రికి దేవినేని ఉమా స్ట్రాంగ్ కౌంటర్ 

ఏపీలో వైసిపి టీడీపీ నేతల మధ్య తాజాగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబును పెద్ద బిచ్చగాడని, అలాగే మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అడ్డగాడిద అంటూ ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మరో మాజీ మంత్రి దేవినేని ఉమా ను ఏకంగా లారీతో తొక్కిస్తానని హెచ్చరించిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. మంత్రి కొడాలి నాని తాటాకు చప్పుళ్లకు భయపడేవారు టీడీపీలో ఎవరూ లేరని హెచ్చరించారు. "కొడాలి నాని ఏ మాత్రం చదువు, సంస్కారం లేకుండా మాట్లాడారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చంద్రబాబుపై సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు వయస్సు గురించి.. మా చావులు గురించి మాట్లాడితే మీరు చేసిన తప్పులు కనపడకుండా పోతాయా? మీ అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబును, దేవినేని ఉమాను బూతులు తిట్టి దాంతో మీ అసమర్థత కప్పిపుచ్చుకోవచ్చని భావిస్తున్నారా? నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్‌తో పోతావ్" అని మంత్రి కొడాలి నాని పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. అంతేకాకుండా లారీలతో గుద్దిస్తానన్న కొడాలి బెదిరింపులపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలి అని ఉమా కోరారు. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టి చేతకాక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఉమా అన్నారు.

కృష్ణా జిల్లాలో దారుణం.. దళిత యువతి ఇంటిని తగులబెట్టిన వైసీపీ వర్గీయులు!!

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమించి మోసం చేశాడంటూ ఆగ్రకులానికి చెందిన యువకుడిపై ఓ దళిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ యువకుడికి సంబంధించిన వ్యక్తులు.. ఆ యువతి ఇంటిపై దాడి చేసి ఇంటిని తగులబెట్టారు.   వడాలికి చెందిన సాయిరెడ్డి అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ అయినంపూడికి చెందిన దళిత యువతి మచ్చా ధనలక్ష్మి ఇటీవల ముదినేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ప్రస్తుతం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.     ఈ క్రమంలో అధికార పార్టీకి చెందినవారమంటూ కొందరు బాధితురాలి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగారు. కేసును విరమించుకుని రాజీకి రాకపోతే ప్రాణాలకు సైతం ముప్పు ఉంటుందని హెచ్చరించడమే కాకుండా.. కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో.. తమ ఇంటిపై దాడి చేసి, తమపై దౌర్జన్యం చేశారని వారం క్రితం బాధితురాలి సోదరుడు మచ్చ సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అయినా అధికార పార్టీకి చెందిన వారు ఆ కుటుంబంపై ఒత్తిళ్లు కొనసాగించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాధితురాలి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా, ఆ కుటుంబం మాత్రం ప్రాణాలతో బయటపడింది. తాము రాజీకి రాలేదన్న కక్షతోనే సాయిరెడ్డి తన వర్గంతో కలిసి తమ కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ.. దీనిపై సుబ్రహ్మణ్యం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటానని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.    అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన పాపానికి ఆ కుటుంబానికి నిలువనీడ లేకుండా చేశారంటూ అధికార పార్టీకి చెందిన వారిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది భయానకమైన ఘటన అని అన్నారు. మచ్చా ధనలక్ష్మి అనే దళిత మహిళకు చెందిన ఇంటిని వైసీపీ వర్గీయులు తగలబెట్టారని, వైసీపీ వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. గత 15 నెలలుగా ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.

చంద్రబాబు పెద్ద భిక్షగాడు.. అచ్చెన్నాయుడు అడ్డగాడిద.. మంత్రి భాష!!

ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎవరేమనుకున్నా.. తన మాట తీరు ఇంతేనని ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి రుజువు చేశారు. తాజాగా ఆయన టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను బూతుల మంత్రి అని అంటున్నారని, తాను బూతులు తిడితే అసలు దేవినేని ఉమా, చంద్రబాబు బతికి ఉంటారా? అని వ్యాఖ్యానించారు.   నేను లారీ డ్రైవర్ అయితే.. నువ్వేమైనా మైసూర్‌ మహారాజువా?. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు.. వాటిని ఈయన కడిగేవాడు అంటూ దేవినేని ఉమాపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబే పెద్ద భిక్షగాడని.. తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటని విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ కుటుంబం అని నాని చెప్పుకొచ్చారు.   అంతేకాదు, ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే ఈఎస్ఐ స్కాం ఆరోపణలతో అరెస్టై.. చాలారోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిపై కూడా నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిలా 70 రోజుల పాటు..ఆస్పత్రిలో పడుకున్న అడ్డగాడిద ఎవరూ లేరని విమర్శించారు.   రైతులకు 'ఉచిత విద్యుత్‌- నగదు బదిలీ' పథకంపై మీడియాలో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా సన్న బియ్యం విషయంలో 'నీ అమ్మ మొగుడు చెప్పాడా' అంటూ నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో ఆయన భాష తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయినా ఆయన తీరు మారలేదు. తాజాగా భిక్షగాడు, అడ్డగాడిద అంటూ మరోసారి విపక్ష నేతలపై వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారితీస్తోంది.

దేశ సరిహద్దుల్లో సైన్యం సిద్ధంగా ఉంది

డ్రాగన్ కంట్రీ చర్యలను తిప్పికొడతాం   భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్   భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తూ సరిహద్దుల వెంట తన సైన్యబలగాలను మోహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ భారత్ సైన్యం ముందుకు వెళ్తోంది. సరిహద్దుల్లో ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. డ్రాగన్ కంట్రీకి ధీటైన జవాబు చెప్పేందుకు ఆర్మీ సర్వసన్నద్దంగా ఉందని, ఇప్పటికే త్రిదళాలను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు చాపకింద నీరులా సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనా సైన్యం ఆటలు ఇక సాగవని, కుట్రలను తిప్పికొట్టగల శక్తి సామర్ధాలు భారత్ కు ఉన్నాయని ఆయన అన్నారు.   మరో వైపు భారత్ చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. యుద్ధం అంటూ వస్తే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు భారత్ చేస్తోంది. అమెరికా, జపాన్ , ఫ్రాన్స్ ఇప్పటికే మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. అమెరికా సైనిక దళాలు కూడా ముందస్తుగానే భారత్ కు అండగా నిలుస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దు వివాదంలో అమెరికా సైన్యం భారత దేశానికి  మద్దతు ఇస్తామని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ఇప్పటికే వెల్లడించారు. యుద్ధ నౌకలను కూడా దక్షిణ హిందు మహాసముద్రంలో మోహరించారు. తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి రష్యాలో పర్యటిస్తూ ఆ దేశ మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఔట్ సోర్సింగ్ రిక్రూట్ మెంట్ పై మాట మార్చిన సర్కార్.. అప్పుడలా ఇప్పుడిలా

తెలంగాణ ప్రభుత్వం పోలీసు బెటాలియన్లలో రెగ్యులర్ పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బార్బర్, కుక్, ధోబీ, నర్సింగ్, మిడ్‌వైఫ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్, స్కావెంజర్, స్వీపర్ వంటి విభాగాల్లోని మొత్తం 272 పోస్టులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఇప్పటి నుండి ఈ పోస్టులకు ఔట్ షోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతి పైన ఆ ఖాళీలను భర్తీ చేసుకోవాలని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో సూచించింది.   అయితే తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా 2017 లో సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేస్తూ పర్మనెంట్ గా చేయవలసిన ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడం కరెక్ట్ కాదని... డిపార్ట్ మెంట్ కు సర్వీస్ అవసరముంటే పర్మనెంట్ పద్దతిలో రిక్రూట్ చేసుకోండని అంతేకాని ఔట్ సోర్సింగ్ కు పోవద్దని చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

