జడ్జీల పైన సోషల్ మీడియాలో కామెంట్స్ పై కేంద్ర మంత్రి సీరియస్..

ఏపీ‌లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. దీంతో కొద్ది రోజుల క్రితం హైకోర్టు జడ్జిల మీద కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన భాషలో విమర్శలు చేశారు. ఈ తీవ్ర విమర్శలు చేసిన వారి మీద కేసులు నమోదు చేయాలంటూ హైకోర్టు కూడా ఆదేశించింది. ఐతే ఇందులో కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు మరియు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో తమ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసంటూ వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అంతేకాకుండా గత ఎన్నికలలో ఓడిన టీడీపీనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయిస్తోందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తునారు.   తాజాగా ఇదే విషయంపై కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటివాటిని ఒప్పుకోబోమని అయన అన్నారు. తాజాగా ఒక జాతీయ దినపత్రికకు రాసిన వ్యాసంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిపై స్పందించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా నెగిటివ్ ప్రచారం చేయడాన్ని ఈ వ్యాసం ద్వారా ఆయన తప్పుపట్టారు. ముందుగా "ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు..  పిల్ దాఖలు చేయడం, తరువాత కేసులకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వాలో కూడా సోషల్ మీడియా వేదికగా జడ్జిలకు నిర్దేశించడం, ఒకవేళ తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అదే జడ్జిల మీద దుష్ప్రచారం చేయడం" సరికాదని అయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌ను అభిశంసించాలన్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ న్యాయవాదులు చేసిన ప్రయత్నం ఈ మధ్యకాలంలో జ్యుడీషియరీ స్వయంప్రతిపత్తి మీద జరిగిన అతిపెద్ద దాడి అని అయన వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో "అయితే నా మాట వినాలి. లేకపోతే బయటకు పంపేస్తాం" అనే విధానం న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తికి పెద్ద సవాలుగా మారుతోందన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీలోని చాలా మంది నేతలు న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తిని కాపాడుకునేందుకు ప్రయత్నించారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ పైన పెరుగుతున్న దాడి తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా ఫైనల్ గా ఆ టెస్ట్ చేయాల్సిందే... కేంద్రం ఆదేశం

మనదేశంలో రోజువారీ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా కరోనా టెస్టుల పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారికి ఒకవేళ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే మరోసారి ఆర్టీ-పిసిఆర్ విధానంలో తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి కేవలం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు మాత్రమే చేస్తున్నారని, అయితే, ఆ టెస్టులో నెగిటివ్ వస్తే ఆర్టీ-పిసిఆర్ టెస్టులు చేయడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్టుగా తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, శ్వాస కు సంబంధించిన సమస్యలతో కూడిన లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా మళ్లీ ఆర్టీ-పిసిఆర్ టెస్టులు తప్పకుండా చేయాలి.   అంతేకాకుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ కేసుల్లో రెండు, మూడు రోజుల గడిచిన తరువాత కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా ఆర్టీ-పిసిఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వారిని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఈ తాజా ఆదేశాలను పాటించడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, అంతేకాకుండా ఈ వైరస్ మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కరోనా టెస్టుల్లో ఆర్టీ-పిసిఆర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

విజయసాయికి నోటీసులు ఇస్తారా?.. లేక మన ఎంపీ గారేలే అని ఊరుకుంటారా? 

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని నోటీసులు పంపిన పోలీసులు.. ఇప్పుడు వైసీపీ విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు పంపుతారా? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య అటు పోలీసు శాఖని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే లాజిక్ ని తెరమీదకు తీసుకువచ్చారు.    చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఆయన డీజీపీకి కూడా లేఖ రాశారు. అయితే, ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని, వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ సదరు నోటీసుల్లో పేర్కొన్నారు.    చంద్రబాబుకి పోలీసులు నోటిసులు ఇవ్వడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరితే.. సాక్ష్యాలివ్వండి, విచారిస్తామని.. పోలీసులు అనడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం ఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగానే ఏపీలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని విపక్ష నేతలు విరుచుకుపడుతుండగా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం ఈ ఘటనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.    "తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు." అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు.   విజయ సాయి వ్యాఖ్యలపై స్పందించిన వర్ల రామయ్య.. పోలీసులకి, ప్రభుత్వానికి చురకలు వేశారు. అంతర్వేది రధానికి నిప్పు పెట్టింది చంద్రబాబు అని ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి గారికి, 91 సీఆర్పీసీ క్రింద సాక్ష్యములు చూపించాలని పోలీసులు నోటీసులు ఇస్తారా? లేక మన ఎంపీ గారేలే అని వూరుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతి పక్షాలకు ఒక న్యాయమా? ఇదేనా మీ ప్రభుత్వ విధానం? అని వర్ల రామయ్య నిలదీశారు.   మరి అప్పుడు.. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. దర్యాప్తు చేయాలని చంద్రబాబు కోరితే.. 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని పోలీసులు నోటీసులు పంపారు. మరి ఇప్పుడు.. తునిలో రైలు ఘటన నుంచి అంతర్వేదిలో రథానికి నిప్పు వరకు చంద్రబాబే చేశారని విజయ సాయి అన్నారు. మరి వర్ల రామయ్య కోరినట్టు.. 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని విజయ సాయికి నోటీసులు పంపి పోలీసులు తమ విశ్వసనీయతని కాపాడుకుంటారో లేక అధికార పార్టీకి ఒక రూల్, ప్రతి పక్షాలకు ఒక రూల్ అని విమర్శలపాలవుతారో చూడాలి.

