సో'నయా' మార్గ్?!
posted on Sep 8, 2020 @ 4:37PM
కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అంతర్ముఖంగా ఏమి ఆలోచిస్తున్నారు? అంతర్గతంగా ఏమి చేస్తున్నారు? పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగి రెండు వారాలైంది. నివురు గప్పిన నిప్పు బైటపడిందనుకున్నారు. అది మంచికే జరిగిందని కొందరు సంతోషించారు. కాదు..అది విఘాతమని మరికొందరు మథనపడ్డారు. పార్టీలోనే నాయకత్వశ్రేణిలో అయోమయం. ఇక కేడర్ సంగతి చెప్పేదేముంది! మొత్తంమీద నాయకత్వలోపమే ఇంత దూరం తెచ్చిందని సోనియగాంధీ గ్రహించారు. గారాల కొడుకు రాజకీయంగా ఇంకా ఎదిగిరాలేదనే ఆమె అనుకుంటున్నారు. అందుకే ఆ బిడ్డడికి మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆలోగా తాను క్రియాశీలం కావాలని నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగానే వర్కింగ్ కమిటీ సమావేశం సాగింది. రెండు రోజుల్లో ఆమె మోడీ సర్కారు మీద వ్యూహాత్మక యుద్దం మొదలెట్టాలని కంకణం కట్టుకున్నారు. వర్కింగ్ కమిటీ సమావేశం ఇచ్చిన జవసత్వాలతో ఆమె రంగంలోకి దిగారు. యుద్ధానికి ఆయుధాలు కావాలి. మోడీ ప్రభుత్వం నుంచి ఆయుధాలు దొరకటం కష్టమేమీ కాదు. కాని అవన్నీ ఇప్పటికే రాహుల్‌గాంధీ ఉపయోగించేశారు. అలా దొరికినవన్నీ వాడేసి చివరికి అస్త్ర సన్యాసం చేసి కూచున్నారు. ఆ సంగతి సోనియాగాంధీకి తెలుసు. అందుకే తాజా అస్త్రం పట్టుకున్నారు. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలన్న ఒకచిన్న ఆయుధం పట్టుకుని రంగంలోకి దూకారు.
ఏడుగురు ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో అర్జంటుగా వీడియో కాన్ఫరెన్సులో యుద్ద వ్యూహాన్ని వివరించారు. ఆ యుద్దంలోని ఔచిత్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేదు. దిగకదిగక పెద్దమ్మ చాలా కాలం తర్వాత రంగంలోకి దిగినప్పుడు ఆమెకి సంఘీభావం ప్రకటించడం తప్ప మరేమీ చేయకూడదని వారూ ముందే తీర్మానించుకున్నారు. ఎందుకంటే ఆమె తీసుకున్న కార్యక్రమం అలాంటిది. పస ఉందా లేదా అన్నది కాదు. అది అంత బలమైందా కాదా అన్నది ఆమె ఆలోచించలేదు. ఆమాటకొస్తే అది ఆమె ఆలోచన కూడా కాదు. అందుకే అందులోని హేతుకత గురించి ఆమె ఆలోచించే అవకాశం లేదు. నీట్, జేఈఈ పరీక్షలు ఆశావహ యువతకు ఎంత ప్రధానమైనదో ఆక్షణంలో వారెవ్వరూ ఆమెకు సూచించలేదు. కరోనా మాత్రమే గుర్తుంది కాని, కరోనాతోపాటు యావత్ ప్రపంచం సహజీవనం చేస్తూ ఆత్మరక్షణ చర్యలతో ముందుకు సాగుతున్న ఈ దశలో అంతటి జాతీయ పరీక్షలను జరపొద్దని కేంద్రాన్ని డిమాండు చేసే అంశానికి దేశవ్యాప్తంగా పెద్దగా మద్దతు రాలేదు. ఇక్కడ మద్దతు అంటే ఆ పరీక్షలతో సంబంధం లేని ఏ ఇతర వర్గాల మద్దతు అని కాదు. పరీక్షలతో నేరుగా జీవితాలే ముడిపడి ఉన్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులే ఇక్కడ ప్రామాణికం. ముఖ్యమంత్రులు భేష్ భేష్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుగానే యుద్దరంగంలో కాలు మోపారు. ఆమెకి ఈమె నైతిక స్ధయిర్యాన్నిస్తే ఈమెకి ఆమె పెద్ద గొంతుకై నిలిచారు. మొత్తంమీద ఒక కార్యాచరణను రూపొందించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయపరమైన పోరాటానికి జనసంఘీభావం, దానికితోడు విశ్వసనీయత వస్తుందనుకున్నారు. కాని ఈ అంశంమీద సుప్రీంకోర్టు అభిమతం వేరుగా ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. మరోవంక రాజకీయ పోరాటానికి తెరతీశారు. నిరసనలు, ధర్నాలు చేశారు. దాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఏతావాతా జరిగిందేమిటంటే నీట్, జేఈఈ పోరాటం విద్యార్ధుల చేతిలోనుంచి రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లి అది రాజకీయాంశంగా మారిపోయింది. ఎప్పుడైతే రాజకీయ రంగు పులుముకుందో దాని తీవ్రత తగ్గిపోయింది. ప్రధాని మోడీ ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది. ప్రధాని మోడీ పని సులువైంది. రాజకీయ ప్రత్యర్ది అయిన కాంగ్రెస్ పార్టీ ఏది కోరితే దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడంలో ఆరితేరిన నరేంద్ర మోడీ ఇక ఆ అంశం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సోనియాగాంధీ తొలి అస్త్రం అలా నీరుగారింది. అసలు ఈ నీట్ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదన్నది మరొక వాదన. పార్టీ నాయత్వ బాధ్యతలు తనకు తప్పకపోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువగా క్రియాశీలకంగా ఉండాలన్న అత్యుత్సాహంతో ఆమె కోటరీ సభ్యులు ఆమెని ఇలా రంగంలోకి దింపినట్టు తెలుస్తున్నది.