కరోనా కు మరో కొత్త వ్యాక్సిన్

అమెరికా లోని ఓహైయో యూనివర్సిటీ పరిశోధన   ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం   కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోన్నే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ కోసం ప్రపంచమానవాళి ఆశగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో కరోనా మహమ్మారితో పోరాడుతూ వైరస్ ను సమర్ధవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ ను అమెరికాలోని ఓహైయోవర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటికే వారు కనిపెట్టిన వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించగా ఆశించిన ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త యు జో డాంగ్ వివరించారు.    కోవిద్ 19 వైరస్ రెండు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని శరీరంలోని జీవకణాలను సోకుతాయి. అయితే ఈ వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకునే కొన్నిరకాల ప్రోటీన్ల ఉత్పత్తికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. ఓహైయో యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేసిన వ్యాక్సిన్ ను ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటిలో ఎక్కువసంఖ్యలో వైరస్ ను ఎదుర్కోనే ప్రొటీన్లు విడుదలైన విషయం గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ‘సెల్యూలార్ ప్రాసెస్’ చేయడం వల్ల ఎలుకల్లోని జన్యు సమాచారాన్ని ఫంక్షనల్ ప్రొటీన్లుగా మార్చే ఆర్ఎన్ఏ మెసెంజర్ అణువుల సీక్వెన్స్ (అన్‌ట్రాన్స్‌లేటెడ్ రీజియన్స్-యూటీఆర్)లో మార్పులు చోటుచేసుకోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ఎలుకల్లో వైరస్ ను ఎదుర్కోనే ప్రోటీన్లు విడుదల కావడంతో పాటు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు వివరించారు.   ప్రపంచవ్యాప్తంగా కోవిద్ వైరస్ కు వ్యాక్సిన్ తయారీ జరుగుతున్నా ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఏపీ బీజేపీ తొలి విజయం ఇదే .. సోము వీర్రాజు 

నిన్న సమావేశమైన ఏపీ కేబినెట్ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ నిర్వహించేవారికి, అలాగే ఆడేవారికి కూడా జైలు శిక్ష ప‌డుతుందని కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ కృషి వల్లే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అయన చెప్పుకొచ్చారు.   ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ఆలోచనలలో వచ్చే చెడు మార్పుల గురించి, అలాగే దీని ద్వారా ప్రజల సొమ్ము దోపిడీ అవడం పైనా మొన్న మేలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ గారిని కలిసినపుడు అయన దృష్టికి తీసుకు వచ్చినట్లుగా అయన తెలిపారు. ఇవే కాకుండా ఇప్పటికే ప్రభుత్వం గుట్కాని నిషేధించినప్పటికీ, ఇప్పటికీ కిరాణా షాపుల్లోను, కిళ్లీ షాపుల్లో, అలాగే బ్లాక్ మార్కెట్ లోను గుట్కా దొరుకుతుండడం పై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తాను సూచించినట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ రోజు ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ ని ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేయడం ఏపీ బీజేపీ సాధించిన తొలి విజయం. అలాగే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సీఎం జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని సోము వీర్రాజు తాజాగా ట్వీట్ చేశారు.

కేసీఆర్ పై ఐక్య పోరాటం! ప్రజా వేదిక.. రేవంత్ సపోర్ట్..కోదండరామే లీడర్!