బీజేపీ నేతలు ఈ విషయాన్ని మరిచినట్టున్నారే!!

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం ఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, నెల్లూరులో వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పు, ఉండ్రాజవరంలో అమ్మవారి దేవాలయానికి చెందిన ముఖ ద్వారం కూల్చివేత, తాజాగా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం.. ఇలా వరుస ఘటనలు జరగడంపై విపక్షాలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఓ వైపు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. మరోవైపు గత టీడీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తోంది.   తాజాగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో అనేక దేవాలయాలను కూలగొట్టారని అన్నారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఒక ఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని చెప్పడం దారుణమని.. మతిస్థిమితం లేని వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన ఎక్కడా లేదని అన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. అసలు దోషులను పక్కన పెట్టేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు. అసలు దోషులను పట్టుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, గత ప్రభుత్వం హయాంలో కూలగొట్టిన దేవాలయాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్మించాలని కన్నా డిమాండ్ చేశారు.   కన్నాతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంతో పాటు గత టీడీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరి తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు.. బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద విమర్శలు చేస్తూ తమని తామే నిందించుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో 2018 వరకు బీజీపీ కూడా భాగస్వామిగా ఉంది. అంతేకాదు, అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా దివంగత బీజీపీ నేత మాణిక్యాలరావు పనిచేశారు. దీంతో ప్రస్తుతం కొందరు బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే పరోక్షంగా తమని తామే నిందించుకున్నట్టు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

హక్కుల బావుటా చాకలి ఐలమ్మ

'ఈ భూమి నాది.. పండిన పంట నాది. తీసుకెళ్లడానికి ఆ దొర ఎవడు' అంటూ బడుగుజీవుల రక్తాన్ని పీల్చే దొరలకు ఎదురొడ్డి నిలబడిన ధీశాలి చాకలి ఐలమ్మ. దొరల గుండెల్లో మంటలు రేపిన అగ్నికణం ఆమె. తన హక్కుల కోసం ఆమె జరిపిన పోరాటం, ప్రతిఘటన మహిళాలోకానికి, యువతరానికి ఆదర్శం. భూమి కోసం.. భుక్తి కోసం ప్రజలను కూడగట్టిన ఆమె పోరాటపటిమ స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. ఆమె పేరులేనిదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతాయన్నంత భయంతో బతుకుతున్న నేటితరానికి ఆమె మార్గదర్శి.   చాకలి ఐలమ్మ 1895 లో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. ఆమెకు పదకొండేండ్లకే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్ళి అయ్యింది. వారికి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఐలమ్మ కుటుంబం ఆంధ్రమహాసభలో సభ్యత్వం తీసుకోవడంతో పాటు తమ ఇంటిలోనే సంఘం కార్యాలయాలన్ని ఏర్పాటుచేశారు. ఆమె ఇంటిని కేంద్రంగా చేసుకుని పాలకూర్తిలో ఆంధ్రమహాసభ కార్యక్రమాలు జరిగేవి.    పాలకుర్తికి పక్కనే నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కుంటుంబమంతా కష్టపడేవారు. సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఆ ఊరి దొర రామచంద్రారెడ్డి అనేక విధాలుగా వేధించాడు. కౌలు భూమిలో పండిన పంట తీసుకుపోవడానికి తన అనుచరులను పంపించాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఐలమ్మ కుటుంబానికి అండగా నిలిచారు. కొంగు నడుముకు చుట్టి రోకలిబండ చేతపట్టుకుని దొర అనుచరులను ఆమె తరిమికొట్టారు. ఐలమ్మ సాహసంతో సాయుధపోరు ప్రారంభమైంది. రాజీ పేరుతో ఐలమ్మను గడీకి పిలిపించి ‘నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు’ అని భయపెట్టే ప్రయత్నం చేసిన దొరకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బతకనీయరు. నీ గడీల గడ్డి మొలస్తది’ అని అదురుబెదురు లేకుండా చెప్పింది. ఆమె ధైర్యం చూసి దొరే ఖంగు తిన్నాడు. నిజాం పాలనకు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి అయ్యింది. ఆమె స్ఫూరి కారణంగా ఊపు అందుకున్న ఉద్యమం ఫలితంగా దాదాపు పది లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. గడీల గడ్డి మెులవాలన్న ఆమె మాటలకు దేవతలు కూడా తథాస్తు అన్నట్లు దొరల రాజ్యం పోయింది, గడీల గడ్డి మొలిచింది. అగ్నికణంగా దొరల గుండెల్లో మంటలు పుట్టించిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న మరణించింది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్న శ్రీశ్రీ మాటలకు ఆమె జీవితమే నిదర్శనం.

రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని విషయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నదే చెప్పిందని వ్యాఖ్యానించారు. రాజధానిపై రాష్ట్రాలదే నిర్ణయమని, రాష్ట్రం ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుందని అన్నారు. రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మార్చడం కుదరదని అన్నారు. దీనిపై రాజధాని రైతులు, మహిళలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులో విశాఖ పేరులేదని గుర్తుచేసారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని పేర్కొన్నారు. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, రాయలసీమకు తరలిపోదని రఘురామ కృష్ణరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మళ్ళీ అదే మాట.. రాజధానుల అంశంలో జోక్యం చేసుకోలేము

ఏపీ మూడు రాజధానుల అంశంతో తమకి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టులో కేంద్రం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఇదే అంశంపై హైకోర్టులో కేంద్ర హోంశాఖ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులను ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదని తేల్చిచెప్పింది.    మూడు రాజధానుల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ తెలిపింది. మూడు రాజధానులను అడ్డుకోగలిగే అధికారం కేంద్రానికి ఉందనేది పిటిషనర్ దోనె సాంబశివరావు అపోహ మాత్రమేనని వెల్లడించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే తాము చెప్పిమని పేర్కొంది. అమరావతే ఏపీ రాజధాని అని కూడా తాము ఎక్కడా చెప్పలేదని, రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ అంతిమ నిర్ణయమని స్పష్టం చేసింది.  

ఒక ఆత్మహత్య 135 మంది పై ప్రభావం

ప్రతి 40సెకన్లకు ఒక ఆత్మహత్య ప్రతి మూడు సెకన్లకు ఒక ఆత్మహత్యాయత్నం   వార్తాపత్రిక తెరిచినా.. టీవీలో వార్తలు చూసిన ప్రతిరోజూ కామన్ గా కనిపించే వార్తల్లో ఒకటి ఆత్మహత్య. సెలబ్రేటీల నుంచి సాధారణ గృహిణి వరకు, రైతు నుంచి విద్యార్థి వరకు ఇలా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటూ తమ కుటుంబాలను అర్ధాంతరంగా విడిచివెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంటే దానివల్ల 135 మంది దాకా ప్రభావితం అవుతారని అమెరికాలో జరిగిన ఒక సర్వేలో స్పష్టమైంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం ఎందరినో కలచివేస్తుంది.   'ఆత్మహత్య మహా పాతకం' అని అభివర్ణించారు పెద్దలు. ఆత్మహత్యలకు పాల్పడే వారిని 'పిరికిపందలు' అని అభివర్ణించారు ఆధునికులు. 'ఆత్మహత్య చేసుకోవాలను కుంటే.. అంతకు ముందు ఒక ప్రజాకంటకున్ని తుదముట్టించు' అని  మహాకవి శ్రీశ్రీ సందేశం ఇచ్చారు. అన్ని దేశాలు.. ప్రాంతాలు..మతాలు.. సంస్కృతులు..జాతులు సమాజాలు.. సామూహికంగా ఎలుగెత్తి ఆత్మహత్యలు వద్దంటున్నాయి. ఈ విషయంలో చొరవ చూపిన ఐక్యరాజ్య సమితి 2003 నుంచి  సెప్టెంబర్‌ 10వ తేదీని ''ఆత్మహత్యల నివారణ దినోత్సవం''గా ప్రకటించింది.   ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య - ప్రతి మూడు సెకన్లకు ఆత్మహత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారి కన్నా.. యత్నించి విఫలమైన వారి సంఖ్య అందుకు ఇరవై రెట్లు! అంటే ప్రతి మూడు సెకన్లకు ఒక ఆత్మహత్యా యత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఆత్మహత్యలకో.. ఆత్మాహుతులకో పాల్పడే వారిలో మగవారే ఎక్కువ అయితే ఇటీవల ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు కేవలం 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కావడం విచారకరం. వ్యక్తిగత ఘర్షణలలో, హత్యల కారణంగా, యుద్ధాల కారణంగా చనిపోతున్న వారి కన్నా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని మరో సర్వేలో రుజువైంది.   కారణాలు.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ప్రధాన కారణాలుగా తేల్చారు. ఆర్థిక ఇక్కట్లతో.. అప్పుల బాధతో మరణించిన వారు 22.8 శాతం, కుటుంబ సమస్యల(ఇందులోనూ ఆర్థికాంశాల)తో ఉసురుతీసుకున్న వారు 22.3 శాతం, వ్యవసాయ సంబంధ సమస్యలతో 19 శాతం, ఇతర కారణాలతో 16.3 శాతం, జబ్బుపడి 14.6 శాతం ప్రాణాలు తీసుకున్నారని కొన్ని సర్వేల లెక్కలు.   క్షణికావేశంలోనే ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ క్షణంలో వారిని ఎవరైనా ఆపితే వారిలో చనిపోవాలన్న ఆలోచన మారిపోతుంది. బతుకుమీద తీపి పెరుగుతుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కుంటాం అన్న ధైర్యం వస్తుంది. కానీ, వారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల ఆనవాళ్లు కనిపెట్టడమే కష్టం. పని ఒత్తిడి, జీవితంపై విపరీతమైన ఆశలు, చిన్నచిన్న విషయాలకే మనస్థాపానికి గురికావడం వంటి మనస్తత్వం ఉన్నవారిని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టాలి. అన్నిటికన్నా జీవితం గొప్పదన్న విషయం వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. సమస్యలను తల్లిదండ్రులు, జీవితభాగస్వామి, స్నేహితులతో పంచుకునే చనువు కల్పించాలి.  అన్నింటినీ మించి నీకు నేనున్నాను అన్న ధైర్యం సాటి మనిషి నుంచి వచ్చినప్పుడు అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలకాలన్న ఆలోచనే రాదు. ఆ ధైర్యం సమాజం నుంచి, సాటి మనిషి నుంచి రావాలి. అప్పుడే ఆత్మహత్య నివారణ దినోత్సవాలు నిర్వహించాల్సిన అవసరం రాదు.

