నిర్లక్ష్యానికి మన బతుకులు సమాధి కాబోతున్నాయా?
ప్రపంచ అభివృద్ధి సైన్స్ తోనే సాధ్యమని తెలిసి కూడా నూతన అధ్యయనం వైపు ప్రయాణించని మన డొల్లతనం ముందు మనకేసి మనమే జాలిగా చూసుకున్నా, బతకని స్థితిలోకి చేరుకుంటున్నామా? సైన్స్ ఇచ్చే ప్రయోజనాల్ని జుర్రుకుంటూ అడుగడుగునా సైన్స్ ని అవమానించే వైఖరికి, పుట్టిన రోగాలకు మన బతుకుల్ని మనం అర్పించుకునే దుస్థితిలోకి వెళ్లిపోతున్నాం.
సైన్స్ వెలుగులో వెలిగిన దేవుడి స్వార్ధ పరత్వం ముందు
దేవుడే దీనంగా నిలబడి, ఇన్నాళ్లూ లక్షోప లక్షల రకాల పూజలు, సువార్తా ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, నమాజ్‌లు అందుకుని విర్రవీగి ఇప్పుడు ఒంటరిగా తన గర్భ కుహరంలో తానే బందీ ఐపోయాడు. మాస్కుల్లేని పూజలు, మాస్కుల్లేని ప్రార్ధనలు ఇప్పుడు నిషిద్ధం.
థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో సైన్స్ ని అత్యంతగా నిర్లక్ష్యం చేసిన ఉపద్రవాన్ని మనం చవి చూడబోతున్నాం. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రజలందరికీ దక్కాల్సిన సమాన హక్కులు, సమాన ఆక్సిజన్, సరిపడిన వైద్యం దక్కనీయకుండా చేసినందుకు ప్రతిఫలంగా ఒక్కొక్కరిపై దాడి చేస్తూ కరోనా కరాళనృత్యం చేస్తోంది.
సైన్స్ రంగాలకు కేటాయింపులు భారీగా తగ్గించడం, శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల మూల్గులని పీల్చి, సైన్స్ ఆవిష్కరణలని గేలి చేసిన, దుర్మార్గం ముందు మన పాలిపోయిన ముఖం మీద కరోనా ఊస్తున్నది.
ఒక్కోసారి ఒక్కో పాలకుడు రాజ్యాంగంలో పేర్కొన్నట్టు శాస్త్ర సాంకేతిక రంగాల విస్తృతికి తోడ్పాటు అందించడం లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు విద్య, వైద్యం, సామాజిక శాస్త్రాల, వైజ్ఞానిక శాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక శాస్త్రాలని సమాజంలోని అనేక వర్గాలకు దూరం చేసిన వెధవాయిత్వాన్నికరోనా బట్టలిప్పేసి బజారులో నిలబెడుతున్నది. ఇప్పుడు సత్వర చావు లేమి వారసత్వం గాళ్ళది. క్రిటికల్ కేర్ లో చావు వైభోగం సంపన్నులది.
ఏమైతేనేం, కరోనా ఇప్పుడు సమాన న్యాయం గెలిచేసిన పాలకుల లత్కోరు స్వభావాన్ని నిరసిస్తూ వెనకా ముందూ అందరికీ సమాన చావు ప్రసాదించడానికి సంసిద్ధంగా వుంది.
గొప్ప ఆయుర్వేద విజ్ఞానం ఇక్కడ వుంది. దానికి దైవత్వం అప్పాదించి విష పూరితం చేశారు. గొప్ప సంఖ్యా శాస్త్రం, గొప్ప ఖగోళ శాస్త్రం, ప్రపంచానికి మార్గదర్శనం చేయగల గొప్ప విజ్ఞానం వుంది. దానికి హేతువుని దూరం చేసి దాని శాస్త్రీయ దృక్పథం ప్రాణ తీగెని తెంచి నామం బెట్టి, విభూది పూసి
దాని స్వభావం నాశనం చేసి వంచించారు. ఈ శతాబ్దాల వెక్కిరింతని కరోనా మరింతగా బట్టబయలు చేస్తున్నది.
ఇప్పుడు ఏది చేసినా ఉపశమనమే. ఇప్పుడు ఏమి చేసినా
మరణాన్ని వాయిదా వేయడమే. ఇప్పుడు వ్యాధి నిరోధాన్ని వ్యాప్తి చేయడమే. ఇప్పుడు ఏమి చేసినా వ్యాధి విస్తృతిని అడ్డుకోవడమే.
సైన్స్ విస్తృతిని విస్తృతంగా అడ్డుకున్న దుష్పరిణామాల శిథిలత్వం కింద ఇక పేర్లు లేని సమాధుల్లో చిరునామా వెతుక్కోవడమే.