డెబ్బయ్ మూడు సంవత్సరాల వయస్సులో ఏ బాదరబందీ లేకుండా విశ్రాంత జీవనం గడపాల్సిన తరుణంలో ఆమె తప్పనిసరై పార్టీ కాడిని భుజాన వేసుకుని ఒంటరి పయనం సాగిస్తున్నారు. ఆందుకే ఆమె పోరాటంలో పదును ఉండటంలేదు. అలాగని ఆమె పూర్తిగా కాంగ్రెస్ పార్టీని సహచర సభ్యులకు వదిలేయడానికి సుముఖంగా లేరు. నయానో భయానో బుజ్జగించో బతిమిలాడో కొడుక్కే పట్టాభిషేకం చేయాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నారు. ఇది ఆమెలో వచ్చిన కొత్త ఆలోచన కాదు. దశాబ్దం పైచిలుకుగా ఆమె ఎదురుచూస్తున్నారు. మధ్యలో రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారు. కాని ఆయన ఆ పగ్గాలు వదిలేశారు. ఇష్టంగా కాదు. వైరాగ్యంతో. తనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇవ్వడం లేదని. సోనియాగాంధీ తన కుమారుణ్ణి అలా స్వేచ్ఛగా వదిలేయడానికి సుముఖంగా లేరని పార్టీలోని ఒక వర్గం నాయకులే బాహాటంగా చెబుతుంటారు. సీనియర్లతో సాహచర్యం చేస్తూ రాహుల్ పార్టీని నడపాలన్నది ఆమె అభిమతంగా ఉంది. అనుభవం, పరిపక్వత లేని రాహుల్ గాంధీ కొన్నేళ్లపాటు సీనియర్ల నీడలో ఉండటం అటు పార్టీకి, ఇటు తనయుడికి శ్రేయస్కరమన్నది ఆమె భావనగా చెబుతున్నారు. అందుకే మొన్న వర్కింగ్ కమిటీ సమావేశంలో నాయకత్వ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె తాను దిగిపోతానని ప్రకటించినప్పటికీ, శాశ్వత ప్రాతిపదిక మీద కార్యాచరణ అవసరమని భావించారు. అందుకు అనుగుణంగా కొంతకాలం పాటు తనకు తప్పదని గ్రహించి, ఎప్పటికప్పుడు కార్యక్రమాలతో పార్టీని సజీవంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మొన్నటి ఉద్యమం. అయితే అది వట్టిపోవడంతో మళ్లీ సందిగ్దంలో పడ్డారు. ప్రధాని మోడీని ఎదుర్కోవాలంటే ఎలాంటి కార్యాచరణ అవసరమన్నదాని మీద కాంగ్రెస్ పార్టీలో స్పష్టత కనిపించడం లేదు. సీనియర్లు ఒక పంథాను అనుసరిస్తుంటే, కొత్తతరం మరొక పంథాలో పోతున్నది. అందుకే రాహుల్‌గాంధీ ప్రతి ఒక్క అంశాన్నీ చేపట్టినా అది రెండు తరాల రెండు వర్గాల మధ్య చీలి శల్యమైపోతున్నది. ఈ విషయం సోనియాగాంధీ గ్రహించినా పార్టీ సమగ్రతను దెబ్బతీసినట్టుంటుందన్న భావన, భయంతో ఆమె మిన్నకుండిపోతున్నట్టు ఒక వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు.
సోనియాగాంధీ కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని తీర్మానించుకున్నప్పటికీ ఆమెకి దారీతెన్నూ చూసే దిక్సూచిలాంటి సహాయకులు లేకుండా పోయారు. ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే చొరవ, సాహసం ఉండాలి. బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే అస్త్రశస్త్రాలుండాలి. మోడీని ఎదుర్కోవాలంటే మరో మోడీ కావాలి. మోడీలాంటి వ్యూహకర్త ఉండాలి. అది ఆమె గ్రహిస్తే కాంగ్రెస్ కు కొత్త సారథి దొరికినట్టే. లేదా రాహుల్‌గాంధీని మరో మోడీలా ఆమె తయారుచేయగలదా? అంతటి శక్తే ఆమెకి ఉంటే ఆమే తనకు తానుగా మరో మోడీ రూపంలో కదనరంగంలోకి దూకరా! మోడీలా వ్యూహాత్మక అడుగులు వేయరా!!
-రాజా రామ్మోహన్ రాయ్