భారత్ అమ్ములపొదిలో గోల్డెన్ యారోస్ గా రాఫెల్

భారతవైమానిక దళంలో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రికత్త చోటుచేసుకుంటున్న తరుణంలో వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేస్తూ రాఫెల్ యుద్ధవిమానాలను అధికారికంగా భారతవైమానికి దళంలో చేర్చారు.     హర్యానాలోని అంబాల ఎయిర్‌బేస్‌లో రఫేల్‌ విమానం ఆవిష్కరణ జరిగింది. 17 స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్‌లో ఈ ఫైటర్ జెట్స్ చేరాయి. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌, ఎయిర్ జనరల్ ఎరిక్ ఆటోలెట్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదూరియా, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.   2016 సెప్టెంబరులో ఇండియా, ఫ్రాన్స్ మధ్య 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్స్‌ ఐదు రాఫెల్ ఫైటర్ జెట్స్ ను మొదటి దశలో పంపించింది. ఈ ఐదు అత్యాధునిక యుద్ధ విమానాలు జూలై 27న అంబాలాకు చేరిన విషయం తెలిసిందే. అయితే వీటిని వైమానిక దళంలో అధికారికంగా చేర్చే ప్రక్రియ ఈ రోజు జరిగింది. సరిహద్దుల్లో డ్రాగన్  చైనా కవ్విస్తున్న సమయంలో భారత వైమానిక దళంలోకి రఫేల్ చేరడం కీలకంగా మారింది. అత్యంత శక్తివంతమైన వీటిని ఏ ఎయిర్ బేస్ కు తరలిస్తారు అన్నది మాత్రం రహస్యంగానే ఉంచారు.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ పై క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రాజెనికా సీఈఓ.. 

ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టుగా ఆస్ట్రాజెనికా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనతో ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ వ్యాక్సిన్ డోస్ వేసుకున్న ఒక వాలంటీర్ కు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయని, అందువల్ల ట్రయల్స్ నిలిపివేస్తున్నామని ప్రకటించడంతో వ్యాక్సిన్ పై సందేహాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ ప్రారంభం కావడంతో, తాజాగా ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ స్పందించారు.   ఇదే విషయంపై పలు ప్రపంచ దేశాల నుండి వివరణ కోరుతూ ఆయనకు పలు ప్రశ్నలు రావడంతో.. ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ దీనికోసం ఓ టెలీ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సోరియట్ మాట్లాడుతూ, యుకె లో వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న ఓ మహిళకు తీవ్రమైన నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్య వచ్చిందని.. అయితే ఆమెకు ఏమైందన్న విషయంలో ఇంతవరకూ నిపుణులు ఎటువంటి నిర్ధారణకు రాలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. త్వరలో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా కాబోతున్నారు అని అయన తెలిపారు. అంతేకాకుండా సురక్షితమైన వ్యాక్సిన్ కోసం తమ ముఖ్య ప్రయత్నమని.. దీంతో వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని తేలితేనే రిజిస్టర్ చేస్తామని అయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు .   అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదని, గత జూలైలో కూడా ఒక వాలంటీర్ కు ఇలాగే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చాయని, అప్పుడు కూడా తాము ట్రయల్స్ ఆపివేశామని తరువాత జరిగిన వైద్యుల పరీక్షల్లో ఆ వాలంటీర్ కు వచ్చిన సమస్యలు వ్యాక్సిన్ వల్ల కాదని తేలిందని ఆయన స్పష్టం చేశారు.

పాపం జస్టిస్ కనగరాజ్.. అద్దె కట్టి ఫర్నిచర్ తీసుకెళ్లండి అంటున్న ఓనర్

ఏపీలో జగన్ ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో ఎస్ఇసి గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి జస్టిస్ కనగరాజ్ ను కొత్త ఎస్ఇసి గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో వాదనల తర్వాత ఈ విషయంలో ఏపీ సర్కార్ నిర్ణయాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే జస్టిస్ కనగరాజ్ కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతం లోని ఒక పోష్ ఏరియాలోని అపార్టుమెంట్లో గత ఏప్రిల్ లో ఆయనకు నివాసాన్ని ఏర్పాటు చేసారు. ఆ ఫ్లాట్ కి నెలకు అద్దె రూ.1,11,800. ఒక పక్క హైకోర్టు అయన నియామకాన్ని రద్దు చేసింది. మరో పక్క పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆ ఫ్లాట్ కు అద్దె కూడా చెల్లించలేదు. అయితే తాజాగా ఈ ఫ్లాట్ లోని ఫర్నిచర్ ను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడంతో తనకు బకాయి ఉన్న అద్దె చెల్లించి తీసుకువెళ్లాలని ఆ ఫ్లాట్ ఓనర్ రవీంద్రనాథ్ కోరారు. దాంతో అధికారులు ఆ ఫ్లాట్ ఓనర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.   అయితే ఈ విషయం పై ఫ్లాట్ ఓనర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ తమకు మొత్తం ఆరు నెలలు అద్దె కింద రూ.7 లక్షల వరకు రావాల్సి ఉండగా.. అధికారులెవరూ ఈ విషయం పై స్పందించడం లేదని వాపోయారు. అంతేకాకుండా తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదని, కేవలం సాధారణ ప్రజలమని.. అద్దె చెల్లించకుండా తమను ఇబ్బంది పెట్టడం సరి కాదన్నారు. వచ్చిన అధికారులకు అగ్రిమెంట్‌ లెటర్‌ ఇచ్చి ఫర్నిచర్‌ తీసుకెళ్లవచ్చని చెప్పానని, వారు స్పందించకపోతే దీనిపై న్యాయస్ధానంలోనే తేల్చుకుంటామన్నారు. ఇది ఇలా ఉండగా అగ్రిమెంట్‌ లెటర్‌ ఇవ్వాలన్న రవీంద్రనాథ్ విజ్ఞప్తి గురించి ఉన్నతాధికారులకు తెలిపామని స్థానిక సిఐ చెప్పారు. దీంతో ఫర్నిచర్ కోసం వచ్చిన అధికారులు వాటిని తీసుకోకుండానే వెళ్లిపోయారు.

జగన్ ప్రభుత్వం పై మండిపడ్డ ఏపీ హైకోర్టు..

ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వంపై మండి పడింది. ఏపీలో కొన్ని వితంతు పెన్షన్లు నిలిపివేయడంతో హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. రాజకీయ కారణాలతో పెన్షన్లు నిలిపివేశారన్న కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వితంతువులంటూ కొంతమంది అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త ఉన్నప్పటికీ ఏ మహిళా కూడా వితంతువునని చెప్పుకోదని, అసలు ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కేవలం వారి ఆర్ధిక కష్టాలను కొంతవరకు తీరుస్తుందని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.   పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా?.. లేక రంజాన్ తోఫా, క్రిస్‌మస్ కానుకలు ఇవ్వమని ఎవరైనా అడిగారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వెయ్యమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా.. అని కోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడాన్ని ఎవరూ కాదనరని, అయితే పెన్షన్లు ఆపిన వితంతువులకు 15 రోజుల్లోగా పెన్షన్లు ఇవ్వాలని, పాతపెన్షన్లు ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో కూడా పెన్షన్లు చెల్లించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కారుతో కైట్ ఫైట్.. డ్రామాలంటున్న కమలం.. గ్రేటర్ ట్విస్ట్!  