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటానికి ఐక్య వేదిక దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో ఉమ్మడి పోరుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృష్ణా బేసిన్ లో ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులే అస్త్రంగా కేసీఆర్ ను టార్గెట్ చేసేలా విపక్షాలు ఉద్యమ కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుడి నడిపిన టీజేఏసీ చైర్మెన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామే ఉమ్మడి పోరాటానికి నాయకత్వం వహించేలా.. ఆయనపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. త్వరలోనే పార్టీలకతీతంగా ప్రజా వేదిక  ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా ప్రజా వేదిక నుంచి కేసీఆర్ సర్కార్ పై సమరానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.        కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా వేదికపై సంకేతాలు వచ్చాయి. తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి మరో ప్రజా ఉద్యమానికి నాంది పలకాలని వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాలు, సాగునీటిరంగ నిపుణులు ముక్తకంఠంతో నినదించారు. లిఫ్ట్ పేరుతో, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణను ఆర్థికంగా దోచుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను దింపింతే తప్ప తెలంగాణకు మంచిరోజులు రావన్నారు. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీని పక్కనపెట్టి.. ఒక ప్రజా వేదికను ఏర్పాటు చేస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.    కేసీఆర్ చేస్తున్న మోసాన్ని, నైజాన్ని ప్రజలకు తెలిపి, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. కేసీఆర్ కుట్రను ఛేదించడానికి అందరూ ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలిపునిచ్చారు. ప్రజా వేదికతో కలిసి పనిచేస్తామని చెప్పారు. క్రిష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల అడ్డంకిని తొలగించడానికి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రజా వేదిక ద్వారా పోరాటానికి మద్దతుగా ఉంటామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. అన్ని ప్రతిపక్షాలు ఏకమై కేసీఆర్ మెడలు వంచాల్సిన సమయం వచ్చిందని జర్నలిస్ట్ సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.    కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడానికి కోదండరామ్ నేతృత్వంలో ప్రజా వేదిక ఏర్పాటు కావాలని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే విపక్ష నేతల మధ్య చర్చ జరిగిందని, త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందని సమాచారం. ప్రజా వేదికపై ప్రజల్లో చర్చ జరగాలన్న ఉద్దేశ్యంతోనే రేవంత్ ప్రకటన చేశారని భావిస్తున్నారు. అన్ని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమైతే.. కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, వివేక్ లు తాము కలిసి వస్తామని ప్రకటించారు కాని.. వారి పార్టీల స్టాండ్ ఏంటన్నది తేలాల్సి ఉంది. ఇక ప్రజా వేదిక ఏర్పాటు ప్రయత్నాలపై  టీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. అధికారిక ప్రకటన వచ్చాకే గులాబీ లీడర్లు స్పందించే అవకాశం ఉంది.

హుక్కా సెంటర్లో బర్త్ డే సెలబ్రేషన్స్... హుక్కా పీలుస్తూ పట్టుబడ్డ 20 మంది మైనర్ బాలికలు

హుక్కా సెంటర్ల పై పోలీసులు దాడులు చేయడం ఆ సందర్బంగా అక్కడ హుక్కా పీలుస్తున్న కుర్రాళ్లను అరెస్ట్ చేయడం గురించి మనం చాలా సార్లు విన్నాం.. చూసాం. కానీ తాజాగా ఒక హుక్కా సెంటర్ పై పోలీసులు జరిపిన దాడిలో బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతొ ఏకంగా 20 మంది మైనర్ బాలికలు హుక్కా పీలుస్తూ పట్టుబడడం కలకలం రేపుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో హుక్కా బార్లపై పోలీసుల దాడులలో ఈ ఘటన వెలుగు చూసింది.    మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టిటి నగర్ ప్రాంతంలో జోహ్రీ హోటల్‌లోని హుక్కా లాంజ్‌లో ఒక బర్త్ డే పార్టీ జరుగుండగా సడెన్ గా పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో అక్కడ 20 మంది మైనర్ బాలికలు ఉన్నట్లుగా తేలింది. అక్కడ మైనర్లకు హుక్కాతో పాటు కొన్ని నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా నిర్వాహకులు అందుబాటులో ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు అనంతరమే అసలు విషయం బయటపడుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.    20 మంది మైనర్ బాలికలతో పాటు, 10 మంది బాలురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చైల్డ్ లైన్ మరియు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కు అప్పగించారు. ఈ మైనర్లందరూ బర్త్ని డే పార్టీ సాకుగా చేసుకొని హుక్కా బార్ లో కలిశారని పోలీసులు తెలిపారు. అయితే హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలకు సంపూర్ణమైన సమాచారంతో సిద్ధంగా ఉండండి: సీఎం

