బీజేపీ దూకుడు.. సెప్టెంబర్ 17న రచ్చేనా!
posted on Sep 8, 2020 @ 6:02PM
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందివచ్చే అన్ని అవకాశాలను ఉపయోగిచుకుంటోంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్. కరోనా, వరదలు, సచివాలయం కూల్చివేత.. ఇలా అన్ని అంశాలపై కారు పార్టీని కార్నర్ చేస్తున్నారు కాషాయ నేతలు. తాజాగా సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తోంది బీజేపీ. తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ఎప్పటినుంచో డిమండ్ చేస్తోంది బీజేపీ. ఇప్పుడు ఇదే డిమాండ్ తో యాత్ర చేపట్టారు బండి సంజయ్.
రెండు రోజుల యాత్రను యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక నుంచి ప్రారంభించారు. సాయుధ రైతాంగ పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి-రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు బండి సంజయ్. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను సందర్శిస్తున్నారు బండి సంజయ్. తెలంగాణ అమరవీరుల చరిత్రను ఈ తరానికి అందించడమే తమ యాత్ర లక్ష్యమంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబరు 17 ను విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న కేసీఆర్, అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17 ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా కేసీఆర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి గద్దె దింపుతామని.. 2023లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు బండి సంజయ్.
1948, సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణ వేరుపడింది. ఆ రోజును తెలంగాణ విమోచన దినంగా జరపాలన్నది బీజేపీ డిమాండ్. అయితే సెప్టెంబర్ 17న విలీన దినంగా జరపాలని కొన్ని సంఘాలు, విద్రోహ దినోత్సవమని మరికొన్ని సంఘాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఆరేండ్లవుతున్నా అధికారికంగా నిర్వహించడం లేదు. ఇదే అస్త్రంగా బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలు రానున్నాయి. దుబ్బాక అసెంబ్లీ బైపోల్ కూడా జరగనుంది. ఈ ఎన్నికలకు బూస్ట్ గా విమోచన పోరాటం కలిసివస్తుందని బీజేపీ భావిస్తోంది.
ఇక సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల్లోనూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మండల తహశీల్దార్లకు వినతి పత్రాలు అందిస్తున్నారు. దీన్ని మరింత తీవ్రతరం చేసి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ఒత్తిడి తెస్తామంటున్నారు బీజేపీ నేతలు. అయినా సర్కార్ స్పందించకపోతే సెప్టెంబర్ 17న మెరుపు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.