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఎంఐఎం మొదటి నుంచి మద్దతుగా ఉంది. ప్రభుత్వం తీసుకువచ్చే అన్ని బిల్లులకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. కేసీఆర్ సర్కార్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తే... ఎంఐఎం తిప్పికొట్టిన సందర్భాలున్నాయి. ఎంఐఎం మాకు మిత్రపక్షమేనని సీఎం కేసీఆరే పలు సార్లు ప్రకటించారు. ఒవైసీ బ్రదర్స్ కు ప్రభుత్వంలోనూ మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు అందుకు బలమిస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. కరోనా పై చర్చలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.   అసెంబ్లీలో కరోనాపై  జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రభుత్వ ప్రకటనపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తు చేయకపోవడం దారుణమన్నారు. మంత్రి ఈటల ప్రసంగం హెల్త్‌ బులెటిన్‌లా ఉందని మండిపడ్డారు. కోవిడ్‌ నిధికి విరాళాలు ఇచ్చినవారిని గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు క్వశ్చన్ అవర్‌లో స్పీకర్‌తోనూ అక్బరుద్దీన్  వాగ్వాదానికి దిగారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి తాము ప్రతీ అంశంలో సహకరిస్తున్నా రూల్స్ మాట్లాడుతున్నారంటూ స్పీకర్‌పై అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.      అక్భరుద్దీన్ తీరుకు టీఆర్ఎస్ నేతలు కౌంటరిచ్చారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.  అన్ని అంశాలను స్వల్ప కాలిక చర్చ నోట్ లో చెప్పడం సాధ్యం కాదన్నారు. సీనియర్ సభ్యుడైనంత మాత్రాన అక్బర్ ఏదీ పడితే అది మాట్లాడతానంటే కుదరదన్నారు తలసాని.  బాధ్యత లేకుండా అక్బర్ మాట్లాడితే తామెందుకు ఊరుకుంటామన్నారు. ఓవర్ స్మార్ట్ గా అక్బర్ వ్యవహరించొద్దన్నారు తలసాని.    మంగళవారం అసెంబ్లీలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ప్రభుత్వం తీర్మానం పెట్టింది. తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినా ఎంఐఎం సపోర్ట్ చేయలేదు. చర్చ జరుగుతుండగానే ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేసి వెళ్లారు. టీఆర్ఎస్ సర్కార్ పెట్టిన బిల్లు లేదా  తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వకపోవడం ఇదే తొలిసారి.  ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు పెంచారు అక్బరుద్దీన్. కరోనా కట్టడిలో విఫలమైందని ఆరోపించారు.    తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని అంశాల్లో కలిసి నడిచిన టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కల్గిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న సమయంలో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య విభేదాలు రావడం ఆసక్తి కలిగిస్తున్నాయి.  సిటీలో పట్టున్న ఎంఐఎం.. ఇంతకాలం సపోర్ట్ చేసిన అధికారపార్టీని టార్గెట్ చేయడంపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఎంఐఎం చెప్పినట్లు నడుచుకునే టీఆర్ఎస్.. గ్రేటర్ ఎన్నికల కోసమే కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శిస్తోంది. ఎంఐఎంతో తమకు సంబంధం లేదని ఓటర్లు భావించేలా గులాబీ నేతలు ఎత్తులు వేస్తున్నారంటున్నారు కమలనాధులు.

40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్తారు.. జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ లోకేష్ 

టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను తాము మర్చిపోబోమని, అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేత లోకేష్ చెప్పారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు ను నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. ప్రభుత్వంపై పోరాడితే సీఎం జగన్ జైల్లో పెట్టిస్తున్నారని అయన విమర్శించారు. "పేద ప్రజల నుంచి దొడ్డిదారిన రూ.5 లక్షలకు కొన్న భూమిని ప్రభుత్వానికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై అన్నీ బయటపడతాయి... కనీసం 40 మంది జైలుకు వెళతారు.. పేద ప్రజల జేబులు కొట్టినోడు ఎవరూ బయటలేరండీ.. గ్యారంటీగా అందరు జైలుకు వెళతారు... ఎలాగూ వైసీపీ అనేది ఒక జైలు పార్టీయే కదా. పార్టీ అధ్యక్షుడూ జైలే... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా జైలే... దీంతో ఇక ఎమ్మెల్యేలు మేం కూడా జైలుకు వెళ్లొస్తాం అంటున్నారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీకి ఇంతకూ ఇంత వడ్డీ తో సహా కలిపి చెల్లించి తీరుతాం అని లోకేష్ పేర్కొన్నారు.   వైసీపీ ప్రభుత్వం 16నెలల నుంచి అధికారంలో ఉందని, కానీ టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారమైనా చూపించారా? అని అయన ప్రశ్నించారు. అదే జగన్ మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారు. ఇక రానున్న రోజుల్లోనూ కొన్ని వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మంత్రులందరికీ అసహనం చాలా పెరిగిపోయింది. సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అంటూ ఇవ్వలేకపోయిన మంత్రి కూడా అసహనంతో మాట్లాడుతున్నారు. సీఎం జగన్ పేరు కూడా అన్నిసార్లు తలవని సొంత మంత్రులు చంద్రబాబు పేరు మాత్రం నిత్యం జపిస్తున్నారు. పాపం నిద్రలేచిన దగ్గర నుంచీ పడుకునే వరకు వైసీపీ నేతల కలలోకి చంద్రబాబే వస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు.   ఒక మతంపై వరుస దాడులు జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ సీబీఐ విచారణ జరగాల్సిందే. ఏదైనా ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ వరుస సంఘటనలు చూస్తుంటే దీంట్లో ఎదో కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఓ రథం దగ్ధం చేశారని, తాజాగా అంతర్వేదిలోనూ అదే ఘటన జరిగిందని అయన తెలిపారు. మరోపక్క గుంటూరు జిల్లాలోని ఒక ఆలయంలో తల దువ్వుకోవద్దని చెప్పినందుకు ఆలయ అర్చకుడ్ని అన్యాయంగా చితకబాదారని.. దాడి చేసిన వ్యక్తి వైసీపీకి చెందినవాడని కూడా తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిది.. కానీ ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. ఎవరైనా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే అక్రమకేసులు లేదా దాడులకు దిగుతున్నారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై ప్రభుత్వం బనాయాయించింది ముమ్మాటికీ దొంగ కేసులే. ప్రతిపక్షాలపై ఎక్కడలేని వింత వింత కేసులన్నీప్రయోగిస్తున్నారు. ఒక పెళ్లికి వెళ్లారని యనమల, చినరాజప్ప లపై కూడా కేసులు పెట్టారు. అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్ తో సహా 36మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తుంటే దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అయితే టీడీపీ అన్నింటికీ సిద్ధంగా ఉంది అని లోకేష్ పేర్కొన్నారు.

ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉంది.. అక్బరుద్దీన్‌ తీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకాలం టీఆర్ఎస్ కి మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం.. ఉన్నట్టుండి టీఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకించడం, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా గళం వినిపించడం మొదలుపెట్టింది. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని నిన్న అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో బాబ్రీ మసీద్ ను కూల్చి వేశారు. కరసేవకులను అయోధ్య రాకుండా కట్టడి చేయడంలో పీవీ సర్కార్ నిర్లక్ష్యంగా వహించందని గతంలో ఎంఐఎం ఆరోపించింది. ఈ కారణంగానే పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈరోజు అసెంబ్లీలో ఎంఐఎం వ్యవహరించిన తీరు చూస్తే టీఆర్ఎస్ కి దూరమవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది.   సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ క్వశ్చన్ అవర్‌లో స్పీకర్‌తో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష పార్టీలకు సభలో మాట్లాడేందుకు ఆరు నిమిషాల సమయం ఏం సరిపోతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే దానిపై చర్చ పెట్టకుండా అనవసరమైన అంశాలపై చర్చ పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి తాము ప్రతీ అంశంలో సహకరిస్తున్నా రూల్స్ మాట్లాడుతున్నారంటూ స్పీకర్‌పై అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.    అంతేకాదు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై కూడా అక్బరుద్దీన్ విమర్శలు చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కరోనా అంశంపై మంత్రి ఈటల మాట్లాడారు. కరోనా పోరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  24,408 మందికి రెమిడిసివిర్ ఇంజెక్షన్లను ఇచ్చామని, కోట్ల సంఖ్యలో మందులు సమకూర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికి కిట్లు అందిస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కూడా సరిపడ అందుబాటులో పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 0.6 శాతం మాత్రమే డెత్ రేట్ ఉందన్నారు.   మంత్రి ఈటల ప్రసంగంపై అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉందని విమర్శించారు. కరోనా వారియర్స్ ను ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని పేర్కొన్నారు. కోవిడ్‌ నిధికి విరాళాలు ఇచ్చిన వారిని గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.   అక్బరుద్దీన్ వ్యాఖ్యల‌పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు మంత్రి ఈటల ఆహర్నిషలు కృషి చేశారని అన్నారు. కరోనా కట్టడికి నిత్యం చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గలేదన్నారు.   సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యవహరించిన తీరు చూస్తుంటే టీఆర్ఎస్ కి దూరమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ఎంఐఎం చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అయ్యారని బీజేపీ పదేపదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా గళం వినిపించడం ఆసక్తికరంగా మారింది.