అసెంబ్లీ సమావేశాలకు సంపూర్ణమైన సమాచారంతో సిద్ధంగా ఉండండి   మంత్రులకు, అధికారులకు సిఎం ఆదేశం   సభలో చర్చించే అంశాలపై ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం ఈ నెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, విప్ లతో గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.   రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా అన్ని వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మంత్రులు సిద్ధం కావాలని సిఎం ఆదేశించారు.   కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం- తీసుకోవాల్సిన చర్యలు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు – నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలు, జిఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం, రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి, నియంత్రిత పద్ధతిలో పంట సాగుతో పాటు వ్యవసాయ రంగం, పివి శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలను చర్చించాలని, ప్రభుత్వ పరంగా చర్చకు సిద్ధమైన అంశాలను బిఎసి సమావేశంలో ప్రతిపాదించాలని నిర్ణయించారు.   మొదటి రోజే ఘన నివాళి ఇటీవల మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే ఘన నివాళి అర్పించనున్నట్లు సిఎం తెలిపారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సిఎం ఆదేశించారు. ‘‘ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్ట సభలకు మించిన వేదిక లేదు. ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలి. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలు అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సభ్యులు ప్రస్తావించాలి. ప్రభుత్వం సభ్యులడిగే ప్రతీ అంశానికి సంబంధించిన వివరాలు చెపుతుంది. అధికార పక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సభలో ప్రస్తావించాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.   అసహనం ప్రదర్శించడానికి వేదిక కారాదు ‘‘అసెంబ్లీ  అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికి మాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదు. ఇలాంటి ధోరణిలో మార్పు రావాలి. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలి. స్పూర్తి వంతమైన చర్చలు జరగాలి. చట్టాలు తయారు చేయానికి (శాసనాలు నిర్మించడానికి), బడ్జెట్ ఆమోదించడానికి, చట్టాలు, బడ్జెట్ అమలు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసనసభలో చర్చ జరగాలి. చర్చలు గొప్పగా, వాస్తవాల ఆధారంగా జరగాలి. ప్రజలకు ఉపయోగపడే విధంగా సభ్యులు మాట్లాడాలి. అసెంబ్లీలో చర్చ ద్వారా అటు ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. ఇటు ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు వెలువడాలి. ఈ విధంగా తెలంగాణ శాసనసభ జరగాలి. అదే ప్రభుత్వం కోరుకుంటున్నది. ఏ పార్టీ సభ్యులైనా సరే, ఏ విషయం గురించి అయినా సరే సభలో మాట్లాడవచ్చు. దానికి  సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి, ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సభ్యులు మాట్లాడే విషయాలు వాస్తవాలు ప్రతిబింబించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.    సమీక్ష సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత రెడ్డి, కెటి రామారావు, టి.హరీశ్ రావు, ఈటల రాజెందర్, జి.జగదీష్ రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ లు ప్రభాకర్, భాను ప్రసాద్, కె. దామోదర్ రెడ్డి, అసెంబ్లీలో చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, విప్ లు గంప గోవర్థన్, గొంగిడి సునిత, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, అరికపూడి గాంధి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..

కరోనా లాక్ డౌన్ ప్రారంభం కాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం తగ్గిపోయింది అంటూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించారు. అన్నిశాఖల్లో పనిచేసేవారి వేతనాల్లో కట్టింగ్స్  ఉంటాయన్నారు. కరోనా ఫ్రంట్ వారియర్స్ గా ఉన్న వైద్యసిబ్బంది,  పోలీసులు,  పారిశుద్ధ్య కార్మికుల జీతాల్లో మాత్రం కోతలు లేవంటూ ఆ తర్వాత ప్రకటించారు. గత రెండు నెలల నుంచి కొన్ని శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇస్తున్నా చాలా వరకు కోతలే. మరి దేశానికి, రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా పడిపోయిన ఈ కరోన కష్టకాలంలో అధికారంలో ఉన్నవారి జీతాల్లో కోతలు విధించారా లేదా అన్న విషయం పక్కన పెడదాం. ముందు మన ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసుకుందాం.   ఒక వ్యక్తి  వేతనాన్ని ఆ వ్యక్తి పనిచేసే సంస్థ నిర్ణయిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం పాలకులు తమ జీతభత్యాలను తామే నిర్ణయించుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రుల జీతాభత్యాలను క్యాబినేట్ లో నిర్ణయిస్తారు. ఇక క్యాబినేట్ లో ఉండేది వారే కాబట్టి వారికి నచ్చిన అంకె ప్రకారమే శాలరీలు ఉంటాయి అని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాదు ముఖ్యమంత్రుల, మంత్రుల జీతాలపై ఎవరి నియంత్రణ కూడా ఉండదు.  వారు చెప్పిందే ఫైనల్.  మరి ఇంతకు రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రుల జీతాల అంకెలను చూసి ఇయర్లీ ప్యాకెజ్ అనుకునేరు. నెలకు మాత్రమే. అలవెన్సులు అదనం..   తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న వేతనం నెలకు అక్షరాల నాలుగు లక్షల పదివేల రూపాయలు. ఇక దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్  జీతం  రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత  ఓ పదివేలు పెంచి నాలుగు లక్షల రౌండ్ ఫిగర్ చేశారు.    ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి  ఆదిత్య  యోగి జీతం  365,000 రూపాయలు మాత్రమే. ఆయన యోగి కదా మరి జీతం ఎందుకు అని మాత్రం అనకండి. ప్రజా సేవకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు.    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నెల జీతం  మూడు లక్షల నలభైవేలు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన జీతం 335,000 రూపాయలు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నెలకు ఒక రూపాయే వేతనంగా తీసుకుంటాను అని ప్రకటించారు. మరి మిగతా డబ్బులు ఏం ఫండ్ కు కేటాయిస్తున్నాయో ఆయనే చెప్పాలి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని జీతం  321,000రూపాయలు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయ్ రామ్ థాకర్  నెల జీతం  310,000 రూపాయలు.   హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ జీతం రెండు లక్షల 88వేల రూపాయలు మాత్రమే. ఆయన ఇటీవల కరోనావైరస్  బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందన్న విషయాన్ని సీఎం స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. జార్ఖండ్  ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరేన్ కుమారుడు హేమంత్ సోరెన్ జీతం 272,000 రూపాయలు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ - 255,000, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి  భూపేష్ బాగెల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జీతం 230,000 రూపాయలు.    గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జీతం 220,000, బీహార్  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెల జీతం 215,000, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ  రెండు లక్షల పదివేల రూపాయలు. అయితే ఆమె ఒక రూపాయి మాత్రమే నెల జీతంగా తీసుకుంటూ మిగతా మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.    తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి జీతం  205,000,  కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప జీతం నెలకు రెండు లక్షల రూపాయలు.  సిక్కిం  ముఖ్యమంత్రి  ప్రేం సింగ్ తామంగ్ నెలకు తీసుకుంటున్న మొత్తం  190,000 రూపాయలు. ఇక త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ జీతం 185,500,   రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్  నెలకు 175,000,  ఒడిశా  ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  165,000,  మేఘాలయ  ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా 150,000, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హేమా ఖాండు ,  అస్సాం  ముఖ్యమంత్రి  శర్వానంద సోనోవాల్ 1,33,000 రూపాయలు తీసుకుంటున్నారు.    మణిపూర్ , పుదుచ్చేరి  ముఖ్యమంత్రులు  120,000 తీసుకుంటున్నారు. అయితే అతి తక్కువ నెల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి నాగాలాండ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నైపిహు రియో. ఆయన నెల జీతం  110,000 రూపాయలు మాత్రమే.    ఇవి కేవలం నెలకు వారు తీసుకునే జీతాలు మాత్రమే . అధికారంలో ఉన్నన్ని రోజులు వసతి, ప్రయాణ ఖర్చులు అన్ని ఉచితమే. అలవెన్సులు కూడా ఇస్తారు. ప్రజా సేవ చేస్తున్నందుకు ఈ మాత్రం వేతనాలు ఇవ్వాల్సిందే మరి..

ట్విట్టర్ వేదికగా లోకేష్ పై విజయసాయి, జగన్ పై అయ్యన్న అదిరిపోయే కౌంటర్లు

వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడైన లోకేష్ పై సెటైర్లు వేశారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో "ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో" అంటూ లోకేష్ పేరు మీద ఒక వ్యాసం ప్రచురితమైంది. తాజాగా దీని పై కామెంట్ చేస్తూ "నీకు సరిగా తెలుగు మాట్లాడడమే రాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. అంతేకాకుండా "దళితునిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న మీ నాన్నారుని అడుగు... ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో చెబుతాడు. దళిత రిజర్వుడు స్థానాల్లో గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచిందో లెక్కలు చూసుకో లోకేశం" అంటూ విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.   అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోకేష్ పై చేసిన సెటైరికల్ కామెంట్లకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "వివేకానందరెడ్డి చనిపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానన్న నువ్వు తెలుగు కోసం మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది" అంటూ ఎంపీ విజయసాయికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా "గుంటూరుని గుండూరు అనే మీ గన్నేరుపప్పుకి ముందుగా తెలుగు నేర్పించి లైవ్ లో కూర్చోబెట్టు" అంటూ సీఎం జగన్ పై సెటైర్ వేశారు. అలాగే పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ అయ్యన్న ఈ సందర్భంగా మండిపడ్డారు. ఒక దళిత యువకుడ్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపిన చెత్త ప్రభుత్వం మీది అంటూ ఎపి ప్రభుత్వం పై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగన్ రెడ్డి.. నీకు దళిత జాతి వచ్చే ఎన్నికల్లో, గుండు కొట్టడం ఖాయం అంటూ ట్విట్టర్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ పై నిషేధం

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974 సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్ష విధించాలని.. ఆన్‌‌లైన్‌ జూదం ఆడేవాళ్ళు పట్టుబడితే 6 నెలల జైలు విధించాలంటూ ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది.   వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవోకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.15380 కోట్లతో బాబు జగజ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ ఫేజ్‌–2 నిర్మాణ ప్రతిపాదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.   గుంటూరు జిల్లా బాపట్లలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదించింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఏపీ ఫిషరీస్‌ ఆర్డినెన్స్‌–2020ను  కేబినెట్‌ ఆమోదించింది.

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై సుప్రీంకు జగన్ సర్కార్

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆస్పత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. డాక్టర్ రమేష్‌ పరారీలో ఉన్నారని, దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని  ఏపీ ప్రభుత్వం తెలిపింది.   రమేష్‌ ఆస్పత్రి స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహించిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. డాక్టర్‌ రమేష్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం సంగతేమిటని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో హైకోర్టు ప్రశ్నించింది. అదే హోటల్‌లో అంతకుముందు ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాన్ని నిర్వహించిన నేపథ్యంలో.. స్వర్ణ ప్యాలెస్‌ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు అధికారాలు ఎలా అనుమతిచ్చారు? అని నిలదీసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన హైకోర్టు.. వారిని నిందితులుగా చేర్చేదాకా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది.   హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కోర్టుల్లో పలు ఎదురుదెబ్బలు తగిలాయి. నిమ్మగడ్డ వ్యవహారం మొదలుకొని, తాజాగా ఇంగ్లీష్ మీడియం అంశంలో కూడా జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరి ఈ స్వర్ణప్యాలెస్‌ ఘటన విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.