అంతర్వేది రథానికి నిప్పు పెట్టించింది బాబే.. విజయసాయి రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ఏపీలో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్దం అయిన విషయం అక్కడి రాజకీయాల్లో రచ్చ రేపుతోంది. ఈ ఘటన కు మీరు కారణం అంటే కాదు మీరని అదికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులను కూల్చి, అమరేశ్వరుడి భూములను మింగి, పుష్కరాల్లో ఏకంగా 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఈ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు అంటూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విజయసాయి రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే చంద్రబాబు గారు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినా కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు అంటూ బాబును ఘాటుగా విమర్శిస్తూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు.   అంతేకాకుండా రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు..

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఉన్నంత సంతోషం ఇవాళ ఉందన్నారు. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజన్నారు. ఈ చట్టం ఫలితంగా ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదు. వీఆర్వోలను స్కేల్‌ ఎంప్లాయిస్‌గా మార్చుతామని కేసీఆర్ తెలిపారు.   పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది. "ధరణి పోర్టల్‌ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ వివరాలు ధరణిలో ఉంటాయి. ప్రపంచంలో ఏమూలనైనా ధరణిని ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తాం. ఇకపై ఎవరూ పక్కవారి ఇంచు భూమి కూడా ఆక్రమించుకోలేరు. వ్యవసాయ భూములనే ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. నాన్‌ అగ్రికల్చర్‌ భూములను సబ్‌ రిజిస్ట్రార్‌లో రిజిస్ట్రేషన్‌ చేస్తారు" అని కేసీఆర్ స్పష్టం చేశారు.   తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల పదవుల రద్దు చట్టం- 2020 పేరుతో సీఎం కేసీఆర్ బిల్లును ప్రవేశపెట్టారు. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం తెలంగాణలో వీఆర్వో పదవులు రద్దవుతాయి. వీఆర్వోలను ఏదైనా ప్రభుత్వ శాఖలోని ఏదైనా సమానమైన శ్రేణిలోకి బదిలీ లేదా విలీనం చేయనున్నారు.

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు

ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక.. ఇది కాళోజీ నారాయణరావు చెప్పిన మాట. చెప్పడమే కాదు తన అక్షరాలతో ఎందరినో కదిలించిన ప్రజాకవి ఆయన. నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా కలం ఎత్తిన తెలంగాణా ఉద్యమకారుడు కాళోజీ.   1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో కాళోజీ జన్మించారు. ఆయన తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. కాళోజీ జన్మించిన అయిదారు ఏళ్లకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశారు.    కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు.   1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.   కాళోజీ రాసిన మాటలు ఎన్నో చరిత్రలో చెరగని ముద్రవేశాయి. ఆయన మాటలు ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తాయి, కదిలిస్తాయి.   "అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు" అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. 'అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు'.. ఈ ఒక్క మాట చాలదా.. కాళోజీ వ్యక్తిత్వం ఏంటో, కవిత్వం ఏంటో చెప్పటానికి.   "తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు.. సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు.. సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా" అని మాతృభాష అయిన తెలుగును చిన్న చూపు చూస్తూ పరభాష వ్యామోహంతో కూరుకుపోయిన వారిని సూటిగా ప్రశ్నించిన కవి కాళోజీ. తెలుగుని చులకనగా చూస్తున్న ఈ తరం వారికి అది చెంపదెబ్బ లాంటిది.   "ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు- ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె." అంటూ మన భాషని, మన యాసని మనమే తక్కువ చేసుకుంటే ఎట్లా? అని ఆలోచింపజేసిన కవి కాళోజీ.   ఇలా ఒకటా రెండా.. ఆయన మాటలు చరిత్ర పుటల్లో చెక్కుచెదరని సంతకాలు. "పుటక నీది. చావు నీది. బతుకంతా దేశానిదీ".. ఇది జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి చెప్పిన మాట. ఆయన దేశం కోసం బ్రతికాడు, మరి మీరు? అని మనల్ని సూటిగా ప్రశ్నించినట్టు లేదూ.   ఇక, కాళోజిని పెంచి పెద్దచేసిన ఆయన అన్న కాళోజీ రామేశ్వరరావు 1996 లో చనిపోయినప్పుడు.. కాళోజీ అన్న మాట "నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప". ఒక్క మాటతో అన్నయ్య గొప్పతనాన్ని, తనకి అన్నయ్య మీదున్న ప్రేమని తెలియజేసారు కాళోజీ.   ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది.